Menu

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (రెండవ భాగం)

మొదటి భాగం ఇక్కడ చదవండి

సినిమాలో కథ

(సినిమా చూసినవాళ్ళు ఈ భాగాన్ని స్కిప్ చెయ్యొచ్చు).

slumdog_millionaireముంబాయిలోని అతిపెద్ద (ఆసియాలోనే) మురికివాడ అయిన ధారవిలో పెరిగే పిల్లలు – సలీం, జమాల్. సలీం, జమాల్ ఇద్దరూ అన్నదమ్ములు. ఒక మతకలహాల సందర్భంలో వాళ్ళ తల్లి మరణిస్తుంది. అప్పటినుంచీ వాళ్ళు అనాథలవుతారు. వాళ్లకు మరో అనాథపిల్ల లతిక తోడవుతుంది. అనుకోకుండా ఒకసారి వాళ్లకు మామన్ అనే వ్యక్తితో పరిచయమవుతుంది. మామన్ వాళ్లకు తినడానికి మంచి తిండి పెట్టి, తన దగ్గరకు తీసుకువెళతాడు. తీరా అక్కడికెళ్ళాక వాళ్లకు అతను చిన్నపిల్లలను ప్రలోభపెట్టి, వాళ్ళను వికలాంగులను చేసి, వాళ్ళతో భిక్షాటన చేయించే ఒక ముఠానాయకుడని తెలుస్తుంది. మామన్ పిల్లలకు మత్తును కలిగించడానికి ఉపయోగించే క్లోరోఫాంను అతని అనుచరుడు పున్నోజ్ ముఖాన చిందించి వాళ్ళు అక్కడినించి తప్పించుకుంటారు. లతిక మాత్రం వాళ్ళు తప్పించుకోవటానికి పరుగెత్తుతూ ఎక్కిన రైలును అందుకోలేక అక్కడే ఉండిపోతుంది.

సలీం , జమాల్ రైళ్ళలో చిన్న, చిన్న వస్తువులు అమ్ముతూ, చిన్న, చిన్న దొంగతనాలు చేస్తూ, ఆగ్రా చేరుకుని, అక్కడ తాజ్ మహల్ దగ్గిర గైడుల్లాగా నటిస్తూ, విదేశీ యాత్రికులనుంచి డబ్బులు సంపాదిస్తూ జీవిస్తుంటారు. జమాల్ ప్రోద్బలంతో, లతిక ఎక్కడుందో తెలుసుకోవాలని, మళ్ళీ ముంబాయి వెళ్తారు. అక్కడ లతిక మామన్ పర్యవేక్షణలో ఒక వేశ్యా నర్తకిగా కనిపిస్తుంది. లతికను అక్కడినుంచి తప్పించే క్రమంలో సలీం మామన్ ను చంపేస్తాడు. అది తెలుసుకున్నమామన్ ప్రత్యర్థి అయిన జావేద్, సలీం తనకు పనికొచ్చే మనిషి అని అతన్ని తన ముఠాలో చేర్చుకుంటాడు. ఈ సంఘటనతో తానో హీరోనని ఫీలయిపోయిన సలీం, లతికను తనదాన్ని చేసుకోవాలని, జమాల్ ను ఇంట్లోనుంచి తరిమేస్తాడు.

ఒంటరివాడైన జమాల్, ఒక కాల్ సెంటర్లో టీలు అందించే కుర్రాడిగా చేరతాడు. కొన్నాళ్ళ తర్వాత, సలీం జాడ తెలుసుకుని, అతన్ని కలుసుకుంటాడు. లతికను గురించి అడిగితే, ఆమె ఎటో వెళ్ళిపోయిందని చెప్తాడు సలీం. కాని, సలీం ప్రస్తుత ముఠా నాయకుడు జావేద్ ఇంట్లోనే లతిక కనిపిస్తుంది. తనతో వచ్చెయ్యమన్న జమాల్ అభ్యర్థనను ఆమె తిరస్కరిస్తుంది. తనకోసం రోజూ సాయంత్రం ముంబాయి వి.టి. స్టేషనులో ఎదురుచూస్తుంటానని చెప్పి జమాల్ వెళ్ళిపోతాడు. జమాల్ కోసం ముంబాయి వి.టి. స్టేషనుకొచ్చిన లతికను, సలీం, అతని మనుషులు వెంబడించి బలవంతంగా కార్లో ఎక్కించుకుని వెనక్కి తీసుకువెళ్తారు. కాని మళ్ళీ లతిక జాడ తెలియని జమాల్, ఆమెను కనుక్కోవడానికి, తను క్విజ్ పోటీలో పాల్గొనడం మంచి మార్గమని, అందులో పాల్గొంటాడు. అందులో అడిగిన అన్ని ప్రశ్నలకూ సరిగ్గా సమాధానం చెప్పగలుగుతాడు. చిట్టచివరి ప్రశ్నకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. దానిక్కూడా సరైన సమాధానం చెప్తే, రెండు కోట్ల రూపాయల బహుమతి అతనిదవుతుంది.

