Menu

శ్యాం బెనెగల్

shyambenegal.jpgఏ ఏటికా ఏడు చిత్ర విచిత్రయిన మార్పులకు లోనవుతూ వ్యాపారమే లక్ష్యంగా అనేకానేక ఆటుపోట్లకు గురవుతున్న భారతీయ సినీ రంగంలో అందులో ముఖ్యంగా హిందీ చిత్ర సీమలో ఏటికెదురీదుతూ 25 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న శ్యాంబెనెగల్ భారతీయ నవ్య సినిమాకి ఓ గొప్ప ప్రేరణ. నవ్య సినిమా ప్రపంచంలో ఆయనదో ప్రత్యేకమయిన ముద్ర.

సమాజానికీ, సహజత్వానికీ సినిమా ఓ వ్యాఖ్యానంలా వుండాలని భావించే బెనెగల్ ’వాస్తవీకరించబడిన కళారూపమే సినిమా’ అని విశ్వసిస్తాడు. 74 ఏళ్ళ వయస్సులో కూడా ఉద్వేగం నిండిన ఉత్సాహంతో చిత్రాలు తీస్తున్నశ్యాంబెనెగల్ 14 డిశెంబర్ 1934 లో బెనెగళ్ళ శ్యాం సుందర రావు గా హైదరాబాదులో జన్మించాడు. అర్థ శాస్త్రంలో ఉస్మానియా నుంచి ఎమ్., పట్టా పుచ్చుకున్న తర్వాత 1959 నుండి 63 వరకు లింటాస్ అడ్వర్టయిజ్మెంట్ కంపెనీలో ఫిల్మ్స్ అసిస్టెంట్ గా పనిచేశాడు.తర్వాత పది సంవత్సరాలు బ్లేజ్ కంపెనీలో వున్నాడు. 1970-72ల మధ్య హోమీబాబా ఫెలోషిప్ సాధించిఆ కాలంలోనే బోస్టన్ (యు.ఎస్.ఏ) టివి లో అసోసియేట్ ప్రొడ్యూసర్ గా పనిచేశాడు. ఈ కాలంలోనే బాలల టెలివిజన్ ను పరిశీలించాడు. అడ్వర్టయిజింగ్ ఫీల్డ్ లో ఆయన అనేక వ్యాపార చిత్రాలు. డాక్యుమెంటరీలు నిర్మించాడు. శ్యాం కొంతకాలం వరంగల్ లో లెక్చరర్‍గా పనిచేశారు.

శ్యాం బెనగల్ తన మొట్టమొదటి ఫీచర్‍ఫిల్మ్ ’అంకుర్’ లో తెలంగాణాలోని ఫ్యూడల్ వ్యవస్థ వికృత రూపాన్నీ, అది చేసే విశృంఖల నృత్యాన్నీ, ఆ నృత్యం కిమ్ద పక్కటెముకలు విరిగిపోతున్న సామాన్య ప్రజానీకం బతుకుల్ని చూపిస్తాడు. చివరగా పేదబాలుని తిరుగుబాటుని ప్రతీకాత్మకంగా చూపిస్తాడు. దాంతో ఆ చిత్రం ఈ ప్రాంతం యొక్క యథార్థ జీవితాల్ని నిజాయితీగా చిత్రీకరించినట్టయింది. ఈ చిత్రం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననల్ని పొందింది. దీనికి 3 జాతీయ అవార్డులు 43 ఇతర అవార్డులు వచ్చాయి.

’అంకుర్’ ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. సుప్రసిద్ధ నటి షబానా ఆజ్మీ అంకుర్ తో తన చలన చిత్ర జీవితాన్ని ఆరంభించారు.

1975 లో బెనెగల్ ’చరణ్‍దాస్ చోర్’ అనే పిల్లల సినిమా నిర్మించాడు. ఇందులో భారతీయ సమాంతర చిత్ర రంగంలోని మరో ఆణిముత్యం స్మితా పాటిల్ రంగప్రవేశం చేశారు. తర్వాత ’నిశాంత్’ లో బెనెగల్ తెలంగాణా పోరాట క్రమాన్ని చిత్రించాడు. ఆ చిత్రానికి 1975 లో జాతీయ ఉత్తమ హిందీ చిత్రం అవార్డు, చికాగోలో బంగారు పతకం లభించాయి. తర్వాత బెనెగల్ గుజరాత్‍లోని ఆనందలో పాల ఉత్పత్తిదారుల నుంచి సహకార పద్ధతిలో పెట్టుబడి సమకూర్చుకుని ’మంథన్’ నిర్మించాడు. ’మంథన్’ కి 1976 లో జాతీయ ఉత్తమ హిందీ చిత్రం అవార్డు లభించింది.

