నా జీవితం లో ’రే’ సినిమా

ray-satyajit

charulata-satyajitray-dvdసత్యజిత్ రే సినిమా గురించి వివరణాత్మక వ్యాసం రాసే అనుభవం, ధైర్యం రెండూనాకు లేవని నా గొప్ప నమ్మకం.అందుకే నా జీవితం లొ ’రే’ సినిమా ఎలాంటి గమ్మత్తైన విధంగా ప్రవెశించిందో పంచుకుందామని కూసింత ప్రయత్నిస్తాను. సాధారణంగా ఎ ’పథెర్ పాంచాలి ’ తోనో ’అప్పు triology’ తోనో రే తో పరిచయప్రాప్తి కలగడం సర్వసాధారణం, కాని నాకు మాత్రం ’చారులత’ సత్యజిత్ రే ని పరిచయం చేసింది.

1994 లో ఆంధ్ర దేశమనే నాకు తెలిసిన చిన్న ప్రపంచం నుంచి కాలేజి చదువుకని మైసూరు రీజనల్ కాలేజి లో చేరటం జరిగింది. ఆసలే ఆంగ్ల సాహిత్యం మేజరు అందునా తెలియని ప్రపంచం ఈ సంధర్భం లో కాలేజి లో film club ఒకటి ఉందని తెలిసి సంబరపడి హుటాహుటిన సభ్యుడినైపొయా. అప్పటిదాకా రిలీజైన ప్రతి తెలుగు సినిమాని అప్రతిహతంగా బాగున్నా బాగులేకున్నాచూడటం అలవాటుగా ఉన్న నాకు అసలు సినిమాపై ఒక నిర్ధిష్టమైన అభిరుచి అప్పట్లో ఏడ్చినట్లుగా నాకు గుర్తులేదు. ఒక వారం తర్వాత ఏదో బెంగాలి చిత్రరాజాన్ని క్లబ్ వారు ప్రదర్సిస్తున్నారహొ… అంటూ ఒక నోటిసు వెలువడటం జరిగింది. ఒక్కసారిగా నేనుకట్టిన 200 రూపాయలు కళ్ళముందు కదిలి భగ్గు మంది. దక్షిణ భారతీయులు చదివే కాలేజి కాబట్టి తెలుగుతోబాటు ఏ తమిళమో,కన్నడమో మహా ఐతే మలయాళం సినిమాలు  దయతలుస్తాయనుకున్న నాకు బెంగాలి సినిమా ఒక షాకేమరి !

ఈ తంతు ,కథాకమామిషు ఏంటో తెలుసుకుందామని మా ఊరి సీనియరుని ఆశ్రయించా. ఆమహాశయుడు ’ఒరే పిచ్చినాగన్నా! film club అంటే సినిమాలు చూసి తందనాలు ఆడటం కాదునాన్నా(ఇక్కడ club కి కూడా ద్వందం తీసాడు మా సీనియరు), సినిమాలు చూసి ఆస్వాదించటం,ఆనందించటం,అభినందించటం అంటూ నా అజ్ఞానాన్ని దూరం చేసాడు. ఏది ఏమైనా నేను కట్టిన పైసలు బూడిదలొ పోసిన పన్నీరు కావడం ఇష్తం లేక అయిష్టంగానే సినిమాని భరించటానికి నిర్ణయించేసుకున్న తరుణంలో ఇంకో ఔత్సాహిక స్నేహితుడు మరింత సమాచారాన్నిమోసుకొచ్చాడు. ఇదేదో గొప్ప దర్శకుడు దర్శకత్వం నెరపిన మహత్తర చిత్రమని, ఈ సినిమా చూడకపోతే జన్మలకు సార్థకత ఉండదని వినికిడని, ఈ సినిమా కేసెట్టు ప్రత్యేకముగా కలకత్తా నుండి దిగుమతి చేయబడిందని దాని పేరు ‘చారులత’ అని దానిభావం.రోట్లో తలపెట్టి రోకటి పోటుకు వెరిచే రకం మనం కాదని బాహాటంగా కాకున్నా మనసులొ అనేసుకుని సినిమా చూడ్డానికి నేనూ తెగించేసాను.