ఆ దశలో, ఏదో మోసం చేసే ఈ ప్రశ్నలన్నిటికీ అతను జవాబులు చెప్పగలుగుతున్నాడని అనుమానించి, క్విజ్ పోటీ నిర్వాహకులు అతన్ని పోలీసులచేత అరెస్టు చేయిస్తారు. ఒక సాధారణ “చాయ్ వాలా” ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలకు సరిగ్గా ఎలా సమాధానాలు చెప్పగలడని వాదిస్తారు. పోలీసులు అతన్ని అనేకరకాల చిత్రహింసలకు గురిచేసినా, ఆ ప్రశ్నలకు తనకు సరైన సమాధానాలు తెలుసునని, తానేమీ మోసం చేయలేదని చెప్తాడు. అతని జీవితంలో జరిగిన అనేకానేక సంఘటనలతో ఆ ప్రశ్నలకు సంబంధముంటుంది. ప్రతి ప్రశ్న వెనుకా ఉన్న అతని జీవితకథను విన్న పోలీసులు, అతను మోసం ఏమీ చేయలేదని నిర్ధారించుకుని అతన్ని వదిలేస్తారు.

చిట్టచివరి ప్రశ్నకు సమాధానం చెప్పటానికి మళ్ళీ క్విజ్ షోకు వస్తాడు. చివరి ప్రశ్నకు అతనికి సరైన సమాధానం తెలియదు (తన జీవితంతో సంబంధం ఉన్నా). క్విజ్ నిబంధనల ప్రకారం లైఫ్ లైన్ ను ఉపయోగించుకోవచ్చు కాబట్టి, సలీంకు ఫోన్ చేస్తాడు.

ఈ లోపు, తన పొరపాటును గ్రహించిన సలీం, లతికను ఎలాగైనా జమాల్ దగ్గిరకు చేర్చాలని, ఆమెకు జావేద్ నుంచి పారిపోవటానికి అవకాశం కల్పిస్తాడు. తన సెల్ ఫోనును కూడా లతికకు ఇచ్చేస్తాడు. క్విజ్ పోటీనుంచి జమాల్ ఫోను చేసినప్పుడు అది లతిక దగ్గిరే ఉంటుంది. ఆమె ఫోన్ ఎత్తుతుంది. తను క్షేమంగా ఉన్నానని చెప్తుంది. జమాల్ ఆమెను చివరి ప్రశ్న సమాధానం అడుగుతాడు. దురదృష్టవశాత్తూ ఆమెకు అది తెలియదు. అయినా, జమాల్ ఊహించి ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాడు. అది కరెక్టవుతుంది. బహుమతి అతని కైవసమవుతుంది.

సలీం సహాయంతో లతిక పారిపోయిందని తెలుసుకున్న జావేద్ సలీం ను చంపటానికి ప్రయత్నిస్తాడు. కాని సలీం అతన్ని రివాల్వర్ తో కాల్చేస్తాడు. జావేద్ మనుషులు సలీం ను చంపేస్తారు.

బహుమతి గెలుచుకున్న జమాల్ లతిక కోసం బొంబాయి వి.టి. స్టేషనులో లతిక కోసం నిరీక్షిస్తాడు. లతిక జమాల్ ను కలుసుకుంటుంది. అక్కడితో కథ ముగుస్తుంది. మనం విన్న ప్రసిద్ధమైన, ఆస్కార్ అవార్డు పొందిన ఎ.ఆర్. రహమాన్ పాట ‘జయహో…’ ఇక్కడే వస్తుంది.

నవలలో ఏముంది?

Q&A నవలలో ప్రధాన పాత్ర పేరు రామ్ మొహమ్మద్ థామస్. “నేను అతని పాత్రని ఏ ఒక్క మతానికీ పరిమితం చేయదలుచుకోలేదు. అతను సగటు భారతీయుడిని ప్రతిబింబించేటట్లుగా ఆ పేరు పెట్టాను. అతనొక అనాథ. అందుకని మూడు మతాల మతపెద్దలు కలిసి మూడు పేర్లూ పెడతారు. దీన్ని సినిమాలో మార్చడం నాకు కొంచెం బాదే కలిగించింది.” అని చెప్పారు వికాస్ స్వరూప్. రామ్ మొహమ్మద్ థామస్ తిమోతీ అనే చర్చి ఫాదర్ దగ్గర (ఢిల్లీలో) కొంతకాలం పెరుగుతాడు. ఆ ఫాదర్ ఇంగ్లండుకు చెందినవాడు కావటంవల్ల రామ్ కు ఇంగ్లీషులో మాట్లాడటం వస్తుంది. ఆ ఫాదర్ ‘దారుణ హత్య’ తర్వాత అతను డిల్లీలోనే ఒక juvenile home లో చేర్చబడతాడు. అక్కడ అతనికి సలీంతో దోస్తీ అవుతుంది. సినిమాలో వాళ్ళిద్దరినీ అన్నదమ్ములుగా చూపించారు. అప్పుడప్పుడూ ఆ హోంని సందర్శించే ముంబైకి చెందిన ఒక సేఠ్ వాళ్ళ భవిష్యత్తు బాగుచేస్తానని చెప్పి, వాళ్ళిద్దరినీ ముంబైకి తీసుకువెళ్తాడు. రామ్ కు అతని అసలుపేరు బాబు పిళ్ళై అని తెలుస్తుంది. అక్కడ అతన్ని అందరూ ‘మామన్’ అని పిలుస్తారు. అతను కేరళలోని కొల్లంకు చెందినవాడు. మళయాళంలో ‘మామన్’ అంటే uncle అని అర్థం. ఈ పాత్రే మనకు సినిమాలో కనపడే Maman. కాని సినిమాలో అతను మళయాళీ అన్నట్టుగా చూపించలేదు. సినిమాలోలాగే అతను అనాథ పిల్లలను వికలాంగులను చేసి భిక్షగాళ్ళుగా మార్చి వాళ్ళ ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అతని దురాగతాలు తెలిసి, అక్కడినుంచి తప్పించుకుని రామ్ నీలిమాకుమారి అనే మాజీ సినీనటి ఇంట్లో పనికి కుదురుతాడు. కొన్నాళ్ళ తర్వాత విచిత్ర పరిస్థితుల్లో ఆమె మరణిస్తుంది.

రామ్, సలీం ఉండే గది పక్కన శాంతారాం అనే అతను అద్దెకు దిగుతాడు. అతను కొంతకాలం క్రితంవరకూ ఖగోళ శాస్త్రవేత్తగా చేసిన ఉద్యోగం పోగొట్టుకుని, కొంతకాలం ఒక కంపెనీలో చేరి, అదీ పోయి చివరకు విమల్ షోరూంలో సేల్స్ మాన్ గా చేస్తూ ఉంటాడు. జీవితంలో నిరాశ, నిస్పృహలతో ఉండి, తాగుడుకు బానిసై భార్యను, కూతురుని కొడుతూ, తిడుతూ ఉంటాడు. ఒకరోజు కన్నకూతురు ‘గుడియా’ పైనే అత్యాచారం చేయబోతాడు. అది చూస్తూ సహించలేని రామ్ అతన్ని మెట్లపైనుండి కిందికి తోసేస్తాడు. అతను చనిపోయాడనే భయంతో, స్నేహితుడు సలీంని, ముంబాయిని వదిలి, తనకు తెలిసిన మరొక ఊరు ఢిల్లీకి వచ్చేస్తాడు. ఢిల్లీలో ఒక ఆస్ట్ర్రేలియన్ దౌత్యాధికారి ఇంట్లో పనికి కుదురుతాడు.

ఇంట్లో నౌకర్లు, కుటుంబ సభ్యులపై ఎప్పుడూ నిఘా పెట్టే ఆ అధికారి, తనే భారత రక్షణశాఖకు సంబంధించిన రహస్యాలని, ఆ శాఖలోని ఒక ఉద్యోగి ద్వారా సేకరిస్తున్నప్పుడు, పోలీసులకు పట్టుబడి, దేశబహిష్కరణకు గురి అవుతాడు (ఆ అనుభవంతోనే క్విజ్ లో persona non grata అన్నదానికి సరైన అర్థం చెప్తాడు రామ్).

ఆ దౌత్యాధికారి భార్యనుంచి తనకు రావలసిన జీతం తాలూకు బాకీలు యాభై వేలు తీసుకుని, సలీంని కలుసుకోవటానికి ముంబై వస్తూంటే, మధ్యలో రైల్లో దొంగలు చొరబడి, ప్రయాణీకుల్నిబెదిరించి డబ్బు, నగలు లాక్కుంటూ, అతని యాభై వేలూ లాక్కుంటారు. వాళ్ళతో ఘర్షణలో అతను దొంగల దగ్గరి రివాల్వరుతోనే ఒక దొంగను కాల్చేస్తాడు (రివాల్వర్ పైన Colt అన్న అక్షరాలు అప్పుడే చూస్తాడు. క్విజ్ లో అడిగినప్పుడు సరైన జవాబు చెప్తాడు). ముంబై వెళ్ళాల్సినవాడు ఆగ్రాలోనే ఆగిపోతాడు. అక్కడ తాజ్ మహల్ దగ్గర టూరిస్టు గైడుగా పనిచేస్తూ, విదేశీ టూరిస్టుల దగ్గర బాగా సంపాదిస్తూ అక్కడే కొంతకాలం ఉండిపోతాడు. అక్కడ శంకర్ అనే ఆటిజంతో బాధపడుతున్న కుర్రాడికి పిచ్చికుక్క కరిచి అతనికి వైద్యం చేయించడానికి నాలుగు లక్షలు దొంగతనం చేయాల్సి వచ్చి, అప్పటికే అతను చనిపోవటంతో, ఆ డబ్బును అదే వ్యాధితో (రేబిస్) బాధపడుతున్న ఒక స్కూలు మాస్టరు కొడుక్కు ఇచ్చేసి, అక్కడినుంచి మళ్ళీ ముంబై వచ్చేస్తాడు – ఒక పేపర్లో ప్రేమ్ కుమార్ నిర్వహించే క్విజ్ పోటీ ప్రకటన చూసి (రామ్ క్విజ్ లో అడిగిన ఒక ప్రశ్నకు లైఫ్ లైన్ ద్వారా ఈ టీచర్ సహాయం పొందుతాడు కూడా).

అన్ని ప్రశ్నలకూ చకచకా సమాధానాలిస్తున్న రామ్ ని ఎలాగైనా పప్పులో కాలేయించాలని ప్రేమ్ కుమార్, క్విజ్ షో నిర్వాహకులు శతథా ప్రయత్నిస్తారు. ఎందుకంటే, వాళ్ళు కనీసం ఎనిమిది నెలలు ఆ షో నడిపితేగాని (ఎవరూ గెలవకుండా జాగ్రత్తపడి) వాళ్ళ దగ్గర అంత పెద్ద మొత్తం బహుమతి ఇవ్వడానికి డబ్బు కూడదు. పదిహేనో అభ్యర్థే తమ కొంప ముంచాడని కంగారు పడుతుంటారు (చివరికి అతనికి ఆ బహుమతి ఇచ్చి ఆ కంపెనీ దివాలా తీస్తుందనుకోండి. కాబట్టి ఆ షోలో అతనే మొదటి, చివరి విజేత అవుతాడు). రామ్ ఏదో మోసం చేసే ఆ క్విజ్ లో గెలిచాడని సాకు చూపి, నిర్వాహకులు అతన్ని అరెస్టు చేయిస్తారు.

సినిమాలో జమాల్ మాలిక్ తన కథను పోలీసులకు చెప్తే, నవలలో రామ్ అది తన లాయరు స్మితకు వినిపిస్తాడు. ఒక్కొక్క ప్రశ్న ద్వారా అతని జీవితాన్ని, అతని నిజాయితీని తెలుసుకున్న స్మిత పోలీసులతో, క్విజ్ షో నిర్వాహకులతో పోరాడి, అతని బహుమతి మొత్తాన్ని అతనికి వచ్చేలా చేస్తుంది (ఈ స్మిత ఎవరో కాదు. రామ్ రక్షించిన శాంతారాం కూతురు గుడియానే). రామ్ తర్వాత సినిమా యాక్టరు కావాలనుకుంటున్న తన స్నేహితుడు సలీంకి సహాయం చేస్తాడు. తను ప్రేమించిన నీతాను పెళ్లి చేసుకుంటాడు.

అయితే, నవలలో లతిక పాత్ర బదులు నీతా అనే ఒక 18 ఏళ్ల వేశ్యావృత్తిలో కూరుకుపోయిన అమ్మాయి పాత్ర ఉంది. రామ్ కు ఆమె ఆగ్రాలోనే పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కాని ఆమె బాస్ అయిన ఆమె అన్న 4 లక్షలు ఇస్తేనే నీతాను వదులుతానంటాడు.

మార్పుల గురించి రచయిత

నవలను సినిమాగా తీసినప్పుడు చేసిన మార్పుల గురించి, వికాస్ స్వరూప్ ను ప్రశ్నించినప్పుడు, కొన్ని మార్పులు తనకు ముందు నచ్చకపోయినా (టైటిల్ మార్చడం, ప్రధాన పాత్ర పేరు మార్చడం మొదలైనవి), తర్వాత వారి అవసరాలకు ఆ మార్పులు అనివార్యమని భావించానని అన్నారు. స్క్రీన్ ప్లే రైటర్ సైమన్ బ్యూఫోయ్ ఈ మార్పుల గురించి తనకు ముందుగానే తెలియజేసాడని అన్నారు. నవలలో రాసినట్టు రామ్ క్విజ్ షోలో పూర్తిగా గెలిచిన తర్వాత కాకుండా, సినిమాలో చిట్టచివరి ప్రశ్న అడగాల్సి ఉండగా పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్టు చూపడం మంచి ఐడియా అన్నారు. ఇది నిజం కూడా. నవలలో కేవలం ఉపసంహారంలోనే లాయర్ స్మిత రామ్ మొహమ్మద్ థామస్ తరఫున పోలీసులతో, క్విజ్ షో నిర్వాహకులతో పోరాడి అతడి బహుమతి మొత్తాన్ని అతనికి వచ్చేలా చేసిందని మాత్రమే రచయిత చెప్తాడుగాని, మరింకే వివరాలూ ఉండవు. సైమన్ బ్యూఫోయ్ ఆ ఒక్క సన్నివేశాన్ని మార్చటం ద్వారా సినిమా చివర్లో మంచి మెలోడ్రామా సృష్టించి, ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించి, ఉద్వేగభరితంగా సినిమాని ముగించాడు (లాజికల్ గా కూడా).

వికాస్ స్వరూప్ తనకు సినిమాలో ఇబ్బంది కలిగించిందని చెప్పిన ఒక సన్నివేశం – హిందూ మతోన్మాదులు ముస్లిములపై దాడిచేయటం. నిజానికిది ఒక సన్నివేశంగా నవలలో లేదు. Juvenile Home లో వార్డెను సలీంను ముంబై సేఠ్ కు పరిచయం చేస్తూ, అతని తల్లిదండ్రులు మతకలహాల్లో మరణించారు అని మాత్రమే చెప్తాడు. బహుశా ఈ సినిమా పట్ల నిరసన ఎక్కువగా టైటిల్ పైనే కేంద్రీకృతమైంది కాబట్టి (ఇండియాలో విడుదల కాకముందే) సినిమాలో ఈ సన్నివేశాన్ని గురించి ఎవరూ అంత పట్టించుకోకపోయి ఉండవచ్చు. అయినా ఈ సన్నివేశం మన సినిమాల్లో అంత explicit గా లేదనే నా ఉద్దేశం (మన సినిమాల్లో అయితే, ముఖ్యంగా తెలుగు సినిమాల్లో, రక్తం చింది హీరో ముఖాన పడితేనేగాని డైరెక్టరుకు సంతృప్తి కలగదు). ఒక బాలీవుడ్ డైరెక్టరు రచయిత వికాస్ స్వరూప్ తో అన్నాడట “SM’s failing was that it wasn’t extreme enough to be truly Indian” అని. అవును. సినిమా offbeat గా ఉన్నమాట నిజమే. మన ప్రేక్షకులు offbeat అంటేనే వెనక్కు తగ్గుతారు కదా.

సినిమాలో కొన్ని మార్పులు అనివార్యమైనా, మొత్తంమీద నవల సారాంశం చెడకుండా స్క్రిప్ట్ రైటర్ సైమన్ బ్యూఫోయ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని వికాస్ స్వరూప్ అన్నారు. సినిమా అంతిమరూపం తనకు సంతృప్తి కలిగించిందని అన్నారు.

స్లమ్ డాగ్ ఇండియాలో ఎందుకు ఆడలేదు?

అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లోనే శని ఉందని అన్నట్టుగా, అసలు ‘స్లమ్ డాగ్’ అనే ఈ పేరే కొంపముంచింది అని చాలామంది అభిప్రాయం. నీ ఫేసు నాకు నచ్చదు అన్నట్టుగా, ఈ ‘డాగ్’ అనే పదం మనవాళ్ళకు కొరుకుడు పడలేదు. పైపెచ్చు అదో తిట్టులా అనిపించింది. ఇంగ్లీషులో underdog అనే పదం ఉంది. ఈ పదానికి dictionary.com లో మూడు నిర్వచనాలు ఉన్నాయి. అవి –

 • 1. a person who is expected to lose in a contest or conflict.
 • 2. a victim of social or political injustice
 • 3. one that is at a disadvantage.

(నిజానికి ఈ మూడు నిర్వచనాలూ సినిమాలో protogonist కి వర్తిస్తాయి)

ఇది ఇంగ్లీషు వాళ్ళు సర్వసాధారణంగా వాడే పదమే. దీన్నే కాస్త pun చేసి, స్క్రిప్ట్ రైటర్ సైమన్ బ్యూఫాయ్ slumdog అనే పదం సృష్టించాడు. అంతకుముందు ఈ పదం ఇంగ్లీషు భాషలో లేదు. ఇది పూర్తిగా ఆ సినిమావారి సృష్టే. భాష తెలిసిన అంతర్జాతీయ ప్రేక్షకులకు ఈ పదంతో ఇబ్బంది లేకపోయినా, ఇండియాలో చాలామంది దీనిపట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఎంతవరకూ వెళ్లిందంటే, ఓ నిరసన కార్యక్రమంలో రెండు ఊరకుక్కల మెళ్ళలో సైమన్, డానీ అని పేర్లు రాసి వేలాడదీసి మరీ తమ వ్యతిరేకత తెలిపారట (నేషనల్ పోస్ట్, కెనడా వికాస్ స్వరూప్ ను చేసిన ఇంటర్వ్యూలో, ఇంటర్వ్యూ చేసినతను చెప్పిన విషయం). Slumdog Millionaire బదులు Slumboy Millionaire అని టైటిల్ పెట్టి ఉంటే అర్థమూ అంత మారేది కాదు. ఎక్కువమందికి అంత అభ్యంతరకరంగా ఉండేదికాదు. అందుకే ఈ సినిమా రచ్చ గెలిచినా, ఇంట గెలవలేకపోయింది.

టైటిల్ అలా ఉన్నా, ఈ సినిమాలో మురికివాడల పిల్లలను అవమానకరంగా తక్కువచేసి ఏమి చూపించలేదు. వాళ్ళు తమ జీవితంతో నిత్యం ఎలా పోరాడుతారు, కష్టతరమైన జీవనస్థితిలో తమ ఉనికిని కాపాడుకోవటానికి ఎలా సంఘర్షిస్తూ ఉంటారు అనేదే ప్రధానంగా చెప్పబడింది. సినిమా చూడని వాళ్ళు సినిమా అసలు సారాన్ని పట్టించుకోకుండా ఏదో అవమానకరంగా తీశారని భ్రమపడ్డారేమోనని నాకు అనిపించింది.

Thanks to India

ఈ సినిమా నిర్మాణం వెనుక తనకు స్ఫూర్తినందించిన కనీసం పది భారతీయ చిత్రాలను దర్శకుడు డానీ బోయల్ పేర్కొన్నాడు. ఎక్కడినుంచైనా ‘స్ఫూర్తి’ పొందితే (కాపీ అని చదువుకున్నా అభ్యంతరం లేదు), కనీసం acknowledge కూడా చెయ్యని మన దర్శకులతో పోలిస్తే, ఇది కాస్త వింతగా లేదూ?

అయితే ఈ సినిమా నిర్మాణం వెనుక మన భారతీయ దర్శకురాలు కూడా ఉండటం గొప్ప విషయం. ఆమే లవ్లీన్ టాండన్. Earth, Monsoon Wedding, Namesake వంటి ప్రసిద్ధ చిత్రాలకు కాస్టింగ్ డైరెక్టరుగా పనిచేసిన అనుభవమున్న ఆమె ఈ చిత్రానికి కూడా మొదట కాస్టింగ్ డైరెక్టరుగా ఉన్నా, తర్వాత చిత్రనిర్మాణంలో ఆమె కీలకపాత్రను గుర్తించిన డానీ బోయల్ ఆమెకు కో-డైరెక్టరు హోదా కల్పించాడు. ముఖ్యంగా చిత్రంలో బాలనటులతో నటింపజేయడంలో ఆమె ప్రధానపాత్ర పోషించడమే కాకుండా, అందులోని హిందీ డైలాగుల్ని తనే రాసింది కూడా. ఆవిధంగా అందులో కనీసం 20 నుంచి 30 శాతంవరకూ హిందీ డైలాగులు ఉండటం వెనుక ఆమె కృషి ఉంది.

ఈ మధ్య వస్తున్న మన భారతీయ సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకర్షించటానికి విదేశాల్లో షూటింగ్ కోసం పరుగెత్తుతూంటే, అక్కడివాళ్ళ సంస్కృతితో తయారైన కథలన్నీ మన కథలుగా చలామణీ చేస్తూంటే, కనీసం ఒక విదేశీ దర్శకుడు మనదేశపు కథను గుర్తించి, షూటింగ్ అంతా ఇక్కడే చేసి, ఆస్కార్ అవార్డులన్నీ ఎగరేసుకుపోయాడు. వాళ్ళ భాషలో చెప్పాలంటే, మన underbelly ని మనకు చూపించాడు కూడా.

‘బాలికా వధు’ సంగతేమోగానీ, ముంబై స్లమ్స్ మట్టిలో పెరిగే రుబినా అలీ, అజహరుద్దీన్ ఇస్మాయిల్ నేరుగా వెళ్లి ఆస్కార్ వేదిక మీద గర్వంగా నిలబడ్డారు. మొదటి నవలతోనే వికాస్ స్వరూప్ మిలియనీర్ అయిపోయాడు. అనిల్ కపూర్ అన్నట్టు, ఈ ఆర్ధికమాంద్యం నిరాశా, నిస్పృహల్లో ఇది గొప్ప రిలీఫ్ ని, ఆశాభావాన్ని అందించిన చిత్రం.

విమర్శలు

ఈ సినిమాపై చాలా విమర్శలు వచ్చాయి. వాటిల్లో ఒకటి, జమాల్, సలీం అంత మంచి ఇంగ్లీషు ఎలా మాట్లాడగలుగుతారు అనేది. నవల ప్రకారమైతే, జమాల్ బాల్యంలో కొంతకాలం ఒక చర్చి ఫాదర్ దగ్గర పెరుగుతాడు. ఆయన ఇంగ్లండువాడు కాబట్టి, జమాల్ కు ఇంగ్లీషులో మాట్లాడటం వస్తుంది. ఇక సినిమా అంటారా? అది ఇంగ్లీషు సినిమా. అందులో ఇంగ్లీషులో కాకుండా మరేభాషలో మాట్లాడతారు? కథ ఇండియాకు సంబంధించినది కనుక, కొన్ని హిందీ డైలాగులు పెట్టారు. అంతే. మిగతా విమర్శలజోలికి నేను వెళ్ళదలుచుకొవటంలేదు.

అయితే, నా కామన్ సెన్సును ప్రశ్నించిన కొన్ని చిన్న, చిన్న లొసుగులున్నాయి. అవి –

జమాల్, సలీం మధ్య వయసు వ్యత్యాసం దాదాపు రెండేళ్ళు కనిపిస్తుంది. లతిక, జమాల్ కంటే కనీసం ఒక సంవత్సరం పెద్దదిగా కనిపిస్తుంది (లతిక, జమాల్ కంటే పెద్దది కాకూడదని నేను అనటంలేదు). జమాల్, సలీం మామన్ నుంచి తప్పించుకున్నప్పుడు వాళ్ళ వయసు ఏడు, తొమ్మిది సంవత్సరాలు అనిపిస్తుంది. వాళ్ళు దాదాపు ఐదేళ్ళ తర్వాత ముంబాయిలో లతికను కలుసుకుంటారు (12, 14 ఏళ్ళ వయసులో). వాళ్ళను చూసి లతిక, మామన్ వెంటనే ఎలా గుర్తుపడతారు అనేది నాకర్థంకాలేదు. పోనీ, అది వదిలేసినా, జమాల్ ను సలీం ఇంటినుంచి తరిమేసిన తర్వాత, మళ్ళీ జమాల్ తనకు 18 ఏళ్ళ వయసులోనే సలీంను కలుసుకుంటాడు (కథ ప్రకారమే). అయితే, నేరుగా కలుసుకోవటానికి ముందు, జమాల్ అతని గొంతును ఫోనులో ఎలా గుర్తుపడతాడు, సలీం, జమాల్ గొంతును ఎలా గుర్తుపడతాడు అనేది కూడా అర్థం కాదు. ఇలాంటి కొన్ని అతుకులు సరిగా అతకలేదేమో అనిపించింది. సినిమా కథ ముందుగా తెలియకుండా, మన ప్రేక్షకులకు అర్థం కావటం కష్టమే అనిపించింది. ఎందుకంటే, ఒక పక్క పోలీసు ఇంటరాగేషను, మరోపక్క జమాల్ జీవితకథ సమాంతరంగా నడుస్తూ ఉంటాయి. చిత్రీకరణ కూడా కొంచెం fast mode లో ఉండటంతో ప్రేక్షకులు తికమక పడటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇటువంటి చిన్న, చిన్న లోపాలు మరిచిపోయి రెండోసారి చూస్తే మాత్రం ఖచ్చితంగా చెత్తసినిమా అనిమాత్రం కొట్టిపారేయలేము.

ఈ వ్యాసం రాయటంలో సహకరించిన వనరులు:

 • 1. సాయి బ్రహ్మానందం (సినిమా), మాలతి చందూర్ (నవల) సమీక్షలు
 • 2. వికాస్ స్వరూప్ నవల – క్యు & ఎ (ఇప్పుడు దాని పేరు సినిమా పేరే)
 • 3. వికాస్ స్వరూప్ వెబ్ సైట్, అందులో ఉన్న ఆయన పలు ఇంటర్వ్యూలు
 • 4. వికీపీడియా వెబ్ సైట్, అందులో ఉన్న ‘స్లమ్ డాగ్’ సినిమాకు సంబంధించిన అనేక వార్తాపత్రికల రిపోర్టులు
 • 5. ‘Slumdog Millionaire’ సినిమా స్క్రిప్ట్ (www.simplyscripts.com)
 • 6. Not but not the least – Google

(‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత అనుమతితో చేసిన కొన్ని తెలుగు అనువాదాలు మూడోభాగంలో. అక్కడితో ఇది పరిసమాప్తి)

10 Comments
 1. శంకర్ August 5, 2009 /
 2. మోహన్ రాజ్ August 5, 2009 /
 3. సాయి బ్రహ్మానందం August 5, 2009 /
 4. తృష్ణ August 6, 2009 /
 5. కొత్తపాళీ August 6, 2009 /
 6. Manjula August 7, 2009 /
 7. మేడేపల్లి శేషు August 7, 2009 /
 8. గీతాచార్య August 7, 2009 /