1977 లో శ్యాం నిర్మించిన ’భూమిక’ ఆయనలోని కళాత్మక దృష్టికి అధ్బుతమయిన ప్రతిరూపం. ఒక నటీమణి యొక్క వ్యథాభరితమయిన జీవన కథనాన్ని హృద్యంగా మలిచిన చిత్రం ’భూమిక’. ఈ చిత్రంలో నటించిన స్మితాపాటిల్ కి జాతీయ ఉత్తమ నటి అవార్డు, 1977వ సంవత్సరానికి ఉత్తమ స్క్రీన్‍ప్లే అవార్డు లభించాయి.

అదే సంవత్సరంలో శ్యాం బెనెగల్ దైవం పట్ల, సెక్సు పట్ల మనుషులకు వుండే మూఢ విశ్వాసాలపై ’కొండూరా’, ’అనుగ్రహం’ అనే ద్విభాషా చిత్రం నిర్మించాడు. ’అనుగ్రహం’ కు ప్రముఖ కవి ఆరుద్ర స్క్రిప్ట్ సమకూర్చగా, వాణిశ్రీ అధ్భుతంగా నటించారు.

తర్వాత శశికపూర్ నిర్మాతగా బెనెగల్ ’జునూన్’, ’కలియుగ్’ చిత్రాలు నిర్మించాడు. ఆ రెండు చిత్రాల్లో ధనవంతులయిన కుటుంబాల్లో వుండే స్వార్థపరత్వాన్ని వారి జీవిన విలువల్ని ఆవిష్కరించారు. ’కలియుగ్’ చిత్రాన్ని భారత కథకు ఆధునిక రూపంలా చిత్రీకరించాడు. ’జునూన్’ చిత్రానికి మూడు జాతీయ ఆవార్డులు లభించాయి.

1982 లో ’ఆరోహన్’, 1983లో వ్యభిచార గృహాలపైన ’మండి’ చిత్రాలు నిర్మించాడు. 1982 లో ’ఆరోహన్’ కి ఉత్తమ హిందీ చిత్రం, ఉత్తమ నటి, ఎడిటింగ్ అవార్డులు లభించాయి.

1985 లో శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన ‘త్రికాల్’ 1986 ఇండియన్ పనోరమాలో ప్రదర్శించబడింది. ఇందులో గోవా ప్రజల సామాజిక జీవితాన్ని అత్యంత ప్రతిభావంతంగా చిత్రించాడు. ఈ చిత్రంలో లైటింగ్ని బెనెగల్ అత్యంత ప్రతిభావంతంగా వాడుకున్నాడు. చిత్రీకరణలో గొప్పతనంవల్ల ప్రతి సీనూ మనసుకు హత్తుకుపోతుంది. కానీ ‘త్రికాల్’ లో ఆయన ప్రతిపాదించిన ఆత్మ అనే అంశం మాత్రం చర్చనీయాంశంగానే మిగిలిపోయింది.

శ్యాం చేనేత కార్మికులపై నిర్మించిన ’సుష్మన్’ తెలంగాణా ప్రాంతంలోని బడుగు చేనేత జీవితాల వాస్తవిక రూపం. ఇందులో ఓంపురి, షబానా, పంకజ్ కపూర్, అనితా కన్వర్ లు పోషించిన పాత్రలు తెలంగాణా పల్లెసీమలో నేటికీ సజీవంగా కనిపిస్తాయి.

ఆ తర్వాత బెనెగల్ దర్శకత్వంలో ’అంతర్నాద్’, ’సూరజ్ కా సాత్వాఘోడా’, ’మమ్మో’ , ’ది మేకింగ్ఆఫ్ మహాత్మ’, సర్దారీ బేగం’ చిత్రాలు వచ్చాయి.

’మేకింగ్ ఆఫ్ మహాత్మ’ కు ప్రొఫెసర్ ఫతీమామీర్ రాసిన ’ది అప్రెంటిస్‍షిప్ ఆఫ్ మహాత్మ’ నవల ఆధారంగా చేసుకున్నారు. సౌత్ ఆఫ్రికాలో గాంధీ జీవితం, ఎదుగుదల, పోరాటాల్ని ఈ చిత్రంలో కళాత్మకంగా చిత్రించారు. దీనికి జాతీయ స్థాయిలో మూడు అవార్డులు వచ్చాయి. గాంధీ పాత్ర పోషించిన రజత్ కపూర్ కి ఉత్తమ నటుడు అవార్డు, ఉత్తమ ఆంగ్ల భాషా చిత్రం, బెనెగల్ కి జ్యూరీ అవార్డు ఈ చిత్రానికి లభించాయి.

2001 లో బెనెగల్ దర్శకత్వంలో వచ్చిన ’జుబేదా’ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్రం అవార్డుని గెలుచుకుంది. 2005 లో వచ్చిన ’నేతాజీ సుభాష్ చంద్రబోస్:ది ఫర్గాటెన్ హీరో’ చిత్రానికి గానూ నర్గీస్ దత్-జాతీయ సమైక్యత అవార్డుని గెలుచుకున్నారు.

తన తుది శ్వాస విడిచే వరకూ సినిమాకే తన జీవితం అంకితం అనే బెనెగల్ ప్రస్తుతం ’మహదేవ్ కా సజ్జన్పూర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకూ శ్యాం బెనెగల్ దర్శకత్వంలో 21 పూర్తి నిడివి చిత్రాలు, రెండు ఫుల్ లెంగ్త్ డాక్యుమెంటరీలు, నాలుగు టెలీ సరియల్స్, అనేక షార్ట్ ఫిలింస్ వెలువడ్డాయి. ఆయన పూర్తి నిడివి డాక్యుమెంటరీల్లో ’నెహ్రూ’ , ’సత్యజితరే’ ల పై చేసిన డాక్యుమెంటరీలు విమర్శకుల్ని ఆకట్టుకున్నాయి.

టివి కోసం ఆయన నిర్మించిన 54 ఎపిసోడ్ల ’భారత్ ఏక్ ఖోజ్’ చిరస్మరణియమయింది. చారిత్రకపరమయిన అంశాల్ని ఆవిష్కరిస్తూ సామాజిక, సాంస్కృతిక పరిణామ క్రమాన్ని ఒడుపుగా పట్టుకుని కొనసాగిన గొప్ప ప్రయత్నంగా ’భారత్ ఏక్ ఖోజ్’ నిలిచిపోయింది.

నవ్య చిత్ర రంగానికి ఆయన అందించిన నటీనటులు అందరూ ప్రతిభామూర్తులుగా వెలుగొందారు. శ్యాం నవ్య సినిమాకి అందించిన వారిలో స్మితా పాటిల్, షబానా ఆజ్మీ, నషీరుద్దీన్ షా, ఓం పురి, సులభా దేశ్‍పాండే, అమ్రిష్ పురి, సుప్రియా పాఠక్, పల్లవీ జోషి, రజత్ కపూర్, పంకజ్ కపూర్, అంజనా శ్రీ వాస్తవ తదితరులు ఎందరో వున్నారు. ఇక ఆయన వద్ద అసిస్టెంట్స్ గా పనిచేసిన వారిలో దయాల్ నిహలానీ విజయవంతమయిన దర్శకుడిగానూ, రవీ ఖెమ్మొ టెలీ సీరియల్ మేకర్ గానూ, ప్రహ్లాద్ కక్కర్ గొప్ప యాడ్ ఫిలిం మేకర్ గానూ ఎదిగారు. ఇక ఆయన చిత్రాలకు ఫోటోగ్రఫీ నిర్వహించిన గోవింద్ నిహలాని దర్శకుడై వెలుగొందుతూనే వున్నాడు.

ఇలా ఆధునిక సినిమాకి అధ్భుతమయిన సేవలందించిన శ్యాం బెనెగల్ కు 1976 లో పద్మశ్రీ, 1991 లో పద్మభూషణ్, 2007 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు లభించాయి.

శ్యాం బెనెగల్ భారతీయ నవ్య సినిమా తెరపై ఓ కథా పురుషుడు.

24 Comments
 1. శిద్దారెడ్డి వెంకట్ March 18, 2008 /
 2. Lakshmanna Vishnubhotla March 19, 2008 /
 3. మంజుల March 19, 2008 /
 4. రాజేంద్ర కుమార్ దేవరపల్లి March 19, 2008 /
 5. శిద్దారెడ్డి వెంకట్ March 19, 2008 /
 6. Lakshmanna March 19, 2008 /
  • విజయవర్ధన్ September 7, 2009 /
 7. chprakash June 29, 2008 /
  • విజయవర్ధన్ September 7, 2009 /
 8. వెంకట్ ఉప్పలూరి September 7, 2009 /
  • విజయవర్ధన్ September 7, 2009 /
   • వెంకట్ ఉప్పలూరి September 11, 2009 /
 9. కొత్తపాళీ September 8, 2009 /
 10. Venkat September 24, 2009 /
 11. santosh padaala October 14, 2009 /
 12. ramesh June 22, 2010 /
 13. ramesh June 23, 2010 /
 14. ramesh June 24, 2010 /