Menu

జెనెర్‌లు – మూసలు (ఒక పరిశీలన)

genreసినిమా పరిభాషలో జెనెర్ అనే పదం తరచుగా వినపడుతుంటుంది (కొంత మంది జెనెరె అని అంటారు). ప్రాధమికంగా ఇది ఏ “రకమైన” సినిమానో చెప్పటానికి వాడుతుంటారు. చాలా వరకు సినిమాల ప్రచారంలో రివ్యూలలో ఈ పదం వినపడుతుంటుంది. (సినిమా విడుదలకి ముందు మాత్రం ఇదొక డిఫరెంట్ సినిమా అనే వినపడుతుంది). “పూర్తి హాస్య రస చిత్రం”, “వళ్ళు గగుర్పొడిచే ఫైట్లతో, అనూహ్యమైన చేజింగ్ దృశ్యాలతో..”, “అన్నా చెళ్ళెళ్ళ అనురాగానికి అద్దం పట్టే సినిమా..” ఇలాగ నేరుగా జెనెర్ గురించి చెప్పకపోయినా వాళ్ళు మాట్లాడేదంతా జెనెర్ గురించే.

అసలు ఈ జెనెర్ అంటే ఏమిటి?

ఇందాక చెప్పినట్టు ఒక సినిమా ఏ రకమైనది (కాటగిరి) చెప్పడానికి వాడే పదం ఈ జెనెర్. వుదాహరణకి హర్రర్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ వగైరా. ఈ జెనెర్ ఆధారిత విభజన సాహిత్యం నుంచే సినిమాలలోకి ప్రవేశించింది. ఆ తరువాత అనేక సబ్‌జెనెర్‌లు, మిక్సిడ్ జెనెర్లు పుట్టుకొచ్చాయి. అయితే అసలు జనెర్ అనేది విమర్శకుల సృష్టి అని, సినిమాకి జెనెర్ అనేది వర్తించదనీ వాదించే వాళ్ళూ లేకపోలేదు. అదక్కడ పక్కన పెడితే అసలు జెనెర్ అనే విభజన ఏ ప్రాతిపదికన జరగాలనే విషయంలోనూ భేధాపిప్రాయాలు వున్నాయి. అందులో కొన్ని:

1. ప్రాధమిక విభజన: చలన చిత్రాలను ఫిక్షన్ – నాన్ ఫిక్షన్ (లేదా డాకుమెంటరీ): కాల్పనిక – కాల్పనికేతర అని విభజిస్తారు. పుస్తకాల(సాహిత్యం) విషయంలోనూ సరిగ్గా ఇదే విధంగా వున్నదన్న సంగతి అందరికీ తెలిసిందే.

2. కథ జరిగే ప్రదేశం ఆధారితంగా జరిగే విభజన:

2.1. ఫాంటసీ: ఇది పూర్తిగా వూహాజనితం. మన తెలుగు సినిమాలలో జానపద చిత్రాలు, సో కాల్డ్ విఠలాచార్య చిత్రాలు చాలావరకు ఇదేకోవకి వస్తాయి (లేదా జానపదం అనే జెనర్‌గ కూడా అనుకోవచ్చు). ఇంగ్లీషులో ఇలాంటి చిత్రాలకి చాలా ప్రాధాన్యం వుంది. Harry Potter చిత్రాలు Lord of Rings వంటివన్న మాట. వీటిలో ఇంకొక రకం సోషియో ఫాంటసీ – యమ పేరుతో మొదలయ్యే చాలా చిత్రాలు, జగదేక వీరుడు- అతిలోక సుందరి ఇలాంటివి.

2.2 చారిత్రాత్మకం: ఇందులో చరిత్రకి సంబంధించిన కథలు, వ్యక్తుల జీవితాలు, కొంత వూహ జోడించిన చరిత్రాత్మక కథలు ఇలాంటివి వుంటయి. గాంధీ, అల్లూరి సీతారామరాజు, పల్నాటి యుద్ధం ఇలాంటివన్న మాట. ఇలాంటి సినిమాలు హాలీవుడ్‌లోనే కాక భారతీయ చిత్రాలలో కూడా అనేకం వున్నాయి. చాలా వరకు విజయం సాధించాయి కూడా.

