Menu

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (నాలుగవ భాగం)

Quiz Showఈ శీర్షికలో వచ్చిన మిగిలిన రెండు భాగాలు:

‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు

నా శరీరం అణువణువునా చురుకైన పోట్లు పొడుస్తున్నట్టుగా ఉంది. నా చేతులు రెండూ ఎత్తుగా ఉన్న ఒక కొయ్యదూలానికి కట్టేశారు. దాదాపు తొమ్మిదడుగుల ఎత్తులో ఉందది. గాలిలో వేలాడుతున్న నా కాళ్ళు, దూలానికి కట్టేసిన నా చేతులూ మిగిలిన శరీరంనుంచి ఎవరో లాగేస్తున్నట్టుగా ఉంది. పూర్తిగా నగ్నంగా చేశారు నన్ను. ఛాతీనుంచి పక్కటెముకలు బైటికి పొడుచుకొచ్చాయి – ఆకలితో అల్లాడే ఆఫ్రికన్ శిశువులకులాగా.

గాడ్బోలె దాదాపు అరగంట పైనుంచీ నాకు యమలోకాన్ని మరపించే శిక్షలు విధిస్తున్నాడు. ప్రతి పదినిముషాలకొకసారీ ఓ కొత్త పరికరంతో వస్తున్నాడు. ముందు ఒక సన్నటి వెదురుబద్దను తీసుకుని నా వెనగ్గా వచ్చి ముడ్లో గుచ్చాడు – దానిమీద కారంపొడి మరీ అద్ది. ఆ బాధ వర్ణనాతీతం. ఎర్రగా కాలుతున్న ఇనుపకడ్డీ నా శరీరంలోకి దూసుకెళ్ళినట్టుగా అన్పించింది నాకు. గొంతులో ఏదో అడ్డుపడి ఊపిరాడనట్టుగా అయింది. బాధతో విలవిలలాడాను. తర్వాత నన్ను కిందికి దింపి, నా తలను ఒక్కొదుటున నిండా నీళ్ళున్న బక్కెట్లో ముంచి, అలాగే కాసేపు పట్టుకున్నాడు. నా ఊపిరితిత్తులు పేలిపోతాయా అన్పించింది. విలవిల చేపపిల్లలా కొట్టుకున్నాను ఆ కాసేపు.

ఇప్పుడు చిన్నపిల్లలు దీపావళి కాకరపువ్వొత్తి చేతిలో పట్టుకున్నట్టుగా ఓ కరెంటు వైరును చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఫూటుగా తాగేసిన బాక్సర్లా నా చుట్టూ తిరుగుతూ, ఉన్నట్టుండి మీదిమీదికొస్తున్నాడు. ఆ కరెంటు తీగను నా ఎడమ అరికాలికి అంటించాడు. అందులోని విద్యుత్తు ఓ వేడి విషప్రవాహంలా నా శరీరమంతా పాకింది. బాధతో మెలికలు తిరిగిపోయాను నేను.

“బాస్టర్డ్. నువ్వా క్విజ్ షోలో ఏం ట్రిక్ చేశావో ఇప్పటికైనా చెప్పు. నీకెవరు ఆ జవాబులందించింది? మర్యాదగా చెప్తే, నీకీ బాధలన్నీ తీరతాయి. ఇంటికి పోయి, హాయిగా భోంచేసి పడుకోవచ్చు.” అని నా జుట్టుపట్టుకుని గుంజి గుంజి అడుగుతున్నాడు.

కాని ఇల్లు అనేది నాకిప్పుడు ఎంతో దూరంలో ఉందనిపిస్తోంది. భోజనమా? హు…ఇప్పుడేదైనా తింటే నాకు వాంతి అయ్యేటట్టుగా ఉంది. చాలాసేపటివరకూ ఏమీ తినకపోతే, ఆకలి చచ్చిపోయి, కడుపులో ఒకవిధమైన నొప్పి, తిప్పుడు ఆరంభమవుతుంది. అదే నాకూ జరుగుతోందిప్పుడు.

నా కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. మసకబారిన నా కళ్ళముందు ఒక దృశ్యం కనబడుతోంది. ఎత్తుగా, తెల్లటి చీరెలో ఉన్న ఒక స్త్రీ. హోరుగాలికి ముంగురులు ముఖం మీద పడుతుండగా చేతులు చాస్తూ నాకెదురుగా వస్తోంది. ఆమె కళ్ళలో ఎంతో ఆర్తి కనిపిస్తోంది. “అమ్మా” అని అరుస్తూ నేనూ ఆమెవైపు చేతులు సాచి పరుగెడుతున్నాను.

ఇంతలో గాడ్బోలె నా మెడ గట్టిగా పట్టుకున్నాడు. గూబ పగిలేలా కొట్టాడు. నా స్వప్నం చెదిరింది.

గాడ్బోలె చేతిలో పెన్ను, పేపరుతో నాకెదురుగా నిలబడి ఉన్నాడు.

“ఈ కన్ఫెషన్ స్టేట్ మెంటు పైన సంతకం పెట్టు.” ఆజ్ఞాపించినట్టుగా అన్నాడు.

ఆ స్టేట్ మెంటు చాలా సింపుల్ గా ఉంది – “రామ్ మొహమ్మద్ థామస్ అనబడే నేను జులై పదో తేదీన ‘నూరు కోట్లు ఎవరు గెలుస్తారు?’ అనే క్విజ్ షోలో పాల్గొన్నాను. అందులో మోసం చేసినట్టుగా ఒప్పుకుంటున్నాను. నిజానికి ఆ ప్రశ్నలకు నాకు సమాధానాలు తెలియవు. నేను మోసం చేసి గెలిచిన బహుమతిని ఉపసంహరించుకుంటున్నాను. నా తప్పును క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇది నా ఇష్టపూర్తిగా, సంపూర్ణమైన మానసిక స్థితిలో ఉండి, ఎవరి వత్తిడి లేకుండా ఇచ్చిన వాంగ్మూలం – ఇట్లు రామ్ మొహమ్మద్ థామస్.”

ఆ స్టేట్ మెంటు పైన సంతకం పెడితే ఏమవుతుందో నాకు తెలుసు. ఆ తర్వాత నా మాటకు ఏ విలువా ఉండదు. పోలీసులతో గొడవ పెట్టుకోవద్దని మావాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈ నేరప్రపంచపు విషవలయంలో మా వీధిబాలలది చివరి వలయం. మా పైన జేబుదొంగలు, చిన్న, చిన్న నేరగాళ్ళు, వాళ్ళపైన కబ్జాదారులు, ఖూనికోర్లు, వాళ్లకు ముందు పెద్ద, పెద్ద డాన్ లు, వాళ్ళ నెత్తిపైన బడా వ్యాపారస్తులు ఉంటారు. వీళ్ళందరికీ తలమానికంగా ఉండేదే పోలీసులు. వాళ్ళ దగ్గర ‘అధికారం’ అనే ఒక వజ్రాయుధం ఉంది. వాళ్ళపైన ఎవరి కంట్రోలూ ఉండదు. చేనుకు రక్షణగా కంచె వేస్తాం. ఆ కంచే చేనును మేస్తే ఏం చేస్తాం? నేను ఆ కాగితంపైన సంతకం చేయలేదు. ఈలోపు గాడ్బోలె చేతిలో పది, పదిహేను చెంపదెబ్బలు తిన్నాను. అవే కాకుండా మరో ఐదారు కరెంటు షాకులు కూడా.

ఉన్నట్టుండి తలుపు దగ్గర ఏదో కలకలం వినిపించింది. బైట నిలబడ్డ కానిస్టేబుళ్లు ఎవరితోనో గొడవపడుతున్నారు. ఇంతలో తలుపులు భళ్ళున తెరుచుకుని తెల్లటి సల్వార్ కమీజులో ఉన్న ఓ ముప్ఫయ్యేళ్ళ యువతి అసహనంగా లోపలికొచ్చింది. అంత ఒడ్డూ, పొడుగూ లేకపోయినా, ఆమె ముఖంలో ఏదో తెలియని అధికార దర్పం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కనుబొమలు తీర్చిదిద్దినట్టుగా ఉండి, వాటి మధ్యలో, ఆమె వేసుకున్న నీలిరంగు దుపట్టాను మాచ్ చేస్తూ, అదే రంగు బిందీ ఆకర్షణీయంగా ఉంది. భుజానికి బ్రౌన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ వేలాడుతోంది.

