Menu

ఎల్వీ ప్రసాద్-ఒక పరిచయం

అక్కినేని లక్ష్మి వరప్రసాద రావు జనవరి 17, 1908న అక్కినేని శ్రీరాములు-బసవమ్మ దంపతులకు,ఏలూరు తాలుకా లోని సోమవరప్పాడు అనే కుగ్రామంలో,రెండో కొడుకుగా జన్మించారు. రైతు కుటుంబంలో గారాల బిడ్డగా పెరిగిన ఎల్వీ ప్రసాద్ చిన్ననాటి నుంచి ఏంతో తెలివైనవాడిగా పేరుపొందినప్పటికీ చదువుల మీద మాత్రం శ్రద్ధ వహించేవాడు కాదు.

చిన్నవయస్సులో నాటక ప్రదర్శనలు, టూరింగ్ టాకీస్లు ప్రదర్శించే సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కనబరచిన ఎల్వీ ప్రసాద్, ఆ తర్వాతి రోజుల్లో స్థానికంగా జరిగే నాటక ప్రదర్శనల్లోనూ చిన్న చిన్న వేషాలు పోషించి నటనపై ఆసక్తి పెంచుకున్నారు. ఇలా నటన, చలనచిత్రాలపై చిన్ననాటి నుండీ పెంచుకున్న ఆసక్తే ఆయన జీవితాంతం కొనసాగింది.

1924 లో, పదిహేడు సంవత్సరాల వయస్సులో మేనమామ కుమ్మర్తె సౌందర్య మనోహరమ్మ ను వివాహం చేసుకున్నారు ఈయన. ఆ దంపతులు త్వరలోనే ఒక పాపకు జన్మనిచ్చారు. ఆ రోజుల్లో ప్రసాద్ తండ్రిగారు చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో వారింట్లో కష్టాలు మొదలయ్యాయి.చివరికి వారు దివాళా తీయడంతో కుటుంబం ఘోర పరాభవాన్ని ఎదురుచూడవలసివచ్చింది. ఈ సమయంలోనే ప్రసాద్ తన నటనా కౌశలంతో చలనచిత్రసీమలో మంచి నటుడిగా ఎదిగి ఇంట్లో వారి కష్టాలు తీర్చవచ్చు అని నిర్ణయించుకుని,జేబులో కేవలం వంద రూపాయల తో,సినిమా ఫక్కీలో,ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బొంబాయి కి పారిపోయారు.

బొంబాయిలోని దాదర్ ప్రాంతంలో వున్న కోహినూర్ ఫిల్మ్ స్టూడియో గురించి విని ఉన్న ప్రసాద్, ఆ స్టూడియో దగ్గర సినిమా వాళ్ళను కలుసుకోవచ్చనే ఉద్దేశంతో 1930 జనవరి ఒకటవ తేదీన దాదర్ స్టేషన్ లో రైలు దిగాడు ప్రసాద్. రామకృష్ణ అనే లాడ్జిలో మకాం ఏర్పరుచుకున్న ఆయనకు కొద్ది రోజుల్లోనే అతని కలలు నిజం చేసుకోవడం ఎంత కష్టమో అర్థమయిపోయింది. అసలే హిందీ కానీ ఆంగ్లం లో కానీ మాట్లాడడం తెలియని ఆయనకు జీవితం మరింత కష్టమైపోయింది. వచ్చీ రాని ఆంగ్ల భాషలో ఎంతో మందికి సినిమాల్లో పని చేయాలన్న తన తీవ్ర వాంఛను తెలియచేసే ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసే అయ్యాయి. సినిమాల్లో అవకాశం కాదు కదా కనీసం కోహినూర్ స్టూడియోలోనికి కూడా ప్రవేశం దక్కకపోవడంతో, స్టూడియో చుట్టూ తిరుగుతూ గోడ సందుల్లోంచి గంటల తరబడీ, ఆ రంగుల ప్రపంచంలోకి ఎప్పుడు వెళ్తానా అని తీవ్రంగా ఎదురుచూసే వాడు.

ఇలా రోజంతా స్టూడియో చుట్టూ తిరగడం, కోహినూర్ స్టూడియో కి ఎదురుగా వున్న టైలర్ షాపు కి వచ్చీ వెళ్ళే సినిమా తారలను గమనించడం తో కొన్నాళ్ళు గడిపేసాడు ఆయన. ప్రతిరోజూ స్టూడియో వద్దకు ఠంచనుగా వచ్చివెళ్ళే ప్రసాద్ ఆ టైలర్ షాపు యజమాని కళ్ళల్లో పడ్డాడు. అప్పుడప్పుడూ మాట్లాడడం ద్వారా సినిమా పై ప్రసాద్ కి వున్న ఆసక్తి ని గమనించాడు ఆ షాపు యజమాని. కానీ అక్కడకు వచ్చి వెళ్ళే సినిమా తారలు మాత్రం ప్రసాద్ కలలను తీరని కలలని నవ్వి గేళి చేసేవారు. అయినా కూడా ప్రసాద్ పట్టువిడవకుండా ప్రతిరోజూ ఆ టైలర్ షాపు దగ్గర సినిమా వాళ్ళను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుండేవాడు.కొద్ది రోజుల తర్వాత తను వుంటూన్న హోటల్ గదిలో ఎవరో చొరబడి వున్న కాస్త సొమ్ము దొంగలించడంతో ప్రసాద్ రోడ్డున పడ్డాడు.

