Wong kar-wai – ఒక పరిచయం

wang.jpgఅవునన్నా కాదన్నా మనందరికీ సినిమాలంటే విపరీతమైన అభిమానం. అందుకే మన వాళ్ళు తీసే సినిమాలు అంతగా బాగోలేకపోయినా చూస్తూనే వుంటాం. చూడ్డం సంగతి పక్కనబెడితే మనమూ సినిమాలు తీద్దామని చాలా కలలు కంటుంటాం. ఒక వేళ అదృష్టవశాత్తూ మనకు అవకాశం వచ్చి సినిమా తీద్దామన్నా మన చుట్టూ వున్న పరిస్థితులు మనల్ని ఆ రోటీన్ వ్యవహారంలోకి లాగేస్తాయి. కానీ ఆసక్తి కలిగిన వాళ్ళు మంచి సినిమాలను సునిశితంగా పరిశీలించడం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యున్నత సినిమాలను స్టడీ చేయడం ద్వారా ఫిల్మ్ లాంగ్వేజ్ ను బాగా తెలుసుకోవచ్చు. ఒక్క సారి ఫిల్మ్ లాంగ్వేజ్ పై బాగా పట్టు సాధించాక అందులో ఎన్ని ప్రయోగాలయినా చేయొచ్చు. మనకంటూ ఒక భాషను సృష్టించుకోవచ్చు. అలా తమ కంటు ఒక శైళిని సృష్టించుకున్న దర్శకులు చాలా తక్కువ మందే వున్నారు. అదీ మన దేశంలో మరీ తక్కువ.ఇలా తమకంటూ ఒక భాషను రూపొందించుకున్న దర్శకుల్లో నాకు గుర్తొచ్చేది ఒక హాంగ్ కాంగ్ దర్శకుడు. హాంగ్‌కాంగ్ సినిమా అనగానే హీ…హూ అంటూ సాగే కుంగ్‌ఫూ సినిమాలే గుర్తుకొస్తాయి ఎవరికైనా. కానీ నాకు తెలిసినంత వరకూ హాంగ్‌కాంగ్ సినిమాకు వన్నె తెచ్చిన దర్శకుల్లో ముందుగా గుర్తొచ్చే పేరు వాంగ్ కార్-వై.

యాక్షన్ సినిమాలతో ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిన జాకీ చాన్, బ్రూస్-లీ, జెట్ లీ లాంటి నటుల లాగే, హాంగ్ కాంగ్ కు చెందిన దర్శకుడైన జాన్ వూ హాలీవుడ్ వెళ్ళి ఫేస్ ఆఫ్ లాంటి యాక్షన్ సినిమాలతో అంతర్జాతీయ ఖ్యాతి పొందినా, రాను రాను యాక్షన్ చిత్రాలంటే బోరుకొట్టిన ప్రేక్షకులు మంచి సినిమాలు ఆశించడం మొదలుపెట్టిన రోజుల్లో వాంగ్ కర్-వై సినిమాలు అంతర్జాతీయంగా ప్రేక్షకుల కళ్ళల్లో పడ్డాయి.

ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా, డ్యాన్సులు, పాటలు, హాంగ్ కాంగ్ సినిమా అంటే కరాటే కుంగ్ ఫూ విన్యాసాలు అని నిర్ధారించేసే రోజుల్లో వాంగ్ కర్-వై తన సినిమాల ద్వారా వ్యక్తిగతమైన శైళి ని నిర్దేశించుకుని, సినిమా ద్వారా కూడా కవిత్వం పలికించవచ్చని నిరూపించాడు.

ఈయన తీసిన మొదటి సినిమా అయిన As tears go by కథాపరంగా Mean streets సినిమాను తలపించినప్పటికీ, సినిమాను విజువల్ పోయట్రీగా చూపించడంలో మాత్రం ఈయన Martin Scorcesse ని మించిపోయారు.

ఆ తర్వాత ఈయన తీసిన Days of Being Wild, Ashes of Times, Chungking Express, Happy Together, Fallen Angels, In the mood for love, 2046 సినిమాలు ఒక దానిని మించినవి ఒకటిగా వుంటాయి.

