Menu

అద్భుత దృశ్యావిష్కారానికి ప్రతీక–ఝాంగ్ యిమో-2

ఈ వ్యాసం యొక్క మొదటి భాగం ఇక్కడ చదవండి.

0621_Zhang_Yimouఝాంగ్ యిమో తీసిన తర్వాత చిత్రం ది స్టోరీ ఆఫ్ క్విజు. ఈ సినిమా 1992 లో విడుదలయింది. ఈ చిత్రం యిమో గత చిత్రంతో పోలిస్తే వైవిధ్య భరైతమయింది. సున్నిత్మయిన హాస్యంతో కూడుకొని ముందుకు సాగుతుంది. నియోరియలిస్టిక్ ధోరణిలో సాగిన ఈ చిత్రంలో  గాంగ్ లీకి తోడు కొత్త వాళ్ళు ప్రధాన భూమిక పోషించారు. ఇది వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గోల్డన్ లయన్ అవార్డుని గెలుచుకుంది.

ఆ తర్వాత ఝాంగ్ తీసిన చిత్రం “టు లివ్””. యుహువా రచించిన నవల ఆధారంగా తీసిన ఈ చిత్రం ఝాంగ్ యిమో తీసిన అన్ని చిత్రాల్లోకి పెద్దది. నిడివి రీత్యానే కాదు సినిమా  కాన్వాస్ రీత్యా కూడా విశాలమయింది. 20 వ శతాబ్దం ప్రారంభ కాలం నుంచి మూడు తరాల చైనీయులు ఎదుర్కొన్న లేదా అనుభవించిన చరిత్రాత్మకతమయిన  వాస్తవికమయిన  అనుభవాల్ని ఈ చిత్రం మనకు కళ్ళముందు ఉంచుతుంది. 1994 Cannes చలనచిత్రోత్సవంలో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ ను గెలుచుకుంది.  అంతే కాదు చిత్రంలో ప్రధాన భూమికను పోషించిన నటుడు గెయు కి ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు.

ఒక ఎపిక్ లాగా సాగే ఈ సినిమా కథలో చైనా లో జరిగిన రాజకీయ, సామాజిక, పరిణామాలు మనకు గోచరిస్తాయి. 1940 లో ప్రారంభమయిన  కథ మూడు తరాల దాకా సాగి  ” జీవితం మరింత….మరింత మెరుగవుతుంది ”  అన్న మాటలతో అంతమవుతుంది. ధనవంతుడి కుమారుడయిన  పుగి జూదంలో సర్వం కోల్పోతాడు. షాక్ కు గురైన తండ్రి చనిపోతాడు. కూతురు ఫెంగ్జియాను  వెంటతీసుకుని గర్భవతి అయిన భార్య అతన్ని వీడిపోతుంది. ఆస్తి అంతా కోల్పోయి  దీనావస్థలో ఉన్న పుగీ వద్దకు భార్య,  కూతురు కొడుకుతో వచ్చి కలుస్తుంది. మిత్రుడు చున్ షెంగ్ తోడుగా పుగి  తోలు బొమ్మలు ఆడిస్తూ గడిపేస్తుంటాడు. అది చైనా సివిల్ వార్ కాలము. పుగి మరియు చున్ షెంగ్ ని బలవంతంగా కొమిటాంగ్ లో చేర్చుకుంటారు. తీవ్రమయిన యుద్ధం తర్వాత వీరిఇద్దరినీ  కమ్యూనిస్ట్ పార్టీ అరెస్ట్ చేస్తుంది. తాము  కళాకారులమని  చెప్పి తోలు బొమ్మలాటతో వారెఇని ఆకట్టుకుంటారు. ఫలితంగా మంచి సర్టిఫెకెట్ తో పుగి ఇల్లు చేరుతాడు. కూతురుకి తీవ్రమయిన జ్వరం వల్ల మాట పడిపోతుంది.

కమ్యూనిస్టు పార్టీ విజయం తర్వాత పుగీ ఆస్తిని కాజేసిన లాంగర్ని పార్టీ రియాక్షనరీగా గమనించి చంపేస్తుంది. కాలం గడుస్తుంది. ఊరు మొత్తం స్టీలు తయారీలో పడిపోయింది. జీపు ఆక్సిడెంటులో కొడుకు చనిపోతాడు. అది చేసింది పార్టీ జిల్లా నాయకుడు చున్ షెంగ్. అతన్ని పుగీ భార్య క్షమించదు. ఎప్పటికయినా  నాకో  ప్రాణాన్ని బాకీ ఉన్నావంటుంది.

కాలం గడుస్తుంది. సాంస్కృతిక విప్లవ కాలం. తోలు బొమ్మల్ని కాల్చేయమని అవి సంప్రదాయ సాంస్కృతిక విలువలున్నవని నగరాధ్యక్షుడు ఆదేశిస్తాడు.

కూతురు ఫెంగ్జియా ఎదుగుతుంది. కమ్యూనిస్టు కార్యకర్తతో  పెళ్ళి జరిపిస్తారు. మారిన పరిస్థుతులలో జిల్లా నాయకుడు చున్  షెంగ్ పుగీ ఇంటికి వస్తాడు.తన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకోమంటాడు. వారి కుమారుని చావుకి కారణం అయిన వాడీగా దు:ఖిస్తున్నానంటాడు. పుగీ అంగీకరించడు. చున్ షెంగ్ వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. ఫెంగ్జియా గర్భవతి అవుతుంది. డెలివరీ సమయంలో నర్సులే చికిత్స చేస్తారు. డాక్టర్లందరినీ అకడమిక్ రియాక్షనరీలుగా గుర్తించి కూలీకి పంపిస్తుంది ప్రభుత్వం. రక్త స్రావంతో ఫెంగ్జియా కొడుకుని కని మరణిస్తుంది. మరి కొంత కాలం గడుస్తుంది. ఫుగీ, ఆయన భార్య, అల్లుడు, మనవడు భోజనం చేస్తుండగా చిత్రం ముగుస్తుంది.  భవిష్యత్తు ఆశావహమయింది అన్న భావనతో ముగుస్తుందీ చిత్రం.

సుదీర్ఘమయిన కాలమూ, మూడూతరాలు, దేశంలో రాజకీయ పరిణామాలు అన్నీ ఈ చిత్రాన్ని ఎపిక్ గా మలిచాయి.

ఝాంగ్ యిమో తర్వాతి చిత్రం “షాంగై ట్రైడ్”. ఇది 1995 లో విడుదలైంది. 1930 ల్లో జరిగిన ఏడు రోజుల కాలగమనం ఈ చిత్ర ఇతివృత్తం. ఓ 14 ఏళ్ళ గ్రామీణ యువకుడి కోణం లోంచి అండర్ వరల్డ్ ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ తర్వాత 1997 లో “కీప్ కూల్” విడుదలైంది. గతంలో ఏడు చిత్రాల్లో హీరోయిన నటించిన గాంగ్ లీ షాంగై ట్రైడ్ సినిమా తర్వాత విడిపోగా యిమో కీప్ కూల్ లో కొత్త హీరోయిన ని పరిచయం చేశాడు.  ఆమె ఝాంగ్ జియి. ఈ సినిమాలో దర్శకుడి నియోరియలిస్టిక్ పోకడల్తో కొత్త వారిని నటులుగా తీసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన “నాట్ వన్ లెస్” వెనీస్ లో మరోసారి గోల్డన్ లయన్ ప్రైజ్ ని అందుకుంది. ఇక 2002 నాటి “హ్యాపీ టైమ్స్” ఆధునిక చైనా నగరాన్ని ఇతివృత్తంగా చేసుకున్న సినిమా.

ఇక మొత్తంగా ఝాంగ్ యిమో సినిమా నిర్మాణ శైలి మారి భిన్నంగా నిర్మించబడిన సినిమా “హీరో”. ఆసియాలో పెద్ద నటీనటులుగా పేరున్న జెట్ లో, మ్యాగీ చ్యూంగ్, టోనీ లింగ్ చువి, ఝాంగ్ జియి తదితరులు ఈ చిత్రంలో నటించారు. స్టేట్ ఆఫ్ క్వీన్ కు రాజయిన యింగ్ జింగ్ చుట్టూరా తిరిగే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందింది. విశ్వ వ్యాప్తంగా వ్యాపార విజయాన్ని చవిచూచిన ఈ సినిమా 2003 లో ఆస్కార్ నామినేషన్ పొందింది.

తర్వాత 2004 లో హౌజ్ ఆఫ్ ఫ్లయింగ్ డాగర్స్, 2005 లో రైడింగ్ ఎలోన్ ఫర్ థౌజండ్ మైల్స్, 2006 లో కర్స్ ఆఫ్ ది గోల్డన్ ఫ్లవర్ చిత్రాలు వచ్చాయి. గోల్డన్ ఫ్లవర్ లో తిరిగి గాంగ్ లీ ప్రధాన భూమికను పోషించింది.

అయితే ఝాంగ్ యిమో తొలినాళ్ళ సినిమాలకు ఇటీవల సినిమాలకు స్పష్టమయిన తేడా మనకు కనిపిస్తుంది. రెడ్ లాంటర్న్ లాంటి చిత్రాల్ని చైనా ప్రభుత్వం నిషేధించగా ఇటీవలి చిత్రాల్ని గొప్పగా అంగీకరించింది.

ఇంకా 2008 ఒలింపిక్ ఉత్సవ చిత్రీకరణల్లో ఝాంగ్ యిమో భాగం పంచుకోవడం కూడా వివాదాస్పదమైంది.

అయినప్పటికీ చిత్ర నిర్మాణ శైలిలో అద్భుతమైన ఒరవడిని కళాత్మకతని ఆవిష్కరించిన ఝాంగ్ యిమో చైనా పితృస్వామ్యాన్ని, విమోచన, అధునికతను కథాంశాలుగా తీసుకొని విలక్షణమైన సినిమాల్ని మనకందించాడు. ఆయన తెరపై చిత్రించిన మూవింగ్ ఇమేజెస్ వీక్షకుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతాయి.