Menu

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (మూడో భాగం)

Vikas Swarupఈ శీర్షికలో వచ్చిన మిగిలిన రెండు భాగాలు:

మొదటి భాగం

రెండో భాగం

‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు

నేను అరెస్టయ్యాను – ఒక క్విజ్ షోలో గెలిచినందుకు.

రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత పోలీసులు నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చారు. వీధికుక్కలు కూడా అరిచి అరిచి అలసిపోయి నిద్రలోకి జారుకున్నాయి. వాళ్ళు భళ్ళున తలుపులు తోసుకునివచ్చి, సంకెళ్ళు వేసి నన్ను దూరంగా ఆగిఉన్న ఎర్రలైటు వెలుగుతున్న పోలీసు జీపు దగ్గరకు నడిపించుకుపోయారు.

మురికివాడ మొత్తం నిద్రలో జోగుతోంది. ఆకు అలికిడి కూడా లేదు. ఏ ఇంట్లోనుంచీ ఒక్కరూ బైటికి రాలేదు. దూరంగా చింతచెట్టు మీది గుడ్లగూబ మాత్రం నామీద సానుభూతితో కాబోలు, గట్టిగా కూసింది.

‘ధారవి’ లో ఇటువంటి అరెస్టులు లోకల్ ట్రైనులో జేబుదొంగతనాలంత మామూలుగా జరిగిపోతుంటాయి. రోజూ ఎవడో ఒకడిని పోలీసులు అరెస్టుచేసి లాక్కుపోతూ ఉంటారు. కొంతమందిని డొక్కల్లో తంతూ, జుట్టుపట్టి ఈడ్చుకుపోతూ ఉంటారు కూడా. వాళ్ళు భయంతో చేసే ఆర్తనాదాలు గుండెల్లో దడ పుట్టిస్తాయి. మరికొంతమంది నిశ్శబ్దంగా పోలీసులకు లొంగిపోతుంటారు. వాళ్ళు పోలీసులు ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్నట్టుగా ఉంటుంది. ఎర్రలైటు పోలీసు జీపును చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంటారు వాళ్ళు. రోట్లో తలపెట్టి రోకటిపోటుకు వెరవెటమెందుకని కాబోలు.

నేను కూడా నా అరెస్టును ప్రతిఘటించి ఉండొచ్చు. నాకేమీ తెలియదని మొరాయించి ఉండొచ్చు. కేకలు వేసి, చుట్టుపక్క వాళ్ళను పోగుచేసి ఉండొచ్చు. కాని అవేవీ నాకు సహాయపడవని నాకు తెలుసు. ఒకవేళ వాళ్ళు నిద్రలేచినా, “ఇదేదో మరో చిల్లర దొంగతనం కేసులే” అని చిటికెలేసి ఆవులిస్తూ మళ్ళీ నిద్రలోకి జారుకోవటం తప్పించి మరేమీ జరగదు. ఆసియాలోని అతిపెద్ద మురికివాడలోనుంచి నాబోటి ఒక అభాగ్యుడి అరెస్టు వాళ్ళ జీవితాలనేమీ ప్రభావితం చేయదు. తెల్లవారి లేస్తే, వీధి పంపు దగ్గర గలాటాలు, ఎవరి బ్రతుకుతెరువును వారు వెతుక్కుంటూ ఏడున్నర లోకల్ కోసం పరుగులు – అంతా మామూలే.

నన్నెందుకు అరెస్టు చేశారనేది కూడా వాళ్లకు పట్టలేదు. అంతెందుకు? ఇద్దరు కానిస్టేబుళ్లు తోసుకుంటూ నా గుడిసెలోకి వచ్చినప్పుడు నేను మాత్రం నన్నెందుకు అరెస్టు చేస్తున్నారని అడిగానా? అసలు నువ్వీ భూమ్మీద జీవించడమే అక్రమమైనప్పుడు, పేదరికం అంచున నీ ఉనికే ప్రశ్నార్థకమైనప్పుడు, అడుగుపెట్టడానికే అందరూ అసహ్యించుకునే మురికివాడలో ప్రతి అంగుళం కోసం అంతర్యుద్ధాలు జరుగుతున్నప్పుడు, చివరికి దొడ్డికి వెళ్ళటానికి కూడా క్యూలలో నిరీక్షించాల్సి వచ్చినప్పుడు, అరెస్టు కావటం అనేది ఒక అనూహ్యమైన విషయమేమీ కాదు. ఏదో ఒకనాడు నీ పేరున అరెస్టు వారెంటు వస్తుందని, నిన్ను తీసుకువెళ్ళటానికి ఎర్రలైటు పోలీసుజీపు సిద్ధంగా ఉంటుందని నీ మనసులో ఏ మూలో ఒక నమ్మకం ఏర్పడిపోతుంది.

