యానిమేషను సినిమాలు …

shrek

ఎందుకనో భారతంలో మామూలు సినిమాలను ఆదరించినట్టుగా యానిమేషను సినిమాలను ఆదరించరేమో అని నాకనిపిస్తుంది. (ఈ మధ్య ట్రెండు మారుతున్నట్టుంది). వాటి గురించి ఎంతో కొంత ఈ వ్యాసంలో చెబుదామని నా ప్రయత్నం.

యానిమేషను సినిమాలు నాకు చాలా బాగా నచ్చుతాయి. అందులో ఇజాలు ఉండవు, స్టార్ నటులు ఉండరు, ఇగోలు చెల్లవు. పాత్రలు మాత్రమే ఉంటాయి.

ఆలోచించండి అసలు ఇవాళ మన సినిమాలలో ఇలాంటి అదృష్టం మనకుందా ? సర్లెండి అదో పెద్ద అంతులేని కథ.

ఇంతకీ యానిమేషను సినిమాలు ఒక ప్రత్యేక సినిమా. అది తయారు చెయ్యడానికి పడాల్సిన శ్రమ అంతా ఇంతా కాదు.

ఎందుకంటారా ?

ఒక 2D యానిమేషను తీయాలనుకోండి. ఒక బంతి ఎగురుతున్నట్టు దానికి ముందుగా బంతి వేరు వేరు స్థాయిలలో ఉన్నట్టు చిత్రాలు గీసుకోవాలి. అంటే బంతి ఎగురుతున్నప్పుడు వేరు వేరు ఎత్తులలో ఉంటుంది కదా. వాటిలో ఒక్కొక్క ఎత్తుకీ వివరంగా చిత్రాలు గీసుకోవాలి. అంతటితో అయిపోతుందనుకున్నారా ?

లేదు. ఆ బంతి ఒకవేళ నేలకు తగిలి పైకి ఎగురుతుందనుకోండి. అది నేలకు తాకినప్పుడు ఆ బంతి ఏ మేరకు కుచించుకుపోతుంది ? మళ్ళీ అది ప్లాస్టిక్ బంతా ? మెత్తని బంతా ? ఫుట్‌బాలా‌ ? ఏవి ఏ మేరకు ఎగురుతాయి.

మీకర్థమయిందనుకుంటాను. అలా ఒక చిన్న దృశ్యం మన కళ్ళ ముందు కనబడాలంటేనే అదీ 2D లో ఇన్ని గమనించుకోవాలి.

మరి ఒకవేళ 3D లో ఒక సీక్వెన్సు తీయాలనుకోండి, అది ఇంకెంత క్లిష్టమయినదో ఆలోచించండి. ఒక ఆబ్జెక్టు వివిధ యాంగిళ్ళలో ఎలా కనబడుతుందో ? పై నుంచి చూపిస్తుంటే ఎలా కనబడుతుంది, పక్క నుంచయితే ఇంకో విధంగా ఎలా కనబడుతుంది, మళ్ళీ ఆ ఆబ్జెక్టు ఏ లైటింగులో ఎలా కనబడుతుంది ? ఎంత మేరకు దాని నీడ విస్తరిస్తుంది ?

ఇలాంటి ప్రశ్నలు ఎన్నిటికో సమాధానం వెతకాలి.

ఇంకోలా చూద్దాం. “ఫైండింగ్ నెమో” అనే చిత్రం ఇక్కడ చాలా మందే చూసి ఉంటారు. అందులో చేపలు, తాబేళ్ళు, షార్కులు ఇలా ఎన్నో పాత్రలు ఉంటాయి. మరి ఆ సినిమా చూస్తున్నప్పుడు మీకు అది కృత్రిమంగా అనిపించదు. అక్కడ నిజంగానే చేప ఈదుతుందా అన్నట్టు ఆ మువ్‌మెంట్సు అనిపిస్తాయి. ఆ చేప మలచిన తీరు, అది ఈదే తీరు, దాని మొప్పలు అన్నీ ఎంతో నిశితంగా పరిశీలించి తయరు చేసారు. అంతే కాదు దాని రంగు, వంటి టెక్స్చర్, పాటర్న్ మొదలయినవి కూడా.

వీటన్నిటినీ పైన చెప్పుకున్న యాంగిల్స్, సిట్యువేషన్స్ లో పెట్టి చూడండి. అర్థమవుతుంది ఎంత క్లిష్టమయిన పద్ధతో. ఎందుకంటే ఆ చేప ఒకవేళ ఈదుతుందనుకోండి, మలుపు తిరిగితే అక్కడ ఆ చేప వళ్ళు ఎలా ఉంటుంది. దానికి ముడతలు వగయిరా ఎలా ఏర్పడతాయి. అలాగన్నమాట.

