Menu

శ్రీరమణ మిథునం చూశాను

mithunamశ్రీరమణ మిథునం గురించి వినని సాహిత్యాభిమనులు తక్కువే వుంటారు. శ్రీరమణ గారు వ్రాసిన మిథునం కథను చదవగానే బాపుగారు ఆ కథను “చదివిన దాని కంటే, ఒకసారి రాస్తే బాగా అర్థం అవుతుంది” అంటూ దస్తూరి తిలకం దిద్దారు. ఆ తరువాత అది డా. జంపాల చౌదరిగారికి చేరి అక్కడినుంచి అనేక ప్రవాసాంధ్రులని అలరించి – ఆంధ్రభూమి నవంబరు 1997లో నాలుగు వారాల ధారావాహికగాను, అదే బాపు దస్తూరితో యధాతధంగా రచనలో ఒకటి రెండుసార్లు అచ్చైంది. ఆ తరువాత దేశ విదేశ భాషలలో అనువాదాల లెక్కేలేదు..!!

సరిగ్గా అక్కడ మన కథ మొదలైంది – ప్రముఖ సాహితీవేత్త మళయాళ చలన చిత్ర దర్శకులు శ్రీ యం.టీ. వాసుదేవన్ నాయర్ ఆ కథ పట్ల ఆకర్షితులై “ఒరు చెరు పుంచిరి” (ఒక చిరు మందహాసం) అన్న పేరుతో మళయాళ చిత్రం రూపొందించారు. ఆ సినిమా చూస్తూ – మధ్యలో మిథునం పుస్తకం తిరగేస్తూ – మళ్ళీ సినిమా చూస్తూ వెనక్కీ ముందుకీ – పుస్తకం చదివేస్తూ – వ్రాసిన వ్యాసమిది.

సాధారణంగా పుస్తకం/నవల సినిమాగా వస్తే పెదవి విరుపులేకాని పొగడ్తలు తక్కువగా వస్తాయి. అందునా మిథునం చిన్న కథ – నవల కాదు. ఇలాంటి కథని ఆధారంగా చేసుకోని ఒక పూర్తి నిడివి చిత్రం తియ్యటం నిజంగా సాహసమే. అందుకేనెమో ఎంతోమంది ఈ కథకి చిత్ర రూపం ఇవ్వాలని అనుకున్నా అది కార్య రూపం దాలచలేదు.

అసలు నవల లేదా ఏ రచన అయినా చదువుకోవడంలో ఒక సౌలభ్యం వుంటుంది. చదివేది మనమైనప్పుడు వూహ మంది.. దృష్టి మనది.. అనుభూతి మనది. అదే సినిమాగా వస్తే దర్శకుడిదే వూహ, దర్శకుడి దృష్టి లోనించి అదే అనుభూతి కలగాలి. దర్శకుడు ఏ మాత్రం రచనని మార్చినా దారి తప్పే ప్రమాదం వుంటుంది. పైగా పాఠకులు వేరు ప్రేక్షకులు వేరు. రచన వుద్దేశ్యం వేరు – సినిమా వుద్దేశ్యం వేరు (వాసుదేవన్ నాయర్ రమణగారికి రాసిన వుత్తరంలో చలన చిత్రోత్సవాల కోసం సినిమాగా రూపొందించాలని అనుకుంటున్నట్టు వ్రాసారు.) బహుశా అందుకేనేమో ఈ సినిమా శ్రీరమణ కథ స్థాయిని అందుకోలేదని అనిపిస్తుంది. అయినప్పటికి చదివిన కథ పక్కన పెట్టి చూస్తే సినిమా గొప్పదిగానే కనపడుతుంది.

కథా వస్తువు చాలా చిన్నది. వయసు మళ్ళిన దంపతులు తమ తోటలాంటి ఇంట్లో, ఇంట్లో – తోటలో సరదాగా చెణుకులు విసురుకుంటూ, ఎత్తిపొడుచుకుంటూ తమ మధ్య ప్రేమని నిలుపుకోవటం కథ. ఇందులో ఒంటరిగా వున్నామన్న కష్టంలేదు.. కొడుకులో కోడళ్ళో చూడటంలేదన్న బాధలేదు. ఒకరికొకరం – ఒకరిలో ఒకరం – చెరిసగం – సగం సగం అంతే (బాపు ముఖచిత్రం గుర్తుందా?). ఇక సినిమా విషయానికొస్తే ఒంటరిగా వున్న వృద్ధదంపతులు వారి ప్రేమలు, మాటలు, మాటకు మాటలు అన్నీ అలాగే వాడుకున్నారు. అయితే దానికి కొసరుగా, ఒంటరిగా వుండే ముసలివాళ్ళ ఇబ్బందులూ, కొడుకింటికో, కూతురింటికో వెళ్ళినప్పుడు అక్కడ ఇమడలేకపోవటం, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వంటివికూడా కనిపిస్తాయి. చిన్న కథని సినిమా చేసే ప్రయత్నంలో కొంత సొంతకథను చేర్చడం అవసరం. అయితే ఆ చేరిన కథలు మూల కథలో భావాన్ని, అనుభూతిని అలాగే నిలపాలి లేదా మరింత పెంచాలి. ఈ చిత్రం విషయంలో అలాంటిది జరగలేదు కాని మరో కొత్త ఫీల్‌ని పరిచయం చేసింది. కథ చదివిన తరువాత కలిగే అనుభూతి ఆహ్లాదం, (కళ్ళు చమర్చినా సరే)అయితే సినిమా ముగిసే సరికి కలిగే అనుభవం – ఆర్ద్రత.

mtfilm1-1ముసలాయన తోటపట్ల అనురాగం, భోజన ప్రియత్వం, అలాగే ముసలమ్మ గడుసుదనం (మొగుడు అటకెక్కాక నిచ్చెన తీసెయ్యటం, ద్రాక్షారామం సంబంధం సంగతులు) లాంటివి పెద్దగా మారలేదు. కథలో శ్రీరమణ ఈ దంపతులకి వరుసకు అల్లుడు.  అడపదడపా ఆ ఇంట్లొకి వెళ్తూ వస్తూ చూసినవి చెప్పిన కథ ఇది. అందువల్ల మనం ఆ కథలోకి పిట్టగోడ మీదుగా తొంగి చూసినట్లుంటుంది. సినిమాలో (అలాంటి పాత్ర వున్నా) మనం నేరుగా ఆ ఇంట్లోకి వెళ్ళి చూసినట్లుంటుంది. అందువల్ల బయటకు మాత్రమే కనిపించే విషయాలే కాక వారి అంతర్గత విషయాలు కూడా తెలుస్తాయి (ఆరోగ్య సమస్యలు లాంటివి) బహుశా అందువల్ల కథ ఫీల్ మారిపోయింది.

రమణ కథలో తెలుగుదనం వుంది. ఏ తెలుగువాడు ఈ కథని చదివినా ఎవరో వెనకనించీ వచ్చి చక్కలిగిలి పెట్టిన అనుభూతి కలుగుతుంది.

“మొదటివాడికి కృష్ణ అని ముద్దుగా పెట్టా – ఏడాది తిరక్కుండా ఇంకోడు – మీ అత్తయ్య వైఖరి చూస్తే ఇదేదో పుచ్చపాదు తీరుగా వుందని అనుమానం వచ్చింది. ఇహ ఏటేటా పేర్లకోసం ఎక్కడ వెతుకుతాంలే అని.. కేశవనామాలు అందుకున్నా..”

“ఆహా! అవిగో శంఖుచక్రాలూ మధ్యన తిరునామం – ఎదురుగా కనిపిస్తున్నాయంటే నమ్ము” అన్నాడు… “అవి గోడ మేకులకి బోర్లించిన చేటా జల్లెడా – మధ్యన నిలువుగా చల్ల కవ్వం”

పోతుపేరంటానికి వెళ్ళి అప్పదాసుమామయ్య వాయనం తెచ్చుకోవటం, బుచ్చి అత్తయ్యని చమత్కారంగా దీర్ఘసుమగళీభవ అంటూ ఆశీర్వదించడం – ఇలాంటివి ఎన్నో

ఇవన్నీ చదివాక కలిగిన అనుభూతి నిశ్చయంగా సినిమా “చూడటం” వల్ల కలగదుగాక కలగదు. ఇందులో దర్శకుడి తప్పేమిలేదు.. తెలుగు నేటివిటీలో వున్న విషయాలు మళయాలంలో చూపెడితే అక్కడ ఎవరికీ అర్థంకాదు. కాబట్టి నేటివిటీకి తగ్గట్టు చేసే మార్పుల్లోకూడా ఆ అనుభూతి మాయం అవుతుంది. (అసలు దర్శకుడికి తెలుగు కథలో వున్న ఫీల్ అర్థమైందా లేదా అనేది మరో ప్రశ్న)

కథలో కొత్తగా వచ్చిన విషయాలలో – ఈ ముసలివాళ్ళింటికి పాత మిత్రుడు రావటం, ముసలాయన తొలిప్రేమ చిన్నమణీమ్మ తారసపడటం – ఈ రెండు పాత్రలద్వారా వృద్ధుల ఇబ్బందులను చెప్పడం బాగున్నాయి. మనమరాలు ముస్లిం వ్యక్తిని ప్రేమించడం, అది ముసలివాళ్ళు అంగీకరించడం లాంటివి అనవసరం అనిపిస్తుంది. మొత్తమ్మీద చూడదగ్గ చిత్రమే అయినా మిథునంతో పోల్చి చూడటానికి మాత్రం సరిపోదు.

(ఈ సినిమా యూటూబ్‌తో సహా అనేక చోట్ల దొరుకుతుంది. కథ చదవాలనుకుంటే ఈ లింకు చూడండి: http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=6180&page=1)

తారాగణం: ఒడువిల్ ఉన్నికృష్ణన్, P.K. వేణుకుట్టన్ నాయర్, పాల్, ముకుందన్, జాయ్, నిర్మల శ్రీనివాసన్

కథ: శ్రీ రమణ
సమర్పణ: John Paul Films And Asianet Communications Pvt. Ltd
కళ: రాధాకృష్ణన్ మంగలత్
సంగీతం: జాన్సన్
ఛాయాగ్రహణం: సన్నీ జోసెఫ్
సహనిర్మాత: Asianet Communications Pvt Ltd.
నిర్మాత: జిషా జాన్
చిత్రానువాదం, మాటలు,దర్శకత్వం: M.T. వాసుదేవన్ నాయర్

4 Comments
  1. rayraj August 4, 2009 /
  2. కొత్తపాళీ August 4, 2009 /
  3. Sowmya September 16, 2011 /