Menu

సినిమాలెలా తీస్తారు-మూడో భాగం

screenplayjx4
ఇతివృత్తం -> కథాంశం -> సింగిల్ లైన్ స్టోరీ -> సీనిక్ ఆర్డర్ -> స్క్రీన్ ప్లే

సినిమా తీయాలంటే ముందు కథ కావాలి. ఏ కథ ఎంతబాగా ఆడుతుందనే విషయంలో ఎవరి అంచనాలు వాళ్ళకుంటాయి. (”Last of the great Vijaya classics” గా గుర్తింపు పొందిన గుండమ్మ కథ ఎలా ఆడుతోందో, అసలు ఆ సినిమాలో ఏముందని జనాలు అంతగా చూస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అదే విజయావారికి మాయాబజార్, పాతాళభైరవి సినిమాలు తీసిపెట్టిన దర్శకుడు కె.వి.రెడ్డి అనేవారు.)

రెడీమేడ్ కథను సినిమాకు adapt చేసుకుంటే (adopt చేసుకోవడం పాత సినిమాలను మళ్ళీ తీస్తున్నప్పుడు తప్ప సాధారణంగా జరగదు కాబట్టి) కథాచర్చలు సీనిక్ ఆర్డర్ నుంచి మొదలౌతాయి. అలా కాక కొత్త కథాంశాన్ని సినిమాగా తీయదలచుకున్నప్పుడు కథ యొక్క కథ ఇతివృత్తం నుంచి మొదలౌతుంది.

సినిమా రచయిత కథ చెప్పడానికొచ్చినప్పుడు ముందుగా దర్శక, నిర్మాతలు ఒక్క ముక్కలో ‘కథేంటి?’ అని అడగడం పరిపాటి. కథారచయిత కూడా కాలహరణం చేయకుండా దానికి సమాధానం నాలుగు ముక్కల్లో చెప్తే దాన్ని బట్టి ఆ కథ తమ అభిరుచికి తగిందో కాదో, ప్రేక్షకులను ఆకట్టుకోగలదో లేదో, ఆ కథను సినిమాగా తియ్యొచ్చోలేదో వారికి ఒక అంచనా ఏర్పడుతుంది. ఉదాహరణకు “లంచగొండి అధికారులను ఒక్కొక్కరినీ హీరో చంపుకుంటూ పోవడమే” భారతీయుడు, ఠాగూర్, అపరిచితుడు – ఈ మూడు సినిమాల ఇతివృత్తం. అంటే మూడు సినిమాల ఇతివృత్తం ఒకటే! కానీ కథాంశాలు మాత్రం వేర్వేరు. (ఈ మూడు సినిమాల్లోని హీరోల్లో ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన నేపథ్యం. అందుకే అవినీతిపరులను చంపడానికి వారెంచుకున్న మార్గాలు విభిన్నమైనవి. ఆ మార్గాలే ఆయా కథాంశాల్లో వైవిధ్యాన్ని తీసుకొచ్చి ఘనవిజయాలు సాధించాయి.)

స్వాతంత్ర్య సమరంలో INA తరపున బ్రిటిష్ వారితో పోరాడిన సైనికుడు స్వాతంత్ర్యానంతర భారతదేశంలో వేళ్ళూనుకునిపోయిన అవినీతిపై సాగించిన పోరాటమే భారతీయుడు కథాంశం.

సంఘంలోని అవినీతిని సహించలేని, నేరుగా ఎదుర్కొనే ధైర్యమూ లేని సంప్రదాయకుటుంబానికి చెందిన బ్రాహ్మణయువకుడిలో ఉండే ఎవరికీ తెలియని మరో మనిషి split personality ద్వారా బయటికొచ్చి ఆ అవినీతిపరులను ఎలా ఎదుర్కొంటాడో, వారిని ఎలా శిక్షిస్తాడో మనస్తత్వశాస్త్రపరంగా చూపించడమే అపరిచితుడు కథాంశం.

ఇలా మొదటగా నాలుగు ముక్కల్లో రాసుకునే కథనే సింగిల్ లైన్ స్టోరీ అంటారు. తర్వాత తీయబోయే పధ్నాలుగు రీళ్ళ సినిమాకు మార్గదర్శిగా ఉండేది ఈ నాలుగు ముక్కల సింగిల్ లైన్ స్టోరీయే.

తర్వాతి దశలో ఈ నాలుగు ముక్కల కథను నాలుగు పేజీల కథగా రాసుకుంటారు. నాలుగు ముక్కల్లోకి రాలేని ఉత్కంఠ, నాటకీయతలు నాలుగు పేజీల కథలోకి వస్తాయి. కథలోకి కదలిక వస్తుంది. ఒక సన్నివేశం తర్వాత ఇంకొక సన్నివేశం వచ్చినప్పుడు కథ ఎలా ముందుకు కదులుతోందో స్పష్టంగా తెలుస్తుంది. ఈ సన్నివేశాల కూర్పు కథాంశానికి అనుగుణంగా ఉందో లేదో సరిచూసుకోవడానికి అవకాశముంటుంది. ఒకరకంగా చెప్పాలంటే మొత్తం పద్దెనిమిది రీళ్ళ సినిమాగా తీయబోయే కథకు ఇది సంక్షిప్తరూపం (precis writing లాంటిది).

