Menu

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (చివరి భాగం)

‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు

clap board
కామెడీ, యాక్షన్లతో కూడిన ఓ చక్కటి కుటుంబకథా చిత్రం విషాదంగా ముగిసిన వైనం. సినిమా పరిభాషలో నీలిమాకుమారితో నేను గడిపిన రోజుల్ని గురించి చెప్పాలంటే, ఇలాగే చెప్పాలి మరి. జుహు విలె పార్లేలోని ఆమె ఫ్లాటులో నేను మూడేళ్లు పనిచేశాను.

మామన్, అతని ముఠానుంచి సలీం, నేను తప్పించుకున్న రోజు రాత్రినుంచే, ఈ అధ్యాయం ప్రారంభమైంది. మేము లోకల్ ట్రైన్ పట్టుకుని జుహులో దిగాము. నేరుగా నీలిమాకుమారి ఫ్లాటుకెళ్ళి, కాలింగ్ బెల్ నొక్కాం.

చాలాసేపటి తర్వాతగాని తలుపు తెరుచుకోలేదు.

ఎదురుగా ఒక స్త్రీ.

“ఎవరు?” అడిగింది.

పొడుగ్గా, అందంగా, ఓ సినిమా హీరోయిన్ ఎలా ఉంటుందో, అలాగే ఉందామె.

సలీం ఆమె కాళ్ళమీద పడిపోయాడు.

“అరెరే!” అని వెనక్కి జరిగి, “ఎవరు మీరిద్దరూ? ఇంత రాత్రప్పుడు ఇక్కడేం చేస్తున్నారు?” అన్నది.

“మేడం, మేం రాధే స్నేహితులం.” అన్నాను నేను చేతులు జోడిస్తూ.

“మీకు ఓ పనికుర్రాడి అవసరం ఉందని రాధే చెప్పాడు. మీరు కనుక ఆ పని మాకిప్పిస్తే, మమ్మల్ని ఆదుకున్నవాళ్ళవుతారు. మీరే పని చెప్పినా చేస్తాం.” అన్నాను ధైర్యం కూడదీసుకుని.

“ఔను. నిజమే. నాకో పనికుర్రాడు కావాలి. కాని మీరు మరీ పసిపిల్లల్లాగా ఉన్నారే.” అందామె కొంచెం సందేహంగా.

“మేడం. మేం చూడటానికి అలా ఉంటాం గాని, నలుగురి పనైనా చేసేస్తాం. అన్నట్టు నాకు కొంచెం ఇంగ్లీషు మాట్లాడటం కూడా వచ్చు” అన్నాను కొంచెం ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటూ.

“కాని నాకిద్దరు పనివాళ్ళు అవసరం లేదు. ఒక్కళ్ళు చాలు.”

సలీం, నేను ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం.

“పోనీ ఒక్కళ్ళనే పనిలోకి తీసుకోండి” అన్నాం.

“నీ పేరేంటి?” అడిగిందామె సలీంని ఉద్దేశించి.

“సలీం”

“ఓహో. నువ్వు ముస్లిం కుర్రాడివన్నమాట”

అవునన్నట్టుగా తలూపాడు సలీం.

“చూడు బాబూ. ఏమనుకోకు. పెద్దావిడ మా అమ్మకు చాదస్తం ఎక్కువ. నాకీ పట్టింపులన్నీ లేవనుకో. కాని ఆమె గురించే…” అంది తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ.

ఆ మాటలకు సలీం హతాశుడయ్యాడు.

వెంటనే నావైపు తిరిగి “నువ్వు? నీ పేరేంటి?” అని అడిగింది.

“నా పేరు రామ్” చెప్పాను.

ఆ ఉద్యోగం నాకు దొరికింది.

* * * *

సినిమావాళ్ళ జీవితం దగ్గరగా చూస్తే, తెరమీద కనబడేంత ఆకర్షణీయంగా ఉండదన్న సత్యం నాకప్పుడే తెలిసింది.

