Menu

ఈనాడు – సఫలం కాని రీమేక్

200908299024709080847_eenaduటెర్రరిజం భయంతో, ప్రభుత్వ అలసత్వం మీద నిరసనతో, ఈ పరిస్థితుల్లో  ఏంచెయ్యాలో తెలీని నైరాశ్యంలో జీవిస్తున్న సాధారణ జనంలోంచీ వచ్చిన ఒక ‘సామాన్యుడు’  వ్యవస్థ ఉలిక్కిపడే విధంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని instant justice అమలుజరిపే కథ ‘ఈనాడు’ చిత్రానిది. కథ కొత్తదికాదు. ఎన్నో సినిమాల్లో చూసిందే. కానీ విన్నూత్నమైన కథనం ఈ చిత్రానికి ఆయువుపట్టు.

గత సంవత్సరం హిందీలో అనూహ్యమైన విజయం సాధించిన A Wednesday చిత్రానికి తెలుగు రూపం “ఈనాడు”. ఒక భాషలో హిట్టైన సినిమాని మరో భాషలోకి రీమేక్ చెయ్యడం ఎప్పుడూ వ్యాపారాత్మకంగా మినిమమ్ గ్యారంటీ అనుకోవచ్చు. కానీ, సృజనాత్మకంగా ఇలాంటి ప్రయత్నాల్లో లాభాలెంతున్నాయో నష్టాలూ అంతే ఉంటాయి. మంచి స్కిప్టులో ఉన్న లాభాల్ని నటుల ఎంపికలోని లోపాలు, పదునులేని సంభాషణలు,పటుత్వంలేని దర్శకత్వం, పేలవమైన నేపధ్య సంగీతం వంటి స్వయంకృతాపరాధాలతో నష్టాలుగా మలుచుకున్న ఘనత మన తెలుగు నిర్మాతలకు చెల్లుతుంది ( రాజ్ కమల్ ప్రొడక్షన్స్).

పోలీస్ కమీషనర్ ఈశ్వర్ ప్రసాద్ (వెంకటేష్) తన జీవితాన్ని మార్చేసిన ఒకరోజు గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో మొదలౌతుంది. హైదరాబాద్ సిటీలో ఆరు చోట్ల బాంబులు పెట్టినట్లు ఒక అనామకుడు (కమల్ హాసన్) ఫోన్ చేస్తాడు. ఆ బాంబుల జాడ చెప్పటానికి ప్రతిగా కొందరు టెర్రరిస్టుల విడుదల కోరుకుంటాడు.ఈ ఘటనలో మరో ఇద్దరు సిన్సియర్ పోలీసులు, ఒక టివి జర్నలిస్టు ఇన్వాల్వ్ అవుతారు. ఈ పరిస్థితిని కమిషనర్ ఎలా ఎదుర్కొంటాడు? చివరికి ఏంజరుగుతుంది? అనేది ఈ చిత్రకథ.

అనామకుడు/సామాన్యుడు గా కమల్ నటన బాగానే ఉన్నా, హిందీ చిత్రంలో నసీరుద్ధీన్ షా నటన గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకో వెలితిగా అనిపిస్తుంది. కమల్ ఆ పాత్ర పోషించడం ద్వారా పాత్ర ధోరణి, ఔచిత్యంలో తేడావచ్చి న్యాయం జరగలేదన్న భావన కలుగుతుంది. ముఖ్యంగా బాంబులుపెట్టిన అనామకుడు,కోపంతో ఉన్న సామాన్యుడిగా మారే దృశ్యాలు ఎలివేట్ అవకుండా మిగిలిపోవడానికి ఈ mis-casting కారణమేమో అనిపించక మానదు. కమల్ తెలుగు వాచకం కూడా పాత్ర అవసరమైన విధంగా పండకపోవడానికి ఒక కారణం కావచ్చు. పోలీస్ కమిషనర్ గా వెంకటేష్ చాలా పాత్రోచితంగా నటించారు. చీఫ్ సెక్రెటరీ (లక్ష్మి)తో జరిగే confrontation దృశ్యాలలో కొంత తికమకగా అనిపించినా (అది బహుశా సంభాషణల మహత్యం అనుకుంటా) క్రమేణా ఆ పాత్రపై తనదైన ముద్రవెయ్యడంలో వెంకటేష్ సఫలమయ్యారు.

మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లుగా గణేష్ వెంకటరామన్, భరత్ రెడ్డి అవసరమైనంత పరిధిలో నటించారు. టివి జర్నలిస్టుగా అంజు అయ్యర్ చాలా అసహజమైన నటన ప్రదర్శించింది. డైలాగులు అప్పజెప్పడంలో ఉన్న శ్రద్ధ నటనపై కనబరిచినట్లు అస్సలు కనిపించదు.

కథలో చెప్పిన సొల్యూషన్ తో సైద్ధాంతికంగా విబేధించినా, హిందీదర్శకుడు నీరజ్ పాండే కథ చాలా మంచిదనే చెప్పాలి. కానీ తెలుగులో కొచ్చేసరికీ, అనుభవరహితుడైన తోలేటి చక్రి దర్శకత్వంలో కథనం పటుత్వాన్ని కోల్పోయింది. సినిమా ప్రారంభంలోనే కమల్ బాంబు తయారు చేస్తున్నట్లు చూపించడం వంటి గిమ్మిక్కులతో పాత్ర ఔచిత్యాల్ని దెబ్బతీసి, ఈ సినిమా ద్వారా కలగాల్సిన desired effect ని తగ్గించేశారు. ఈ సినిమాలో ఉన్న పెద్ద లోపాలు నీలకంఠ సంభాషణలు. శృతిహసన్ నేపధ్యసంగీతం. వీటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఈ సినిమాని రెడ్ కెమెరాతో చిత్రీకరించడం సాంకేతికంగా ఒక ప్రయోగం. ఔట్ పుట్ బాగానే అనిపించినా, మనోజ్ సోనీ సినెమాటోగ్రఫీ సాధారణంగా ఉంది.

హిందీమూలం చూడనివాళ్ళు, కనీసం కథవున్న సినిమా కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి.

22 Comments
 1. pappu September 22, 2009 /
 2. kumar September 22, 2009 /
   • raamesabaabu September 26, 2009 /
   • chandrasen September 30, 2009 /
   • chandrasen September 30, 2009 /
 3. Sreeram September 22, 2009 /
   • గీతాచార్య September 24, 2009 /
 4. $h@nK@R! September 22, 2009 /
 5. Indian Minerva September 22, 2009 /
 6. అబ్రకదబ్ర September 22, 2009 /
 7. వెంకట్ ఉప్పలూరి September 23, 2009 /
 8. కొత్తపాళీ September 23, 2009 /
 9. VEDANTAM SRIPATISARMA September 23, 2009 /
 10. Venkat September 24, 2009 /
 11. Venkat September 24, 2009 /
 12. ramabrahmam September 30, 2009 /