Menu

వింత కలయికల ‘తడి’- ఈరమ్ (తమిళ్)

eeram-poster-1ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణ సంస్థ ‘S picture‘ వైవిధ్యానికి పట్టంగట్టే నిర్మాణసంస్థగా మంచి గుర్తింపు పొందింది. ఈ సంస్థ నూతన చిత్రం, ‘అరివళగన్‘ దర్శకత్వం వహించిన “ఈరమ్“. ఈరమ్ అంటే తెలుగులో తడి లేదా చమ్మ అని అర్థం.

ఒక అపార్ట్మెంట్ బిల్డింగులో రమ్య(సింధు మీనన్) అనే గృహిణి బాత్ టబ్ లో మునిగి చనిపోతుంది. అది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీస్ పరిశోధన ప్రారంభమవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ రమ్య ఒకప్పుడు ప్రేమించిన వాసుదేవన్ (ఆది). రమ్య సూసైడ్ నోట్ లభించడం, చుట్టుపక్కల ఫ్లాట్ వాళ్ళ సాక్ష్యాల ఆధారంగా పోలీసులు రమ్య చావునొక ఆత్మహత్యగా నిర్ణయిస్తారు. కానీ రమ్య వ్యక్తిత్వం తెలిసిన వాసుదేవన్ కు అది ఆత్మహత్య అని నమ్మబుద్ది కాదు. ఒక మిత్రుడి సహాయంతో సొంతంగా తనే ఇన్వెస్టిగేట్ చెయ్యడం మొదలెడతాడు. అదే సమయంలో ఆ అపార్ట్మెంట్ లో రమ్యతో పరిచయమున్న ఒక్కొక్కరూ చంపబడ్డం మొదలౌతుంది. ఈ అందరి చావులోనూ ఉపయోగపడిన ఆయుధం …నీళ్ళు…తడి.

రమ్య ఎందుకు చనిపోయింది? రమ్య చావుకీ ఈ చావులకీ మధ్యనున్న సంబంధం ఏమిటి? వాసు ఈ రహస్యాన్ని బేధిస్తాడా అనేది మిగతా కథ.

ఈ మధ్యనే నవతరంగంలో సినిమాల మూసల (Genre – జాన్రా) గురించి చర్చలు జరిగాయి. ఆ నేపధ్యంలో చూసుకుంటే, ఈ సినిమాని మర్డర్ మిస్టరీతో మొదలై హృద్యమైన ప్రేమకథగా రూపాంతరం చెంది, హఠాత్తుగా మానవాతీతశక్తుల సినిమాగా పరిణితిచెందే ఒక ధిల్లర్ అనుకోవచ్చు. ఇన్ని మూసలు కలిపిన మసాలా మిక్స్ లాగా అనిపించినా, అన్ని మూసల్నీ సరైనపాళ్ళలో కలిపి కన్విన్సింగా చెప్పగలగటం వలన ఒక మంచి సినిమాగా తయారయ్యింది.ముఖ్యంగా హారర్ ఎలిమెంట్ ని ధ్రిల్లర్ పంథాలో నడిపి, ఎక్కడా జుగుప్స కలగకుండా దర్శకుడు చూపించిన విధానం అభినందనీయం.

Tamil-Movie-Eeram-Stills-05భద్రాచలం లాంటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సింధు మీనన్ (చందమామ ఫేమ్), రమ్యపాత్రలో చాలా మంచి నటన కనబరిచింది. చాలా అందంగా కూడా కనిపించింది. ‘మృగం’ చిత్రంలో తన భీకరమైన నటన కనబరిచిన ఆది(దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు) చాలా అండర్ ప్లే ఉన్న వాసుదేవన్ పాత్రలో రాణించాడు. మంచి భవిష్యత్తు ఉన్న నటుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. రమ్య భర్త ‘బాల’గా నందా నటన ఆకట్టుకుంటుంది. రమ్య చెల్లెలిగా శరణ్య మోహన్ పాత్రోచితంగా నటించింది. ముఖ్యంగా రమ్య తనని ఆవహించినప్పుడు చేసిన నటనని మెచ్చుకోవచ్చు.

సినిమాలో చాలా భాగం వర్షం పడుతూవుంటుంది. ఆ మూడ్ ని సినెమాటోగ్రఫీ విభాగం(మనోజ్ పరమహంస) మనసుకి హత్తుకునేలా చిత్రీకరించింది. నేపధ్యసంగీతం చాలా బాగున్నా, పాటల్లో కొంత మోనాటనీ ధ్వనిస్తుంది. ఇది ఔట్-అన్డ్-ఔట్ దర్శకుడు ‘అరివళగన్‘ చిత్రం. భారతీయ సినిమాల్లో ధ్రిల్లర్లు వచ్చేదే చాలా అరుదు. అదీ ఇంత మంచిది రావడం అత్యంత అరుదు. కాబట్టి… అర్జంటుగా చూసెయ్యండి.

9 Comments
  1. గీతాచార్య September 20, 2009 /
  2. mohanrazz September 20, 2009 /
  3. కన్నగాడు September 21, 2009 /
      • రామ November 18, 2009 /
  4. srilu September 25, 2009 /
    • mohanrazz September 25, 2009 /