2.3 టైం మెషిన్ సినిమాలు: పేరు చెప్పగానే అర్థమైంది కదా – కొన్ని దశాబ్దాలు/శతాబ్దాలు తరువాత ప్రపంచం ఎలావుంటుందో వూహించి తీసే సినిమాలు. ఇది చెప్పగానే ఆదిత్య 369 లో రెండొవ సగం గుర్తుకు వస్తుంది. మొన్నామధ్య వచ్చిన లవ్ స్టోరీ 2050 అనే హిందీ సినిమా మరో వుదాహరణ. ఇలాంటి చిత్రానికి నిర్మాణ వ్యయం సాధారణంగా ఎక్కువ వుండటం వల్లేమో భారతీయ భాషల్లో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. హాలీవుడ్‌లో Matrix, Star Trek ఇలాంటివి చాలానే వచ్చాయి. ఇదే విషయంతో వచ్చిన Demolition Man, The Eraser లాంటి సినిమాలు చాలా తెలివైన కథలుగా కనిపిస్తాయి నాకు. భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త రకం టెక్నాలజీలు, వింత వాహనాలు వంటి ఆకర్షణలు లేకుండా కథ నడపటమే అందుకు కారణం.

2.4 యుద్ధం సినిమాలు: Saving the Private Rayn, At the Enemy’s Gate ఇలాంటివి. కథ ఎక్కువ భాగం యుద్ధంలో వుంటుంది. తెలుగులో ఒకటి రెండు వచ్చినా అవి యుద్ధం కథ కన్నా మిగిలిన కథకు ప్రాముఖ్యత వున్నవే ఎక్కువ. హిందీలో బోర్డర్, LOC లాంటి చిత్రాలు కొన్ని వచ్చాయి.

2.5 కౌబాయ్ చిత్రాలు: ఇవి పుట్టింది ఇంగ్లీషు చిత్రాలలో అయినా తెలుగు వాళ్ళు కూడా బాగానే ఆదరించారు. ఆంధ్రా కౌబాయ్ కృష్ణ సినిమాలు కొన్ని మీకు గుర్తుకు రావచ్చు. అలాగే కొదమసింహం, టక్కరి దొంగ చెప్పుకోతగ్గవి.

2.6 ప్రిజన్ (జైలు) సినిమా: ప్రధానంగా జైలు గోడల మధ్య ఈ సినిమా నడుస్తుంది. జైలులో గడిచే జీవితం/జైలులో నించి పారిపోయే ప్రయత్నం ప్రధాన ఇతివృత్తాలు. కాలాపాని, నిరీక్షణ వంటి చిత్రాలు తెలుగులో చెప్పుకో దగిన వుదాహరణలు. ఇంగ్లీషు చిత్రాలలో Escape from Alcatraz చెప్పుకోదగినది.

ఇవి కథ జరిగే ప్రదేశం పరిస్థితి ఆధారిత విభజన. ఇంకా గిరిజన చిత్రం, అడవి చిత్రమని చాలా చెప్పొచ్చు. కానీ అవి మీ వూహకే వదిలేస్తూ మరో రకం విభజన గురించి చెప్తాను. ఇది ఎంచుకున్న ఇతివృత్తం మీద ఆధార పడ్డది.

3. ఇతివృత్తం మీద ఆధారపడి విభజన:

3.1 ఆర్ట్ ఫిలిం: దీన్నే కొంతమంది అవార్డ్ సినిమా అని కూడా అంటారు. ఈ పేరు చెప్పగానే సత్యజిత్ రే లాంటి దర్శకులు గుర్తుకు వస్తే ఇంక నేను వివరించాల్సిన పని లేదు. సాధారణంగా జడ్జిమెంటల్‌గా వుండని కథలు(non judgemental), పాత్రల అంతః సంఘర్షణలు ఇలాంటివాటికి ప్రాధాన్యత వుంటుంది. పాథిరే పాంచాలి నుంచి మన నిమజ్జనం దాక చాలా వుదాహరణలు చెప్పచ్చు.

3.2 క్రైం/అండర్ వర్ల్డ్ కథలు: ఇందులో ప్రధాన తారాగణం తుపాకులు, బుల్లెట్లు, బాంబులు (ఫాక్షన్ బాంబులుంటే అదింకొక సబ్‌జనెర్). ఇలాగన్న మాట. రాంగోపాల్ వర్మ సత్య, కంపెనీ ఇలాంటివి, తెలుగులో కొంతవరకు ఫాక్షన్ సినిమాలు ఈ వర్గంలోకి వస్తాయి.

3.3 యాక్షన్ చిత్రాలు: ఫైట్లు, స్టంట్లు, చేజింగులు.. ఇలా సాగుతాయి ఈ కథలు. ఇంగ్లీషులో బెన్-హుర్ నుంచి బాండ్ సినిమలు, బ్రూస్‌లీ సినిమాలు, స్పీడ్(1994) ఇలాంటివన్న మాట. తెలుగులో కూడా పోలీసు హీరోలని పెట్టి ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. (ఇలాంటి సినిమా కనిపెట్టాలంటే ఒక చిన్న క్లూ: ఇందులో హీరోయిన్ పాటలు పాడటానికి, విలన్ ఎత్తుకెళ్ళడానికి తప్ప ఇంకెందుకూ పనికిరాదు. అది హీరోయిన్ వోరియంటెడ్ చిత్రమైతే హీరోకి అదే వర్తిస్తుంది).

3.4 అడ్వంచర్ చిత్రాలు: వెర్టికల్ లిమిట్, క్లిఫ్ హాంగర్ ఇలాంటి సినిమాలు. మన భారతీయ భాషల్లో ఇలాంటి సినిమాలు తక్కువనే చెప్పాలి. ఎప్పుడైనా కౌబాయ్ చిత్రాలలో, యాక్షన్ చిత్రాలలో అడ్వెంచర్స్ (స్టంట్‌మేన్ చేసినవి)కనిపిస్తాయి. కొంతవరకు నిధి వేట లో అడవిలో తిరిగే సినిమాలు ఇదే వర్గంలోకి వస్తాయి.

3.5 కామెడీ చిత్రాలు: సినిమా మొత్తం మీమ్మల్ని నవ్వించాలని ప్రయత్నిస్తే అదే కామెడీ చిత్రం. చాప్లిన్ నుంచి జిం కారీ దాకా, రాజేంద్ర ప్రసాద్ నించి అల్లరి నరేష్ దాకా ఇలాంటి సినిమాలు లెక్కకు మిక్కిలి.

3.6 డ్రామా: ఇది బహుశా సినిమాలలో అధ్యధిక శాతం వుండే జెనెర్ అనుకుంటాను – కనీసం తెలుగు సినిమాలలో. మెలో డ్రామాగా, సెంటిమెంటల్ సినిమాగా ఇంక ఎన్నో వుప వర్గాలున్నా ప్రధానంగా ఇది కారెక్టరైజేషన్‌తో, మంచి సంభాషణలతో నిజ జీవితానికి దగ్గరగా లేదా నిజ జీవితం లోనించి కొంచెం అతిశయోక్తులతో తయారవుతాయి. సినిమా చూశాక మనసు భారంగా అయిపోయింది, కళ్ళలో నీళ్ళు తిరిగాయి.. ఇలాంటి వన్నీ ఈ డ్రామా చిత్రాలను కనిపెట్టే అభిప్రాయాలు. ఇలాంటి సినిమాల లిస్ట్ తయారు చేస్తే అది ఒక కొండవీటి చాంతాడు అవుతుంది. టైటానిక్ ఒక మంచి వుదాహరణ.

3.7 హర్రర్ చిత్రాలు: కేవ్‌వ్‌వ్‌వ్… ఇలాంటి కేక సినిమా హాల్లోనించి వస్తే అదే హర్రర్ చిత్రం. ఇందులో ఎక్కువ శాతం భూతాలు, పిశాచాలు వున్నా అక్కడక్కడ సైకో ఎనలటిక్ సినిమాలు కూడా తగులుతుంటాయి. రాంగోపాల్ వర్మ (ఇందాక చెప్పిన అండర్ వరల్డ్ సినిమాలు పోగా మిగిలిన) సినిమాలు, ఎగ్జాగరిస్ట్, ఈవిల్ డెడ్ లాంటి ఇంగ్లీషు సినిమాలు వుదాహరణ.

ఈ వర్గం మీద ఆధారపడ్డ విభజన కూడా ఇక్కడ ఆపుతున్నాను. ఇంకా ఇందులో మిస్టరీ సినిమాలు (అన్వేషణ), థ్రిల్లర్ సినిమాలు (ఎ ఫిలిం బై అరవింద్), మ్యూజికల్ సినిమాలు (శంకరాభరణం), స్పోర్ట్స్ సినిమాలు (సై)ఇలా చాలా వ్రాసుకుంటూ పోవచ్చు. ఇలా కాకుండా తీసే ఫార్మేట్ ఆధారంగా మరొక విభజన చెయ్యొచ్చు. Live action, Animation, Children’s film, Classic film, Cult film, Serial film, Adult film, Silent filmవగైరా. ఇప్పటికి సినిమాల విభజన గురించి తెలిసింది కాబట్టి మీ వూహా శక్తికి పదును పెట్టి ఇంకా ఎన్నో రకాల విభజనలు చెయ్యొచ్చు.

ఇక ఈ జెనెర్‌లలో సబ్ జెనెర్లు మిక్సిడ్ జెనెర్లు కూడా వున్నాయి. కామెడీ అనే ఒక్క జెనెర్ తీసుకుంటే అందులో స్లాప్ స్టిక్ కామెడీ (చాప్లిన్), స్పూఫ్ లేదా పేరడీ, స్క్రూ బాల్ కామెడీ, బ్లాక్ కామెడీ, సిచ్యుయేషనల్ కామెడీ ఇలాగా చాలా వుప వర్గాలున్నాయి. అలాగే మిక్స్‌డ్ జెనెర్లలో – కామెడీ థ్రిల్లర్ (ముత్యమంత ముద్దు), యాక్షన్ కామెడీ (జాకీ చాన్)ఇలాంటివీ వున్నాయి. ఇప్పుడు మనం చర్చ తెలుగు సినిమాల మీద కేంద్రీకరిద్దాం.

మన సినిమాలలో జెనెర్లు – మూసలు

తెలుగు సినిమాలలో ఎక్కడో తప్ప టచ్ చెయ్యని జెనెర్లు చాలా వున్నాయని నాకనిపిస్తుంది. వుదాహరణకి స్పోర్ట్స్ – హిందీలో లగాన్, చక్‌దే ఇండియా, గోల్, తెలుగులో సై, కామెడీ మిక్స్‌తో కబడ్డీ కబడ్డీ ఇలాంటివి మినహాయిస్తే ఇలాంటి సినిమాలు అరుదుగా కనిపిస్తాయి. హాలీవుడ్‌లో ఇలాంటి చిత్రాలు చాలా వస్తుంటాయి (ముఖ్యంగా బేస్‌బాల్, ఫుట్‌బాల్). అలాగే మ్యూజికల్స్ – ఇంగ్లీషులో ఇలాంటి సినిమాలు చాలా వస్తుంటాయి. తెలుగులో మనదైన శైలిలో కె. విశ్వనాధ్ తీసిన చిత్రాలు, మరి కొన్ని మినహాయిస్తే ఇలాంటి సినిమాలు తక్కువనే చెప్పాలి. యానిమేషన్ సంగతి సరే సరి. ఎంతసేపూ కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్.. ఇది దాటి ఆలోచించడానికి మన నిర్మాతలకి దర్శకులకి భయం. ఇది మన సినిమాలలో మొదటి మూస.

రెండొవ మూస: అసలు చాలా వరకు తెలుగు సినిమాలు ఒక జనెర్‌కింద జమకట్టటం కుదరదు. ఇంగ్లీషు సినిమాలలాగా ఒకే జనెర్ మీద ఆధారపడి సినిమాలు చాలా తక్కువ వుంటాయి. ఏ సగటు సినిమా అయినా కొంచెం సెంటిమెంటు, మరి కొంచెం కామెడీ, క్లైమాక్స్‌కి కొంచెం ముందు యాక్షన్ వుంటే హిట్టే అని ఫార్ములాలలో ఇర్రుక్కుపోతుంటాయి. లేదా సినిమా ఫస్టాఫ్ అంతా కాలేజీలో స్లాప్ స్టిక్/సిచువేషల్ కామెడీ ఇంటర్వెల్ దగ్గర ట్విస్టు ఆ తరువాత మెలో డ్రామా. ఇది ఇంకొక ఫార్ములా. ఇలా కలిపి కొట్టటం తప్పేమి కాదు. ఈ వ్యాసం మొదటి భాగం మొదట్ళో చెప్పినట్టు – “జెనెర్ అనేది సినిమాకి వర్తించదు” అనే వాదించే విమర్శకుల పాయింటు ఇదే. సినిమా (ప్రత్యేకించి తెలుగు సినిమా) ప్రజల జీవితంలో ఒక భాగం. ఆ జీవితంలో లాగానే అన్ని రకాల అనుభవాలు సినిమాలో వుండాలని అనుకోవడం తప్పేమి కాదు. కాకుంటే ఎప్పూడూ ఒకే జెనెర్ కాంబినేషన్‌లో సినిమాలు తీస్తారు మనవాళ్ళు. గ్యారంటీ ఫార్ములా అనో, హీరోగారి ఇమేజ్ అనో, రిస్కెందుకులే అనో అక్కడే ఆగిపోతారు. గమ్యం, అనసూయ, అరుంధతి లాంటి కొత్త జెనెర్ కాంబినేషన్లో సినిమాలు ఇప్పుడిప్పుడే వూపందుకుంటున్నాయి. అలా మూ స దాటి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం నిజంగా ఒక శుభ పరిణామం..

