Menu

క్విక్ గన్ మురుగన్ – రీడ్ ఇట్ ఐ సే!

quickనేను “క్విక్ గన్ మురుగన్” చూసి ఇరవైనాలుగు గంటలైనా… ఇంకా మురుగన్ డైలాగులు గుర్తొస్తూనే ఉన్నాయి. ఏదైనా మాట్లాడి… “ఐ వాంట్ ఇట్ ఐ సే” తరహా లో మాట్లాడ్డం బాగా వంటబట్టేసింది. “లీవ్ ద లేడీస్ ఐ సే” – అబ్బ తలుచుకుంటే ఇప్పుడు కూడా నవ్వొస్తోంది. సినిమా గురించి ఇదివరలో నవతరంగం లో ఓ పరిచయం రాసారు, ఇది ఏదో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైనప్పుడు. కానీ, మన థియేటర్లలో రిలీజై రెండ్రోజులైనా దీని గురించి ఇక్కడ ఎవరూ మాట్లాడకపోయే సరికి… “ఐ హర్టెడ్ ఐ సే!” – 😉

కథ విషయానికొస్తే, వెల్, స్పూఫ్ లకి స్పూఫ్. మురుగన్ కౌ బాయ్ కనుక, ఆవులను కాపాడే బాధ్యత, శాఖాహారులని కాపాడే బాధ్యతా అతనిదే. అతనికి, నాన్ వెజ్ రెస్టారెంట్ నడుపుతూ వెజిటేరియనిజం ను నిర్మూలించాలన్న ఆలోచనల్లో ఉండే “స్టీల్ ప్లేట్ రెడ్డి” కీ మధ్య ఉన్న గొడవ, మురుగన్ స్టీల్ ప్లేట్ ఆగడాలను ఎలా నిరోధించాడు? అన్నది ఈ సినిమా కథ. కథ మొదటి భాగం లో స్వర్గలోకం సెట్టింగ్, అక్కడి సంభాషణలు-ఆ వాతావరణం, అక్కడి పద్ధతులు వివరించే దృశ్యాలు-అసలు చాలా సృజనాత్మకత కనిపించింది నాకందులో. ఇక మురుగన్ ఫీట్ల గురించి చెప్పాలంటే, మేట్రిక్స్ సినిమాలూ, మరిన్ని రజనీకాంత్, విజయకాంత్ సినిమాలు -అసలు ఈ సినిమా లోని దృశ్యాల ముందు అవన్నీ బలాదూర్. సంభాషణలు టూ గుడ్. నేను తమిళంలో చూడ్డం వల్ల అక్కడక్కడా పూర్తిగా అర్థం కాలేదు కానీ, మురుగన్ రాక్స్. రాజేంద్ర ప్రసాద్ కాస్త యువకుడిగా ఉంటే బాగుండేది అనిపించింది కానీ, ఆయన కాకుండా ఇంకెవరన్నా ఆ ఎఫెక్ట్ కలిగించగలిగే వాళ్ళా అంటే అనుమానమే.

సినిమా గంటన్నరే ఉండటం కాస్త నిరాశ కలిగించింది నాకు. అసలుకైతే, అలాంటి స్టోరీలైన్ తో మొదలుపెడితే, your imagination can go wild… and a wonderful nonsense comedy thriller could have been generated. ఎటొచ్చీ, నాన్సెన్స్ ఫిక్షన్ కు మనదేశంలో అంత గుర్తింపు ఉండట్లేదని వాపోయేవాళ్ళలో నేనూ ఉన్నాను కనుక, ఇంకా ఎక్కువ ఇమాజినేషన్ ఉండి ఉంటే, ఈ సినిమాను మనవాళ్ళు ఆదరించగలిగేవారు కాదేమో అనిపించింది. ఈ సినిమాకి వెళ్ళేముందు సంగీతం గురించి పెద్ద ఆశలేం లేవు కానీ, నా అంచనాలను మించి ఎంటర్టైనింగ్ గా ఉంది సంగీతం కూడా. పైగా, మురుగన్ కి కోపం వచ్చినప్పుడో, విలన్ ఎంట్రీ అప్పుడో…ఇలా వివిధ సందర్భాల్లో వచ్చిన నేపథ్య సంగీతం టూ గుడ్. అయితే, కథనం ఇంకాస్త పట్టుతో ఉండాల్సింది అనిపించింది. అంటే, ఇలా కూడా సినిమాని నేను చాలా ఎంజాయ్ చేసాను కానీ, సినిమా ఈ తరహా అనే తెలిసి తీస్తున్నప్పుడు మరింత ముందుకెళ్ళి ఉండొచ్చు-ఇమాజినేషన్ పరంగా…అనిపించింది

ఇవన్నీ ఒకెత్తు. ఈ థియేటర్ ఒకెత్తు. నేను ఈ సినిమా బెంగలూరు నడిబొడ్డులో ఉన్న మల్లేశ్వరం మెయిన్ రోడ్డులో…సంపిగె థియేటర్లో చూసాను. మొదట -అలాంటి చోట అలాంటి థియేటర్, పెద్దగా ఆదరణ లేకున్నా ఎలా బ్రతుకుతోంది అన్న సందేహం మొదలైంది. లోపలికెళ్ళాక, ఇంకా బలపడింది… ఎప్పుడో చిన్నప్పుడు సిటీల్లోకి రాకముందు తప్పితే, ఇలాంటి థియేటర్ కి వెళ్ళి కొన్ని యుగాలైపోయిన భావన కలిగింది. అలాంటి సినిమాని… చూస్తే అలాంటి థియేటర్ లోనే చూడాలి. ఎటొచ్చీ, మీకో గుంపు కామెడీ చేస్కుని నవ్వుకునే స్నేహితులో, ఎందులో అయినా కామెడీ చూసి నవ్వుకోగల స్నేహితులో ఉంటే, ఇంక పండగే.

వాచ్ ఇట్ ఐ సే! మైండ్ ఇట్! 🙂

11 Comments
  1. $hankar August 30, 2009 /
  2. Cine Valley August 31, 2009 /
  3. విజయవర్ధన్ August 31, 2009 /
  4. G August 31, 2009 /
  5. mohanrazz August 31, 2009 /
  6. Ambati Sreedhar September 3, 2009 /
  7. su September 19, 2009 /
  8. bhanu September 20, 2009 /