ముఖాన ఏమాత్రం మేకప్ లేకుండా, వాళ్ళూ మనందరిలాగే అన్నిరకాల సమస్యలు, ఈతిబాధలతో కనిపిస్తారు. తేడా అల్లా, మనం డబ్బు గురించి ఆలోచించి బాధపడ్తే, వాళ్ళు పేరుప్రఖ్యాతుల గురించి ఆలోచిస్తూ అనుక్షణం మథనపడుతూ ఉంటారు.

నీటితొట్టెలో తిరిగే చేపవంటిది వాళ్ళ జీవితం. ముందు దాన్ని అసహ్యించుకుంటారు. కాని పొగడ్తలకు పొంగిపోతూ తర్వాత దానిమీద మోజు పెంచుకుంటారు. ఎప్పుడైతే చుట్టూ ఉన్న వాళ్ళు తమను పట్టించుకోవడంలేదని తెలుసుకుంటారో, అప్పుడు నీళ్ళు ఖాళీ అయిన తొట్టెలో చేపలా విలవిలలాడతారు.

నీలిమాకుమారి తరచూ నన్ను షాపింగుకు వెంట తీసుకెళ్తుండేది. ఆమెకు స్వంత కారు లేదు. అందుకని టాక్సీలో వెళ్ళేవాళ్ళం. నిజానికి నాకు ఆమెతో బైటికి వెళ్ళటమంటే పెద్ద బోరుగా ఉండేది. ఆమె ఎంతసేపూ కాస్మెటిక్స్, బట్టలే కొనేది. ఆ బరువంతా నేను మొయ్యాల్సివచ్చేది. ఒక్కసారైనా మెక్డొనాల్డ్స్ కో, పిజ్జా హాట్ కో వెళ్ళేది కాదు. నాకేమీ కొనిచ్చేది కాదు కూడా.

కాని ఈరోజు కఫే పరేడ్ లోని ఒక ఖరీదైన చీరెల దుకాణానికెళ్ళాం. ఆమె రెండు గంటల్లో కనీసం వంద చీరెలు చూసి, చివరికి యాభైవేలు పెట్టి, మూడు చీరలు తీసుకున్నది. అది దాదాపు నా రెండేళ్ల జీతానికి సమానం.

మేమిలా బిల్లు పే చేసి, అలా బైటికి అడుగుపెట్టామో లేదో, స్కూలు యూనిఫాంలో ఉన్న ఓ అమ్మాయిల గుంపు ఆమెను చుట్టుముట్టేసింది. ఆమెను చూసి చాలా ఎగ్జయిట్ అయిపోతున్నారు వాళ్ళు.

“మీరు…నీలిమాకుమారి….సిన్మా యాక్టరు కదా మేడం.” అనడిగింది ఓ పిల్ల కుతూహలంగా.

“అవును” అంది నీలిమాకుమారి నవ్వుతూ.

“వావ్! చూడండే. నే చెప్పలేదూ” అని కెవ్వున అరిచిందా పిల్ల.

“నీలిమ గారూ, మేమంతా మీ ఫాన్స్ మి. మిమ్మల్నీరోజు ఇక్కడ కలవటం నిజంగా మా అదృష్టం. మాదగ్గర ఇప్పుడు ఆటోగ్రాఫ్ బుక్స్ అయితే లేవు. ఈ ఎక్సర్సైజు పుస్తకాల్లోనే మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా?” అందా అమ్మాయి నీలిమవైపు తిరిగి.

“తప్పకుండా” అని తన హాండ్ బాగ్ లోనుంచి పెన్ను తీసి, ఒక్కొక్కళ్ళే వాళ్ళ పుస్తకాలు అందిస్తూంటే, నీలిమ ఒక్కొక్కళ్ళ పేరే అడుగుతూ, “రీతుకు ప్రేమతో – నీలిమ”, “ఇందూకు ప్రేమతో – నీలిమ” “మాలతికి ప్రేమతో – నీలిమ” “రోషిణికి ప్రేమతో – నీలిమ” అని ముద్దొచ్చే అక్షరాల్లో రాసిచ్చింది. అది చూసుకుని ఆనందంలో మునిగిపోయారు వాళ్ళు.