కొంతమంది ఇది నా చేజేతులా చేసుకున్నదే అంటారు. ఆ క్విజ్ షోలో పాల్గొనటం వల్లే ఇదంతా జరిగిందంటారు. ఉన్నవాళ్ళను, లేనివాళ్ళను వేరుచేసే లక్ష్మణరేఖను దాటి వెళ్ళొద్దన్నామా అని గుర్తుచేస్తారు. అసలు చేతిలో చిల్లిగవ్వ లేనివాడివి నువ్వెందుకు ఆ బుర్రకు పనికల్పించే పోటీలో పాల్గొనటం? మనలాంటి వాళ్ళం కాళ్ళూ, చేతులూ తప్ప బుర్రను ఉపయోగించటం నేరం అంటారు.

* * *

ఇంటరాగేషన్ రూం బైట ఇద్దరు కానిస్టేబుళ్లు చెరొకవైపూ చెక్కుచెదరని అటెన్షన్లో నిలబడి ఉన్నారు – లోపలెవరో ముఖ్యమైన వ్యక్తులున్నారనటానికి గుర్తుగా. ఈరోజు ఉదయం వాళ్ళే నోటినిండా పాన్ నములుతూ, కుళ్ళు జోకులు వేసుకుంటూ కనిపించారు.

గాడ్బోలె నన్ను రూంలోకి దాదాపుగా తోశాడు. అక్కడ గోడకు ఆ ఏరియాలోని నేరాల వివరాల పట్టిక వేలాడదీసిన చోట ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. నేను వాళ్ళలో ఒకతనిని గుర్తుపట్టాను. ఆడవాళ్ళలాగా బారుగా జుట్టు వేలాడుతూ రాక్ స్టార్ లా ఉన్నతను, చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని క్విజ్ షో వేదికపై అందరికీ సూచనలిస్తూ కనిపించాడు. తెల్లగా ఉన్న మరో బట్టతలతను ఎవరో నాకు తెలియలేదు. అతను ఊదారంగు సూటూ, నారింజరంగు టై తో ఉన్నాడు. ఒక్క తెల్లవాళ్ళే ఇంత చిటచిటలాడే ఎండలో కూడా సూట్ వేసుకుంటారు. అతన్ని చూస్తే, నాకు కల్నల్ టేలర్ గుర్తొచ్చాడు.

సీలింగ్ ఫాన్ ఫుల్ స్పీడులో తిరుగుతున్నా, కిటికీలు లేని ఆ గదిలో గాలి లేనట్టే అనిపిస్తోంది. ఫాన్ గాలి, తెల్లగా సున్నంవేసిన గోడలకు తగిలి మరింత వేడెక్కుతోంది. పై కప్పుకు అడ్డంగా ఉన్న సన్నని ఇనుపదిమ్మ గదిని రెండుగా విభజిస్తున్నట్టుగా ఉంది. ఆ ఇనుపదిమ్మ నుంచి ఒక లాంప్ షేడ్ వేలాడుతోంది. ఆ గదిలో ఒక తుప్పుపట్టిన ఇనుప టేబుల్, మూడు కుర్చీలు తప్ప మరేం లేవు.

“ఇతనే సర్, రామ్ మొహమ్మద్ థామస్” గాడ్బోలె నన్ను ఆ తెల్లవ్యక్తికి పరిచయం చేశాడు. అది సర్కస్ లో రింగ్ మాస్టర్ తను మచ్చిక చేసిన జంతువును ప్రేక్షకులముందు ప్రదర్శించినట్టుగా ఉంది.

తెల్లమనిషి కర్చీఫుతో ముఖం అద్దుకుంటూ నన్నొక కొత్త తెగకు చెందిన కోతిని చూసినట్టు చూశాడు.
“అయితే ఇతనేనా ఆ ఫేమస్ విన్నర్! కాని నేననుకున్న దానికంటే వయసు ఎక్కువగానే కనిపిస్తున్నాడే” అన్నాడు ఇంగ్లీషులో.

అతని విదేశీయాసను నేను గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నేను తాజ్ మహల్ దగ్గర చూసిన అమెరికన్ టూరిస్టుల ముక్కుతో మాట్లాడే యాసనే పోలి ఉంది అది.

ఆ ‘అమెరికన్’ కుర్చీలో కూర్చున్నాడు. అతని కళ్ళు నీలంగా, ముక్కు కాస్త గులాబీ రంగులో ఉంది. నుదిటిమీది రక్తనాళాలు ఆకుపచ్చగా, చిన్న చెట్టుకొమ్మల్లా కనిపిస్తున్నాయి.

“హలో” అన్నాడు నన్ను చూసి, “నా పేరు నీల్ జాన్సన్. నేను క్విజ్ షో నిర్వహించే న్యూఏజ్ టెలిమీడియా సంస్థ ప్రతినిధిని. ఇతను ప్రొడ్యూసర్ బిల్లీ నందా” అని పరిచయం చేశాడు.

నేనేం మాట్లాడలేదు. కోతులు మాట్లాడవు కదా. అదీ ఇంగ్లీషులో.

అతను నందా వైపు తిరిగి “ఇతనికి ఇంగ్లీషు అర్థమవుతుంది కదా” అన్నాడు.

“నీకేమన్నా మతిపోయిందా నీల్. ఆఫ్టరాల్ ఒక రెస్టారెంటులో వెయిటర్ ఇంగ్లీషు మాట్లాడగలడని ఎలా అనుకుంటావ్” అన్నాడు నందా విసుగ్గా.

ఇంతలో దూరంనుంచి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ సైరను కూత వినబడింది. ఒక కానిస్టేబుల్ పరుగెత్తుకుంటూ వచ్చి గాడ్బోలె చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే అతను బైటికివెళ్ళి కాసేపట్లో కాస్త పొట్టిగా, లావుగా యూనిఫాంలో ఉన్న వ్యక్తితో తిరిగొచ్చాడు. అతనో పెద్ద పోలీసాఫీసరని ఆ అధికార దర్పం ఉట్టిపడే యూనిఫాం చెప్పకనే చెప్తోంది. గాడ్బోలె, జాన్సన్ వైపు పళ్ళు బైటపెట్టి నవ్వుతూ, “మిస్టర్ జాన్సన్, కమిషనర్ గారొచ్చారు” అన్నాడు.

జాన్సన్ లేచి నిలబడ్డాడు. “థాంక్యూ కమిషనర్ గారూ. బిల్లీ మీకు ఇదివరకే తెలుసనుకుంటాను” అన్నాడు.

కమిషనర్ తలూపుతూ “హోం మినిస్టరునుంచి మెసేజ్ రాగానే ఇలా వచ్చాను” అన్నాడు.

“అవునవును. ఆయన మిఖెలోవ్ కి పాత ఫ్రెండు”

“చెప్పండి. ఏం చెయ్యగలను మీకు?”

“సర్! W3B విషయంలో మీ సహాయం కావాలి”

“W3B?”

“అదే. Who Will Win Billion కి షార్ట్ ఫాం”

“ఏమిటది?”

“అదొక క్విజ్ షో. మా కంపెనీ 35 దేశాల్లో ప్రారంభించింది. ముంబై అంతటా మీరు మా అడ్వర్టయిజ్మెంట్లు చూసే ఉంటారు.”

“లేదు. నేనంత గమనించలేదు. ఇంతకీ బిలియన్ ఎందుకు?”

“ఎందుక్కాదు? మీరు Who Wants to be a Millionaire ప్రోగ్రాం చూశారా?”

“కౌన్ బనేగా కరోడ్ పతా? అది మా ఇంట్లో అందరం విడవకుండా చూసేవాళ్ళం.”

“ఎందుకు చూసేవాళ్ళో చెప్పండి?”

“ఎందుకంటే… చాలా ఇంట్రెస్టింగా ఉంటుంది.”

“ఒకవేళ దాని ప్రైజ్ మనీ పదివేలే పెట్టామనుకోండి. అప్పుడూ అంతే ఇంట్రెస్టింగా ఉంటుందంటారా?”

“ఉండదనుకుంటా”

“అదే మరి. చూశారా. ప్రపంచంలో, అందరూ అనుకునేట్టు అతిపెద్ద ఆకర్షణ సెక్స్ కాదు. డబ్బు. ఎంత పెద్ద మొత్తమయితే, అంత ఆకర్షణ”

“ఓహో! ఇంతకీ మీ షోలో క్విజ్ మాస్టర్ ఎవరు?”

“ప్రేమ్ కుమార్ దాన్ని నిర్వహిస్తున్నారు.”

“ప్రేమ్ కుమారా? ఎవరు? ఆ ‘బి’ గ్రేడ్ యాక్టరా! అతనికి అమితాబచ్చన్ పాపులారిటీలో సగం కూడా లేదు కదా?”

“ఫర్వాలేదు. ఇప్పుడు కాకపొతే తర్వాత పాపులర్ అవుతాడు. అతనికి ఇండియన్ న్యూఏజ్ టెలిమీడియాలో 29 శాతం వాటా ఉంది. కాబట్టి అతన్నే ఎంచుకోవలసి వచ్చింది మేము.”

“ఓకే! నాకిప్పుడర్థమైంది. ఇంతకీ ఇతను….ఏం పేరు? అదే…రామ్ మొహమ్మద్ థామస్…ఇందులోకేలా వచ్చాడు?”

“అతను పోయినవారం మా పదిహేనో ఎపిసోడ్ లో పాల్గొన్న అభ్యర్థి.”

“అయితే?”

“అతను షోలోని పన్నెండు ప్రశ్నలకూ సరైన సమాధానాలు చెప్పి బిలియన్ గెలిచాడు.”

“ఏంటీ! జోక్ చేస్తున్నారా?”

“జోక్ కాదు. నిజమే. మేమూ మొదట మీలాగే ఆశ్చర్యపోయాం. ఇతను ఆ పోటీలో జాక్ పాట్ కొట్టి చరిత్ర సృష్టించాడు. కాకపొతే, ఆ ఎపిసోడ్ టివిలో ఇంకా ప్రసారం కాలేదు. కాబట్టి చాలామందికి ఇంకా తెలియదు”

“ఓకే. బిలియన్ గెలిచాడంటున్నారు. ఇంకేవిటి సమస్య?”

జాన్సన్ ఒక్కక్షణం ఆగి నెమ్మదిగా, “నేనూ, బిల్లీ మీతో కొంచెం ప్రైవేటుగా మాట్లాడొచ్చా?” అన్నాడు.

కమిషనర్ గాడ్బోలేవైపు చూశాడు. ఆ చూపును అర్థం చేసుకున్న గాడ్బోలె, నావైపోసారి గుడ్లు మిటకరించి చూసి, బైటికెళ్ళిపోయాడు నేను రూంలో ఉన్నా నన్నెవరూ పట్టించుకోలేదు. బహుశా వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడుకొంటోంది నాకర్థం కాదనుకున్నారేమో.

“ఓకే. ఇప్పుడు చెప్పండి.” అన్నాడు కమిషనర్.

“చూడండి సర్, మిఖేలోవ్ ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద మొత్తం బహుమతిగా ఇచ్చే స్థితిలో లేడు” అన్నాడు జాన్సన్.

“మరి అటువంటప్పుడు ఇంత పెద్ద బహుమతి ఎందుకు పెట్టినట్టు?” అన్నాడు కమిషనర్.

“అది…అదొక బిజినెస్ ట్రిక్. అంతే”

“చూడండి. మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. అదొకవేళ బిజినెస్ ట్రిక్కే అనుకున్నా, ఎవరో ఒకరు ప్రైజు గెలిచారు కాబట్టి, మీ ప్రోగ్రాంకి మరింత పేరు రాదా? Who Wants to be a Millionaire ప్రోగ్రాంలో ఎవరైనా కొత్త వ్యక్తి గెలవగానే కార్యక్రమం చూసేవాళ్ళ సంఖ్య రెట్టింపయ్యేదట.”

“మీరన్నది నిజమే సర్. కాని టైమింగండీ బాబూ టైమింగ్. మా కార్యక్రమానికి ఓ ప్లానింగ్ ఉంది. దాని ప్రకారం, మొదటి ఎనిమిది నెలలు ఎవరూ ఫైనల్స్ కు చేరకుండా జాగ్రత్తపడితేగాని, అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా మా పెట్టుబడి మాకు తిరిగిరాదు. కాని ఈ వెధవ మా ప్లాన్స్ అన్నీ తలకిందులు చేశాడు.”

కమిషనర్ విషయం అర్థమైనట్టుగా తలూపి, “ఓకే. ఇప్పుడేం చెయ్యమంటారు నన్ను?” అన్నాడు.

“వీడు – ఈ థామస్ అనే కుర్రాడు, ఈ షోలో మోసం చేసి గెల్చినట్టు నిరూపించాలి. ఆడియన్స్ లో వాడి మనుషులెవరో ఉండి, వాడికీ సమాధానాలు అందించారనేది నా అనుమానం. కొంచెం ఆలోచించండి. ఎన్నడూ స్కూలుకు వెళ్లనివాడికి, కనీసం న్యూస్ పేపర్ చదవనివాడికి ఈ సమాధానాలు ఎలా తెలుస్తాయంటారు?” అన్నాడు జాన్సన్ ఆవేశంగా.

కమిషనర్ బుర్ర గోక్కుంటూ అన్నాడు, “సరే…నాకైతే ఖచ్చితంగా ఈ విషయం తెలియదు. కాని ఎంతోమంది పేదరికంలోనుంచి వచ్చిన పిల్లలు తర్వాతి జీవితంలో మేధావులైన సందర్భాలు చాలానే ఉన్నాయికదా. ఐన్ స్టీన్ ముందు ఒక హైస్కూల్ డ్రాపౌట్. కాదంటారా?”

“చూడండి కమిషనర్ గారూ! వీడు ఐన్ స్టీన్ కాదు అని మీకు నిరూపించగలం” అని నందావైపు సూచనగా చూశాడు జాన్సన్.

నందా స్టైల్ గా ఉన్న తన జుట్టును సవరించుకుంటూ నా దగ్గరకొచ్చాడు. నాతో హిందీలో మాట్లాడుతూ, “చూడు రామ్ మొహమ్మద్ థామస్, నీకు నిజంగా మా క్విజ్ లో గెలవగల తెలివితేటలే ఉంటే, ఇప్పుడు మేం పెట్టబోయే మరో చిన్న క్విజ్ లో పాల్గొని, నువ్వది నిరూపించుకోవాలి. ఇవి చాలా తేలిక ప్రశ్నలు. మామూలు తెలివితేటలున్న వాళ్లెవరైనా సరైన సమాధానాలు చెప్పేస్తారు.”

నన్ను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని, ప్రారంభించాడు.

“రెడీయా? మొదటి ప్రశ్న. ఫ్రాన్స్ దేశపు కరెన్సీ ఏమిటి? (ఎ) డాలర్ (బి) పౌండ్ (సి) యూరో (డి) ఫ్రాంక్”

నేను నిశ్శబ్దంగా ఉన్నాను. ఉన్నట్టుండి కమీషనర్ చెయ్యి నా చెంపను బలంగా తాకింది.

“బాస్టర్డ్. చెవుడా నీకు? సమాధానం చెప్పు.” గర్జించాడు.

నందా కమిషనరును వారిస్తూ “ప్లీజ్, కమిషనర్ గారూ. మనం దీన్ని కాస్త మర్యాదపూర్వకంగా నిర్వహించుకుంటే బాగుంటుంది.” అని నావైపు తిరిగి “ఎస్, నీ జవాబేమిటి?” అన్నాడు.

“ఫ్రాంక్” అన్నాను నీరసంగా.

“తప్పు. సరైన సమాధానం ‘యూరో’. ఓకే. రెండో ప్రశ్న. చంద్రుడిపై కాలుపెట్టిన తొలి మానవుడెవరు? (ఎ) ఎడ్విన్ ఆల్డ్రిన్ (బి) నీల్ ఆమ్ స్ట్రాంగ్ (సి) యూరి గగారిన్ (డి) జిమ్మీ కార్టర్”

“తెలియదు”

“నీల్ ఆమ్ స్ట్రాంగ్. మూడో ప్రశ్న. పిరమిడ్స్ ఎక్కడ ఉన్నాయి? (ఎ) న్యూయార్క్ (బి) రోమ్ (సి) కైరో (డి) పారిస్.

“తెలియదు.”

“కైరోలో ఉన్నాయి. నాలుగో ప్రశ్న. అమెరికా అధ్యక్షుడెవరు? (ఎ) బిల్ క్లింటన్ (బి) కోలిన్ పావెల్ (సి) జాన్ కెరీ (డి) జార్జ్ బుష్.”

“తెలియదు.”

“జార్జ్ బుష్. సారీ మిస్టర్ థామస్. ఒక్క ప్రశ్నక్కూడా సరైన సమాధానం చెప్పలేకపోయావు.”

నందా కమిషనర్ వైపు తిరిగి ఇంగ్లీషులో అన్నాడు. “చూడండి సర్. వీడో మొద్దు వెధవ అని తెలిసింది కదా. పోయినవారం ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏదో ట్రిక్ చేసే చెప్పాడనటంలో ఏమాత్రం సందేహం లేదు.”

“ఏం ట్రిక్ చేశాడంటారు?” అడిగాడు కమిషనర్ అయోమయంగా.

“అదే నాకర్థం కావడంలేదు. నాదగ్గర ఆ షో తాలూకు ఫుటేజ్ డివిడి కాపీలు రెండున్నాయి. మా ఎక్స్ పర్ట్స్ మైక్రోస్కోప్ పెట్టుకుని వెతికారు కాని, ఎక్కడా ఏ క్లూ దొరకలేదు. కాని తప్పకుండా అది ఒకనాటికి బైటపడుతుంది. ఆ నమ్మకం నాకుంది.” దృఢంగా అన్నాడు నందా.

ఉదయంనుంచీ ఏమీ తినకపోవటంతో నా కడుపులో పేగులు కరకరమంటున్నాయి. తెరలు, తెరలుగా దగ్గొస్తోంది.

జాన్సన్ నావైపు చురుగ్గా చూస్తూ అన్నాడు, “కమిషనర్ గారూ, మీకు గుర్తుందా? Who Wants to be a Millionaire ప్రోగ్రాంలో ఒక ఆర్మీ మేజర్ మిలియన్ పౌండ్లు గెలిచిన సంగతి? ఇంగ్లండులో జరిగిందది. అతని గెలుపును అనుమానించిన కంపెనీ బహుమతి ఇవ్వడానికి నిరాకరించింది. పోలీసులు అతనిపై కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు చేశారు. చివరికి తేలిందేమిటంటే, అతని మనిషొకడు ఆడియన్సులో ఉండి, ‘ఒకరకంగా’ దగ్గటంద్వారా అతనికి సమాధానాలు అందించాడని తెలిసింది. తప్పకుండా అలాంటిదేదో ఇక్కడ కూడా జరిగింది.”

“అయితే, మనం అలా దగ్గినవాళ్ళకోసం చూద్దామంటారా?” అమాయకంగా అడిగాడు కమిషనర్.

“లేదు. ఈ షోలో అలాంటిదేమీ జరగలేదు. వీడు మరేదో సంకేతాన్ని ఉపయోగించి ఉంటాడు.”

“పేజర్ లేదా సెల్ ఫోన్ ద్వారా ఏమైనా సంకేతాలు పంపించి ఉండొచ్చా?”

“లేదు. అలాంటివేం వాడిదగ్గర లేవని నమ్మకంగా చెప్పగలం. అలాంటివి మా స్టూడియోలో పనిచెయ్యవు కూడా.”

“లేకపోతే, మెదడులో ఏదైనా మెమరీ చిప్ లాంటిది అమర్చుకుని ఉన్నాడంటారా?” ఏదో ఐడియా తట్టినవాడిలా అన్నాడు కమిషనర్.

జాన్సన్ పెద్దగా నిట్టూరుస్తూ, “కమిషనర్ గారూ, మీరు సైన్స్ ఫిక్షన్ సినిమాలవీ ఎక్కువగా చూస్తుంటారా ఏమిటి? చూడండి. వాడేం చేసిఉంటాడో మాకైతే తెలియదు. అది కనుక్కునే బాధ్యత మీది. కాని వీడొక పచ్చిమోసగాడని మాత్రం నా నామ్మకం. అది నిరూపించటంలో మీరు మాకు సహాయం చేయాలి.” అన్నాడు.

కమిషనర్ ఏదో సలహా ఇస్తున్నట్టు మెల్లగా, “వాణ్ణి కొనేస్తే పోలా?” అన్నాడు.

“వాడికి బిలియనుకి ఎన్ని సున్నాలుంటాయో కూడా తెలియదు. అలాంటివాడికి ఓ పదో, ఇరవయ్యో వేలు పడేసి వదిలించుకుంటే పోలా?” అన్నాడు మళ్ళీ వివరంగా.

ఆ కమిషనర్ ముఖం మీద ఒక్క గుద్దు గుద్ది, చుక్కలు చూపించాలనిపించింది నాకు. ఆ క్విజ్ షోలో పాల్గొనటానికి ముందు, నాకు బిలియన్ విలువ తెలియదు. నిజమే. కాని అది చరిత్ర. ఇప్పుడు నాకు తెలుసు. నాకు న్యాయంగా రావలసిన బహుమతి నాక్కావాలి – ఒకటి పక్కన తొమ్మిది సున్నాలతో సహా.”

“అది కుదరని పని” జాన్సన్ అన్నాడు “అటువంటి పని మనల్ని తేలిగ్గా కోర్టుకీడుస్తుంది. వీడు న్యాయంగా ఈ షోలో గెలిచినవాడైనా అయ్యుండాలి. లేదా పచ్చిమోసగాడైనా అయ్యుండాలి. బహుమతి పొందటమో, జైలుకు పోవటమో ఏదో ఒకటే జరగాలి. దీనికి మధ్యేమార్గం అంటూ లేదు. వాడు జైలుకు పోవటానికి మాకు మీ సహాయం కావాలి. ఇప్పటికిప్పుడు బిలియన్ కుమ్మరించాలంటే, మిఖేలోవ్ కి హార్ట్ అటాక్ రావటం ఖాయం.”

కమిషనర్ జాన్సన్ కళ్ళలోకి సూటిగా చూస్తూ “మీ పాయింట్ నాకర్థమైంది” అని అతనికి దగ్గరగా జరిగి “మరి నాకేంటి ఇందులో?” అన్నాడు.

ఆ ప్రశ్న ముందే ఊహించినవాడిలా జాన్సన్ అతన్ని భుజమ్మీద చెయ్యేసి పక్కకు తీసుకెళ్ళాడు. కొంచెంసేపు గుసగుసగా మాట్లాడినతర్వాత, నాకు రెండు మాటలు మాత్రం వినిపించాయి “టెన్ పర్సెంట్” అని.

కమిషనర్ ముఖం ప్రసన్నంగా కనిపించింది. “ఓకే, ఓకే, జాన్సన్, మీ పని అయిపోయినట్టే అనుకోండి. ఆగండి. గాడ్బోలేని పిలుస్తాను.” అన్నాడు.

ఇన్స్పెక్టర్ గాడ్బోలె లోపలికొచ్చాడు.

“గాడ్బోలె, నువ్వింతవరకూ ఇతన్నుంచి ఏం సమాచారం రాబట్టావు?” అడిగాడు కమిషనర్.

గాడ్బోలె నావైపు నిస్సహాయంగా చూశాడు. “ఏమీ లేదు సార్. వెధవను ఎన్నిసార్లు అడిగినా ఒకటే జవాబు – తనకా క్విజ్ లో అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు తెలుసునని. అందులో అదృష్టమే తనని గెలిపించిందంటాడు.”