షాంగై లో పుట్టి ఐదేళ్ళ వయసులో హాంగ్‌కాంగ్ తరలి వెళ్ళిన వాంగ్ కర్ వై కుటుంబం అక్కడి భాష అర్థం కాని పరిస్థితుల్లో ఇతరులతో స్నేహం చేయడం కష్టం కావడంతో ఒంటరి తనాన్ని దూరం చేసుకోవడానికి ఎక్కువగా సినిమాలు చూడడం ద్వారా వాంగ్ కర్ వై కి సినిమాలతో మొదటి అనుభూతులు ఏర్పడ్డాయి.

భాష ఏదైనా చిత్రాల ద్వారా ఎంతో సమాచారాన్ని అందివ్వగల సినిమా అంటే చిన్న నాడే ఆసక్తి కనబర్చిన వాంగ్ కర్-వై కాలేజీ నుండీ బయట పడగానే సినిమా అవకాశాల కోసం ఎదురు చూడకుండా కొన్నాళ్ళూ TV పరిశ్రమలో పని చేశాక, దాదాపు పదేళ్ళ పాటు సినిమాలకు రచయితగా పనిచేసాకే మొదటి సినిమా చేసే అవకాశం దొరికింది.

ఇప్పటివరకూ 12 సినిమాలు తీసి అంతర్జాతీయ ఖ్యాతి గడించి దాదాపు అన్ని చిత్రోత్సవాల్లోనూ అవార్డులు పొందిన తర్వాత కుడా తనను ఒక దర్శకునిగా కాకుండా ఇంకా ఒక ప్రేక్షకుడిగానే భావిచే వాంగ్ కర్-వై, సినిమాలు ఎందుకు తీయ్యాలి అనే ప్రశ్నకు సమాధానం ఆయన మాటల్లోనే చెప్పాలంటే “…I think I wouldnt really consider myself a director. I still see myself as an audience member – an audience member who stepped behind camera. When I make a film, I always try to reproduce the first impressions that I had as a film lover. And I believe I make films for the audience, first and foremost. But there has to be more than that, of course. Its not the only reason. It must only be one of the reasons. The rest is more personal and, well, more secret.”

పెట్టిన కూలింగ్ గ్లాసెస్ ఎప్పుడూ తీయని వాంగ్ కర్-వై కళ్ళల్లో ఎప్పుడూ ఎటువంటి చిత్రాలు కదలాడుతాయో ఎమో కానీ, ఆయన సినిమాలు చూసిన ఎవరైనా ఒప్పుకోవలిసిన విషయం ఒకటుంది. ఈయన సినిమాల్లో వున్నటువంటి భావ చిత్రణ వేరే ఏ దర్శకులతో పోల్చలేనంతగా అద్వితీయంగా వుంటుంది. అంతటి ప్రత్యేకత ఏమిటి ఈయన సినిమాల్లో అని అడిగితే మాత్రం ఈయన తీసిన సినిమాలు చూసి తెలుసుకోవలిసిందే! కానీ వాంగ్ కర్-వై మాటల్లోనే ఆయన దర్శకత్వ ప్రతిభలోని రహస్యలేంటో తెలుసుకోవడం చాలా అరుదైన విషయం.

ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు తెలుసుకుంటే ఆయన ప్రతిభ వెనుక వున్న కొన్ని రహస్యాలు మనకు తెలియవచ్చు. వాంగ్ కర్-వై రూపొందించిన సినిమాలన్నింటికీ దాదాపుగా ఆయనే స్క్రిప్ట్ సమకూర్చుకున్నారు. తన సినిమాలకు తానే స్క్రిప్ట్ రచించుకోవడం అనేది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఒక విధంగా వాంగ్ కర్-వై కి ఇది ఒక పెద్ద ప్రయోజనం. తన సినిమాలకు తనే స్క్రిప్ట్ రాసుకోవడం వల్ల ఏ దర్శకునికైనా పూర్తి స్వాతంత్ర్యం దొరుకుతుంది.అంత మాత్రాన ప్రతి దర్శకుడు మంచి స్క్రిప్ట్ రాయగలరని నమ్మకం ఏమీ లేదు.

వాంగ్ కర్-వై విషయానికి వస్తే ఈయన స్క్రిప్ట్ రాసే సమయంలో ముందుగా ఆలోచించే విషయం, కథ జరిగే ప్రదేశం గురించి. ఎక్కడ జరుగుతుందో తెలిస్తే ఎలా జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడం చాలా సులభం అని ఈయన అభిప్రాయం. అందరు దర్శకులు స్క్రిప్ట్ రాసుకుని లోకేషన్లు వెతుక్కోవడానికి వెళ్తే వాంగ్ కర్-వై మాత్రం ముందు లొకేషన్లు వెతుక్కుని తర్వాత కథ రాసుకుంటారట.

ఈయన స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు తప్పకుండా పరిగణించే మరో విషయం genre. చాలా మంది కథా రచయితలు తప్పు చేసేది ఇక్కడే! ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు చూసిన వాళ్ళెవరైనా ఈ విషయం ఒప్పుకుంటారనుకుంటాను. ఈ మధ్య వచ్చే సినిమాలు ముందు ఒక కామెడీ గా మొదలయ్యి, లవ్‍స్టోరీ గా రూపాంతరం చెంది అక్కడనుంచి ఒక యాక్షన్ సినిమాగా ముగుస్తుంది. ప్రేక్షకులకు నవరసాలు అందించాలని, లేదా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఈ ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒక genre నుంచి మరో genre కు మారుతూ ప్రేక్షకుల్లో ఒక మూడ్ కల్పించలేకపోవడం చాలా సినిమాల యొక్క పెద్ద తప్పు. అందుకే వాంగ్ కర్-వై మాటల్లో genre యొక్క ప్రాముఖ్యత చెప్పాలంటే,”The only thing that I try to make very clear when I start a film is the genre that I want to place it in……I try to make each of my films in a different genre. And I think that’s part of what has made them so original.

అదే ఇంటర్వ్యూ లో వాంగ్ కర్-వై చెప్పిన మరో విషయం కాబోయే దర్శకులకు ఎంతో మార్గ దర్శకమవుతుందని నా అభిప్రాయం. ఒక కవి పదాలను ఒక సారి ప్రాస కోసం,ఒక్కో సారి భావుకత కోసం, మరో సారి అర్థం కోసం,ఒక్కో రకంగా వుపయోగించుకున్నట్టు దర్శకుడు సినిమాటోగ్రాఫర్తో కలిసి తమకు అర్థవంతమైందైగా తోచేలా ఒక భాషను సిధ్ధాంతీకరించాలి అని చెప్తాడు. ఒక్క మాటలో చెప్పలంటే “Invent Your Own Language” అంటాడు వాంగ్ కర్-వై.

నా దృష్టిలో వాంగ్ కర్-వై కు వున్న మరో అనుకూలత ఈయన సినిమాలన్నింటికీ దాదాపుగా ఒకే సినిమాటోగ్రాఫర్(Christopher Doyle) పని చేయడం. ఈ విధంగా చేయడం మూలాన దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ మధ్యన ఒక విధమైనటువంటి అవగాహన ఏర్పడి మంచి ఫలితాలు లభించే అవకాశం వుంది. ఇదే విషయం Ingmar Bergman మరియు Sven Nyskvist ల జంట కూడా నిజమని నిరూపిస్తుంది.

అన్నింటికంటే ముఖ్యంగా దర్శకుడు అవ్వాలనుకునే వారికి ఈయన ఇచ్చే సూచన. “One last thing: to be a director, you have to be honest. Not with other people, but with your self. You have to know why your’re making a film; you have to know when you’re making a mistake and not put the blame on others.”

ప్రేక్షకుల కోసమే సినిమాలు తీసే మన దర్శకులు, వాంగ్ కర్-వై చెప్పినట్టు ప్రేక్షకుల కోసం మాత్రమే కాకుండా తమ సినిమాలకో పర్సనల్ టచ్ ఇచ్చినట్టయితే తప్పకుండా మంచి సినిమాలు రూపొందించే అవకాశం వుంటుంది.

అసలీ ఎవరీ వాంగ్ కర్-వై ఏమిటాయన గొప్పతనం అని ఇప్పటికీ మీకనిపిస్తే ఇప్పుడే వెళ్ళి ఆయన శినిమాల DVD లు తెచ్చుకుని చూసి తెలుసుకోండి. నేర్చుకోండి. ఇప్పుడే అంత అర్జంటుగా వెళ్ళి తెచ్చుకోవడం కుదరనట్టయితే ఈ కింది వీడియో చూసి ఆనందించండి. ఈయన తీసిన In the mood for love మరియు 2046 సినిమాలు చూడడం మాత్రం మర్చిపోకండి.

వాంగ్ తీసిన లేటెస్ట్ సినిమా My Blueberry Nights ఆయన అభిమానులను చాలా నిరాశకు గురిచేసిందని విన్నాను. త్వరలో ఆ సినిమా చూసి నా అభిప్రాయం రాసే ప్రయత్నం చేస్తాను. అయినా క్వాలిటీ సినిమాలు తియ్యాలంటే హాలీవుడ్ కి కొంచెం దూరంగా వుండడమే మేలేమో కదా :-)

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

14 Comments to “Wong kar-wai – ఒక పరిచయం”

  • వెంకట్ గారు,
    wong kar wai గురించి చాలా వివరంగా రాసారు. ధన్యవాదాలు.
    రెండేళ్ళ క్రితం, ఓ చైనీస్ ఫ్రెండ్ తో దర్శకుడు zhang yimou గురించి చెపుతుంటే,
    ఆమె wong kar wai గురించి చెప్పింది.
    మీరు పైన పేర్కొన్న సినిమాలు చూసాను. In the mood for love,
    Fallen Angels నాకు బాగా నచ్చాయి.
    మీ వ్యాసం kar wai గురించి మరింతగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

  • Chungking Express : మొదటి కథ పెద్దగా అర్థం కాలేదు. రెండో కథ మాత్రం టూ గుడ్. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టడం లేదు.

  • Yes..I saw Chungking Express (1994), Fallen Angels ( 1995), Happy Together (1997), In the Mood for Love (2000). These are really good.

  • “ఈ మధ్య వచ్చే సినిమాలు ముందు ఒక కామెడీ గా మొదలయ్యి, లవ్‍స్టోరీ గా రూపాంతరం చెంది అక్కడనుంచి ఒక యాక్షన్ సినిమాగా ముగుస్తుంది. ప్రేక్షకులకు నవరసాలు అందించాలని, లేదా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఈ ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒక genre నుంచి మరో genre కు మారుతూ ప్రేక్షకుల్లో ఒక మూడ్ కల్పించలేకపోవడం చాలా సినిమాల యొక్క పెద్ద తప్పు”
    ———————————————————————
    అక్షరలక్షలు చేసే మాటలు. ఫక్తు యాక్షన్ సినిమా చూస్తూ, “ఫస్టాఫ్ లో కామెడీ తగ్గింది – హీరోయిన్ ని ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుండేది” లాంటి కామెంట్లు చేసుకునే పరిస్థితినుంచీ మనం ఎదిగితేతప్ప genre cinema ఇక్కడ రాదేమో!

  • వెంకట్ గారూ, మంచి వ్యాసం అందించారు, మీరు ఇచ్చిన లింకులు ఎందుకో పనిచేయటంలేదు. అయినా యూట్యూబులో చూస్తాను. మహేష్ గారు వ్యాసంనుంచి కోట్ చేసిన పైభాగాలు, వికాస్ స్వరూప్ ‘క్యు & ఎ’ నవలలో నీలిమాకుమారి పాత్రద్వారా చెప్పించిన అభిప్రాయాలకు చాలా దగ్గరగా ఉన్నాయి.
    “కామెడీ, ట్రాజెడీ, యాక్షన్, మెలోడ్రామా – ఇలా అన్ని రసాలూ చింతపండు సంచీలో కూరినట్టు ఒకే సినిమాలో కూరెయ్యాలనుకుంటారు. కాని అది కాదు పధ్ధతి. ఒక మంచి సినిమా అంటే, ఏదో ఒక ప్రత్యేక రసాన్ని ఆవిష్కరించాలి. నేనెప్పుడూ కూడా నా చిత్రాలన్నీ, కథ పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే, అందులో నా పాత్రేమిటో ఆకళింపు చేసుకున్న తర్వాతనే ఎన్నుకునేదాన్ని. నా చిత్రాల్లో ఎక్కడా రెండు పాటలు పాడేసి, డాన్సులు చేసేసి, రెండు, మూడు రీళ్ల తర్వాత చనిపోవటమంటూ ఉండదు. ఒక పాత్ర ఎప్పుడూ కూడా ఓ సజీవ స్రవంతిలాగా ఉండాలి. ఓ చిత్రకారుడు ఎలాగైతే కుంచె పట్టుకుని ఓ సజీవచిత్రాన్ని మలుస్తాడో, అలా ఒక నటుడు, నటి తన పాత్రకు ప్రాణంపోయాలి. తనదైన రసావిష్కరణ చేయాలి.”
    మహేష్ గారూ, ఇక్కడే వికాస్ స్వరూప్ genre అనే మాట వాడాడు. దాన్ని తెలుగులో ఏమంటారని నేను మిమ్మల్ని అడిగాను. గుర్తుందా. ఇప్పటికైనా తెలుగు మాట దొరికిందా?

  • @మేడేపల్లి శేషు: Genre అనేది విషయం,శైలి,రసస్పందన మూడింటి కలగలుపు. ఇదమిద్ధంగా వాటన్నింటి కలిపి చెప్పగలిగే తెలుగుపదం లేదనుకుంటాను.మన సినిమాలు ఎలాగూ అన్నిరసాలూకలగలిపిన కలగూరగంపలే కాబట్టి ఇప్పటివరకూ అవసరం కూడా రాలేదు కాబోలు.(ఎలాగూ మనోళ్ళు ఏ రసాన్నైనా “భీభత్సం” చెయ్యడంలో దిట్టలుకదా!) ఇప్పుడు అవసరం అనిపిస్తోంది కాబట్టి మనం హాయిగా ఒకటి సృష్టించుకుంటే సరి.

    “రసవిధానం” – “రసవిధి” అనే పదాలు నా సూచన. ఇంకేమైనా appropriate పదాలుగా అనిపిస్తే పంచుకోండి చర్చిద్దాం.

  • నవరసాలు కలిసి ఉండటం తప్పుకాదు! అలా కూడా మనం ఆనందించిన మంచి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు తీయటం చేతకాక, ఏడవలేక మద్దెలోడు అన్నట్టు ఈ గోల. కానీయండి. కాపీ కొట్టండి.

    అది విధి, విధానం కాదు. అది కేవలం categorization – వర్గీకరణ.
    - రసరూపవర్గం అనొచ్చేమో.
    ఐనా కాస్త తెలుగొచ్చిన వాళ్ళని,సాహిత్యంలో genre గురించి తెలిసిన వాళ్ళని అడిగి పదం కనుక్కోటం మంచింది.

    మొత్తానికి genre కావాల్సిందే నన్నమాట! కానీండి.

    పౌరాణిక చిత్రం
    చారిత్రాత్మక చిత్రం
    సాంఘిక చిత్రం
    హాస్య చిత్రం
    భక్తి చిత్రం
    జానపద చిత్రం
    సోషియో ఫాంటసీ చిత్రం
    కుటుంబకధా చిత్రం
    మహిళా చిత్రం
    క్రీడా చిత్రాలు ( క్రీడాచిత్రాలు వేళ్ళమీద లెక్కించవచ్చు. ఇంకో నాలుగు వరసగా తీస్తే అదీ వస్తుంది)
    ప్రేమ చిత్రాలు
    యువ చిత్రాలు/ కాలేజ్ చిత్రాలు
    ఫాక్షన్ చిత్రాలు (క్రీడా చిత్రాలకంటే ఎక్కువున్నాయేమో ఇవి!)
    సంగీత ప్రాధాన్య చిత్రాలు
    సంప్రదాయ చిత్రాలు
    పిల్లల చిత్రాలు
    జంతువుల చిత్రాలు
    హీరో చిత్రాలు
    హీరోయిన్ చిత్రాలు
    యాక్షన్ /ఫైటింగ్ సినిమాలు
    సెంటిమెంట్ సినిమాలు
    ———–
    దొంగ చిత్రాలు
    సవాల్ చిత్రాలు
    దిద్దిన చిత్రాలు
    రాముడు చిత్రాలు
    గ్రాఫిక్ చిత్రాలు
    :)

    genre అనేది జస్ట్ వాళ్ళ మార్కెటింగ్‌కి వాళ్లు పెట్టుకున్న వర్గీకరణ! అంతేకానీ, అలా ఓ genre లోనే ఉండాలి అనేదేం లేదు.

    • @రేరాజు: నవరసాలూ కలిసి ఉండటం బాగానే ఉంటుంది. కానీ నవరసాల్ని కలగలిపి కలగూరగంపజేస్తే ఒక నిర్ధుష్టమైన రసస్పందన మాత్రం కరువౌతుంది. ప్రస్తుతం నవరసాల్నీ సమపాళ్ళలో కలిపే రసస్రష్టలు లేరు.

    • Rayraj,

      ఎదవ చిత్రాలు మర్చిపోయారు సారూ… :D

      viz.., “నేనెంతెదవనో నాకే తెలియదు…”etc థీములున్నవన్నమాటా

  • సరిగ్గా సినిమాలు తీసి విజయవంతం చేస్తే, ఒక్కోదానికీ అవే పేర్లొస్తాయి. అంతేగానీ, పేర్లు పెట్టుకొని సినిమాలు తీయరు.

    ఏదో ఆ డైరెక్టర్ అలా చెప్పారని పట్టుకోనక్కర్లేదు. అలా ఒకొక్క genreలో ఒక్కో సినిమా తీస్తాను అని చెప్పడం – వైవిధ్యానికి, ఒరిజనాలిటీకి వేసుకున్న పదం. ఎక్స్‌పెక్టేషన్‌ మేనేజ్‌మెంట్లో భాగం అని అర్ధం చేసుకోవాలి.

    • అలా genre డిఫైన్ చేసుకుని స్టాన్లీ కూబ్రిక్ ఎలాంటి వైవిధ్యమైన సినిమాలు తీయగలిగారో ఆలోచించి చూడండి

      • I could not get what you are trying to say. I don’t think he was famous for moulding his movies to a genre.Rather, it is the reverse.

        Anyway, let me clarify in detail. ‘genre’ని డిఫైన్ చేసుకుని సినిమా తీయడాన్ని తప్పుబట్టలేదు.అదీ ఓ పద్దతే. కానీ,
        ౧ .ఉన్న వాటిల్లోనే తీస్తే, కొత్త genreలు ఎలా పుడతాయి?
        ౨. మన సినిమానే ’ఇండీటైన్మెంట్’ అనే genreగా మార్కెటింగ్ ఎందుకు చేసుకోలేరు!?
        ౩. దర్శకుడు ఏ రసస్పందనను కోరుకుంటున్నాడో, దాన్ని కలిగించాడా లేదా? అన్నంత వరకే పాయింటు.If choosing a ‘genre’ helps, Use it!
        _________
        ’జాతము’ గురించిన చర్చనింకా చూడలేదుగానీ, ఆ పదాన్ని ఎంచుకోడంలోనే, genreతో సూచించ దలుచుకున్న విషయం మిస్ అయిపోతారు. ఎటిమాలజీకై ఉన్న అవసరమూ, దాంతో లాభమూ వేరు. కానీ, “ఈ జాతములోనే ఈ సినిమా చాలా గొప్పది.” అనొకొని చూడండి. పోనీ, ఇది ఎంతమంది బుర్రల్లో ఎలాంటి రసస్పందన కలిగిస్తుందో చూడండి. :) )
        ______

        అక్కడ ’genre’ అనేది ఉంది గాబట్టి, ఇక్కడా ఉండాలి అని ఆలోచించడంలోని లోపాన్ని గుర్తిస్తే చాలు, ఒరిజినాలిటీ తన్నుకొని వస్తుంది.

        ఇక్కడ గొప్పది ఒకటి పుడితే, అదీ ఒక ’genre’ కింద పేరుపొందొచ్చు. లేదా ఏ “genre” కీ ఒదగని ఓ అమోఘ చిత్రరాజంగా కొనియాడబడొచ్చు!In that sense, lack of a genre is an opportunity/ a chance. ఆ “ఛాన్స్” ని ఎలా వాడుకోవాలో ’ఆలోచించండి’.

  • వర్గపదం నిషిద్దం అనుకుంటే – రసరూపశైలి ఎలా ఉంది?

    “ఈ రూపశైలిలో వచ్చిన సినిమాల్లో ఇది తలమానికం” లాంటి వాడకం తేలిగ్గా ఉండేలా ఉంది.
    అప్పుడు రస కూడా డ్రాపు.

    నేనిక్కడితో డ్రాపు :)

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories