Menu

గడుగ్గేయకారుడు: వేటూరి-రెండవ భాగం

వేటూరి మానవ జీవితంలోని అన్ని అనుబంధాలలోని అన్ని కోణాలను తనదైన కవి హృదయంతో దర్శించారు. దాంపత్య జీవితంలోని అనురాగాన్ని కంటి తడిలో చూపించి… భార్యాభర్తలే సిరులన్నింటినీ మించిన చిరునవ్వులనీ అత్యంత హృద్యంగా చెప్పారు. (మా ఇంటిలోన మహలక్ష్మి నీవే.)

వేటూరి కలం – సరస సరాగాల సుమవాణిని -శిలలతో సైతం వినిపించేలా చేసింది. పదం-పాదం కలిసిన నర్తనలో పరుగు గౌతమినే- పరవళ్లు తొక్కించింది. (నిన్నటి దాకా శిలనైన.)

వేటూరి ఎంతో హృద్యమైన పాటలను సైతం రాశారు. మాటలనే పాటలుగా లయాత్మక విన్యాసాలుగా సున్నితంగా మలచిన ఘనత ఆయనది. చల్లగాలి, సన్నజాజుల నేపథ్యంతో చిన్న మాటని అత్యంత మనోరంజకంగా చెక్కిన పదశిల్పి వేటూరి. (చిన్నమాట… ఒక చిన్నమాట)

వేటూరి కలం నుంచి జాలువారిన కవిత్వం… అజరామరం. పాటల రాతలోనే కాదు…. వచన రచనలోనూ మేటి అనిపించుకోవడం… ఆయనకు ‘పెన్నుతో పెట్టిన విద్య’. ఆయన ప్రతి పాటా… మెరుపుగా, ఉరుముగా నినదించింది. మారుతున్న కాలంతో పాటే పాట స్టైల్‌నూ మార్చి… యువత మనసు కొల్లగొట్టడంలో ఆయన నిత్య యవ్వనుడే!

వాక్యం పురుష లక్షణమైతే లయతాత్మకమైన వాక్యం అంటే పాట.. స్ర్తీ అంశ. పాటలోని ఆ లాలిత్యాన్ని లెక్కకు మిక్కిలి పాటలలో జీవింపచేసిన పదబ్రహ్మ- వేటూరి.

పడచుదనపు లోగిలిలోకి వచ్చిన అమ్మాయి మనోవాంఛలని సిరిమల్లెపూవు చిన్నారి చిలకమ్మ సాక్షిగా రాసిన వేటూరి… ఎదురుచూపులోని మధురబాధని అద్భుతంగా చెప్పారు. (సిరిమల్లెపువ్వా, చిన్నారి చిలకమ్మ)

యువ హృదయాలలోని సంఘర్షణని, తడబాటుని, తత్తరపాటుని చిత్రిక పట్టడంలో వేటూరిని మించిన రచయిత లేరేమోననిపిస్తుంది. మనసా త్రుళ్లి పడకే, అతిగా ఆశపడకే అని హెచ్చరికలు చేసిన ఆ కవే… తొలిసారి చూపు తర్వాత అమ్మాయి మదిలో మెదిలిన కలల గురించి… నిదుర రాని కనుపాపలకు జోలపాడలేని నిస్సహాయత గురించి చెప్పిన తీరు హ్యాట్సాఫ్‌. (తొలిసారి మిమ్మల్ని )

వేటూరి కేవలం గీతకారుడు మాత్రమే కాదు… మంచి రచయిత కూడా. ఆయన ‘సిరికాకొలను చిన్నది’ అనే సంగీత నాటకాన్ని కూడా రాశారు. శ్రీకాకుళం నేపథ్యంగా శ్రీకృష్ణదేవరాయుల కాలం నాటి కథతో రాసిన ఈ నాటికలో భక్తి పారవశ్యతను వర్ణించిన తీరు గొప్పగా ఉంటుంది.

ఇదే కాకుండా సినిమా సంగీతం-సంగీతకారులపై తన మనోభావాలను ఆయన “కొమ్మ కొమ్మకో సన్నాయి” అనే వచన రచనలో అద్భుతంగా రాశారు. పాటలతోనే కాకుండా వచనంలో కూడా ప్రాస క్రీడలాడడం తనకు “పెన్నుతో పెట్టిన విద్య” అని నిరూపించారు వేటూరి. ఇక గోరింటాకులోని ఆయన రాసిన పాట పల్లవినే ఈ పుస్తకానికి శీర్షికగా పెట్టడం విశేషం.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న వేటూరి 10వేల పైగా పాటలు రాశారు.

పంతులమ్మ, కాంచన గంగ, చంటి, రాజేశ్వరి కల్యాణం, సుందరాకాండ సినిమాల్లో రచించిన పాటలకు నంది అవార్డులు గెల్చుకున్నారు. ఇక శంకరాభరణం లోని అన్ని పాటలకు రచన చేసి శాస్త్రీయ సంగీత ధర్మంలోని పాటల రచనలో మేటి అని నిరూపించుకున్నారాయన. (శంకరా నాదశరీరాపరా)

వేటూరి ఎన్నో తాత్విక పరమైన పాటలను కూడా రాశారు. స్రవంతి సినిమాలోని “నవ్వుతూ వెళ్లిపో నువ్వుగా మిగిలిపో” పాట పాజిటివ్ థింకింగ్‌ ఆటిట్యూడ్స్‌ని చూపిస్తే… మాతృదేవోభవ సినిమాలోని “రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే” పాటలో జీవన తాత్వికత- వైరాగ్యంగా వ్యక్తమవుతుంది. ఇదే సినిమాలోని వేణువై వచ్చాను భువనానికి పాట జాతీయ స్థాయిలో ఉత్తమ గీతంగా అవార్డును సాధించింది. తెలుగు పాటకు కీర్తిని తెచ్చింది. వేణువై వచ్చాను అనే పేరుతోనే వేటూరి తన ఆత్మకథను రాయాలని సంకల్పించడం… ఆ పాటపై ఆయనకున్న ప్రేమకు తార్కాణమే.

సిరిసిరిమువ్వ సినిమాకు జంథ్యాలతో కలిసి- వేటూరి మాటలు రాయడం విశేషం. అలాగే దేశమంతా గర్వించే దర్శకుడు మణిరత్నం తీసిన గీతాంజలి సినిమాకు అన్ని పాటలను రాసి అరుదైన ఘనతను సాధించారు. రాలేటి పూలతో రాగాలను పలికించారు.(ఆమనీ పాడవే… హాయిగా )

తెలుగు సినిమా పాటను అశ్లీలం చేశారని, వల్గారిటీని చొప్పించిన సంస్కృతికి శ్రీకారం చుట్టారని వేటూరిపై విమర్శలు ఉన్నాయి. అయితే అంతకు మిక్కిలి హృదయసంగమమైన పాటల్ని … భక్తి-ఆధ్యాత్మికంగా సైతం రాశారాయన. భక్తకన్నప్పలో శివశివ శంకర అనే పాట అందుకు ఉదాహరణ.సంగీత-నృత్య-సాహిత్యాల సమన్వయంతో కైలాసాన కార్తీకాన శివరూపాన్ని శివుని నయనత్రయ లాస్యాన్ని… సాగరసంగమంలో నాదవినోదంతో పరుగులెత్తించారు. నటరాజు కీర్తనలో ఓం నమశ్శివాయను మహాద్భుతంగా ఉరకలెత్తించారు. (నాద వినోదం నాట్యవిలాసం )

తెలుగు సినిమా ఒక అందమైన తోట లో ని పాటల చెట్టు కొమ్మకొమ్మకో సన్నాయిలను పూయించి… రాగాల పల్లకిలో ప్రేక్షకులను- ఊయలూగించిన పదాల మాంత్రికుడు… వేటూరి సుందరరామమూర్తి! తెలుగు పాటను పరవళ్లు తొక్కించి, ఉరకలెత్తించిన గీతర్షి ఆయన!

–మామిడి హరికృష్ణ

9 Comments
  1. vinay chakravarthi September 28, 2009 /
  2. Chari September 28, 2009 /
  3. నేస్తం October 1, 2009 /
  4. ravi s October 5, 2009 /
  5. yardstick October 26, 2009 /
  6. Niranjan Rao January 29, 2010 /