Menu

అద్భుత దృశ్యావిష్కారానికి ప్రతీక–ఝాంగ్ యిమో-1

0621_Zhang_Yimouఝాంగ్ యిమో చైనా నుంచి ఎగిసి వచ్చిన ఓ గొప్ప దర్శకుడు. ఆయన చిత్రాల నిండా మానవ ఉద్వేగాలు, ప్రేమలూ, అభిమానాలు, హింసా ప్రతీకారాలు వెరసి మనుషుల జీవితాల్లోని అన్ని స్పందనా ప్రతిస్పందనల్ని మనం గమనించవచ్చు. ఆయన సినిమాల్లోని ప్రతి ఫ్రేమూ మౌలిక రంగుల సాంద్రత, అద్భుతమనిపించే లైటింగ్, విశాలంగా కనిపించే దృశ్యాలు మొత్తంగా సువిశాలమైన కాన్వాసులో గీసిన పెయింటింగ్స్ లా కనిపిస్తాయి. ముఖ్యంగా ఝాంగ్ యిమో తొలినాటి చిత్రాలు తాజాదనంతో చూపరుల్ని తన్మయుల్ని చేస్తాయి. యిమో ప్రాధమికంగా సినిమాటోగ్రాఫర్ కావడం వల్ల దృశ్యాల మధ్య లయని సాధించడంలో గొప్ప విజయాన్ని సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఝాంగ్ యిమో చిత్రాల్లో మనకి చైనాకు సంబంధించిన గతం, వర్తమానం, భవిష్యత్తులు గోచరిస్తాయి. చైనాకు చెందిన అయిదవ తరం దర్శకుల్లో యిమో ప్రధానమైన వ్యక్తి. ఆయన సినిమా నిర్మాణ శైలిలో విజువల్ డిస్ప్లే ప్రధానమయిన అంశం. అందులోనూ మహిళల్ని ప్రధాన భూమికలుగా చేయడం కూడా ఆయన ప్రత్యేకత.

1980 తర్వాత అంతర్జాతీయ సినిమాని చైనా తమ దేశంలోనికి అనుమతించిన నేపథ్యంలో బీజింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయిదవ తరం చలనచిత్రకారులు ఉద్భవించారు. ఫ్రెంచి సినిమాల ప్రభావంతో చైనాలో న్యూవేవ్ ప్రారంభమయింది. అట్లా ఆధునికతను సంతరించుకున్న చలన చిత్రాల్లో జాంగ్ యున్ (The one and eight) , చెన్ కైగి (yellow earth) లాంటి వాళ్లు ప్రధానమయినవారు.

1950 లో షాంగ్చీ ప్రాంతంలో జన్మించిన ఝాంగ్ కుటుంబం నేషనలిస్టు ఆర్మీతో సంబంధాలు ఉన్న కారణంగా అష్టకష్టాలు పడింది. 1966 లో చైనా సాంస్కృతిక విప్లవకాలంలో సెకండరీ స్కూలు విద్యను వదిలేసి ఓ చేనేత మిల్లులో కార్మికుడిగా చేరాడు. ఆ అతర్వాత ఫోటోగ్రాఫర్ గా ఎదిగాడు. 1974 లో సొంత కెమెరా కొనుకున్న ఝాంగ్ తీసిన ఫోటోలు స్థానిక పత్రికల్లో అచ్చయ్యేవి. 1979 లో బీజింగ్ ఫిల్మ్ అకాడమీ లో చేరాడు. మొదట రూల్స్ ప్రకారం ప్రవేశం దొరకని ఝాంగ్ ఆయన తీసిన ఫోటోలు చూసిన కల్చరల్ మినిస్టర్ చొరవ మేరకు అందులో చేరాడు. 1982 లో సినిమాటోగ్రఫీలో కోర్సు పూర్తి చేసి బయటకొచ్చాడు.

మొదట ఆయన నాలుగవ తరానికి చెందిన దర్శకుడు వూటిన్ యాన్ మింగ్ వద్ద చేరాడు. ఆయన తీసిన “ఓల్డ్ వెల్ ” చిత్రానికి కెమెరావర్క్ చేయడంతో పాటు ఓ పాత్రను కూడా పోషించాడు. ఆ తర్వాత అయిదవ తరానికి చెందిన చెన్ కై గి, ఝాంగ్ జున్ హోవో ల చిత్రాలకు కలిసి పనిచేశారు.
1987 లో ఝాంగ్ తీసిన ’”రెడ్ సోరగమ్” , “జూడో(1990)”, “రైజ్ ది రెడ్ ల్యాంట్రిన్(1991)” సినిమాలు ఆయన ట్రైలజీ గా మన్ననలు అందుకున్నాయి.

“రెడ్ సోరగమ్” లో దృశ్యమానమయిన ఆయన కథనం అంతర్జాతీయ ప్రశంసల్ని అందుకుంది. 1988 లో బెర్లిన్ లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో గోల్డెన్ బేర్ అవార్డును గెలుచుకుంది. 1930 ల నాటి ఉత్తర చైనా ప్రాంత ప్రజలకు చెందిన కథాంశమిది. ఆనాటి ప్రజలు తమ నేల కోసం తమ సోదరుల త్యాగాలకు ప్రతీకారంగా తమను అర్పించుకోవడం హృదయాల్ని కదిలిస్తుంది. చిత్రంలో ప్రజల ఆవేశం తెగువ చకితుల్ని చేస్తుంది. సినిమా ప్రారంభం నుంచి చివరిదాకా ఓ అద్భుత గేయంలా సాగిపోతుంది. సినిమా చివరకి వచ్చేసరికి ఓ ఉద్విగ్నతకు లోనవుతాం. రెండు హృదయాల మధ్య రెండు జీవితాల మధ్య ప్రేమ, తమ నేల కోసం, తమ వారి కోసం, సామాజిక ప్రేమగా పరిణితి చెందడం ఈ చిత్రంలో చూస్తాం. సినిమాలో విషయపరమైన ఉద్వేగమంతో పాటూ సాంకేతికపరమైన పరిణితి స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా చివరిదాకా ఉండే కథనాత్మక బిగువు మన కళ్ళని, మనసుని కట్టిపడేస్తుంది.

“రెడ్ సోరగమ్” కొంతవరకు దర్శకుడి ఆత్మకథే. అందుకే ఆయన సినిమాని తన నానమ్మ కథ అంటూ మొదలుపెడతాడు. మనవడు కనిపించకుండా కేవలం కథ చెబుతుంటాడు. మొదట నానమ్మ పెళ్ళవగానే పల్లకీలో అత్తవారింటికి బయలు దేరుతుంది. ఆ నాటి ఆచారం ప్రకారం ఆమె తండ్రి డబ్బు తీసుకుని ఆమెను 50 ఏళ్ళ లోఫర్ కిచ్చి పెళ్ళి చేస్తాడు. ఆమె భర్త సారా తయీరీ చేస్తుంటాడు. సెడాన్ (పల్లకి) లో అత్తవారింటికి వెళ్ళేదారిలో బందిపోట్లు అటకాయించి దోచుకునే ప్రయత్నం చేస్తారు. పల్లకీ మోసే బోయీలు దొంగలను ఎదిరించి పోట్లాడుతారు. బందిపోట్లు పారిపోతారు. భర్త సేవకుల్లో ఒకడు పెళ్ళి కూతుర్ని స్పర్శిస్తాడు. అక్కడ వారిద్దరిలో ప్రేమ అమ్కురిస్తుంది. పల్లకీ బయలుదేరి ఊరు చేరుతుంది. అక్కడ మూడు రోజులున్న తర్వాత పెళ్ళి కూతురు తండ్రి వద్దకు తిరిగి వస్తుంది. మళ్ళీ అత్తవారింటికి వెళ్ళడానికి నిరాకరించిన ఆమెను తిట్టి పంపిస్తారు.. కోపంతో బయలుదేరిన ఆమెను దోవలో భర్త సేవకుడు ఎత్తుకెళ్ళి అనుభవిస్తాడు. ఊరు చేరేటప్పటికి ఆమె భర్తని ఎవరో చంపేసి ఉంటారు. ఆమె సేవకలుందరినీ కూడగట్టుకుని సారా తయారుచేయడం ఆరంభిస్తుంది. సేవకుడు ఆమెను తన భార్యగా ప్రకటించి అందరినీ ఒప్పిస్తాడు. దాంతో అతను బాస్ అయిపోతాడు. కొంత కాలం గడిచిన తర్వాత వారికొక కొడుకు పుడతాడు. ఇంతలో చైనా పై జపనీయుల ఆక్రమణ మొదలవుతుంది. అందులో భాగంగానే వీరి ఊరుపైనా దాడి చేసి అందరినీ బంధిస్తారు, బానిసలుగా మార్చి సేవలు చేయించుకుంటారు. చర్మం ఊడ బెరకడం లాంటి అఘాయిత్యాలు చేస్తారు. ఆమె ఓ రోజు రాత్రి తన వాళ్ళందరినీ సవాలు చేస్తుంది. మీరంతా మగవాళ్ళయితే జపాన్ ట్రక్కుని పేల్చేసి ప్రతీకారం చేయమంటుంది. అంతా మర్నాడు ట్రక్కుని పేల్చేసి తామూ మరణిస్తారు. కాల్పుల్లో ఆమె కూడా చనిపోతుంది. చివరకు ఆమె భర్త, కొడుకు మిగులుతారు. “అమ్మా వెళ్ళపో .స్వర్గానికి వెళ్ళిపో. ముందుకాలం మనదే! “అంటూ ఆమె కొడుకు పాట పాడుతూ ఉండగా ఎర్రటి సూర్యుడు ప్రతీకగా చిత్రం ముగుస్తుంది. అద్భుతమనిపించే కథనం, చైనా గ్రామీణ ప్రాంత సౌదంర్యాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ఈ సినిమాలో గాంగ్ లీ ప్రధాన పాత్ర పోషించింది. ఆమెను చలనచిత్ర రంగానికి పరిచయం చేసింద్ ఝాంగ్ యిమోనే. ఆ అతర్వాత కూడా అనేక చిత్రాల్లో ఆమెనే ప్రధాన పాత్రలు పోషించింది.

ఝాంగ్ ట్రైలజీ లో రెండవ చిత్రం జుడో. ఇది ఓ చారిత్రాత్మకమైన కథను తీసుకుని నిర్మింపబడింది. ఇందులో గాంగ్ లీ ప్రధాన స్త్రీ భూమిక ను పోషించగా లిబాషియన్ పురుష పాత్రలో నటించాడు. తన మొదటి సినిమాలాగే ఈ చిత్రం కూడా విమర్శకులనుంచి ప్రశంసల్ని అందుకుంది. అంతేకాదు చైనా నుంచి అస్కార నామినేట్ అయిన మొదటి చిత్రంగా చరిత్రకెక్కింది.

ఆ తర్వాత వచ్చింది ట్రైలజీ లో మూడవది ఝాంగ్ నిర్మించిన మాగ్మమ్ ఓపస్ “రైజ్ ది రెడ్ లాంటర్న్” . సుప్రసిద్ధ రచయిత సుటాంగ్ రచించిన నవల “వైవ్స్ అండ్ కాంకుబైన్స్” ఈ చిత్ర మూల కథ. 1920 ప్రాంతాల్లో చైనాలోని ఓ ధనవంతుడయిన వ్యక్తి భవన సముదాయంలో జరిగే వాస్తవాలు, సంఘర్షణలను ఈ చిత్రంలో ఆవిష్కరించారు ఝాంగ్. ఈ చిత్రంలో కూడా ప్రధాన పాత్రని ఆమె అత్యంత ప్రతిభావంతంగా పోషించింది. ఈ చిత్ర నిర్మాణ శైలి ఝాంగ్ యిమో సిగ్నేచర్ లా కనిపిస్తుంది.

చైనా సివిల్ వార్ కి ముందు కాలం నాటి కథ ఇది. 19 ఏళ్ల సాంగ్లియాన్ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తన యూనివర్శిటీ చదువును అర్థంతరంగా వదిలేసి ధనవంతుడయిన చెన్ కి నాలుగవ భార్యగా ఇంకా చెప్పాలంటే ఉంపుడుగత్తెగా మారుతుంది. విశాలమయిన భవంతుల సముదాయంలో ఆమెను నాలుగవ భార్య గా పిలుస్తారు. మొదటి రోజుల్లో ఆమెకు రాజ భోగాలు చూపిస్తారు. పాదాల మర్ధనం, ఎర్ర లాంతర్లు, భర్త ఆమెతోటే అధికంగా గడపడం, ఇలా కాలం గొప్పగా నడుస్తుంది.

వాజమాన్ చెన్ తన ఇష్టానుసారంగా రోజుకో ఉంపుడుగత్తెతో గడుపుతాడు. సాయంత్రం ఎవరి గడపముందు ఎర్ర లాంతరు వెలుగుతుందో ఆ రాత్రి భర్త ఆమెతో గడపడం అక్కడి ఆచారం. చెన్ మొదటి భార్య వయస్సు మళ్ళింది. అమెకు పెద్ద కొడుకుంటాడు. రెండవ భార్య ఝా యో సాంగ్లియాస్ తో స్నేహంగా ఉంటుంది. మూడవ భార్య మేషన్ ఓ మాజీ ఒపేరా సింగర్. ఈ ముగ్గురిలో రెండవ భార్య నమ్మదగింది కాదని సాంగ్లియాన్ తెలుసుకుంటుంది.

భర్త తన వద్దే అధికంగా ఉండాలని భావించిన సాంగ్లియాన్ తనకు రాని గర్భం వచ్చిందని చెబుతుంది. భర్త ఉత్సవాలు చేస్తాడు. కానీ గర్భం బూటకమని పనిమనిషి ద్వారా బయటపడుతుంది. భర్త సాంగ్లియాన్ కు చెందిన అన్ని లాంతర్లని కప్పేయాలని ఆదేశిస్తాడు. పనిమనిషిపై కోపంతో ఆమె లోటుపాట్లని సాంగ్లియాన్ బయటపెడుతుంది. భర్త పనిమనిషిని శిక్షిస్తాడు. ఆమె మరణిస్తుంది. ఈ సంక్షోభ నేపథ్యంలో సాంగ్లియాన్ తన 20 వ పుట్టిన రోజు సందర్భంగా అతిగా మద్యం సేవిస్తుంది. మద్యం మత్తులో మూడవ భార్యకు డాక్టర్తో ఉన్నఅక్రమ సంబంధం గురించి బయటపెడుతుంది.భర్త ఆజ్న మేరకు ఒపెరా సింగర్ అయిన మూడవ భార్యను భవంతిపై అంతస్థులో ఒంటరి గదిలో ఉరివేసి చంపేస్తారు. అది గమనించిన సాంగ్లియాన్ తీవ్రంగా మధనపడుతుంది. ఇంతలో యజమాని చెన్ అయిదవ భార్యను తెచ్చుకుంటాడు. సాంగ్లియాన్ ఒంటరిగా దుఖంతో పిచ్చిదానిలా మారిపోతుంది.

ఈ మూడు సినిమాల్లో నూ ఝాంగ్ స్త్రీ పాత్రనే ప్రధానం చేశాడు. మూడు స్త్రీ పాత్రల్ని అందంగా అద్భుతంగా చూపించడమే కాకుండా ఉదాత్తమయినవిగా కూడా ఆవిష్కరించాడు. ముఖ్యంగా రైజ్ ది రెడ్ లాంటర్న్ విశ్వవ్యాప్తంగా విమర్శకుల మన్ననలు అందుకున్నప్పటికీ చైనా లో అది నిషేదానికి గురైంది. నిర్మాణానికి ముందు స్క్రిప్ట్ ని అంగీకరించిన చైనా ప్రభుత్వం సినిమా విడుదలయిన తర్వాత నిషేధించింది.

–ఇంకా ఉంది

7 Comments
  1. జీడిపప్పు August 1, 2009 /
  2. su August 1, 2009 /
    • rr August 9, 2009 /
      • su August 10, 2009 /
  3. su August 1, 2009 /
  4. శంకర్ August 1, 2009 /