Menu

బాబోయ్ అవార్డు సినిమాలు-మొదటి భాగం

award-leadబాబోయ్ అవార్డు సినిమాలు!-అని నేనటం లేదు. ’బాబోయ్ అవార్డు సినిమాలు’ అనే శీర్షికతో ఒక వెబ్ సైట్లో గతకొద్దికాలంగా వస్తున్న వ్యాసమాలిక ఇది. ఈ శీర్షికలో వచ్చిన మొదటి వ్యాసంలో రచయిత ఎమ్బీయస్ ప్రసాద్ గారు అవార్డు సినిమాల గురించి చెప్తూ “మన తెలుగు వారికీ, అవార్డులకీ చుక్కెదురనీ, మనవాళ్ళు అవార్డులనూ, అవార్డులు మనవాళ్ళనీ పట్టించుకవనీ చెప్తూ అవార్డు సినిమాలంటే అర్థంకానివి, స్లో గా నడుస్తూ, తానేడుస్తూ ఇతరులనేడిపించేవి అని డిఫైన్ చేసి ఆ తర్వాత అవార్డు సినిమాలలో అసలు లోపం కథే (అది లేకపోవడం)” అని చెప్పుకొచ్చారు. ఇవి కాకుండా పథేర్ పాంచాలీ గురించి, సత్యజిత్ రే గురించి కొన్ని పిట్ట కథలూ చెప్పి ముగించారు.

ఇక రెండో భాగంలో శ్రీశ్రీ వచనకవిత్వం చేసి చివరకది హాస్యాస్పదం కావడానికి బాధ్యుడు కాకపోయినా ఆద్యుడయినట్లే ఇలాంటి ఏడుపుగొట్టు అవార్డు సినిమాలకూ సత్యజిత్ రే బాధ్యుడు కాకపోయినా అద్యుడయ్యాడని చెప్పుకొచ్చి, రావి కొండలరావు (సి)నీతి చంద్రికలో అవార్డు సినిమాలను వెక్కిరిస్తూ సృష్టించిన పాత్ర గురించీ చెప్పారు. ఆ తర్వాత సత్యజిత్ రే బిభూతి భూషణ్ నవల పథేర్ పాంచాలి నుంచి ఒక సినిమా కాకుండా మూడు సినిమాలు ’లాగారు’ అని బాధ వ్యక్తం చేశారు. అలా అని సత్యజిత్ రే ని తక్కువ చేయటం లేదనీ ఆయన చాలా గొప్పవారనీ ఆయన ఇలాంటి అవార్డు సినిమాలే కాకుండా వివిధ రకమైన సినిమాలు తీసి ఆలరించారనీ కాకపోతే ఆయన సినిమాలను మోడల్ గా తీసుకుని చాలామంది గుడిశెల్లో నాలుగు షాట్స్ తీసి, నాలుగు సింబాలిక్ షాట్స్ తీసి పారేసారనీ, అంతే కానీ వారికంత నేపథ్యం లేదనీ చెప్పుకొచ్చారు. ఇలాంటి వాళ్ళని మెచ్చుకునే ఒక మేధావి వర్గం కాచుక్కూచోని ఉండడం వల్ల, వాళ్ళు పట్టుబట్టడం వల్ల ఇలాంటి సినిమాలకే అవార్డులొచ్చాయనీ ముగించారు.

స్థూలంగా రెండు వ్యాసాల్లోని విషయం అది.

అయితే ప్రసాద్ గారు చెప్పిన విషయాలతో నేనసలు ఏకీభవించలేకపోవడమే నన్నీ వ్యాస రచనకు పురికొల్పింది. ’బాబోయ్ అవార్డు సినిమాల’ని భయపడే వారు ఈ వ్యాసం చదివి ’బాబాయ్ చూస్తే అవార్డు సినిమాలే చూడాలని’ నా ఆకాంక్ష. చదవి మీ అభిప్రాయాలు తెలియచేయండి.

తెలుగు సినిమాలకీ-అవార్డులకీ చుక్కెదురు.

ముందుగా మన తెలుగు వారికీ, అవార్డులకీ ఎందుకు చుక్కెదురో చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంధమే అవుతుంది. ఆయన చెప్పినట్టుగా మన తెలుగు వాళ్ళకి అవార్డులు రాకపోలేదు. పథేర్ పాంచాలీ తో పోటీ పడి రజతపతకం గెలుచుకున్న ’బంగారు పాప’ తెలుగు సినిమానే. తెలుగులో కాకపోయినా కన్నడంలో నిర్మించిన ’సంస్కార’ సినిమాకు అవార్డునందుకున్న పట్టాభి మన తెలుగు వాడే. మొన్నీ మధ్య అవార్డు తెచ్చుకున్న హోప్, కిట్టు సినిమాలు కూడా తెలుగువే. ఈ విధంగా మన వాళ్ళకీ అప్పుడప్పుడూ అవార్డులు వచ్చాయి. అలాగే అవార్డుల కోసం చాలా మంది ప్రయత్నాలూ చేస్తూనే వున్నారు. కాకపోతే మన సినిమాలు జాతీయ స్థాయిలో పోటిపడలేక అవార్డులు గెలుచుకోవటం లేదంటే ఒప్పుకోవచ్చు కానీ మాకెందుకు అవార్డులు మాకూ అవార్డులకు చుక్కెదురనడం ’అందని ద్రాక్ష పుల్లన’ అన్నట్టు ఉంటుంది.

అవార్డు సినిమాలంటే గుడిశెల్లో నాలుగు షాట్లూ, నలుపు తెలుపు సినిమాటోగ్రఫీ, సింబాలిజం….ఎక్సట్రా!

అసలు మన సినిమాలకు అప్పుడే కాదు ఇప్పుడూ అవార్డులు ఎందుకు రావు అంటే మనవాళ్ళకి చాలామందికి అవార్డు సినిమాలంటే ప్రసాద్ గారు చెప్పిన డెఫినిషనే తెలుసు. చీకట్లో గుడిశెల్లో…పేదవారి బతుకుల గురించి నత్త నడకన సాగే కథనం ఉన్న సినిమాలకు మాత్రమే అవార్డులు వస్తాయని ఒక అపనమ్మకం. నాకు తెలిస ఇలా జరగడానికి కారణం పథేర్ పాంచాలి అనుకుంటా. ఆ రోజుల్లో పథేర్ పాంచాలీ కి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రావడంతో కాసింత క్యూరియాసిటీతో ఆ సినిమాకి వెళ్ళిన వాళ్ళకి ఆ సినిమాలో మసాలా ఏమీ లేకపోగా తమ రోజువారీ జీవితాలు మరో సారి చూసినట్టనిపించి ’అయ్య బాబోయ్’ ఇలాంటి సినిమాలకా అవార్డులిచ్చేది అని భయపడడం మొదలుపెట్టివుంటారు మన సగటు తెలుగు ప్రేక్షకులు.

ఆ తర్వాత దూరదర్శన్ వచ్చాక రాక రాక ఒక ఆది వారం టివిలో ఇంట్లో  కూర్చుని ఉచితంగా సినిమా చూడొచ్చనకుని ఎదురుచూసిన వారికి ఆదివారం మధ్యాహ్నం పూట ప్రసారమయ్యే అవార్డుపొందిన ఇతర భాషా సినిమాల ద్వారా తాము కోరిన వినోదం అందకపోగా, అర్థంకాని భాష, సబ్ టైటిల్స్ చదువలేకపోవడం, ఇతర రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆసక్తి లేకపోవడం లాంటి ఎన్నో అంశాలు మన ప్రేక్షకులచే బాబోయ్ అవార్డు సినిమాలనిపించవచ్చు.

అయితే ఆ రోజులు వేరు. రోజులు మారాయి. ఇప్పుడు కూడా ప్రసాద్ గారిలా ఆలోచించడం మన సినిమాల భవిష్యత్తుకి మంచిది కాదని నా అభిప్రాయం.

నా దృష్టిలో అవార్డు సినిమాలంటే ఫలానా అని డిఫైన్ చేయాలని పూనుకోవడంలోనే తప్పుంది. ఏదైనా సినిమానే. కాకపోతే వాటిలో మంచి వాటికి అవార్డులిచ్చి గౌరవిస్తారు. అంతే కానీ అవార్డు సినిమాలంటూ వేరే వుండవు. అయితే మన వాళ్ళు చాలామందికి అవార్డు సినిమాలంటే ఇలా ఉండాలి కాబోలు అని ఎప్పటినుంచో చాలా మంది నూరి పోశారు. అందుకే కాబోలు ఒక ప్రముఖ తెలుగు సినీ నిర్మాత ఒరియా భాషలో సినిమా నిర్మాణం చేపట్టి ఇది కేవలం అవార్డుకోసం తీస్తున్నానని అప్పట్లో ప్రకటన చేసినట్టు గుర్తు. అంటే ఫలానా రాష్ట్రంలో ఫలానా కథతో తీస్తేనే అవార్డు వస్తుందని ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులూ అనుకోవడంవల్లనే మనం మంచి సినిమాలు తీయలేకపోవడానికీ మరియు మన సినిమాలు అవార్డు రాకపోవడానికీ కారణం.

అవార్డు సినిమాలంటూ వేరే ఉండవు.

పైన చెప్పినట్లు ఫలానా సినిమాలు అవార్డు సినిమాలంటూ ఏమీ ఉండకపోయినా అది కేవలం ఒక జనరలైజేషన్. అవార్డు సినిమాలంటూ లేకపోయినా ప్రపంచంలోని అన్ని దేశ సినీ పరిశ్రమల్లోనూ ఆర్ట్ హౌస్ సినిమాలనీ కొన్నుంటాయి. అవి మామూలుగా వచ్చే కమర్షియల్ సినిమాల లాగా కాకుండా కొన్ని ప్రత్యేకతలు కలిగిఉంటాయి. ఉదాహరణకు:

 • ఈ సినిమాల్లో థ్రీ యాక్ట్ స్ట్రక్చర్ ఉండకపోవచ్చు.(Pulp Fiction)
 • కథ కంటే కూడా కథనానికి ప్రాముఖ్యం ఉండొచ్చు. కొన్ని సినిమాల్లో అసలు కథంటూ లేకపోవచ్చు.(Salam Cinema)
 • కమర్షియల్ సినిమాలోలాగా ఇందులో పాత్రలు పూర్తి గా చెడ్డవాళ్ళూ లేదా పూర్తిగా మంచి వాళ్ళూ అయ్యుండరు. మనందరిలాగే మంచి చెడుల కలయిక అయ్యుంటారు. (The Conversation)
 • సినిమా ఆఖరున ఒక భారీ సీనులో అప్పటివరకూ ఉన్న సమస్యలు తీరిపోయి కథ సుఖాంతమైందని చెప్పకపోవచ్చు. అంటే ఓపెన్ ఎండింగ్ తో సినిమా ముగియవచ్చు. (400 Blows)
 • కథలోని అన్ని అంశాలనూ అరటిపండు తొక్క వలచి నోట్లో పెట్టినట్టుగా వివరంగా తెలియచేయక కొన్ని భాగాలు ప్రేక్షకుల ఊహకే వదిలేయవచ్చు. (Silence of Lorna)
 • ప్రేక్షకుల్లో మదిలో ప్రశ్నలు లేవనెత్తే విధంగా ఆలోచానాత్మకంగా ఉండొచ్చు.(Fight Club)
 • కొన్ని సినిమాలయితే మొదటిసారి చూసినప్పుడు అంతగా అర్థం కాకపోవచ్చు. (Mull Holland Drive)
 • నెరేటివ్ (కథా గమనం) సరళరీతిలో కాక విరళంగా ఉండొచ్చు. (21 Grams)
 • తత్వ శాస్త్రంలో ఎడతెగని చర్చ జరిగే అంశాల గురించి చర్చించవచ్చు – Ethics,morals,values ఇలా (Rashoman)
 • ప్రయోగాత్మకంగా ఉండొచ్చు.(Koyaanisqatsi)

పైన పేర్కొన్న కారణాల వల్ల సాధారణంగా వినోదం కోసం మాత్రమే సినిమాలు చూసే ప్రేక్షకులు ఈ సినిమాలకు కాస్త దూరంగానే ఉంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితే. మన దేశంలో కూడా 70-80 లలో సమాంతర సినిమాలనీ, ఆర్ట్ సినిమాలనీ పైన చెప్పిన అంశాలతో చాలా సినిమాలొచ్చాయి. ముఖ్యంగా పూనే లోని FTII నుంచి వచ్చిన ఫిల్మ్ స్కూల్ విద్యార్థులు ఈ సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఈ సినిమాలకు ఆ రోజుల్లో ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం ఉండేది (NFDC, DD ద్వారా). ఈ ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన వారిలో తెలుగు వాళ్ళు తక్కువకావడంతో మనకి పైన పేర్కొన్న అంశాలున్న సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి.  ఆ ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన జాట్ల వెంకటస్వామి నాయుడు గారు మాత్రం ’ప్రత్యూష’ లాంటి కొన్ని సినిమాలతో తన ప్రయత్నాలు చేసారు.

అయితే మనం అవార్డు సినిమాలని అంటూన్న వాటిని ఆర్ట్ హౌస్ సినిమాలని అనలేము. ముఖ్యంగా తెలుగులో చాలామంది దర్శకులు సినిమాల ద్వారా ప్రబోధించాలనీ, సమాజలో మార్పు తేవాలనీ ప్రయత్నించారు. అలాగే సమాజంలోని అసమానతలకు, రుగ్మతలకు తమ సినిమాల ద్వారా అప్పటి పరిస్థుతులను ప్రతిబింబింపచేసారు. ఇలా చేయడం ద్వారా సినిమాకీ ఒక పర్పస్ ఉందని తెలియచేశారు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఫలానా హీరో ఫలానా విలన్ ని క్లైమాక్స్ లో కుళ్ళపొడవడమో, ఫలానా ఉమడి కుటూంబం విడిపోయి మళ్ళీ ఎలా కలిసిందో, ఆల్రెడీ భార్య ఉన్న భర్త కొన్ని బలహీన క్షణాలో మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడో, ఒక కాలేజీలో ఒక కుర్రాడు, కుర్రది ఎలా ప్రేమలో పడ్డారో…ఇలాంటి అంశాలతోనే కాకుండా వేరే ఎన్నో కోణాల్లో కూడా జీవితాన్ని సినిమా ప్రతిబింబింపచేయవచ్చు అని నిరూపిస్తాయి ఈ ఆర్ట్/ఆర్ట్ హౌస్ సినిమాలు.అందుకే ఈ సినిమాలకి అవార్డులొస్తాయి.

అయితే జీవితంలోని ఆ కోణాలను మనం పట్టించుకోకపోతే పోయాము. సరే. కానీ అలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారిని ఎగతాళి చెయ్యాల్సి అవసరం ఉందా అనేది ప్రశ్న!

అవార్డు సినిమాల గురించి మరిన్ని విశేషాలతో ….త్వరలో

12 Comments
 1. శంకర్ November 13, 2008 /
 2. Sri December 27, 2008 /
 3. అబ్రకదబ్ర September 30, 2009 /
 4. anveshi October 1, 2009 /
  • అబ్రకదబ్ర October 1, 2009 /
   • అబ్రకదబ్ర October 1, 2009 /
 5. rayraj October 1, 2009 /
   • rayraj October 1, 2009 /