ఇవన్నీ సాధించడానికి వివిధ టెక్నిక్కులు వాడతారు. పేపరు మీద గీసుకుని దానిని కంప్యూటరులో ఎక్కించడం ఒక పద్ధతయితే, కంప్యూటరులోనే వివిధ 3D సాఫ్టువేర్లు ఉపయోగించి మోషన్ కాప్చర్, స్కెలిటల్, వైర్ మెష్ మోడళ్ళూ వగయిరా సృష్టించుకుని తయారు చెయ్యడం ఇతర పద్ధతులు.

అయితే ఏ విధంగా చేసినా, ఏ పద్ధతి ఉపయోగించినా అది ప్రేక్షకుడికి కృత్రిమంగా అనిపించకూడదు. అప్పుడే ఆ యానిమేషన్ చిత్రం ఆకట్టుకోగలుగుతుంది.

నాకు నచ్చిన కొన్ని యానిమేషను సినిమాల గురించి చెబుతాను:

ష్రెక్: నాకు బాగా నచ్చిన అన్ని సినిమాలలోనూ ష్రెక్ ఒకటి. కథ మనం చాలా ఫెయిరీ టెయిల్స్ లో విన్నదే. అగ్లీ హీరో, బ్యూటీఫుల్ హీరోయిన్, ఫాల్ ఇన్ లవ్ లాంటిదన్నమాట.

ష్రెక్ అనే ఓగర్, ఫియోనా అనే ప్రిన్సెస్ ఎలా ప్రేమలో పడతారో, వారి స్నేహితులయిన డాంకీ, పిల్లి తో కలిసి చేసే ప్రయాణంలో ఎలాంటి ఆపత్తులని ఎదుర్కొన్నారో అన్నదే కథ.

ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం. నిజంగానే అద్భుతం సృష్టించగలిగారు ఈ సినిమాలో. అసలు రొమాన్సు, ప్రేమ లాంటి ఫీలింగులని మామూలు నటులతోనే కల్పించడం కష్టం అనుకుంటే యానిమేషను సినిమాలో దీనిని చిత్రించగలగడం అదీ మనిషి కాని ఒక ఓగర్‌తో కలిసి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

ఈ సినిమా యానిమేషను సినిమాలలో ఒక మైలురాయి వంటిది అని చెప్పుకోవచ్చు.

ముఖ్యంగా చెప్పుకోవాలంటే యానిమేషను సినిమాలలో భావాలు పలికించడం, ఆ భావాలతో ఆడియన్సుని కనెక్టు చెయ్యగలగడం చాలా కష్టం. ఎందుకంటే అవి మామూలు మనుషులు కావు. మనిషి స్క్రీనుపై మలచిన చిత్రాలు. అలాంటి చిత్రాలు ఒక మామూలు సగటు మనిషితో కనెక్టు అవాలంటే ఆ పాత్ర సృష్టించడానికి తీసుకోవాల్సిన శ్రద్ధ ఎంతో ఊహించుకోవచ్చు.

పాత్ర డయిలాగులు, వేషభాషలు, వంటి విరుపులు, హావ భావాలు అన్నీ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.

పైవన్నీ అద్భుతంగా చిత్రించగలిగిన సినిమా ష్రెక్. యానిమేషను సినిమాలు చూడని వారు దీనితో మొదలుపెడితే శుభం :-)

దీనికి సీక్వెళ్ళుగా ష్రెక్ ౨, ష్రెక్ ౩ కూడా వచ్చాయి. ఒకటి, రెండు బాగున్నాయి కానీ మూడు అంత ఆకట్టుకోలేకపోయింది.

టాయ్‌స్టోరీ: అసలు యానిమేషను సినిమాల గురించిన ఏ చర్చ అయినా ఈ సినిమా లేకుండా ముగియదేమో ?

ఆటబొమ్మలు అనే వాటికి కూడా ప్రాణముంటే అసలు అవి ఏమి ఆలోచిస్తాయి ? ఎలా ప్రవర్తిస్తాయి అనే ఆలోచన చుట్టూ కథ సాగుతుంది.

వుడీ, బజ్ అనేవి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు. వుడీ అనే కౌబాయ్ తన యజమాని ఆండీకి అత్యంత ఇష్టమయిన ఆటబొమ్మ. బజ్ అనే కొత్త సూపర్ హీరో ఆటబొమ్మ వచ్చినప్పుడు వుడీ ఉనికి ప్రమాదంలో పడుతుంది. తన యజమానిని ఆకట్టుకునేందుకు ఎలాంటి పాట్లు పడిందో, ఆ ప్రయత్నంలో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయో, వుడీ బజ్ స్నేహితులుగా ఎలా మారారో అన్నదే కథ.

ఆటబొమ్మలు, పిల్లలకి వాటితో ఉండే అనుబంధం, స్నేహం, ప్రేమ, లాంటి ఎన్నో విషయాలను సినిమాలో అంతర్లీనంగా అద్భుతంగా చూపించగలిగారు.

అత్యద్భుతం అనడంలో అతిశయోక్తి లేదేమో. ఆతబొమ్మలు, పిల్లల అనుబంధంలో మనం చూడని కోణాలు ఇందులో చూడవచ్చు.

దీనికి కూడా సీక్వెల్ వచ్చింది టాయ్ స్టోరీ 2. అది టాయ్ స్టోరీ కంటే బాగుంటుంది. (సీక్వెల్ మొదటిని మించినది కావడం అరుదు కదూ). మూడోది కూడా ప్రయత్నంలో ఉన్నట్టుంది.

ఫైండింగ్ నెమో: నెమో అన్న చేపపిల్ల తప్పిపోయి ఎక్కడెక్కడికో చేరుతుంది. దానిని కాపాడడానికి అతని తండ్రి మార్లిన్ ఎలా ప్రయత్నిస్తాడో అన్నదే కథ.

ఒక యానిమేషను అద్భుతంగా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. కొన్ని వందలు, వేలాది సముద్ర ప్రాణులను చూపించాలి ఈ సినిమా కోసం. తాబేళ్ళు, జెల్లీ ఫిష్‌లు, షార్క్‌లు, రకరకాల చేపలు ఒకటేమిటి అన్ని రకాల ప్రాణులూనూ. కథలో భాగంగా వాటిని మలచిన తీరు అద్భుతం, అమోఘం.

అసలు వాటి కదలికలనయితే ఎంత బాగా అనుకరించగలిగారో చూస్తే గానీ అర్థమవదు. ఉదా: జెల్లీ ఫిష్ అనేది ఒక పారదర్శక మైన ప్రాణి. అది కదిలే తీరు మిగతా ప్రాణులకి చాలా భిన్నం. వేళ్ళడే పోగుల్లాంటి అవయవాలతో అది భలే చిత్రంగా సాగుతుంది. సినిమాలో దానిని తీసిన తీరు మైండ్ బ్లోయింగ్.

అసలు మిస్సవకూడని సినిమాలలో ఇది కూడా ఒకటి.

అసలు చెప్పుకుంటూ పోతే అద్భుతమయిన యానిమేషను సినిమాలకి అంతే ఉండదు. లయన్ కింగ్, మాన్స్టర్స్ ఇంక్, ఆంట్ బుల్లీ, ఎ బగ్స్ లైఫ్, రాటటూయీ ఇంకా ఎన్నో. ఈ మధ్యే విడుదలయిన నాకు నచ్చిన యానిమేషను చిత్రంతో ముగిస్తాను. :-)

కుంగ్ ఫూ పాండా: మీరెప్పుడయినా మీ జీవితంలో ఇది ఎలాగయినా సాధించాలి అని అనుకున్నారా ? అది మీకు అసాధ్యమయినదే అయినా కూడా ?

అలా కుంగ్ ఫూ లో ప్రావీణ్యం సాధించాలనుకున్న ఒక పాండా కథే ఈ సినిమా.

కుంగ్ ఫూ ఎలాగయినా నేర్చుకోవాలన్నది “పో” అనే పాండా ఆశయం. కానీ పరిస్థితుల వల్ల దానికది కుదరదు. ఒకసారి అనుకోకుండా “టాయ్ లుంగ్” అనే స్నో లెపర్డుతో పోరాడడానికి టైగ్రెస్, క్రేన్, మాంటిస్, వైపర్, మంకీ అనే “ఫ్యూరియస్ ఫైవ్”  కాకుండా పాండా ఎన్నికవుతుంది. ఆఖరికి గురువు “షిఫు” కి కూడా “పో” అంటే ఇష్టం ఉండదు.

కానీ పో ఎలా తన మీద నమ్మకంతో “టాయ్ లుంగ్” ని ఓడించిందో అనేదే కథ.

మనిషి జీవితంలో కూడా ఎన్నో సాధించాలనుకుంటాడు. కానీ ఎన్నో అవరోధాలు, అనుమానాలు. అన్నీ అధిగమించి తన మీద నమ్మకం పెంచుకోగలిగితేనే అనుకున్నది సాహించగలుగుతాడు. అలాంటి సూత్రాన్ని హాస్యభరితమయిన యానిమేషను చిత్రంలో బంధించి మనకు వివరించడంలో సఫలమయింది ఈ సినిమా.

* భారతంలోనూ ఈ మధ్య యానిమేషను చిత్రాలను నిర్మించే ప్రక్రియ మొదలయింది. రామాయణం, మహాభారతం లాంటి కథలు, గణేశుడు, రాముడు, కృష్ణుడు లాంటి దేవుడి పాత్రలని యానిమేషనుగా మలస్తున్న చిత్రాలు ఎక్కువ.

* యానిమేషను చిత్రాలను నిర్మించే ప్రముఖ స్టూడియో పిక్సర్ (స్టీవ్ జాబ్స్ చే స్థాపించబడింది, వాల్ట్ డిస్నీచే కొనబడింది), వాల్ట్ డిస్నీ. దాదాపు ప్రముఖ యానిమేషను చిత్రాలన్నీ ఇవి నిర్మించినవే.

–ప్రవీణ్ గార్లపాటి

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

13 Comments to “యానిమేషను సినిమాలు …”

  • నేను మొట్టమొదట ధియేటర్లో చూసిన యానిమేషన్ చిత్రం “The Lion King”. సినిమా చూడటం ప్రారంభించిన పది నిమిషాల తరువాత అది యానిమేషన్ చిత్రమనే విషయం మరిచిపోయి చూసాను. అంత హృద్యంగా అనిపించింది.

    సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభ మన దగ్గర మెండుగా ఉన్నాయి. చాలా వరకూ హాలీవుడ్ చిత్రాల యానిమేషన్ మనదగ్గరే జరుగుతోంది. కానీ,మన దేశంలో ఇంత డబ్బు, సమయం,శ్రమ వెచ్చించి సిన్సియర్గా ఇలాంటి పని చెయ్యడం చాలా కష్టం. అటు పరిశ్రమ, ఇటు ప్రభుత్వం సహాయం చేస్తేతప్ప వీలవ్వటం లేదు. ఇక ప్రేక్షకులంటారా, ఒకవేపు మీరు చెప్పిన లిస్టులో ఉన్న సినిమాల క్వాలిటీ చూసిన తరువాత మన “కిట్టు”(మొదటి తెలుగు యానిమేషన్ చిత్రం)ని చూస్తారంటారా, చూసినా ఆదరిస్తారంటారా?

    కొంత ఆలోచించాల్సిన విషయమే!

  • Very good story. I like to watch animations.. I would love to watch the animated dashavatara in a theatre. I am look fwd for the movie.

  • I m looking forward for the movie.

  • నాకు కూడా ఆనిమేషన్ సినిమాలు చాలా ఇష్టం, నేను పిక్సర్ వాళ్లు చేసిన అన్ని సినిమాలు చూసాను. కొత్తగా వచ్చిన Wall-E కూడా బాగుంది. అన్ని ఆనిమేషన్ చిత్రాలలో నాకు నచ్చే విషయం, ఒక మంచి సందేశం తో ముగింపు ఉండటం.

  • It was a nice article. But, I would have loved to see “Ants” or “Bugs life” and “Monsters Inc” in the list :)
    Ratatouille had a looooot of fans among many I know. Strange that U did not include that.

  • @ మహేష్:
    మొదలు అంటూ ఉంది. నాకది సంతోషం కలిగించే విషయం. మన పురాణాలు మంచి intriguing కథలు. అవి యానిమేషనుగా మలచడం మంచిదే.

    @ సుజాత:
    యానిమేషను నచ్చంది ఎవరికి :)

    @ ప్రపుల్ల:
    WALL-E కూడా ఒక ఎక్సలెంటు సినిమా !

    @ సౌమ్య:
    వ్యాసాన్ని ఇంకా పొడిగించలేక అలా సర్దుకోవాల్సి వచ్చింది. అందుకే కనీసం వాటిని స్మరించి తరించా :-)

    అసలు చెప్పుకుంటూ పోతే అద్భుతమయిన యానిమేషను సినిమాలకి అంతే ఉండదు. లయన్ కింగ్, మాన్స్టర్స్ ఇంక్, ఆంట్ బుల్లీ, ఎ బగ్స్ లైఫ్, రాటటూయీ ఇంకా ఎన్నో.

  • nice article,
    నాకూ చాలా ఇష్టమైనవి యానిమేషన్ సినిమాలు, అసలు వయసు సంబంధం లేకుండా అందరూ ఇష్టపడతారు వీటిని.

  • ప్రవీణ్,
    యానిమేషన్ సినిమాల గురించి మంచి పరిచయ వ్యాసం అందించారు. వీలైతే యానిమేషన్ సినిమాల చరిత్ర, ఈ ప్రక్రియలో చోటుచేసుకున్న మార్పుల గురించి అలాగే ప్రస్తుతం పరిస్థుతులను వివరిస్తూ మరో వ్యాసం రాయండి. వ్యాసం పెద్దదవుతుందనుకుంటే సీరీస్ గా కొనసాగించండి.

  • ఆదరిస్తారేమో , పూర్తి నిబద్దత తో నాణ్యత విషయం లో రాజీ పడకుండా తీయాలే గాని. ఒప్పుకుంటాను ఖర్చుతో కూడుకున్న పనే. హాలివుడ్ లో ప్రే ప్రొడక్షన్ వర్క్ నెలల తరబడి సాగుతుంది. ఉదాహరణ కి “ష్రెక్” సినేమా తీసుకుంటే, అందులో కధా నాయకుడి ఆహార్యం , ఆకారం ( రంగు తో సహా) ఎలా ఉండాలి అనే దానిమీద వారాల తరబడి కసరత్తు జరుగుతుంది. ఒకటికి పది డిజైన్స్ వేసి చూసుకుంటారు.
    నా వరకు నేను ఈ ఆనిమేషన్ సినిమాలని శ్రధ్ధగా చూడడం మొదలెట్టింది స్టూవర్ట్ లిటిల్ నుంచి. అందులో చిన్న ఎలుకకి షర్ట్ ,ప్యాంట్ తోడగడం, ఆది కాళ్ళు వంచినప్పుడు దానికి అనుగుణంగా ఆ ప్యాంట్ మడత పడడం అప్పట్లో నాకు ఎలా తీసేరా అనిపించేది.
    బైదిబై, స్టూవర్ట్ లిటిల్ మీ లిస్ట్ నుంచి మిస్ …. అలానే ఇంకొక మూవీ ఉంది ” ఓవర్ ది హెడ్జ్” అని. అందులో ఒకటి రెండు కాదు దాదాపు పది పన్నెండు కేరక్టెర్లు మూవీ అంతా కనబడుతూనే ఉంటాయీ. ఎంత కష్ట పడ్డారో అనిపిస్తుంది.
    అలానే ” ది ఇన్ క్రెడిబుల్స్” .. ఓ… చాలా ఉన్నాయే……..

    /ఉమాశంకర్

  • ఉమశంకర్ గారు:

    అవును శ్రద్ధ పెట్టి తీస్తే, సరయిన అవగాహన కల్పిస్తే చక్కటి యానిమేషను సినిమాలు తెలుగులో వచ్చే అవకాశం ఉంది.

    ఒక రకంగా చెప్పాలంటే నాకెందుకో పూర్తి స్థాయి యానిమేషను సినిమాలంటే ఎక్కువ ఇష్టం. అంటే మనుషులు లేకుండా కారెక్టర్లు మాత్రమే ఉన్న సినిమాలన్నమాట.

    వెంకట్:

    దానికి నేను కొంత అధ్యయనం చేయవలసి ఉంటుంది. తప్పకుండా ఇంకొంత రాయడానికి ప్రయత్నిస్తాను.

  • అందరూ మెడగాస్కర్‍ని మర్చిపోయినట్టున్నారు… వచ్చిన యానిమేషన్ సినిమాకల్లా వెళుతుంటే మా ఫ్రెండ్స్ నన్ను వెటకారం చేసేవాళ్ళు… మీ వ్యాసం చూపించి వాళ్ళ నోరు మూయిస్తా….findin nemo తీసిన andrew stanton latest సినిమా Wall-E కూడా చాలా బావుంది.. సూపర్ మెసేజ్ కూడా …

  • వ్యాసం బాగుంది. డిస్నీ తీసిన ఏ ఏనిమేషన్ చిత్రమైనా వుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో మంచి సందేశంతో వుంటాయి. అందుకే పిల్లల్ని పెద్దల్నీ ఒకే రకంగా అలరిస్తాయి. పైన (వ్యాఖ్యల తో సహా) చెప్పిన చిత్రాలన్నీ నా ఫేవరెట్సే – అవి కాక స్టూవర్ట్ లిటిల్, డైనాసోర్, పోలార్ ఎక్స్‌ప్రెస్ కూడా చూడాల్సిన చిత్రాలు.

  • అవే కాదు … ఇంకా ఎన్నో సినిమాలు వున్నాయి… వుదాహరణకు ఈ సినిమా …

    http://www.dreamworks.com/spirit/main.html …స్పిరిట్ అనే ఈ సినిమా …

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories