Menu

స్వరకోకిల సుశీల – 2

ఈ వ్యాసం మొదటి భాగం ఇక్కడ చదవండి.

1952లో పెండ్యాల నాగేశ్వరరావుగారి స్వరసారథ్యంలో ‘కన్నతల్లి’ సినిమాతో ప్రారంభమైన స్వరకోకిల సుశీల గానప్రస్థానం… అప్రతిహతంగా దాదాపు నలభై ఏళ్ల పాటు దక్షిణాది భాషా చిత్రాలు అన్నింట్లోనూ కొనసాగింది. తెలుగుతో పాటు తమిళం, మళయాళం, కన్నడం హిందీలోనే కాకుండా సింహళభాషలో కూడా ఆమె పాటలు పాడారు. శాస్త్రీయ సంగీతం… జానపదం… సంప్రదాయ పురాణపద్యం… వంటి ఎన్నో స్వరప్రక్రియలలో సుశీల ముద్రపడని ప్రయోగం లేదు.

మనిషి పుట్టింది మొదలు మరణించే వరకూ ఉండే అన్ని దశలు… అన్ని ఉత్సవాలు… వేడుకలు… సందర్భాలు జీవన ఘట్టాలను ప్రతిబింబించే అన్ని రకాల పాటlu, స్వరకోకిల సుశీల కంఠం నుంచి వెల్లువెత్తాయి. మన జీవితంలోని అన్ని సందర్భాలలోనూ పాడుకోవడానికి తగినంతగా ఆమె పాటలు… తెలుగుజాతి హృదయాలలో చిరస్థాయిని పొందాయి.

నటీమణుల పాత్రలోని భావోద్వేగాలకు అనుగుణమైన స్వరస్థాయిలతో ఆమె పాడిన పాటలు భావయుక్తంగా రాగయుక్తంగా శ్రోతలను మైమరపించాయి. తెలుగు తెరపైని అందరూ నటీమణులకు సుశీల పాటే ప్రాణమైంది.

అంజలీదేవి అభినయానికి సుశీల గానమే ఊపిరిగా మారింది.

సావిత్రి నటనాపటిమకు సుశీల గాత్రమే జీవమై భాసిల్లింది.

జమున అల్లరితనానికి సుశీల స్వరమే కొత్త నడకలు నేర్పింది.

సరోజాదేవీ అభివ్యక్తిలో ..శారద సజీవచైతన్య స్ఫూర్తిలో సుశీల మాటే పరవళ్లు తొక్కింది.

విజయనిర్మల ఎదురుచూపులో సుశీల మాటే పాటై పల్లవించింది. కార్తీక పున్నమిని వెన్నెల కెరటాలని కళ్లెదుట సాక్షాత్కరింతచేసింది.

పి.సుశీల పూర్తి పేరు పులపాక సుశీల. కానీ ఇన్నేళ్ల ఆమె స్వరప్రస్థానం ఆమె ఇంటి పేరును “P ఫర్‌ పాటల సుశీల””గా మార్చేశాయి. వాణిశ్రీకి ఆమె పాడిన పాటలు సుశీలకు మాస్‌ పాటల ఫాలోయింగ్‌ను తీసుకువచ్చాయి. సుశీలకు ఫ్యాన్‌లుగా సాధారణ శ్రోలుండడం మామూలు. కానీ వాణిశ్రీ లాంటి నెంబర్‌వన్‌ హీరోయిన్‌ సుశీల వీరాభిమాని కావడం… సుశీల స్వరమంత్రమే తప్ప మరోటి కాదు. ముద్దుల బాబును నిద్ర పుచ్చినా… ఎట్టాగ ఉన్నాది ఓరబ్బీ అని కవ్వించినా… మల్లలె వేళనీ, వెన్నెల మాసాన్ని తీసుకువచ్చినా … అది సుశీల గాత్రమహిమే.

పెండ్యాలతో పరిచయమై సాలూరి రాజేశ్వరరావు, కేవీ మహదేవన్‌, MS విశ్వనాధన్‌, దక్షిణామూర్తి, మాస్టర్‌ వేణు, రమేష్‌నాయుడు, చక్రవర్తి, JV రాఘవులు, ఇళయరాజా, ఘంటసాల వంటి మహా సంగీత దర్శకుల స్వరాలకు తన తీయని గొంతుతో ప్రాణం పోసింది – సుశీల. కర్నాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణతో… ఘంటసాలతో… సౌందరరాజన్‌తో, జేసుదాసుతో… SP బాలసుబ్రమణ్యంతో కలిసి ఆమె పాడిన పాటలు ఆల్‌టైమ్‌ హిట్స్‌గా నిలిచాయి.

సుశీల గానమాధుర్యం ఆమెకు… ప్రజల రివార్డులను, ప్రశంసలను ఒకవైపు అనేక అవార్డులను మరోవైపు తీసుకువచ్చాయి. జాతీయ స్థాయిలో ఐదుసార్లు జాతీయ ఉత్తమగాయనిగా అవార్డులను గెల్చుకునేలా చేశాయి. ఇక్కడ విశేషమైన విషయం ఏమంటే, జాతీయస్థాయిలో ఉత్తమ నేపథ్యగాయనిగా అవార్డులను 1969లో ప్రారంభించినపుడు ప్రతిష్టాత్మకమైన ఆ తొలి అవార్డును గెల్చుకున్నదెవరో తెలుసా?

లతా మంగేష్కర్‌, ఆశాభోంస్లే వంటి మహాగాయనీ మణులు కాదు.

మన తెలుగింటి కోయిల – సుశీల.

MLA ఏడుకొండలు సినిమాలోని పాటకు ఓసారి, మేఘసందేశం లోని ప్రియా చారుశీలే అనే జయదేవుని అష్టపది గీతానికి ఓసారి, సిరిసిరిమువ్వలోని ఝుమ్మంది నాదం అన్న పాటకు మరోసారి జాతీయ అవార్డులు వరించాయి. తెలుగు పాటకు నీరాజనాలను అర్పించాయి. సైయనే పాదానికి, ఉగే తనువుకి, చెలరేగిన రాసలీలకి సుశీల స్వరం సుస్వరం అయింది. సకల భావాల భాస్వరమే అయింది.

సంగీతమే సర్వస్వంగా… సినిమా పాటే జీవనబాటగా మలుచుకున్న – స్వరకోకిల సుశీల గొంతులోని సహజ ప్రత్యేకత, సంగీత సాధన, ఆమెను కలకాలం గుర్తుంచుకునే గాయనిగా మలిచాయి. ఆమె గాన మాధుర్యం పామరులను, పండితులనే కాదు… సంగీత సామ్రాట్టులను సైతం రంజింపచేయడం గొప్ప విశేషం.

జయసుధ… శ్రీదేవి… భానుప్రియ… రాధిక… టబు… రాధ… అంబిక…. శ్రీవిద్య… సరిత… ఇలా ఒక్కరని ఏమిటి… హీరోయిన్లు ఎందరైనా, హీరోయిన్లకు ఎలాంటి బ్రాండ్ పడినా… వారందరికీ గాత్రదానం చేసి సినిమా పాటకు సార్వజనీనతను తీసుకొచ్చిన స్వరసామ్రాజ్ఞి- సుశీల. లాలి పాటైనా… జోలపాటైనా… అది సుశీలమ్మ గొంతులో మాతృ మాధుర్యాన్ని రంగరించుకుని… ఏకంగా వటపత్రశాయికే లాలి పాడటం ఆమె స్వరంలోని సమ్మోహనమే.

దేశవ్యాప్తంగా లతా మంగేష్కర్ పాటలంటే చెవుకోసుకునే ప్రజలుండగా… లతా మంగేష్కర్ ఇంట్లో లతాజీతో సహా అందరూ సుశీల అభిమానులమని బాహాటంగా చెప్పడం ఆ స్వర సామ్రాజ్ఞి పాండిత్యానికి గొప్ప గుర్తింపే. ఇక ఆశాభోంస్లే అయితే సుశీలను దక్షిణాది లతా అని పొగిడింది.

సమకాలీనుల నుంచే కాకుండా తర్వాతి తరం గాయనీమణులకు ఆదర్శమూర్తిగా ,స్ఫూర్తిదాతగా నిలిచిన అజరామ స్వరం సుశీలది. అంతెందుకు ప్రముఖ గాయక సంగీతకారుడు SP బాలు చెల్లెలు SP శైలజ – సుశీల పాటలనే అనుకరించి పాడేదట. ఇప్పటికీ తన పాటల స్టైల్‌లో అంతర్లీనంగా సుశీల ప్రభావం ఉంటుందని ఆమె స్పష్టంగా చెపుతుంది.

తరతరాలుగా తెలుగు ప్రేక్షకులను తన పాటల పల్లకిలో ఊరేగిస్తున్న సుశీల గానమాధుర్యానికి … మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ గాయనిగా ఆరుసార్లు నంది అవార్డులను ఇచ్చి సత్కరించింది. తెలుగు సినీ రంగంలో అత్యున్నత అవార్డ్‌ అయిన రఘుపతి వెంకయ్య అవార్డ్‌ను ప్రదానం చేసింది. భారతప్రభుత్వం ఇటీవలే ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్‌ పురస్కారంతో సన్మానించింది. ఫిల్మ్‌ఫేర్‌ సంస్థ లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డును బహుకరించింది. కానీ ఆకులో ఆకై… పూవులో పూవై…. సంగీత సాగరంలో కెరటమై ఒదిగిన సుశీల స్వరం – ప్రకతృతిలోని సౌందర్యానికి మాత్రమే తలవంచింది.

లతా మంగేష్కర్‌ తరువాత అతి ఎక్కువ పాటలు పాడిన గాయనిగా రికార్డును, తమిళనాడు ప్రభుత్వంచే కళైమామణి అవార్డును సాధించిన స్వరసామ్రాజ్ఞి – సుశీల. భారతీయ కళాసంస్కృతి పరిరక్షణ కోసం తన పేరుమీద ట్రస్ట్‌ స్థాపించి ఔత్సాహిక యువ సంగీతకారులు, గాయకులకు అవార్డులను ఇస్తున్నారు. దీంతో పాటు … హైదరాబాద్‌లోని అత్యున్నత ప్రమాణాలతో ఓ సంగీత కళాశాల స్థాపించాలన్నది ఆమె లక్ష్యం. సంగీతం గానంలో విశిష్ట కృషి చేసిన కళాకారులు… గాయకులకు తన పేరు మీద సుశీల అవార్డును బహూకరించాలని నిర్ణయించడం… తొలి అవార్డు గ్రహీతగా మరో గానసరస్వతి S.జానకిని సెలక్ట్‌ చేయడం ఆ గంధర్వ గాయనీమణిలోని ఔన్నత్యానికి నిదర్శనం. స్త్రీ శక్తిని… జనని జగన్మాతని భక్తి పూర్వకంగా కీర్తించిన సుశీల మనసులోని ఆలోచనే ఇందుకు మూలం.

మహానటుడు నందమూరి తారకరామారావు, కరుణానిధీ, MG రామచంద్రన్‌, జయలలిత వంటి నట ముఖ్యమంత్రుల అభిమాన గాయనిగా సుశీల అత్యున్నత స్థానాన్ని సంపాదించుకుంది.

ఇందిరాగాంధీతో సైతం ప్రత్యేక ప్రశంసలు పొందిన ఘనత ఆమెది.

రాజ్‌కపూర్‌, శాంతారామ్‌ వంటి బాలీవుడ్ దర్శక శిఖామణులతో పొగడ్తల పూలదండలు పొందిన ఘనత.

కిశోర్‌కుమార్‌, పండిట్‌ రవిశంకర్‌, నౌషాద్‌, బప్పీలహరి, ఎ.ఆర్‌.రెహమాన్‌ వంటి సంగీత జ్ఞానుల అభిమానాన్ని పొందిన అసమాన ప్రతిభ – స్వరకోకిల సుశీలది.
స్వరరాగా గంగా ప్రవాహంలో తనదైన ప్రత్యేక బాణీని, వాణిని వినిపించిన సుశీల కారణజన్మురాలు. తన జన్మకు అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకున్న అతికొద్ది మంది మహనీయుల్లో ఒకరిగా నిలిచిపోయే నిత్య చైతన్య సంగీత స్ఫూర్తి – సుశీల.

–మామిడి హరికృష్ణ

2 Comments
  1. pappu August 14, 2009 /
  2. గీతాచార్య August 14, 2009 /