సినిమా మొదలవక ముందే క్లబ్బు కోఆర్డినేటరు లేచి కొన్నిపరిచయ వ్యాఖ్యలు చెయ్యడం మొదలెట్టాడు, సినిమా ముందువేసే న్యూస్ రీలు లాగా ఇదీ భరించక తప్పదని నాకు అర్థమైపోయింది. ఈ సినిమా ని సత్యజిత్ రే అనే వ్యక్తి దర్శకత్వం వహించారని తను చెబుతూ ఒలికించిన గౌరవం చూస్తే, ఒక్క క్షణం ఆ ’రే’ ఎవరో మామధ్య కూర్చుని ఉన్నాడేమో అందుకె ఇన్ని రాగాలు పొతున్నాడు ఈ వెధవాయి అనిపించింది.

Charulata1సినిమా మొదలైంది, సన్నగా ఎక్కడొ దూరంగా నాకు తెలిసిన సంగీత ధ్వని తెరమీద ఉన్న చీకటి లోంచి titles మధ్యన వినిపించింది. ఆ క్షణం లో, నా జీవితంలో ఎప్పటి నుండో చూడాలనుకున్న సినిమా ఇదేనేమో అనిపించింది. ఎందుకలా అనిపించిందో ఇప్పటివరకు సమాధానం దొరకని ప్రశ్నల్లొ ఒకటి. ’చారు’ తెరమీదకి వచ్చింది, మధుబాల తరువాత నా కంటికి ఇంతవరకు ఏ కథానాయిక ఆనలేదనేచెప్పాలి కాని ఈ గుండ్రటి బెంగాలి వదనం ఒక్క సారిగా నన్ను ప్రేమలొ పడేసినట్టుఅనిపించింది. మాధబి(వి) ముఖర్జీ తన పేరని తరువాత తెలిసింది, కాని ఆ మోము లోని నిఘూఢ విషాదం చూసి ఒక్క ఉదుటున తెరచించుకు వెళ్ళి ఓదార్చుదామనిపించింది. ఆ నటి ఒక్క చూపులొ చూపించిన భావప్రకటన సినిమా మొత్తానికి మూలవస్తువని తరువాత తరువాత తెలియ వచ్చింది. బహుశా దీనినే గొప్ప నటన , మహాగొప్ప దర్శకత్వ ప్రతిభ  అంటారేమో. నాయిక ఒంటరితనం, జీవితం మీది జిజ్ఞాస, ప్రేమ,ఉత్సుకత దానితొపాటు తన ఉనికినే గుర్తించని భర్త భూపతి (శైలెన్ ముఖర్జీ) నిరాసక్తతని ఒక్క ‘opera glassess’ దృశ్యం లొ చూపించిన విధానం చూసి సినిమా అంటే ఇదేరా! అనిపించిందంటె నమ్మాలి.

తెరచించకుండానే ’చారు’ ఉదాసీనతను దూరం చెయ్యడానికి ప్రత్యక్ష్యమవుతాడు ’అమోల్’ (ఈ పాత్రను సౌమిత్ర చటర్జీ చేసారు). తన బీరకాయపీచు సంబంధం ఏమిటో subtitles చదవలేని నా బుర్రకు అర్థం కాలేదుకానీ… తను ’చారు’ జీవితం లొ తెచ్చిన మార్పు చూసి మాత్రం చాల ఈర్ష కలిగింది. రవీంద్ర సంగీతం, బెంగాలి సాహిత్యం సాక్షిగా వీరి మధ్య ఏర్పడే సాన్నిహిత్యానికి ఒక ’క్యుపిడ్’ బొమ్మ చారులత ఊగె ’ఉయ్యాల’ సాక్ష్యాలవుతాయి. ఆపుకోలేని ఆకర్షణ, అందుకోలేని అశక్తత, ఆమోదయోగ్యం కాని సామాజిక పరిస్థితి, భర్త నమ్మకం, అన్న విశ్వాసం వెరసి సినిమాకి కావలసిన ఘర్షణ (conflict) ని అందించాయి.

charulata1అమోల్ సహవాసం లో చారు ఒక సృజనాత్మక వ్యక్తి (రచయిత్రి) గా తన ఉనికిని మళ్ళీ పొందుతుంది కాని మారుతున్నభర్త స్థితిగతులు (ఆస్థి, పత్రిక అంతా పోతుంది), ఈ moral conflict మరియు’చారు’ యొక్క independent growth as an individual (beyond just being passive women companion) ను తట్టుకోలేక ఒక ఉత్తరం రాసి లండన్ కి పలాయనం సాగే ’అమోల్’ , ఇవన్ని కలిపి ’చారు” ను క్రుంగదీస్తాయి. తనజీవితం అనుకున్న పత్రిక పోయి ఒకవైపు ఉన్న భూపతి, అమోల్ వెళ్ళిపొయిన బాధలొ ఏడుస్తున్న చారు ని చూసి జరిగిన ’విషయం’ గ్రహిస్తాడు. ఈ బీటలు వారిన సంసారం ఒడ్డుకు చెరిందా ? చారు జీవితం ఏమైంది? అన్నదే సినిమాకు ముక్తాయింపు.

ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం, కథనంలో ఉన్న beauty అది ఏంటంటే…ఎక్కడా ఏమీ చెప్పక పోవడం. అంగ్లం లో ఒక మాట చెబుతారు “if you have said it, you have finished it. If you have suggested it, you have created it” అని. ’రే’ ఈ చిత్రం లో చారు -అమోల్ మధ్య ప్రేమ ఉందనికాని, వారి మధ్య శారీరక సంభంధం ఉన్నట్లుగాని ఎక్కడా చెప్పడు, మనచేత అనిపింపచేస్తాడు. భూపతి-చారు ఆఖర్నకలిసారా లేదా అన్నదికూడా చెప్పడు, సినిమా ఆఖరు లో వీరిద్దరి చెతులు కలిసాయా లేదా అనిపించే  విధంగా “freeze shot” తో ’శుభం’ (శుభ మేనా…..?) పడుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే, ’రే’ తెరమీద కవిత్వం రాసాడని చెప్పవచ్చు… poerty on screen.

ఆప్పటివరకు విలన్ని చంపేముందుకూడా “నేను నిన్ను చంపుతారా” అని డయలాగు చదివే చంపే హీరోల సినిమాలను ఆరాధించిన నాకు చారులత ఒక అద్భుతంగా అనిపించింది. సినిమా అంటే ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, కూసింత సెంటిమెంటు… లేకపోతే రివెంజ్ ఉంటే చాలు అనుకునే ఈ ’ఎర్ర బస్సు మహేష్’ కు జ్ఞానోదయమైంది.

styajit_ray_4ఇప్పుడు సత్యజిత్ రే గనుక బ్రతికిఉంటే, ఆ మహానుభావుణ్ణి కలిసే అవకాశం వచ్చి ఉంటే ఒక పని మాత్రం ఖచ్చితంగా చేసేవాడిని. చలం మైదానాన్ని, బుచ్చిబాబు ’చివరకు మిగిలేది’ ని ఆయన చేతుల్లో పెట్టి దయచేసి ఈ తెలుగు సాహితీ కుసుమాలను తెరబద్ధం చేసి తెలుగు సినిమాని పునీతం చెయ్యమనే వాడిని.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

K మహేశ్ కుమార్

రచయిత:

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లి. పెరిగింది కుప్పం, పీలేరు మరియు వాయల్పాడు గ్రామాలలో. ఆరోతరగతి నుండీ 'నవోదయ విద్యలయం' లో చదివా. ఈ సెంట్రల్ స్కూల్ పుణ్యమా అని హర్యాణా లోని హిస్సార్ జిల్లాలో రెండు సంవత్సరాలూ, అనంతపురం జిల్లా లేపాక్షి లొ రెండు సంవత్సరాలూ విద్యగడించి, స్కూలు (12th class) ముగిసే సరికీ కాస్త బయటి ప్రపంచంతోపాటూ హిందీ భాష కూడా వంటబట్టింది. ఇక నా జివితంలో సినిమాలంటారా! తమిళ నాడు బార్డరు మా పక్కనే కాబట్టి చిన్నప్పుడే తెలుగు సినిమాలతో పాటూ వాటినీ సాధించాం. అప్పట్లో మనం చూడని సినిమా లెదని నా నమ్మకం. "ఆ సినిమా బాగాలేదు" అని ఎవరైనా అంటే "ఎందుకు బాగాలేదో చూద్దాం" అని వెళ్ళే రకంగా మనకు ప్రసిద్ధి. ఇలా సినిమాలపై దండయాత్ర సాగిస్తుండగానే, కాలేజి చదువులకని మైసూర్ 'రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్' లో చేరటమూ, ఆటోమేటిక్ గా అక్కడి Film Club లో చేరడమూ 1994 లో జరిగిపోయాయి. అప్పటికే తెలుగు,తమిళ సినిమాకు దాస్యం చేస్తున్న మన బుర్రకు అక్కడే భారతీయ, ప్రపంచ సినిమాలు పరిచయమై, దాస్యాన్నితోలగించి కొంత మంచి సినిమా జ్ఞానాన్ని ప్రసాదించాయి. ఇలా సంపాదించిన సినిమా జ్ఞానంతో "ఇక సినిమాలు తియ్యడమే జీవిత లక్ష్యమ్" అనుకుని FTII కలలుకనగా, ఏదో సమస్య వలన ఆ సంవత్సరం అక్కడ "0 year" అయ్యి కూర్చ్ఘుంది. ఏమైతేనేం అని హైదరాబాద్ సెంటల్ యూనివర్సిటీ లో 'MA Communication' 2000 సంవత్సరంలో ముగించి కనీసం "డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్" అనిపించేసాం. ఆతరువాత టివీ చానళ్లలో, సిరియల్స్ లో కొంత 'ప్రయత్నం' చేసినా నిరాశ తప్ప నా ఆశను సాధింఛే మార్గం దొరకక, ఆర్ధికంగా కూడా గిట్టుబాటుకాక `Social/Development Communication Consultant' గా అవతారమెత్తి ఇప్పటిదా బ్రతుకుదెరువు కానిస్తూ, సినిమా కళాపోషణ చేస్తూ కలలు కంటున్నాను. అదేదో కృష్ణవంశి సినిమాలో సంగీత అన్నట్టు మనమూ "ఒక్క ఛాన్సిస్తే" అంటూ నవతరంగంలో చేరి "ఆ చాన్స్ మనమే కల్పింఛుకుందాం" అనే స్థితికి చేరి ఎదురుచూస్తున్నాం.

11 Comments to “నా జీవితం లో ’రే’ సినిమా”

  • మహేశ్ గారూ,
    నవతరంగానికి స్వాగతం. మీరు చేరడంతో ఈ తరంగం మరింత బలం చేకూర్చుకుంటుందని మీ మొదటి వ్యాసం తోనే తెలుస్తుంది. రాబోయే రోజుల్లో మీ నుంచి మరిన్ని వ్యాసాలు వస్తాయని ఆశిస్తున్నాను.
    అక్కడక్కడ ఉన్న అచ్చు తప్పులు సరి చేసి, వ్యాసాన్ని సరైన కేటగిరి కి మార్చి, బొమ్మ అతికించి, ట్యాగులు పెట్టాను.
    ఒక సారి సరిచూసుకోండి.
    వెంకట్

  • వెంకట్ గారు,
    ప్రొత్సాహానికి ధన్యవాదాలు.ఇన్నాళ్లు ఆలొచనలు మాత్రం చెస్తూ వచ్చిన నాకు వాటికి అక్షర రూపం కల్పిం అవకాశం ఇక్కడ రావటం ఆనందాన్ని కలిగిచింది.
    అవసరమైన మార్పులు చెసినందుకు మరోసారి thanks.

  • చాలా బాగా వ్రాసారు మహేశ్ గారు, నవతరంగానికి స్వాగతం.

    మీ వ్యాసం చదివి నేను ధీర్ఘాలోచనలో స్వగతంలోనికి వెళ్ళాను. ఠక్కున గుర్తుకు వచ్చింది, నేను కూడా ఒక రే సినిమా చూశాను కదా ఎప్పుడో అని. అఱె, అది కూడా మా కాలేజీలో (ఆంధ్రా బయట ఉన్నది) ఫిలిం క్లబ్బులో వేశారు కాదా అనిపించింది. ఆస్కారు వచ్చిన ఏకైక దేశీ దర్శకుడు అంటే చూడడానికి వెళ్ళాం.

    అప్పుడు ఆ సినిమా చూసి నాకు కలిగిన భావాలు గుర్తుకువచ్చాయి. నాకు ఆ సినిమా నచ్చలేదు. పథెర్ పంచాలి అనుకుంట, లేదా అప్పునో సరిగా గుర్తు కూడా లేదు. “తెలుగులో పాతవి చాలా వుంటాయిగా ఎడుపు గొట్టువి, ఈ సినిమా అంత గొప్పేఁవిటో” అనుకున్నా. మళ్ళీ ఎప్పుడూ రే సినిమా చూడలేదు. ఇది జరిగి ఎనిమిదేళ్ళ అవవస్తుంది. ఇప్పుడు చూస్తే వేరే విధంగా స్పందిస్తానేమే!
    మొత్తానికి నా జీవితంలో రే సినిమాని గుర్తుకు తెచ్చుకొని నాకు చాలా నవ్వొచ్చింది. అలానే అంపశయ్య నవలలో కూడా హీరోకి రే సినిమా అంటే చాలా ఇష్టం కానీ హీరోయిన్ బెంగాలీ అయినా ఆమెకి అస్సలు ఇష్టం వుండవు. ఎవరైనా రే సినిమాలు చాలా బాగుంటాయంటే నాకు ఆ సంఘటన కూడా గుర్తుకువస్తుంది.

