Menu

స్వరకోకిల సుశీల – 1

సినీ పాటల తోటలో లతను మరిపించిన రేరాణి. దక్షిణాది సినీ సంగీత రంగాన్ని నాలుగు దశాబ్దాల పాటు పాలించిన రారాణి. పాటలతల్లి తన పాదాలకు దిద్దుకున్న సప్తస్వరాల పారాణి. సందర్భం ఏదైనా సన్నివేశం మరేమైనా.. అన్ని రకాల భావాలను మాధుర్యంగా తన గొంతులో పలికించిన రుతురాగం… జీవననాదం… ప్రేక్షక హృదయ నాదం- సుశీల. సినీ సంగీతానికి నిజంగా ఆమె ఒక వరం.

ప్రపంచమంతటా సంవత్సరానికి ఒకసారే వసంతం వస్తుంది. వసంతకాలానికి కోయిల గానం మృదుమధురంగ ఉంటుంది. కానీ దక్షణభారత ప్రజలు, అందులోనూ తెలుగు ప్రజలు ఏ పుణ్యం చేసుకున్నారో… ఆమె పాట విన్న ప్రతిసారీ మన ఇంటి ముందరి చెట్టుపై కోయిల కూసినట్టే అనిపిస్తుంది. ఈ ప్రజలకు ఎప్పుడూ వసంతాన్ని ఇవ్వలేననుకున్నాడేమో ఆ దేవుడు… వసంతానికి బదులుగా ఆమె స్వరసంగీత వసంతాన్ని మనకు ప్రసాదించాడు.

ఆమె గొంతు – ఝుమ్మనే నాదం….
ఆమె స్వరం – పందిరి నీడలోన జాబిల్లి…
ఆమె పదం – పదే పదే హృదయాలలో మ్రోగే వీణ…
ఆమె పాట- పరవశాల తెలుగు పాటకు సరాగాల బాట.
ఆమె సుశీల… “గానకోకిల” సుశీల… మెలోడీ క్వీన్‌ సుశీల…
నిదురించే సినీ సంగీత తోటలోకి తేలివచ్చిన పాట….

చిటారు కొమ్మ పైనున్న తేనె…
స్వర్గంలోకంలోని అమృతం …
ప్రవహించే సెలయేటి కమ్మదనం…
నేలపై విరిసిన లేతమొగ్గ తాజాదనం…
గులాబీల లోని సుగంధం…
ముద్దబంతుల పరిమళం…
గాలిలో వ్యాపించిన కోయల కుహుకుహునాదం…
ఇవన్నీ కలిపి… మిక్స్ చేసి కొన్ని యుగాల తర్వాత తీయగా వేకువలా పల్లవించిన సంగీతం … సుశీల స్వరం. సినిమా సంగీతానికి ఆమె ఒక వరం. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినిమా సంగీతాన్ని పలకరించి… పలవరించి… పాటలతో పరుగెత్తించిన గంధర్వగీతం… సుశీల.

ఆనందం-విషాదం… విరహం-వియోగం… వినోదం-విలాసం… విజయం-పరాజయం… ఉత్సాహం-ఉల్లాసం… ఉద్యమం-ఉత్తేజం… ఉద్యమం-ఉత్తేజం… సందర్భం ఏదైనా సన్నివేశం మరేమైనా.. అన్ని రకాల భావాలను, అన్ని వర్గాల భావ ప్రకంపనలను ప్రభావవంతంగా తన గొంతులో పలికించిన రుతురాగం… జీవననాదం… ప్రేక్షక హృదయ నాదం-సుశీల

గానకోకిల సుశీల స్వర ప్రవాహంలో మునిగి… తేలి… తన్మయమైన శ్రోతలంతా… ఇంత మృదువైన, మధురమైన, మార్దవమైన,… మనోహరమైన పాటల పూలీయమని, ‘ఎవరు నేర్పేరమ్మా ఈ స్వరాలమ్మకు’ అని ఆశ్చర్యపోతారు. అభినందిస్తారు. ఆత్మల్లో నిలుపుకుంటారు.