గాడ్బోలె ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఆ హడావుడిలో నాకు షాక్ ఇవ్వడానికి తయారుచేస్తున్న కరెంటువైరు తగిలి కెవ్వుమన్నాడు. లోపలికొచ్చింది ఎవరైనా మగవాళ్ళై ఉంటే, ఆ క్షణంలో కాలరు పట్టుకుని బైటికి గెంటి ఉండేవాడు. కాని వచ్చింది ఒక స్త్రీ కాబట్టి తమాయించుకుని “ఎవరు నువ్వు? ఏంటా తోసుకుని రావటం? నేనేం చేస్తున్నానో తెలియటంలా?” అని గాండ్రించాడు.

“నా పేరు స్మితా షా. నేను రామ్ మొహమ్మద్ థామస్ లాయర్ని” అన్నది ఆమె ఏమాత్రం తొణక్కుండా. ఒక్కసారి నావైపు, నా పరిస్థితి వైపు జాలిగా చూసి, వెంటనే తల తిప్పుకుంది.

గాడ్బోలె ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. నేను కూడా అంతే ఆశ్చర్యపోయాను. కాని నా ఆశ్చర్యాన్ని పట్టించుకునే స్థితిలో లేడతను. నేనీ అమ్మాయిని ఇదివరకెప్పుడూ చూడలేదు. నా దగ్గర ఆటోలో వెళ్ళటానికే డబ్బుండదు. ఇక లాయర్ని ఎలా పెట్టుకుంటాను?

“లాయరా!” అని నమ్మలేనట్టుగా చూస్తూ అన్నాడు గాడ్బోలె.

“అవును. నా క్లైంటు మీద నువ్వు చేస్తున్న హింస అన్యాయం, అక్రమం. దీన్ని వెంటనే ఆపాలి. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 330, 331 కింద అతను నీ మీద చర్య తీసుకోవచ్చు. అతని అరెస్టు తాలూకు పేపర్స్ నేను చూడాలి. ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదు చేయలేదనుకుంటా… ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా అతనికి మీరు చెప్పలేదు. ఇది రాజ్యాంగంలోని 22 వ అధికరణ ధిక్కారం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 50 ఉల్లంఘన కూడా అవుతుంది. నువ్వు అతని అరెస్టు వారెంటు తెచ్చేవరకూ, నేను అతన్ని పోలీసుస్టేషను నుంచి తప్పిస్తున్నాను. అతనితో నేను మాట్లాడాలి.”

“అది….అది… నేను కమీషనరు గారితో మాట్లాడాలి. కాస్తాగండి.” అన్నాడు గాడ్బోలె నీళ్ళు నములుతూ. ఆమె వైపు నిస్సహాయంగా చూస్తూ పక్క గదిలోకి వెళ్ళాడు.

ఇదంతా నాకు అద్భుతంగా అనిపించింది. లాయర్లకు పోలీసులపై ఇంత ‘పవర్’ ఉంటుందని నాకు ఇప్పటివరకూ తెలియదు.

గాడ్బోలె మళ్ళీ గదిలోకి ఎప్పుడొచ్చాడో, ఆమెతో ఏమి మాట్లాడాడో కూడా నేను గమనించలేదు. ఆ నరకంనుంచి బైటపడ్డానని మాత్రం చెప్పగలను.

* * *

మీరెప్పుడైనా ఢిల్లీ వెళ్లి ఉంటే, రైలు దిగి పహాడ్ గంజ్ గేటువైపు వెళ్లి ఉంటారు. నిరంతరం వాహనాల రొదతో, దుమ్మూ, ధూళితో ఉంటుంది ఆ ప్రాంతమంతా. స్టేషనులోనుంచి బైటకువచ్చి ఎడమపక్కకు కనాట్ ప్లేస్ వైపు వెళుతూంటే, చవక ధరలకు లభించే లాడ్జీలు, యాత్రీకులను ఆకర్షించే వేశ్యలు కనిపిస్తారు. కాని కుడిపక్కకు వెళ్తే, మదర్ డైరీ, జె.జె. వుమెన్స్ హాస్పిటల్ దాటాక, ఒక ఎర్ర రంగు బిల్డింగు దానిమీద తెల్లటి సిలువ గుర్తుతో కనిపిస్తుంది. అదే సెయింట్ మేరీస్ చర్చ్. నేను పద్ధెనిమిది ఏళ్ల క్రితం అక్కడే పుట్టాను. క్లుప్తంగా చెప్పాలంటే, డిసెంబర్ 25 రాత్రి చల్లటి చలిలో నన్ను ఎవరో అక్కడ పాతబట్టల కోసం పెట్టిన బుట్టలో వదిలివెళ్లారు. నన్ను అక్కడ ఎవరు, ఎందుకు వదిలి వెళ్ళారో నాకు ఈనాటి వరకూ తెలియదు. కాని దగ్గరలోని జె.జె. వుమెన్స్ హాస్పిటల్ ప్రసూతికేంద్రం పైనే అందరికీ అనుమానం. ఏ పరిస్థితులు ఆమెను నన్ను వొదిలేయటానికి కారణమయ్యాయో తెలియదుగాని, ఆ కన్నతల్లినుంచి ఆరోజు దూరమయ్యాను.