lvprasad.jpgప్రసాద్ సొమ్మును దొంగలించిన దొంగ మొత్తం సొమ్మంతా ఊడ్చేయకుండా కొంచెం మానవత్వం చూపించి కొంత సొమ్ము వదిలేయడమే కాకుండా ఆ డబ్బుతో రైలు టిక్కెట్టు కొనుక్కొని ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం మంచిదన్నట్టుగా ఒక ఉత్తరం రాసి పెట్టి మరీ వెళ్ళాడు. ప్రసాద్ మాత్రం పట్టు విడవకుండా లాడ్జి ఖాళీ చేసి ట్రంకు పెట్టెతో సహా స్టూడియో దగ్గరకు చేరుకున్నారు. అలా ట్రంకు పెట్టేతో స్టూడియో ముందు కూర్చున్న ప్రసాద్ ని చూసి టైలరింగ్ షాపు యజమాని జరిగిన సంగతి తెలుసుకున్నారు.ప్రసాద్ చెప్పిన కథనం విని సినిమాల్లో అవకాశం దొరికే వరకూ తన షాపు లో పని చేస్తూ అక్కడే తలదాచుకోవచ్చని సలహా ఇచ్చారు. రోజు రోజుకీ దూరమవుతున్న కల అదృష్టవశాతూ వీనస్ ఫిలిం కంపెనీ లో చిన్న ఉద్యోగం దొరకడంతో మళ్ళీ కలలు నిజమయ్యేలా కనిపించాయి. వీనస్ ఫిలిం కంపెనీ లో పనికయితే చేరాడు కానీ వాళ్ళు సినిమాలు తీయలేదు సరికదా తనకు జీతం కూడా ఇవ్వలేదు. ఇక్కడే ప్రసాద్ ధీరాలాల్ అనే పంజాబీ యువకునితో పరిచయమయ్యింది. వీనస్ లో జీతం లేని ఉద్యోగం చేయలేక ధీరాలాల్ సహాయంతో చిన్న చితకా ఉద్యోగాలు చేస్తూ పొట్టగడుపుకుంటున్న రోజుల్లో ఆయనకు ఇండియా పిక్చర్స్ అనే సినిమా కంపెనీలో మరో చిన్న ఉద్యోగం దొరికింది. ఇక్కడ పని చేస్తుండగా అక్తర్ నవాజ్ అనే దర్శకుడు ‘స్టార్ ఆఫ్ ది ఈస్ట్’ అనే సినిమాలో ఒక చిన్న పాత్ర పోషీంచే అవకాశం ఇచ్చారు. దురదృష్టవశాత్తూ ఈ సినిమా విడుదలకాలేదు.

ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ లో పనిచేస్తున్న ధీరాలాల్ సోదరి మోతీ సహాయంతో, తొలి భారతీయ టాకీ సినిమా అయిన ‘ఆలం అరా’ సినిమాలో ఒక చిన్న పాత్రను పోషించడంతో సినిమాల్లో నటించాలనే తన కలను నిజం చేసుకున్నారు ప్రసాద్. ఈ సినిమాలో నటించినందుకుగానూ నెలకు 30 రూపాయల జీతంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు ప్రసాద్. ఈ సినిమాకి పని చేస్తున్న రోజుల్లో హెచ్ ఎం రెడ్డి తో కలిగిన పరిచయం ద్వారా ఆయనకు మరిన్ని అవకాశాలు కలిగించాయి. హెచ్.ఎం రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తొలి తమిళ టాకీ సినిమా కాళిదాసు లో నటించిన తర్వాత ఆయన దర్శకత్వంలోనే వచ్చిన తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద సినిమాలోనూ చిన్న పాత్రల్లో నటించారు ప్రసాద్. మూడు సినిమాల్లో నటించడం ద్వారా సినిమా రంగంలో కొద్దిగా స్థిరపడ్డట్టే అని నిర్థారించుకున్న ప్రసాద్ ఆనందంతో తను ఇంటికి తిరిగొస్తున్నట్టుగా టెలిగ్రాం పంపారు. అప్పటివరకూ ప్రసాద్ చనిపోయి వుంటాడనుకున్న ప్రసాద్ తిరిగొస్తున్నాడని ఇంట్లో వాళ్ళు సంతోషపడినా అతని చిన్నారి కూతురు మరణ వార్తను ఎలా తెలియచేయాలా అని తీవ్ర విచారానికి కూడా గురిచెందారు. కొన్నళ్ళు సొంత వూరిలో గడిపిన ప్రసాద్ తన భార్య తో కలిసి బొంబాయి కి చేరుకున్నారు. ఇక్కడే ఆనంద్ మరియు రమేష్ అనే ఇద్దరు కుమారులకు ఆ దంపతులు జన్మనిచ్చారు.

బొంబాయిలో వుండగా అనుకోకుండా దొరికిన ఒక అవకాశంతో, ఆలీ షా దర్శకత్వంలో వచ్చిన కమర్-అల్-జమన్ అనే సినిమాకు ప్రసాద్ సహాయ దర్శకునిగా పనిచేశారు. ఈ సినిమాకి పని చేస్తున్నప్పుడే హాజరు పట్టిలో రాయడానికి పేరు పెద్దదిగా వుందని ఒక క్లర్కు ఈయన పేరును అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ రావు నుంచి ఎల్వీ ప్రసాద్ గా కుదించి వేశారు. అప్పటినుంచీ ఆయనకు ఆ పేరే స్థిరపడిపోయింది.

6 Comments
  1. Theja April 9, 2008 /
  2. శిద్దారెడ్డి వెంకట్ April 9, 2008 /
  3. చక్రవర్తి April 10, 2008 /
  4. sujatha April 10, 2008 /
  5. Praveen September 7, 2009 /
  6. rayraj September 7, 2009 /