మూడొవ మూస: ఇది దర్శకుడు లేదా నటీనటులకి సంబంధిచినది. వుదాహరణకి యస్వీ కృష్ణారెడ్డి అనగానే మీకు ఎలాంటి సినిమాలు గుర్తొస్తాయి? – చిన్న పిల్లలకు నచ్చే కామెడీ (ఎక్కువగా స్లాప్ స్టిక్), లేదా సెంటిమెంట్. కే విశ్వనాధ్ – సంగీతం + సాంప్రదాయం. రాజేంద్ర ప్రసాద్ – కామెడీ. ఇలా ఫలానా దర్శకుడంటే లేదా హీరో అంటే  సినిమా ఫలానా రకంగా వుంటుంది అని ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. అలా వుండటం తప్పేమీ కాదు – హాలీవుడ్ లో కూడా ఇలాంటి దర్శకులు హీరోలూ వున్నారు, హిచ్‌కాక్, జింక్యారి లాగా. కానీ హాలీవుడ్ నటీనటులు చాలా అరుదుగా ఇలాంటి చట్రాలలో ఇరుక్కుంటారు. మన దగ్గర మరీ బాధ కలిగించే విషయమేమిటంటే దర్శకుడు, నటీ నటులే కాక ఇతర టెక్నీషియన్లు ఆఖరికి నిర్మాతలు కూడా ఇలా జెనెర్ మూసల్లో పడిపోతుంటారు. (దిల్ రాజు – యూత్ సినిమా, శ్యాం ప్రసాద్ రెడ్డి – గ్రాఫిక్స్ సినిమా ఇలాగ). ఇలా మూసలో పడిపోతే ఇక వైవిధ్యంగా ఆలోచించే అవసరం, అవకాశం లేకుండా పోతుంది. ఫలితం – తిప్పి తిప్పి అదే కథలు సినిమాలుగా రావటం, కధలు కరువొచ్చేసిందో అంటూ రీమేక్ రైట్లకోసం పరిగెట్టడం.

అయితే ఇదే జనెర్‌లను ఆధారం చేసుకొని కొత్త కథలు తయారు చేసే అవకాశం లేకపోలేదు. ఇందాక చెప్పినట్లు తెలుగు సినిమాలో ఇంతవరకూ వుపయోగించని జెనర్లు (ముఖ్యంగ జెనర్ కాంబినేషన్లు) చాలా వున్నాయి. చారిత్రక కథలో స్లాప్ స్టిక్ కామెడీ చెయ్యడానికి అవకాశం వుందా? (తమిళం నుంచి తెలుగుకు వచ్చిన 23వ రాజు పులకేశి గుర్తుందా?) లేకపోతే చారిత్రాత్మక కథలో మెలో డ్రామా అవకాశం వుందా? ఇలా కొత్త రకం జెనెర్ కాంబినేషన్ల గురించి ప్రస్తుతం ఏ రచయితా/దర్శకుడూ ఆలోచించట్లేదు. అసలు ఇలాంటి కొత్త ఆలోచనలు చెయ్యగలిగితే కొత్త కథ అవసరం కూడా రాదు. పాత కథలనే కొత్తగా చెప్పచ్చు. గతంలో థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా కథనే మెలోడ్రామాగా మార్చి వ్రాయచ్చు. అప్పుడు కొత్త కథలకోసం వెతుక్కోవాల్సిన అవసరమే వుండందు. నిజానికి మనకి ఇప్పుడు కావాల్సినది కొత్త కథలు కాదు – మూసలలోనించి బయటపడటానికి సిద్ధంగా వున్న టెక్నిషియన్స్, కొత్తగా ఆలోచించగలిగిన రచయితలు..!!

8 Comments
  1. Ramu September 14, 2009 /
  2. rayraj September 14, 2009 /
  3. రమణ మూర్తి September 14, 2009 /
      • ధోండి September 15, 2009 /
      • గీతాచార్య September 21, 2009 /
  4. అబ్రకదబ్ర September 17, 2009 /