“అదృష్టం. హ్హె” వ్యంగంగా నవ్వాడు జాన్సన్.

“ఎస్సర్. నేను ఇప్పటివరకూ థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు. మీరు ఒక్కసారి పర్మిషన్ ఇచ్చారంటే, వాడి తోడుదొంగలనందర్నీ నిమిషంలో పట్టేస్తాను.” చెప్పాడు గాడ్బోలె.

కమిషనర్ జాన్సన్, నందాల వైపోసారి చిలిపిగా చూసి “మీకది ఓకేనా?” అన్నాడు.

నందా తల అడ్డంగా ఊపాడు. అతని జుట్టు చిందరవందరగా ఎగిరింది. “లేదు, లేదు. ఇతన్ని అరెస్టు చేసిన విషయం ఇప్పటికే పేపర్లవాళ్ళకి తెలిసిపోయింది. మనం అతన్ని హింసించినట్టు తెలిసిందంటే, మన పని అయినట్టే. ఎవరో ఒక బ్లడీ ఎన్జీవో వాళ్ళు వచ్చి పౌరహక్కుల్ని కాలరాసారంటూ చేయాల్సిన గొడవంతా చేస్తారు” అన్నాడు

కమిషనర్ అతని వీపు మీద తడుతూ, “బిల్లీ, నువ్వు కూడా అచ్చు అమెరికన్లలాగే ఆలోచిస్తున్నావే. డోంట్ వరీ. గాడ్బోలె ప్రొఫెషనల్. వాడి ఒంటిమీద ఒక్క గుర్తు కూడా కనపడదు.” అన్నాడు.

ఆకలికి నా పేగులు అరుస్తున్నాయి. వాంతవుతుందా అన్నట్టుగా ఉంది.

కమిషనర్ వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు “గాడ్బోలె, రేప్పొద్దటికల్లా నాకు మొత్తం వివరాలు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీ ప్రమోషన్ దీనిమీదే ఆధారపడి ఉందని మాత్రం గుర్తుంచుకో.”

“థాంక్యూ సర్, థాంక్యూ” అని ఒక వెర్రినవ్వు నవ్వుతూ “అదంతా నాకొదిలేయండి సర్. మీరు రేప్పొద్దున వచ్చేసరికి వాడు మహాత్మాగాంధీ హత్య కూడా నేనే చేశానని ఒప్పుకుంటాడు”

నేను మహాత్మాగాంధీ హంతకుడిని గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. ఆయన చనిపోయే చివరి క్షణాల్లో “హే రామ్” అన్నాడట. అవును. నా పేరూ అదే. ఫాదర్ తిమోతీ నాకీ మాటకు అర్థం చెప్పాడు. రాముడు హిందువుల ఆరాధ్య దేవుడని, తండ్రికిచ్చిన మాటకోసం పధ్నాలుగేళ్ళు అరణ్యవాసం చేశాడని.

గాడ్బోలె వాళ్ళను పంపించి వెనక్కి వచ్చాడు. బుసకొడుతూ ఇంటరాగేషన్ రూంలోకి వచ్చి భళ్ళున తలుపేశాడు. నావైపు వేలు చూపిస్తూ, “మాదర్ఛోత్! బట్టలిప్పు.” అన్నాడు.

* * *

(ఇందులో పోలీసు ఇంటరాగేషన్ సన్నివేశం ఎక్కువభాగం ఆక్రమించడంతో నేను అనుకున్న ఇంకా కొన్ని ముఖ్యమైన భాగాల్ని ఇందులో పొందుపరచలేకపోయాను. కాబట్టి అవి వచ్చే భాగంలో…. శేషు)

10 Comments
 1. గీతాచార్య August 14, 2009 /
 2. Sarath 'Kaalam' August 14, 2009 /
 3. శంకర్ August 14, 2009 /
 4. మేడేపల్లి శేషు August 17, 2009 /
  • గీతాచార్య August 17, 2009 /
  • శంకర్ August 17, 2009 /
   • chandrasen August 18, 2009 /
 5. rayraj August 18, 2009 /