Menu

బాణం-మూడోస్సారి!

baanamనవతరంగంలో బాణం గురించి జరుగుతున్న చర్చ చూసి ఎలాగైనా ఈ సినిమా చూడాలనిపించింది. (నవతరంగం ఈ సినిమా బాగోలేదని వ్రాసిన సమీక్షలు చదివికూడా ఈ సినిమా చూడాలనుకుని చూసిన చాలామందిలో నేనూ ఒకడిని. ఆ విధంగా నవతరంగం రివ్యూ ఆధారంగా మాత్రమే ప్రేక్షకుడు సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించకోడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ) బాణం సినిమా చైతన్య దంతులూరి అనే నూతన దర్శకుని మొదటి ప్రయత్నం అని తెలిసిందే. ఇక ఈ సినిమా కథ కథనాల గురించి ఇది వరకు వచ్చిన వ్యాసాల్లో చదివే వుంటారు కాబట్టి వాటిని మరోసారి ప్రస్తావించదలుచుకోలేదు. అయితే first things first. ఈ సినిమా మీ ఊర్లో అదృష్టవశాత్తూ ఇంకా ఆడుతుంటే అర్జెంటుగా వెళ్ళి ఈ సినిమాని చూసెయ్యండి.

ఔను నిజమే గత రెండు వ్యాసాల్లో ఈ సినిమా ఏమీ బాగోలేదని వ్రాసారు. అది ఆయా సమీక్షకుల ధృక్కోణం. కానీ నా అభిప్రాయం ప్రకారం ఈ సినిమా ఒక మంచి ప్రయత్నం. అలాగని గత రెండు వ్యాసాల్లో చెప్పిన తప్పులేమీ ఈ సినిమాలో లేవని కాదు నా వాదన. నేను చెప్పేదేంటంటే ఈ సినిమాలో ఉన్న తప్పులన్నింటినీ పక్కనపెట్టినా కూడా ఇంకా ఈ సినిమాలో చూసి ఆనందించదగ్గ విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని తెలియచేసి మరి కొంతమందిని ఈ సినిమా చూసేలా చెయ్యాలన్నదే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం.