గానకోకిల సుశీల 73ఏళ్ల క్రితం 1935లో విజయనగరంలో జన్మించారు. శాస్త్రీయ సంగీతం అంటే చెవి కోసుకునే ఫ్యామిలీ సుశీలది. తండ్రి ముకుంద రామారావు ఆ కాలంలో ఫేమస్‌ క్రిమినల్‌ లాయర్. తల్లి శేషావతారం గృహిణి. కానీ వీరి ఇంట్లో నిరంతరం దేవుడి ముందర దీపంతో పాటు సంగీతం వినిపిస్తూ ఉండేదట. కుటుంబ పరిస్థితి ఇలా ఉండగా సుశీల జన్మించిన ఊరు కూడా సంగీత సాహిత్యాలకు ఆ కాలంలో చిరునామాగా ఉండే ఊరు – విజయనగరం. వీణకు పుట్టిల్లు-బొబ్బిలి- విజయనగరంలోనిదే. వీణలోని సుస్వరం.. శ్రావ్యత అంతా పుణికి పుచ్చుకున్నదేమో… సుశీల స్వరమంతటా సంగీతామృత వర్షమే కురిసింది. వీణలోనో, తీగలోనో దాగిన రాగాన్ని అన్వేషించే ప్రయత్నం సుశీల స్వరం చేసింది.

ఇప్పుడు మన మీడియా, టాలెంట్‌ హంట్ అంటూ రియాలిటీ షోలను నిర్వహిస్తోంది. ఈ టాలెంట్ హంట్‌.. అంతా ఇటీవలి డిస్కవరీ అని మన కాలపు వీరులంతా గొప్పలకు పోతున్నారు కానీ… అసలు తొలితరపు టాలెంట్‌ హంట్ తెలుగు సినిమాకు అందించిన స్వర అక్షయపాత్రే – సుశీల అంటే మనం ఆశ్చర్యపోతాం. సుప్రసిద్ద సినీ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు 1950 కాలంలో కొత్త గాయనిల కోసం అన్వేషిస్తూ,అప్పట్లో సంగీతకారులకు కేరాఫ్ అయిన ఆలిండియా రేడియోలో… ఈ టాలెంట్ హంట్ లాంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోటీలో ఎంపికైన టాప్ పదుగురిలో సుశీల టాప్‌గా నిలిచింది. ఈ టాలెంట్ షో… సుశీల జీవితాన్ని గానకోకిలగా మార్చేసింది. కోట్లాది శ్రోతల గుండెల్ని ఆనందపు ఊయలలో ఓలలాడించింది. అలసిన మనసుల్ని, అలిగిన వేళలోని కృష్ణుని అందాలని రసరమ్యంగా సున్నితంగా ఆవిష్కరించింది.

మన జీవితంలో ఏ సందర్భంలో అయినా పాడుకునే విధంగా… అన్ని రకాల పాటలకు గాత్రదానం చేసింది స్వరకోకిల – సుశీల.

సినీ సంగీత సామ్రాజ్యంలో మహామహులతో కలిసి పనిచేసే అద్భుత అవకాశం ఆమెకు దక్కింది. దీనికి ఆ గానకోకిల కఠోర సంగీత సాధన తోడైంది. అందుకే తెలుగువారి హృదయాల్లో తన పాటలతో చెరగని ముద్ర వేసింది.

స్వరకోకిల సుశీల చిన్ననాటి నుంచే సంగీత సాధన చేసింది. విజయనగరం మహారాజా మ్యూజిక్ కాలేజ్‌లో కర్నాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. సంగీతంపై ఆమెకు ఉన్న ఆసక్తికి- ఈ శాస్త్రీయ శిక్షణాశక్తి తోడైంది. పైగా ఆమ్యూజిక్ కాలేజ్‌ ప్రిన్స్‌పాల్‌గా ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామినాయుడు ఉండేవారు. ఆయన స్ఫూర్తి… ఆయన వాద్య సంగీత నైపుణ్యం – సుశీల గానాన్ని ప్రభావితం చేసాయేమో… తర్వాతి కాలంలో సుశీల పాడిన పాటలలో వయోలిన్ లోని విషాద గాంభీర్యం… వైరాగ్య స్ఫూర్తి గాత్ర రూపంలో జాలువారాయి. సుశీల గానం చేసిన వందలాది గీతాల్లో ఈ విషయం అర్థమవుతోంది.

–ఇంకావుంది

–మామిడి హరికృష్ణ

7 Comments
  1. గోపాల్ August 12, 2009 /
  2. గీతాచార్య August 12, 2009 /
  3. రామ August 13, 2009 /
  4. pranavvarma September 11, 2009 /
  5. ramesh September 11, 2009 /
  6. karunakar February 20, 2011 /