ఈ అనూహ్యమైన అభిమానానికి పొంగిపోయింది నీలిమ. ఎవరైనా ఆమెను గుర్తుపట్టి మాట్లాడటం, దానికి ఆమె స్పందన – ఇదంతా చూడటం నాకిదే మొదటిసారి. ఆటోగ్రాఫులు ఇవ్వటం ముగించి, చెమటలు కక్కుతూ, సంచులు మోస్తున్న నన్నుచూసి, కొంచెం జాలిగా “పద రామ్, నీకు బాగా ఆకలేస్తోందనుకుంటా. ఐస్ క్రీం తిందాం రా” అని తీసుకెళ్ళింది. నా ఆనందం చెప్పనలవి కాదు.

* * * *

అప్పుడప్పుడూ నీలిమాకుమారి, సినిమాల గురించి, సినిమాకళ గురించి నాకు చెప్తూ ఉండేది. సినిమా నిర్మాణంతో ముడిపడి ఉన్న అనేకమంది సాంకేతిక నిపుణుల గురించి చెప్పేది.

“సినిమాలు చూసేవాళ్ళంతా, సినిమా అంటే కేవలం నటీనటులు, దర్శకులే అనుకుంటారు. తెరవెనుక పనిచేసే అనేకమంది సాంకేతిక నిపుణుల గురించి వాళ్లకు నిజానికి తెలియదు. వాళ్ళు వాళ్ళ పనంతా సక్రమంగా చేస్తేనే డైరెక్టరు “లైట్స్, కెమెరా, యాక్షన్” అని చెప్పగలుగుతాడు, తెలుసా?” అని సెట్స్ నిర్మాణం గురించి, కెమెరామెన్, లైట్ బాయ్స్, మేకప్ మెన్, స్టంట్ మెన్, స్పాట్ బాయ్స్ ఇలా అనేకమంది టెక్నీషియన్స్ గురించి చెప్పేది.

ఆ తర్వాత రకరకాల కథాచిత్రాల గురించి కూడా చెప్పేది.

“ఈ రోజుల్లో తీసే సినిమాలంటే నాకసహ్యం. కామెడీ, ట్రాజెడీ, యాక్షన్, మెలోడ్రామా – ఇలా అన్ని రసాలూ చింతపండు సంచీలో కూరినట్టు ఒకే సినిమాలో కూరెయ్యాలనుకుంటారు. కాని అది కాదు పధ్ధతి. ఒక మంచి సినిమా అంటే, ఏదో ఒక ప్రత్యేక రసాన్ని ఆవిష్కరించాలి. నేనెప్పుడూ కూడా నా చిత్రాలన్నీ, కథ పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే, అందులో నా పాత్రేమిటో ఆకళింపు చేసుకున్న తర్వాతనే ఎన్నుకునేదాన్ని. నా చిత్రాల్లో ఎక్కడా రెండు పాటలు పాడేసి, డాన్సులు చేసేసి, రెండు, మూడు రీళ్ల తర్వాత చనిపోవటమంటూ ఉండదు. ఒక పాత్ర ఎప్పుడూ కూడా ఓ సజీవ స్రవంతిలాగా ఉండాలి. ఓ చిత్రకారుడు ఎలాగైతే కుంచె పట్టుకుని ఓ సజీవచిత్రాన్ని మలుస్తాడో, అలా ఒక నటుడు, నటి తన పాత్రకు ప్రాణంపోయాలి. తనదైన రసావిష్కరణ చేయాలి. నువ్వు “టైమ్స్ ఆఫ్ ఇండియా” లో “రెండు గుండెల బంధం” సినిమా రివ్యూ చూశావా? అందులో సమీక్షకుడు హీరోయిన్ పూజా ఈ పాత్రని పీకి పాకం పెట్టిందని రాయలేదూ? అంతేకాదు. ఇందులో హీరోయిన్ స్థానంలో నీలిమాకుమారే ఉండి ఉంటే, ఆ పాత్రకు గొప్పగా న్యాయం చేసేది. ఈనాటి హీరోయిన్లు ఆమెనుండి నేర్చుకోవలసింది చాలా ఉంది – అని కూడా రాశాడు. అది చదివి నాకు చాలా ఆనందమేసింది. ఒక నటికి అంతకంటే గొప్ప కాంప్లిమెంటు ఏముంటుంది?”

“అయితే, మీ ప్రత్యేకమైన శైలి ఏమిటి మరి” అనడిగాను అమాయకంగా.

ఆమె చిన్నగా నవ్వి “అది తెలుసుకోవటానికి నువ్వింకా చాలా చిన్నకుర్రాడివి. నన్ను ‘ట్రాజెడీ క్వీన్ ఆఫ్ ఇండియా’ అని పిల్చేవారు తెలుసా? రా, చూపిస్తాను.” అని నన్ను తన బెడ్ రూంలోకి తీసుకెళ్ళింది.

అక్కడ ఉన్న ఒక అల్మైరా తెరిచింది. అది రకరకాల వీడియో కాసెట్లతో నిండిపోయి ఉంది.

“ఇవన్నీ నేను నటించిన సినిమాల కాసెట్లు, తెలుసా? ” అంది.

“నిజంగా? ఎన్ని కాసెట్లు ఉంటాయేమిటి మేడం?” అనడిగాను.

“నూటా పధ్నాలుగు. ఇరవై ఏళ్లలో నేను 114 చిత్రాల్లో నటించాను” అని మొదటి వరసను చూపిస్తూ చెప్పింది “ఇవన్నీ నా కెరీర్ తొలిదశలో నటించిన సినిమాలు. ఎక్కువగా కామెడీలు. కామేడీలంటే తెలుసుకదా?” అంది.

నేను తలూపి, “తెలుసు, గోవిందా సినిమాల్లాంటివి” అన్నాను.

ఆమె నా మాటలు విననట్టుగానే, తర్వాతి రెండు వరుసలు చూపిస్తూ చెప్పింది “ఇవి నా కెరీర్లో మధ్యదశకు సంబంధించినవి. ఎక్కువగా కుటుంబకథా చిత్రాలు. అయితే, నేను “హంతకుడెవరు?” “30 ఏళ్ళ తర్వాత” వంటి థ్రిల్లర్, హారర్ చిత్రాల్లో కూడా నటించాను”

చివరగా చివరి నాలుగు వరుసలలో పేర్చిన కాసెట్లను చూపిస్తూ చెప్పింది “ఇవన్నీ ట్రాజెడీలు. ఇక ఇవన్నీ నాకొచ్చిన లెక్కలేనన్ని అవార్డులు, ట్రాఫీలు”

“ఇదిగో. ఇది నా అభిమాన సినిమా” అంది ఒక కాసెట్టును చూపిస్తూ. దానిమీద “ముంతాజ్ మహల్” అని రాసుంది.

“నా కెరీర్లో కలకాలం నిలిచిపోయే పాత్ర ఇది – షాజహాన్ చక్రవర్తి భార్య ముంతాజ్ మహల్. దీనికి నాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అదిగో, ఆ మధ్యలో ఉన్నది చూడు. దానిని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నాను” గర్వంగా చెప్పింది.

“మేడం, అదే మీరు పోషించిన అత్యుత్తమమైన పాత్రా?” అడిగాను.

ఆమె ఒకసారి నిట్టూర్చి అన్నది “అది చాలా మంచి పాత్ర. అందులో సందేహం లేదు. ఎంతో భావోద్వేగాలతో నేను నటించిన పాత్ర. కాని అత్యుత్తమమైన పాత్ర నేను ఇంకా చేయాల్సి ఉంది”

(సమాప్తం)

* * * *

(ఇంతవరకూ ఈ వ్యాసపరంపరలో వచ్చిన ‘క్యు & ఎ’ నవలలోని కొన్ని భాగాల అనువాదానికి అనుమతించిన రచయిత వికాస్ స్వరూప్ గారికి కృతఙ్ఞతలు)

4 Comments
  1. G September 1, 2009 /
  2. thikamaka September 2, 2009 /
  3. శంకర్ September 2, 2009 /