బాణం ఎందుకు చూడాలి: కొన్ని కారణాలు

 • నిన్న రాత్రి ఈ సినిమాకెళ్ళే ముందూ, అంతకు ముందు వారం రోజులుగా నాతో బాణం గురించి మాట్లాడిన అందరితోనూ నేను ఒక విషయం గురించి మళ్ళీ మళ్ళీ ప్రస్తావించాను. అదేంటంటే, ఈ సినిమా లో కథ 1989 లో జరుగుతుంది. 1989 అంటే న్యారో ప్యాంట్లు పోయి బ్యాగీలు వస్తున్న రోజులు. అయితే పోస్టర్స్ లో కానీ ట్రైలర్స్ లో కానీ ఆ పీరియడ్ లో జరిగే సినిమాలగా ఎక్కడా అనిపించలేదు. అయితే నిన్న సినిమా చూస్తున్నంత సేపూ అది 1989 లో జరిగినట్టు లేకపోయినా ఇప్పటి రోజుల్లో కాదు అని మాత్రం దర్శకుడు చాలా బాగా ఎస్టాబ్లిష్ చెయ్యగలిగాడు. అయితే పీరియడ్ సినిమాల్లో కాస్ట్యూమ్స్ మాత్రమే కాకుండా లొకేషన్స్ కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ సినిమాలో లొకేషన్స్ దృష్ట్యా ఎంతో శ్రద్ధ వహించినట్టు మాత్రం కనిపిస్తుంది. అంటే 1989 నాటి ఇల్లు, కట్టడాలు చూపించాడని నేననటం లేదు. రొటీన్ గా తెలుగు సినిమాలో చూసే లొకేషన్స్ కాకుండా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అంతే కాకుండా సినిమా మొత్తం ఒరిస్సా బోర్డర్ లో జరుగుతుందని చెప్పకనే చెప్తాడు. హీరో ఇంటి పేరు పాణిగ్రాహి అవ్వడం, విలన్ ఇంటి పేరు పట్నాయక్ కావడం, విలన్ పక్కన ఉండే ఒక రౌడీ పేరు సాహు కావడం… ఇలా.
 • సినిమాలు తియ్యాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళల్లో తియ్యగలిగే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. అయినప్పటికీ సినిమా తీసేవరకూ మనమూ తియ్యగలమనే నమ్మకమే ఎంతో మంది ఔత్సాహిక దర్శకులను ముందుకు నడిపిస్తుంది. అయితే ఇలా సినిమా తియ్యగలమనుకునే వాళ్ళలో చాలా రకాలుంటారు. అర్జెంటుగా ఒక పెద్ద హీరోతో సినిమా తీసేసి పెద్ద డైరెక్టర్ అయిపోదామనో, ఒక రొమాంటిక్ సినిమా తీసేసి హిట్ కొట్టేద్దామనో…ఇలా. అయితే చాలా కొద్ది మంది మాత్రమే సినిమా ద్వారా ఏదో చెప్పాలనుకుంటారు. అలాంటి వారిలో ఒకడు చైతన్య అని సినిమా చూసాక మీకు తప్పక అనిపిస్తుంది. కానీ అతను ఏదైతే చెప్పాలనుకున్నాడో అది మాత్రం honest గా చెప్పగలిగాడు. ఆ విధంగా ఇది ఒక honest attempt అని గ్యారెంటీగా చెప్పగలను.
 • హీరో అంటే పనికిమాలిన వెధవ. అమ్మాయిలను ఏడిపిస్తూ, అమ్మాయిలంటే కేవలం ఆటబొమ్మలుగా మాత్రమే అన్నట్టుగా దాదాపు అన్ని తెలుగు చిత్రాల్లోనూ చూపించడం రొటీన్ అయిపోయిన ఈ రోజుల్లో ఈ సినిమాలో హీరో హీరోయిన్లను మరియు వారి రిలేషన్షిప్ ని చూపించినట్టుగా ఈ మధ్య కాలంలో ఏ తెలుగులో సినిమాలోనూ చూడలేదు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ లో హీరో హీరోయిన్లు మొదటి సారి కలిసే సీన్, ఆ తర్వాత హీరోయిన్ ని వాళ్ళ అత్తమామల దగ్గరకు (హీరో బైక్ మీద, హీరోయిన్ రిక్షాలో) తీసుకెళ్ళే సీన్ చైతన్య ఎంతో ప్రతిభావంతంగా రూపొందించాడు.
 • ఈ మధ్య తెలుగు సినిమాకి స్క్రిప్ట్ రాయడం ఎలా ఉందంటే హీరో బాబాయి పాత్ర వ్రాస్తున్నప్పుడు అక్కడ డీఫాల్ట్ గా చంద్రమోహన్ పేరు వ్రాసేసుకోవడం, ఇంట్లో ఒక వదిన పాత్ర ఉంటే ఆమెను సురేఖవాణిగా ఫిక్స్ అయిపోవడం, ఇక సురేఖావాణి ఉంటే ఆమె కొడుకుగా మాస్టర్ భరత్ ని పెట్టెయ్యడం, విలన్ పక్కన అటు తిరిగి సెటైర్లు వేసే వ్యక్తిగా రఘుబాబునో మరొకర్నో అనుకోవడం, లేదా విలన్ దగ్గరుండే రౌడీల్లో ఒకడిగా సుబ్బరాజని ఇలా ఫిక్స్ అయిపోయిన రోజుల్లో ఈ సినిమాలో పరిచయమైనంతమంది నూతన నటీనటులు ఈ మధ్య కాలంలో ఏ సినిమా ద్వారా పరిచయం కాలేదేమో!
 • ఈ రోజు చిత్రసీమ లో దర్శకులవ్వాలని నానా కష్టాలు పడీ తిరిగే వేలమందిలో కొద్ది మందికి మాత్రమే ఉండే passion చైతన్యలో కనిపించింది నాకు. ఒక హీరో, హీరోయిన్ వారి మధ్య లవ్ ట్రాక్. సడన్ గా వీళ్ళ మధ్య ఒక విలన్. ఇక హీరో విలన్ ల మధ్య ఒక వయొలెంట్ యాక్షన్ ట్రాక్. మధ్యలో రిలీఫ్ కోసం ఒక కామెడీ ట్రాక్. పీరియాడిక్ ఇంటర్వెల్స్ లో పాటలు.అలాంటి పరిస్థుతుల్లో అనవసరమైన పాటల్లేకుండా, కామెడీ ట్రాక్ లేకుండా గత నాలుగైదేళ్ళల్లో ఎన్ని తెలుగు సినిమాలొచ్చాయో లెక్కపెట్టి చూడండి. మీకే తెలుస్తుంది.
 • అనిల్ బండారి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. సినిమాటోగ్రఫీలో కాంట్రా జూమ్, వెర్టిగో షాట్, కంప్రెషన్ షాట్, ట్రాక్ ఇన్ జూం ఔట్ అని వివిధ రకాలుగా పిలవబడే ఒక టెక్నిక్ ఉంది. ఈ టెక్నిక్ మొట్టమొదటి సారిగా హిచ్ కాక్ వెర్టిగో అనే సినిమాలో వాడాడు. నిజానికి ఈ టెక్నిక్ ని కనిపెట్టింది ఆయనే.  వెర్టిగో అంటే fear of heights. వెర్టిగో సినిమాలో హీరోకి హైట్స్ అంటే భయం. అయితే పాత్ర ద్వారా ఈ మాట చెప్పించడం ఒక పద్ధతి. కానీ అదే భయాన్ని చూపించడం ఎలా? అప్పడే హిచ్ కాక్ ఈ టెక్నిక్ కనుక్కున్నారు. ఈ టెక్నిక్ లో ఏం జరుగుతుందంటే కెమెరా ట్రాక్ మీద నుంచి ముందుకు కదుల్తుంటుంది. అదే సమయంలో కెమెరా జూమ్ ఔట్ అవుతుంది. దీని వల్ల ఏం జరుగుతుందంటే ఒకే ఫ్రేం లో చిత్రం ప్రేక్షకుడికి దగ్గరగా జరుగుతూనే దూరంగా కూడా జరుగుతుంది. ఈ టెక్నిక్ ని ఆ తర్వాత చాలా మంది చాలా సినిమాల్లో (తెలుగులో కూడా) ఉపయోగించారు. కానీ తెలుగులో ఈ టెక్నిక్ ని సరిగ్గా ఉపయోగించుకున్నవాడు బాణం దర్శకుడు చైతన్య మాత్రమే అంటాను.