నా మనోనేత్రం ముందు ఆ దృశ్యం నాకు అనేకసార్లు కనిపించింది. ఎత్తుగా, గంభీరంగా తెల్లచీరలో ఉన్న ఒక స్త్రీ అర్థరాత్రి చేతుల్లో అప్పుడే పుట్టిన శిశువుతో ఆసుపత్రినుంచి బైటికొచ్చింది. ఈదురుగాలి వీస్తోంది. ఆమె నల్లటి జుట్టు ముఖం మీద పడుతూ ఆమె రూపాన్ని కనపడనివ్వకుండా చేస్తోంది. ఆమె కాళ్ళకింద చితికే ఎండిన ఆకులు పటపటమని చప్పుడు చేస్తున్నాయి. గాలికి దుమ్ము లేస్తోంది. ఆకాశంలో మెరుస్తోంది. ఆమె శిశువును గుండెలకు హత్తుకుని బరువుగా అడుగులు వేసుకుంటూ చర్చి వైపు వస్తోంది. ఆమె చర్చి ద్వారం వరకూ చేరుకుని, తలుపు తట్టింది. బలంగా వీచే గాలి హోరులో ఆ చప్పుడు ఎవరికీ వినిపించలేదు. ఆమెకు సమయం ఎక్కువగా లేదు. కళ్ళనుంచి ధారాపాతంగా కన్నీళ్లు కారుతూండగా, శిశువు ముఖాన్ని ముద్దులతో తడిపింది. తర్వాత నెమ్మదిగా బాబును అక్కడ ఉన్న పాత బట్టల బుట్టలో ఉంచి చలి తగలకుండా చుట్టూ బట్టలు కప్పింది. చిట్టచివరిసారి బాబును ఆప్యాయంగా చూసుకుని, వెంటనే కళ్ళు తిప్పుకుని వెనక్కి తిరిగి పరుగులాంటి నడకతో చీకట్లో అదృశ్యమైంది.

* * *

సెయింట్ మేరీ చర్చికి అనుబంధంగా ఒక అనాధాశ్రమం, దత్తత స్వీకార కేంద్రం కూడా ఉన్నాయి. నన్ను కూడా మరికొంతమంది శిశువులతో అందులో చేర్చారు. మిగిలిన పిల్లలను దత్తత చేసుకోవటానికి ఎవరో ఒకరు వస్తున్నా, నాకోసం మాత్రం ఎవరూ రాలేదు. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒక దంపతులు వచ్చి చూస్తారు. నన్ను చూసి, తలతిప్పుకుని పక్క ఉయ్యాల దగ్గరకు వెళ్ళిపోతారు. బహుశా నేను నల్లగా ఉండి చూడటానికి అంత ఆకర్షణీయంగా లేను కాబోలు. లేదా కడుపునొప్పితోనో, కాలినొప్పితోనో ఎప్పుడూ ఏడుస్తూ ఉండి ఉంటాను. అలా నేను ఆ అనాధాశ్రమంలోనే మరో రెండేళ్ళు ఉండిపోయాను. దానికి తగ్గట్లు, అక్కడి సిస్టర్స్ ఎవరూ కూడా నాకో పేరు పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదేమో, నన్ను బేబీ, బేబీ అనే పిలిచేవాళ్ళు.

చివరికి నన్ను మిసెస్ ఫిలోమినా థామస్, ఆమె భర్త డొమినిక్ థామస్ లు దత్తత తీసుకున్నారు. తమిళనాడులోని నాగర్ కోయిలుకి చెందిన ఆ దంపతులు ఎంతోకాలంగా ఢిల్లీలోనే ఉంటున్నారు. సెయింట్ జోసెఫ్ చర్చిలో ఫిలోమినా స్వీపర్ గానూ, ఆమె భర్త తోటమాలిగానూ పనిచేస్తున్నారు. అప్పటికే నలభైల్లో ఉన్న ఆ పిల్లలులేని దంపతులను, ఫాదర్ తిమోతీ ఎవరో ఒక అనాథ శిశువును దత్తత తీసుకుని, వాళ్ళ జీవితంలోని లోటును తీర్చుకోమని కొంతకాలంగా చెప్తున్నాడు. సెయింట్ మేరీ అనాధాశ్రమాన్ని సందర్శించమని కూడా వాళ్లకు చెప్పాడు. థామస్ బహుశా నన్ను చూసి తలతిప్పుకుని వెళ్ళిపోయాడేమోగాని, ఫిలోమినా మాత్రం చూడగానే నన్ను ఎంచుకుంది. నేను బహుశా ఆమె నల్లటి నలుపుకు సరిపోతాననుకుని ఉండవచ్చు.

దత్తతకు సంబంధించిన తతంగాలు పూర్తిచేయటానికి వాళ్లకు దాదాపు రెండు నెలలు పట్టింది. కాని నన్ను ఇంటికి తీసుకువెళ్ళిన మూడు రోజుల్లోపే థామస్ తన భార్య జీవితంలోని లోటు భర్తీ అయిందని గుర్తించాడు. అది నావల్ల కాదు. మస్తాన్ షేక్ అనబడే పొరుగున ఉన్న లేడీస్ టైలర్ వల్ల. ఫిలోమినా ఓ శుభముహూర్తాన చెప్పాపెట్టకుండా తన భర్తనీ, దత్తపుత్రుణ్ణీ వదిలేసి, ఆ టైలరుతో భోపాల్ కు ఉడాయించిందని వినికిడి. ఆమె ఆచూకీ ఈనాటివరకూ తెలియలేదు.

విషయం తెలిసిన థామస్ కోపంతో రెచ్చిపోయాడు. నన్ను ఉయ్యాలలోనుంచి లాక్కెళ్ళి ఫాదర్ తిమోతీ కాళ్ళముందు పడేశాడు.

“ఫాదర్, ఇదిగో, ఈ పిల్లాడివల్లే ఈ అనర్థమంతా జరిగింది నాకు. అన్నిటికీ మూలకారణం వీడే. ఇప్పుడు వీణ్ణేం చేస్తారో మీ ఇష్టం.”

ఫాదర్ తిమోతీ ‘ఆమెన్’ అనేలోపే డొమినిక్ థామస్ చర్చినుంచి బైటపడ్డాడు. అతనో చిన్న పిస్తోలు పుచ్చుకుని భోపాల్ వెళ్ళే రైలెక్కినట్టు అతణ్ణి చివరిసారిగా చూసినవాళ్ళు చెప్పారు.

అలా నేను ఫాదర్ తిమోతీకి ఓ పెద్ద బాధ్యతనయ్యాను. ఆయనే నాకు తిండి, బట్ట కల్పించటమే కాకుండా, నాకో పేరు కూడా పెట్టాడు – ‘జోసెఫ్ మైకేల్ థామస్’ అని.

ఏ ప్రీస్టూ నా తలను బాప్తిస్మం ఇచ్చే కలశంలో ముంచలేదు. ఏ పవిత్రజలాన్నీ నామీద చల్లలేదు. నాకోసం ఏ కొవ్వొత్తీ వెలిగించలేదు. ఎటువంటి తెల్లశాలువా నామీద కప్పలేదు. అయినా నేను ‘జోసెఫ్ మైకేల్ థామస్’ ని అయిపోయాను – ఆరు రోజుల వరకూ.

* * *

డో రోజు ఇద్దరు వ్యక్తులు ఫాదర్ తిమోతీని కలవటానికొచ్చారు. ఒక లావుగా ఉన్నతను, కుర్తా, పైజామాలో ఉన్నాడు. బక్కపలచగా, గడ్డంతో ఉన్న మరొకతను షేర్వానీలో ఉన్నాడు.

“మేము ‘సర్వమత సామరస్య సంఘం’ నుంచి వచ్చాం” లావాటి వ్యక్తి చెప్పాడు “నా పేరు జగదీశ్ శర్మ. ఇతను ఇనాయత్ హిదాయతుల్లా. మా సంస్థ మూడో సభ్యుడు సిక్కుమత ప్రతినిధి, హర్వీందర్ సింగ్ కూడా రావలసి ఉంది. కాని ఏవో కారణాలవల్ల అతను ఈరోజు గురుద్వారాలో బిజీగా ఉండిపోయాడు. సరే, ఫాదర్. అసలు విషయానికొస్తాం. మీరు ఒక అనాథ శిశువుకు ఆశ్రయం కల్పించారని తెలిసింది.”

“అవును. ఆ పిల్లాణ్ణి దత్తత చేసుకున్న దంపతులు ఉన్నట్టుండి అతన్ని వదిలేసిపోవటంవల్ల, నేను అతని బాధ్యత తీసుకోవలసి వచ్చింది.” వాళ్ళ అనుకోని రాకకు కారణం ఏమై ఉంటుందో అర్థంకాని ఫాదర్ చెప్పాడు.

“ఆ పిల్లాడికి పేరేం పెట్టారు?”

“జోసెఫ్ మైకేల్ థామస్.”

“అది క్రిస్టియన్ పేరు కదూ?”

“అవును… కాని…”

“అతను క్రిస్టియన్ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లాడని మీకెలా తెలుసు?”

“లేదు. నాకదేం తెలియదు…”

“మరి అటువంటప్పుడు క్రిస్టియన్ పేరెందుకు పెట్టారు?”

“అది…మరి ఏదో ఒక పేరు పెట్టాలికదా. అయినా, ఈ పేరుతో వచ్చిన ఇబ్బందేమిటి?”

“అన్నీ ఇబ్బందులే ఫాదర్. మీకు తెలియదా, ప్రస్తుతం మతమార్పిడి విషయాల్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయో. క్రైస్తవమతంలోకి పెద్దఎత్తున జరుగుతున్న మతమార్పిడులకు వ్యతిరేకంగా ఎన్నో చర్చిలను తగలబెడుతున్నారు.”

“కాని ఇది మతమార్పిడేమీ కాదే.”

“చూడండి ఫాదర్. ఇందులో మీకేమీ సంకుచిత ప్రయోజనాలున్నాయని మేమనటంలేదు. కాని ఇప్పటికే మీరొక హిందూ బాలుణ్ణి మతం మార్చారని వార్త బైటికి పొక్కింది.”

“కాని అతను హిందువు అని ఎలా చెప్పగలరు?”

“రేపు మీ చర్చిని ముట్టడించే రౌడీ మూకలకు ఇవేం పట్టవు. అందుకే మేం మీకు సహాయం చేయటానికి వచ్చాం.”

“అయితే మీరేమంటారు?”

“మీరు ఆ పిల్లవాడి పేరు వెంటనే మార్చండి.”

“ఏమని మార్చాలి?”

“ఆ… అతనికో హిందూ పేరు పెడితే సరిపోతుంది. మా దేవుడి పేరు ‘రామ్’ అని పెట్టండి.” అన్నాడు శర్మ.

హిదాయతుల్లా మెల్లగా దగ్గి అన్నాడు, “ఎక్స్క్యూజ్ మి, మిస్టర్ శర్మా. ఒక సమస్యను తీర్చబోయి మరో సమస్యను తెచ్చిపెడుతున్నట్లున్నారు. ఆ పిల్లాడు పుట్టుకతో హిందువు అని ఏం నమ్మకం? ముస్లిం అయ్యుండొచ్చు కదా. కాబట్టి ‘మహమ్మద్’ అని ఎందుకు పిలవకూడదు?”

మరో అరగంట వరకు శర్మ, హిదాయతుల్లాల మధ్య వాళ్ళ పేర్ల గురించి చర్చ జరిగిన తర్వాత, తిమోతీ అన్నాడు.

“చూడండి. రౌడీమూకల దాడిని తప్పించుకోవటానికి, ఆ పిల్లాడి పేరు మార్చటమే పరిష్కారమైతే, ఆ పని చేయటానికి నేను సిద్ధమే. మీ ఇద్దరు సూచించిన పేర్లూ నేను స్వీకరిస్తాను. వాడి పేరు ఇకనుంచీ ‘రామ్ మొహమ్మద్ థామస్’. ఇది మీకు సమ్మతమే అనుకుంటాను.”

అదృష్టవశాత్తూ, ఆ రోజు వాళ్ళతోపాటు సింగ్ రాకపోవటం నాకు మంచిదైంది.

(ఈ వ్యాసపరంపర చివరి భాగం వచ్చే వారం)

4 Comments
  1. శంకర్ August 21, 2009 /
  2. మేడేపల్లి శేషు August 21, 2009 /
    • శంకర్ August 21, 2009 /