  • WOW, it is a nice way of putting things in words.
    It makes me to write my first experience of Antonioni’s master class, The passenger. I’m naive to Ray Cinema and soon going to jump into his movies. After I watching Antonioni’s films, even I changed my science career and I took a new career which make me to live with his movies.

  • మహేష్ గారు,మీమొదటి తెలుగు వ్యాసం తోనే మంచి సమాచారం,మీ పరిచయం రెండూ సమపాళ్ళలో చాలా చక్కగా అందించారు.కొన్ని చోట్ల విరామచిహ్నాలు బాగానే ఇచ్చారు,కొన్ని సార్లు మరిచారు.వీలయినంత వరకూ మార్చాను.
    చలం మైదానాన్ని గతంలో సినిమానటుడు దివంగత చలం,శారద జంటగా తెరకెక్కించేందుకు యత్నించారు గానీ,మనకు తెలియని కారణాల వల్ల ఆ ప్రయత్నం సఫలం కాలేదు.
    చివరికి మిగిలేది నవలా రూపంలో చదివి,ఆస్వాదించేందుకు మాత్రం బాగుంటుందని నా అభిప్రాయం.

  • రాజేంద్ర గారు, మీ పరిశీలన శిరోధార్యం. విరామాలు, అల్పవిరామాల విషయం లో నా పాండిత్యం శంకించదగినదే. తెలుగు రాయటం మానేసి దాదాపు పది వసంతాలయింది,చదవడం బహుశ మూడు సంవత్సరాలుగా అంతగా సాగడంలేదు. మీ వంటి సహృదయులు తప్పులను క్షమించి,సవరించి, అభినందిస్తారనే నమ్మకంతోనే ఈ సాహసం చేశాను. నా నమ్మకాన్ని నిలిపినందుకు ధన్యవాదాలు.

    మైదానం కన్నా చివరకు మిగిలేది ని సినిమాగా తియ్యడం సులువని నా అభిప్రాయం, ఈ దిశలో కొంత screenplay గా రాశే ప్రయత్నం ఈ మధ్యనే ప్రారంభించాను.త్వరలో కొన్ని సీన్లని మీతోపంచుకునే ప్రయత్నం చేయగలను.

  • మహేశ్ గారూ,
    గ్రహణం సినిమా తీసిన మోహన్ కృష్ణ చివరకు మిగిలేది నవలను ఏకాంత గీతంగా స్క్రీన్ ప్లే రాసుకుని ఆ మధ్య సినిమా అనౌన్స్ కూడా చేసాక ఆగిపోయింది.

  • “సాహిత్యానికి సినిమా అనుసరణ” పైన కొన్ని వ్యాసాలు ఇక్కడ చూడొచ్చు:
    http://museindia.com/feature16.asp

    • దీంట్లో “కన్యాశుల్కం” పైన ఒక వ్యాసం చూడొచ్చు.

  • @ Mahesh :

    I am really impressed , idi mee 1st post ante asharayam vestundi , well written . inta baaga raasina vallu ipppdu vacchhae vi enti alaa raatunnaru , deeni standards lo kaneesam 2 % koooda levu ippudu raasevi , please ilaanti vi appudappudu raastoo undu !!

  • చాలా బాగా రాసారండి.నా చిన్నాప్పుడు దూరదర్శన్ లో(సత్యజిత్ రే పోయినప్పుడనుకుంటా)ఆయన సినిమాలు కొన్ని ఒక వారం,పది రోజులు వేసారు.నాన్నగారి నుంచి ఆయన సినిమాల గొప్పతనం వినీ,వినీ ఉన్న నాకు అప్పూ ట్రయోలొజీ(పథేర్ పాంచాలి,ఆపరాజితొ,అపుర్ సన్సార్) తో పాటూ,దేవి,చారులత,తీన్ కన్యా,కాంచన్ జంగా మొదలైన సినిమాలు చూసే భాగ్యం దక్కింది.
    భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులు ఆయన.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories