Menu

నాటి ప్రేమ మధురిమలు – నేటి ప్రేమ తికమకలు : లవ్ ఆజ్ కల్

lvoeaajkalహిందీ చిత్రరంగంలో, నేటి కాలం యువత భావాలకు అద్దంపట్టే చిత్రాలు తీస్తున్న దర్శకుడు ఇంతియాజ్ అలి. ఈ ఆధునిక యువత మెటీరియలిస్టిక్ భావజాలం వెనుక తమదైన ఆలోచన,ఉద్వేగం,అనుభూతి ఉన్నాయనే నిజాన్ని తన చిత్రాలద్వారా హృద్యంగా చెప్పే ప్రయత్నంలో ఇప్పటివరకూ సఫలమయ్యాడమే చెప్పొచ్చు. ‘సోచానథా’ (2005), ‘జబ్ వుయ్ మెట్’ (2007) తర్వాత ఇంతియాజ్ అలి తీసిన మూడో చిత్రం “లవ్ ఆజ్ కల్”.
‘ప్రేమ: నేడు – నాడు’ అనే అర్థం వచ్చే ఈ చిత్రశీర్షిక, చిత్రం కథని చెప్పకనే చెబుతుంది. ఒక ఆధునిక ప్రేమ కథ ఒక నిన్నటి (మొన్నటి) తరం ప్రేమకథల్ని సమాంతరంగా నడిపి, విధానాలు మారినా ప్రేమ భావాలు మారలేదనే సునిశితమైన విషయాన్ని దర్శకుడు ఇంతియాజ్ చెప్పడానికి ప్రయత్నించారు. లండన్ లో ఉన్న ‘జై’ (సైఫ్ అలీ ఖాన్) ‘మీరా’ (దీపికా)లు జీవితాంతం కలిసి ఉండమని తెలిసీ ఇష్టపడతారు. కొంతకాలం కలిసుంటారు. “గొప్ప ప్రేమ పుస్తకాల్లో మాత్రమే ఉంటుంది. మనం సాధారణమైన మనుషులం (ఆమ్ ఆద్మీ – Mango people) కాబట్టి ప్రాక్టికల్గా విడిపోదాం” అనేసి జై, మీరాతో విడిపోతాడు. మీరాకూడా పరిస్థితుల ప్రభావం వలన కలిసుండటం కుదరదు (కెరీర్ పరంగా జై శాన్ఫ్రాన్సిస్కో వెళ్ళాలనుకుంటాడు. మీరా ఇండియా) కనక మంచి స్నేహితులుగా విడిపోదాం అని ఒప్పుకుంటుంది.

ఇలా ఒకసారి విడిపోయిన జంట వివిధ పరిస్థితుల్లో మళ్ళీమళ్ళీ కలుస్తుంది. మళ్ళీమళ్ళీ విడిపోతుంది. పరస్పరం ప్రేమిస్తున్నామనే అనుభూతికన్నా, పరిస్థితులు వారి సహజీవనానికి అనుకూలంగా లేవనే “లాజిక్” వల్ల అన్నిసార్లూ వారి మధ్యనున్న ప్రేమ తీవ్రతని గుర్తించక విడిపోతారు.

ఈ ఆధునిక కలిసివిడిపోయే ప్రేమలమధ్య, మరోవైపు ‘వీర్’ (రిషి కపూర్) జైకి తన (పాతకాలం) ప్రేమకథను చెబుతాడు. చూపులతో ప్రేమించడం. ఒకసారి కూడా మాట్లాడకపోయినా, ఏడుజన్మలకూ ‘హర్లీన్ కౌర్’ (గిస్లీ మాంటేరియో) తన భార్యకావాలని ప్రతిజ్ఞ చేసుకోవడం. ప్రేమికురాల్ని (కేవలం) చూడటానికి డిల్లీనుంచీ కలకత్తా ప్రయాణించడం. సాహసించి హర్లీన్ కుటుంబానికి తన పెళ్ళి ఉద్దేశాన్ని చెప్పి రైల్వేస్టేషన్లో తన్నులు తినటం. చివరికి ధైర్యం చేసి హర్లీన్ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి కాబోతున్న తరుణంలో కలకత్తా నుంచీ ఢిల్లీ తీసుక్పొచ్చి పెళ్ళి చేసుకోవడం ఈ పాత కథలోని అంశాలు.

ఈ పాతకథలోని “గుడ్డిప్రేమని” పరిహసించే జై ఆధునిక ‘లాజికల్ ప్రేమ’ తీవ్రతని సంతరించుకుని ఈ జంటజీవితాల్ని ఎలా ప్రభావితం చేసింది? చివరికి వీరిద్ధరూ ఏ పరిస్థితుల్లో శాశ్వతంగా కలిసిపోవడానికి కలుస్తారు? అనేది తెరపై చూడాల్సిన విషయం.

కథ తెలిసిందే అనిపించినా, కథనం విషయంలో పాత్రల రూపకల్పన విషయంలో దర్శకుడు తీసుకున్న శ్రద్ధవలన వైవిధ్యమైన సహజత్వం ఈ చిత్రంలో సమకూరింది. పరిచయమైనప్పుడు ఒకర్నొకరు ఇంప్రెస్ చెయ్యడాలు, కలిసుండాలనే ‘బాధ్యత’ నెత్తిమీదున్నప్పుడు ప్రేమికులు పడే సునిశిత ఇబ్బందులు. ఒకసారి విడిపోయాక స్నేహితులుగా వారి మధ్య ఏర్పడే అరమరికలు (ఆబ్లిగేషన్స్) లేని బంధం. జీవితంలోంచీ భౌతికంగా దూరమైపోయినా మనసులో మిగిలిపోయే మనుషుల మధ్య ఏర్పడే ఆత్మబంధాలు వంటి ఎన్నో సున్నితమైన అంశాల్ని మెలోడ్రామా ఛాయలు లేకుండా,స్టీరియోటైంపింగ్ కి స్థానం ఇవ్వకుండా తెరపైకి అనువదించడం చాలా కష్టం. ఆ కష్టాన్ని దర్శకుడు చాలా ప్రేమగా నిర్వహించి సినిమా స్థాయిని పెంచాడు.

నటులుగా సైఫ్ అలీ ఖాన్ మరో మెట్టు ఎదిగాడు. ముఖ్యంగా మనసులోని భావాలను సరైన పదాల్లో చెప్పలేని తికమక సంభాషణల్ని అత్యంత సహజంగా వెలువరించిన శైలి చూస్తే ఖచ్చితంగా ముచ్చటేస్తుంది. నాలుగో సినిమాకే ఇంత మంచి పాత్ర రావడం దీపికా అదృష్టమైతే, దానిలో చాలావరకూ రాణించడం మెచ్చుకోదగిన అంశం. కొన్ని సీన్లలో దీపిక నటనలోని లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించినా, దర్శకుడికి పాత్ర మీదున్న అథారిటీ దీపికా ప్రయత్నం వలన కొన్ని సీన్లు అద్భుతంగా పండాయి. (*స్పాయిలర్) పెళ్ళైపోయిన తరువాత జైకీ తనకూ మధ్య ఇంకా ఏదో బంధం మిగులుందనే స్పృహకొచ్చి భర్త (రాహుల్ ఖన్నా)తో చెప్పే సీన్లోని నటన ఆ రాణింపుకి ఒక ఉదాహరణ. హర్లీన్ కౌర్ గా గిస్లీ మాంటేరియో అనే కొత్తనటి ఈ సినిమాద్వారా పరిచయమయ్యింది. నటన అంతంత మాత్రమే అయినా పాత్రకు సరిపోయింది. రిషి కపూర్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది. కొన్ని సంభాషణలు తననోటివెంట రావడం వలన మరింత అర్థవంతంగా మారాయా! అనిపించక మానదు.

ప్రితమ్ సంగీతం అవసరానికి అనుగుణంగా ఉంది. నట్రాజన్ సుబ్రమణియన్ సినెమాటోగ్రఫీ రెండు కాలాలనూ చాలా చక్కగా ఇనుమడింపజేసింది. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాతో నిర్మాతగా కూడా అవతారమెత్తాడు. అభిరుచి కలిగిన నిర్మాతగా నిరూపించుకున్నాడు. తన బ్యానర్ ఇల్యూమినాటీ ఫిల్మ్ మరిన్ని అర్థవంతమైన సినిమాలు భవిష్యత్తులో తియ్యాలని ఆశించొచ్చు.

ఈ సినిమాకి ప్రాణం రచయిత-దర్శకుడు ఇంతియాజ్ అలి.

చిత్రం ముగింపులోని కొన్ని అంశాలు అతిగా అనిపించినా, దాన్ని దర్శకుడి పొయటిక్ కొనసాగిపు (poetic extension) అనుకుంటే ఇంకా బాగా అనిపిస్తాయి. ఒకస్థాయిలో కొత్తతరం ప్రేమల్లోకూడా ఇంత బలీయమైన భావనలు ఉంటాయా? అనే ప్రశ్నలు ఉదయించినా, ఈ జంటలో అలా ఉంటే మాత్రం తప్పేమిటనేవిధంగా చేసి దర్శకుడు, ఒక రొమాంటిక్ కథను హృద్యంగా తెరకెక్కించాడు.

ఈ మధ్యకాలంలో వచ్చిన హిందీ చిత్రాలలో చూడదగిన చిత్రం ‘లవ్ ఆజ్ కల్’. మెదడు థియేటర్ బయట విడిచెళ్ళాల్సిన సినిమాలు వస్తున్న ఈ తరుణంలో మెదడుతోపాటూ కొంత మనసునూ థియేటర్ కి చెచ్చుకోమని చెప్పే చిత్రం ఇది. చూడండి. కొంత నిరాశపరిచినా, కొన్ని అనుభూతుల్ని మాత్రం ఖచ్చితంగా మిగులుస్తుంది.

18 Comments
 1. శంకర్ August 6, 2009 /
  • Madhu August 6, 2009 /
 2. raman August 6, 2009 /
 3. Sowmya August 6, 2009 /
 4. sivaji August 6, 2009 /
 5. raju August 10, 2009 /
 6. sasank August 10, 2009 /
 7. sasank August 10, 2009 /
   • sasank August 10, 2009 /
   • sasank August 11, 2009 /
 8. maitreyi August 10, 2009 /
 9. chandramouli August 20, 2009 /