ఇదే శీర్షికలో ఇంతకు ముందు చెప్పినట్లు సినీరచయిత తనకు నచ్చినట్లు రాయడం కాకుండా నిర్మాత, దర్శకుడు, హీరో, తదితరుల ఇష్టాలను కూడా పరిగణనలోకి తీసుకుని కథలో అందుకు అనుగుణంగా మార్పులు చెయ్యవలసి ఉంటుంది. ఆ మార్పులు ఇక్కడినుంచే మొదలౌతాయి. అంటే ఇతివృత్తం రచయిత చెప్పిందే అయినా కథాంశం మాత్రం అచ్చంగా రచయిత ముందనుకున్నదే కాకపోవచ్చు. ఇతరుల ఇష్టాయిష్టాలే కాకుండా అర్థం పర్థంలేని సెంటిమెంట్లు, నటీనటుల ఇమేజ్ లాంటివాటికి అనుగుణంగా కథ మార్చి రాయాల్సి రావడం రచయిత స్వేచ్ఛను హరించడమే.

సీనిక్ ఆర్డర్: సన్నివేశాల సమాహారం (దృశ్యమాలిక). కథారచనలో ఇది తర్వాతిదశ. కథాంశాన్ని తెరకెక్కించడానికి వీలుగా దృశ్యాలుగా విడగొట్టుకుని వరసగా రాసుకోవడమన్నమాట. దీంట్లో ప్రతి దృశ్యానికీ కథాంశపరంగా ఒక ప్రయోజనముండేలా, ప్రతి సన్నివేశం రసానుభూతికి భంగం కలగకుండా కథాంశాన్ని ముందుకు నడిపేలా జాగ్రత్త తీసుకోకపోతే కథనం పేలవంగా తయారవుతుంది.

మాటలు: సీనిక్ ఆర్డర్ సిద్ధమైన తర్వాత మాటల రచయిత రంగప్రవేశం చేస్తాడు.

స్క్రిప్ట్/స్క్రీన్ ప్లే రచన:
సినిమా దృశ్యమాధ్యమం. సినిమా రచన కూడా దానికి తగినట్లే ఉండాలి. నేపథ్య, వాతావరణ చిత్రణలు దృశ్యంలోనో, శ్రవణంలోనో తెలియాలి. తాము ఆ సన్నివేశం జరుగుతున్నచోటే ఉన్న భావన ప్రేక్షకులకు కలిగించాలి. ప్రేక్షకులకు తాము సినిమా థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్నామనే ఆలోచన రానివ్వకుండా వారిని తనలో లీనం చేసుకుని తనతోబాటు ఆ వాతావరణంలో విహరింపజేసేదే నిజమైన సినిమా. దీనికోసం సందర్భానికి తగిన ధ్వనులు (సంవాదం, నేపథ్యసంగీతం, సంగీతం, వాతావరణ సంబంధ ధ్వనులు, జంతువులధ్వనులు) వినిపించడం, దృశ్యాలు చూపించడం చేస్తారు. లేకపోతే ప్రేక్షకులకు ఆసక్తి పోతుంది. ఇవన్నీ స్క్రీన్ ప్లేలో “లెఫ్టు”లో వస్తే మాటలు “రైట్” లో వస్తాయి. అందుకే కె. విశ్వనాథ్ లాంటి దర్శకులు లెఫ్టు నింపడం పై ప్రత్యేకశ్రద్ధ వహిస్తారు. స్క్రీన్ప్లే తయారుచేసేటప్పుడు ఆయన తన సహాయకులకు ఎప్పుడూ “లెఫ్టు నింపండిరా” అని బోధిస్తూ ఉంటారని ఆయన దగ్గర పనిచేసినవాళ్ళు చెప్తారు. ఇంతకూ ఈ “లెఫ్ట్” ఏమిటి.

లెఫ్ట్ ఏమిటో తెలియాలంటే అసలు స్క్రీన్ ప్లే ఎలా రాస్తారో తెలియాలి.

స్క్రీన్ ప్లే రాయడం కోసం పేజీలో మార్జిన్ వదిలిన తర్వాత మిగిలిన భాగాన్ని నిలువుగా మధ్యలోకి విభజించుకుంటారు. దాంట్లో ఎడమవైపు దృశ్యవివరణ, కుడివైపు సంభాషణలు రాసుకుంటూ పోతారు. పేజీ పై భాగంలో ఎడమవైపు సీన్ నంబరు, మధ్యలో లొకేషను, కుడివైపు ఇండోరా/ఔట్డోరా, పగలా/రాత్రా, అవసరమైతే టైమ్ రాసుకుంటారు. స్క్రీన్ ప్లేలో – మరీ ముఖ్యంగా ఎడమవైపు – ఎంత వివరంగా రాసుకుంటే చిత్రీకరణలో అంత స్పష్టత వస్తుంది. ఆ రకంగా చూస్తే మంచి మంచి దృశ్యకావ్యాల్లాంటి సినిమాలు తీసేవాళ్ళంతా ఎర్రకామెర్లు లేని లెఫ్టిస్టులే! శంకరాభరణం సినిమా మొత్తం కలిపినా సంభాషణలు పదహైదు పేజీలకు మించి లేవు! సినిమాస్క్రిప్టులో లెఫ్టు ప్రాధాన్యతేమిటో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఐతే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి మాటల మాంత్రికులు లెఫ్టుకు ఎక్కువ మొగ్గకుండానే “రైట్ రైట్” అంటూ దూసుకుపోగలరు. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎవరి స్టైల్ వారిదే!

కమల్ హాసన్ సినిమా ద్రోహి స్క్రిప్టులోని ఒక పేజీ:

దృశ్యం:4 ఆది బెడ్‌రూమ్ లోపల/పగలు

లాంగ్ షాట్ లో చెట్టు. కెమేరా కిందకు దించి ఆదినారాయణరావు ఇల్లు చూపిస్తారు.
మిడ్ షాట్ లో సుమిత్ర బాత్రూమ్ తలుపులు తీసుకొని వస్తున్న దృశ్యం.
మిడ్ షాట్ లో ఆదినారాయణరావు దుస్తులు ధరిస్తున్న దృశ్యం.
లాంగ్మిడ్ షాట్ లో ఇద్దరినీ చూపిస్తారు.

సుమిత్ర:

ఆది:

సుమిత్ర:

ఆది:

సుమిత్ర:

ఆది

సుమిత్ర:

ఇదేమిటి?

(…అబ్బాస్ ఇంటికి.

యూనిఫారమ్‌లోనా?

(…కాస్త పని ఉంది.

ఇవేం చెయ్యను? నమిలి మింగెయ్యనా?

ఏదీఏవిటది?

ప్రభాత్ థియేటర్. ఈవినింగ్ సిక్స్ థర్టీ షో రుపీస్ నైన్ ఫిఫ్టీ నాట్ రిఫండబుల్ మర్చిపోయానని చెప్తే మాత్రం నాకు కోపం వస్తుంది.

క్లోజప్ షాట్ లో సుమిత్ర ఆదినారాయణరావు దగ్గరకు వచ్చే దృశ్యం.

ఆది:

సుమిత్ర:

గుర్తుందని అబద్ధం ఆడితే?

ఇంకా కోపం వస్తుంది

మిడ్ షాట్ లో ఆమె నుంచి అతడు దూరంగా కదిలే దృశ్యం

సుమిత్ర:

అయితే, అది……మీకొద్దన్నమాట.

మిడ్ షాట్ లో ఆది వెనక్కు తిరగడం.

ఆది:

సుమిత్ర:

ఏది?

ఇంకో పాపో! బాబో!

ఇలా లాంగ్ షాట్లు, మిడ్ షాట్లు, క్లోజ్ షాట్లు మార్చి మార్చి చూపించడమెందుకు?
ఇదే దృశ్యాన్ని ఆది, సుమిత్ర ఎక్కడివాళ్ళక్కడే బిగుసుకుపోయి డైలాగులు అప్పజెప్తూ ఉంటే, కెమెరాను కూడా ఒకేచోట పాతేసి, యాంగిల్ కూడా మార్చకుండా తీస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇక నుంచి మీరు సినిమా చూసేటప్పుడు షాట్ మారడాన్ని అప్రయత్నంగానే గమనిస్తారు. ఆ విషయం నాకు తెలుసు. 🙂

స్క్రీన్ ప్లేలో కుడి ఎడమల కనిపించే ఖాళీలు సెట్ ప్రాపర్టీస్, ఆ షాట్లో వచ్చే నటీనటుల వివరాలు, షూటింగులో ఓకే అయిన షాట్ నంబరు తదితరాలు రాసుకోవడానికి ఉపయోగపడతాయి.

-సుగాత్రి (http://sahityam.wordpress.com)
తొలిప్రచురణ:పొద్దు

14 Comments
 1. Ravi June 12, 2008 /
 2. Ravi varma June 12, 2008 /
 3. raj June 12, 2008 /
 4. sodigadu June 12, 2008 /
 5. Manjula June 13, 2008 /
 6. srikanth August 27, 2008 /
 7. Mahesh Vaddi October 2, 2008 /
 8. chandrasekhar October 4, 2008 /
 9. raju March 30, 2009 /
 10. శంకర్ March 30, 2009 /
 11. john August 12, 2009 /
 12. kishor_ KTG September 16, 2009 /
 13. Vara December 5, 2009 /