పైన చెప్పిన కారణాలు సినిమా చూడడానికి గొప్పకారణాలు కాకపోవచ్చు. నేను చెప్పిన కారణాలే సినిమా చూడొద్దని చెప్పడానికీ ఉపయోగించొచ్చు. ఉదాహరణకు పైన చెప్పిన పాజిటివ్ పాయింట్స్ కి మరో కోణం కూడా ఉంది.

 • దర్శకుడు ఈ సినిమాలో చేసిన పొరపాటు కథాకాలాన్ని 1989 అని సూచించడం. అయితే కథ మొత్తం రణస్థలి అనే ఫిక్షనల్ ప్లేస్ లో జరిగినట్టు చూపించిన దర్శకుడు కథాకాలాన్ని కూడా ఒక unspecified time period లో జరుగుతున్నట్టు హింట్ చేసి వదిలేస్తే చాలా బావుండేది.
 • ఈ సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్నది తప్పా ఒప్పా, లేక చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పగలిగాడా అనే విషయం లో ప్రశ్నకు మాత్రం అతను సఫలం కాలేదనే చెప్పాలి. అతను చెప్పాలనుకున్న దాంట్లో క్లారిటీ లేదన్నది నిజం.
 • హీరోయిన్ చేత ‘అయ్యా‘ అనిపించడం జయం లో ‘వెళ్ళు‘ అనిపించడానికి కాస్త ఇమిటేషన్ లా ఉండి ఆర్టిఫీషియలగా అనిపించింది.
 • సినిమాలో నటీనటులందరూ వారి వారి రోల్స్ లో సరిపోయారు కానీ సాయాజీ షిండే కి ఎవరైనా డబ్బింగ్ చెప్తే బావుండేది. నిజమే అది అతని ట్రేడ్ మార్క్ డైలాగ్ డెలివరీ కావొచ్చు. కానీ ఇండస్ట్రీ కి వచ్చి ఇన్నేళ్ళయినా ఇంకా వచ్చీ రాని తెలుగు మాట్లాడినట్లు ఆ డైలాగులేంటో అర్థం కాదు. అలాగే హీరోయిన్ అత్తమామలు పాత్రలు పోషించిన వారు straight out of any other Telugu film లాగా ఉన్నారు.
 • ఈ సినిమాలో అసలేమీ కామెడీ లేదని కాదు. ఏవియెస్ ద్వారా కొంచెం ప్రయత్నించారు. మిస్టర్ పెళ్ళాంలో తుత్తి లా ఈ సినిమాలో ఉత్తినే అనిపించినా అది పెద్దగా పండలేదు. అదీ కాక ఈ సినిమాలో ఏవియెస్  శాస్త్రీయ సంగీతకారుడు. అయితే చాలా తెలుగు సినిమాల్లోలాగే శాస్త్రీయ సంగీతమంటే ఊసుపోక రాగాలు తీసే వాడిలాగే ఉంది ఏవియెస్ పాత్ర. అన్ని పాత్రలకీ ఒక సీరియస్ ఔట్లుక్ ఇచ్చిన దర్శకుడు ఈ పాత్ర ద్వారా శాస్త్రీయ సంగీతమంటే ఒక చులకన భావంతో కూడిన నెగెటివ్ ఔట్లుక్ ఇవ్వడం బాగోలేదు.
 • ఈ ట్రాక్ ఇన్ జూమ్ ఔట్ లేదా వెర్టిగో షాట్ అనేది సినిమాకి బ్రహ్మాస్త్రం లాంటిది. ఏదో ఒక పాత్రని మాత్రమే ఇలాంటి టెక్నిక్ ద్వారా చిత్రీకరించడమో లేదా ఒక అవ్యక్తమైన అనుభూతి పాత్రకు కలిగినప్పుడు మాత్రమే ఈ టెక్నిక్ ఉపయోగిస్తే బావుంటుంది. కానీ ఈ సినిమాలో ఈ టెక్నిక్ ని కాస్తా ఎక్కువగానే ఉపయోగించినట్టు నా అభిప్రాయం.
 • ఇక ఇవి కాకుండా సినిమాలో వెతికితే ఎన్నో తప్పులున్నాయి. సినిమా లో అసలు హీరో ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఒక పట్టాన అర్థం కాదు. ముందు పోలీస్ అవుతానంటాడు. మధ్యలో మర్డర్ కేస్. ఎలాగో బయటకొచ్చి సివిల్స్ రాస్తాడు. విలన్ చేతిలో చావు దెబ్బలు తింటాడు. నలుగురు ట్రైనీ పోలీస్ ఆఫీసర్ల ని తీసుకెళ్ళి విలన్స్ మీద తిరగబడతాడు, తిరిగి పోలీస్ ట్రైనింగ్ కి వెళతాడు. అసలెక్కడా ఆ పాత్రకు ఒక ఇంటిగ్రిటీ ఉన్నట్టు కనిపించదు (అన్ని సీన్స్ లో గంభీరంగా ఉండడంలో తప్పితే). అలాగే సినిమా మొదటి సగంలో ఒక మాదిరిగా నడిచిన కథను రెండో భాగంలో హడావుడిగా తేల్చేస్తాడు. నా దృష్టిలో హీరో రెండో భాగంలో పోలీస్ ఆఫీసర్ అయిపోయుంటే కథ వేరే విధంగా ఉండేది. పోలీస్ అయ్యాక విలన్ ని ఎదుర్కోవడం ఎంత కష్టమవుతుందో తెలుసుకుని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నలుగురు సిన్సియర్ పోలీసుల సాయంతో విలన్ ని ఎలా అంతమొందించాడో చూపించి ఉంటే నాకు నచ్చి ఉండేది. (అంటే Untouchables లో లాగా) Atleast కమర్షియల్ ఫార్మట్ లో నైనా ఒక విజయవంతమైన సినిమా అయ్యుండేదేమో.

అయితే ఇవన్నీ మొదటి సినిమాలో చాలామంది చేసే పొరపాట్లే అని క్షమించి ఈ సినిమాని చూడొచ్చు. ముఖ్యంగా ఇలాంటి ప్రయత్నాలకు నవతరంగం సభ్యులు, పాఠకులు, అభిమానులు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. అలా అని కొంతమంది చెప్పేటట్టు సినిమా అంటే ఎంతో కష్టపడి తీస్తారు. కాబట్టి మనం చూడాలి. చూసి బాగోలేకోయినా సినిమా తీసినోళ్ళని ఏమీ అనకూడదనే మూర్ఖపు వాదన కాదు నాది. ఈ సినిమాలోని తప్పులన్నింటి మధ్యలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. మధ్య మధ్యలో మంచి సీన్స్ ఉన్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా టెక్నికల్ గా కూడా బావుంది. పైగా తెలుగు సినిమాల్లో ఈ మధ్య ఎప్పుడూ లేని ఒక ఫ్రెష్నెస్ ఉంది. దయచేసి ఈ సినిమా చూడండి. ఈ దర్శకుడు ఇంకా ఎదిగి మంచి సినిమాలు నిర్మించాలనే ప్రోత్సాహం అందచేయండి.

18 Comments
 1. a2zdreams September 26, 2009 /
  • Gorey Saif Ali September 27, 2009 /
 2. Hari Charana Prasad September 27, 2009 /
 3. ceenu September 27, 2009 /
 4. Rohit September 27, 2009 /
  • నేస్తం September 28, 2009 /
 5. అబ్రకదబ్ర September 27, 2009 /
  • Rambo October 14, 2009 /
 6. G September 27, 2009 /
 7. శ్రీరామ్ వేలమూరి September 29, 2009 /
 8. sanjeev September 29, 2009 /
 9. Rajesh September 30, 2009 /
 10. కొత్తపాళీ October 1, 2009 /
 11. శేఖర్ October 2, 2009 /
 12. Varun April 12, 2011 /
 13. rateesh April 13, 2011 /