Menu

మోక్షము గలదా?

కొన్ని సినిమాల గురించి పరిచయం చెయ్యాలంటే చాలా కష్టం. ఈ సినిమాల గురించి చాలామందికి ఎంతో కొంత తెలిసే వుంటుంది. ఇక కొత్తగా చెప్పడానికేముంటుంది అపిస్తుంది. ఉదాహరణకు సత్యజిత్ రే సినిమా పథేర్ పాంచాలి గురించి మనందరికీ తెలుసు. ఈ సినిమా ప్రపంచంలోని అత్యుత్తమ సినిమాల్లో ఒకటని, పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిందనీ, ఎన్నో అవార్డులు గెలుచుకుందనే విషయాలతో పాటు ఇప్పుడా సినిమా ఓ క్లాసిక్ అనీ సినిమా చూడని వాళ్ళయినా తలూపేసి ఒప్పేసుకుంటారు. ఉదాహరణకు మనం మిస్సమ్మ ఒక క్లాసిక్ అంటాము. నిజమే అది అలాంటి స్టేటస్ పొందదగిన సినిమానే. కానీ మిస్సమ్మ సినిమా ఆ తర్వాత వచ్చిన సినిమాలను ఎంత వరకూ ప్రభావితం చేసింది అంటే పెద్దగా లేదనే చెప్పాలి. అలాగే ఒక మాయాబజార్ లేదా మరేదైనా పాపులర్ క్లాసిక్. అయితే ఈ సినిమాలకు క్లాసిక్ అనే స్టేటస్ ఆపాదించబడడానికి ముఖ్యకారణాల్లో ఒకటి పరిపూర్ణత (Perfection). ఈ సినిమాల్లో చలనచిత్ర కళలోని అన్ని శాఖలలోనూ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శింబడినట్టుగా మనం చూడవచ్చు. ఇలాంటి సినిమాలు విడుదలయ్యాక చూసి బయటకు రాగానే ప్రేక్షకులు “క్లాసిక్!” అని ఒక లేబుల్ అంటించేస్తారు. అయితే క్లాసిక్స్ లో మరో రకం క్లాసిక్స్ కూడా వుంటాయి. ఈ సినిమాలు ఇంతకుముందు చెప్పినట్టు సినిమాల్లాగా విడుదలవగానే క్లాసిక్ అనే లేబుల్ అంటిచుకోకపోగా ఆ రోజుల్లో ప్రేక్షకులు/విమర్శకుల తిరస్కారానికి గురయ్యొండొచ్చు. అందుకు ముఖ్యకారణాల్లో ఒకటి ఈ సినిమాలు అప్పటివరకూ ఋజువు చేయబడివున్న ప్రామాణికాలనూ/నియమాలనూ తిరస్కరించడమో లేదా తిరగరాయడమో చేశాయి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఈ రోజు క్లాసిక్స్ అని లేబుల్ వేయబడే అన్ని సినిమాలలో కేవలం కొన్ని మాత్రమే చలనచిత్ర ప్రక్రియ ఎదుగుదల క్రమంలో మైలు రాళ్ళుగా నిలిచాయి. వీటిలో చలనచిత్ర కళకు దిశానిర్దేశం చేసినవి కొన్నయితే అప్పటివరకూ వెళ్తున్న దారిలో మాత్రమే కాకుండా చలనచిత్ర ప్రక్రియలో ఇంకెన్నో కొత్త దారులున్నాయని నిరూపించిన సినిమాలు కొన్ని. ఉదాహరణకు సిటిజెన్ కేన్ (Citizen Kane), బ్రెథ్ లెస్ (Breathless), పథేర్ పాంచాలి సినిమాలను తీసుకుంటే ఆయా సినిమాలు అప్పటి సినిమా చరిత్రను రెండు భాగాలుగా విభజించిన సినిమాలుగా చూడవచ్చు. అమెరికన్ సినిమా చరిత్రలో సిటిజెన్ కేన్ ముందు, సిటిజెన్ కేన్ తర్వాత అనే విధంగా కొట్టొచ్చినట్టు రెండు భాగాలుగా విభజన కనిపిస్తుంది. అలాగే ఫ్రెంచ్ సినిమా చరిత్ర ని Godard తన సినిమాభ్రెథ్ లెస్ తో, భారతదేశ సినిమా చరిత్రను సత్యజిత్ రే పథేర్ పాంచాలి తో పై విధంగా చెయ్యగలిగారు. ఇలాంటి సినిమాల కోవలోకి చెందిన మరో సినిమా ఇటలీకి చెందిన L’avventura.

ఇటలీ కి చెందిన Michelangelo Antonioni ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాకి పూర్వం ఆయన ఐదు పూర్తి స్థాయి చలనచిత్రాలను నిర్మించాడు.అయితే ఈ సినిమాకి పూర్వం తీసిన సినిమాలు అటు ప్రేక్షకులు ఇటు విమర్శకులనీ సంతృప్తిపరచలేదు. ఇలాంటి దశలో ఆయన ఆరో సినిమాగా నిర్మించిన L’avventura నిర్మాణ దశలో ఎదుర్కొన్న కష్ట నష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ఈ సినిమా మొదటగా ఫ్రాన్స్ లోని కాన్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఈ సినిమా ప్రదర్శన పూర్తి అయ్యాక ప్రేక్షకుల్లోని 90 శాతం మంది అరిచిగోలపెట్టారట. ఎవడ్రా ఈ సినిమా తీసిందంటూ జనాలగోలనుంచి కంటనీరు పెట్టుకున్న ఆంటొనియాని ఆ రోజైతే సిగ్గుతో పారిపోయుండొచ్చు కానీ ఈ సినిమా విడుదలైన కొన్నేళ్ళకు సైట్ అండ్ సౌండ్ నిర్వహించిన ఒక సర్వేలో ప్రపంచంలోని అత్యుత్తమ పదిసినిమాల్లో ఇది ఒకటిగా ఎన్నుకోబడింది.

కథ పరంగా పెద్ద సంచలనాత్మకమైన కథా వస్తువు ఈ సినిమాలో లేదు. ఇటలీకి చెందిన బాగా ధనవంతుల కుటుంబాలనుంచి వచ్చిన యువతీ యువకులు కొంతమంది ఒక పడవలో విహారయాత్రకు బయల్దేరుతారు. మార్గ మధ్యంలో ఒక దీవి కనిపించడంతో పడవలోని వారందరూ ఆ దీవిపైకి చేరుతారు. కాసేపు అక్కడ గడిపాక అందరూ తిరిగి పడవలోకి చేరుకుంటారు. అందరూ పడవలోకి చేరారనుకుని తిరిగి ప్రయాణం ప్రారంభించాలనుకుంటుండగా వారితోపాటు వచ్చిన ఎన్నా (Anna) అనే ఒక యువతి తప్పిపోయినట్టు గ్రహించి అందరూ కలిసి ఆమె కోసం వెతకడం ఆరంభిస్తారు. తప్పిపోయిన యువతి ప్రేమికుడైన శాండ్రో మరియు ఎన్నా స్నేహితురాలైన క్లాడియా లు కలిసి ఎన్నా కోసం తీవ్రంగా ఆ దీవిపై గాలించి అక్కడనుంచి సిసిలీ పట్టణంలో ఆమె కోసం వెతుకుతారు. ఈ సందర్భంలో శాండ్రో మరియు క్లాడియా మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఇంతలోనే జరిగిన ఒక సంఘటన వారి ప్రేమ బంధాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది.

అయితే సినిమా పూర్తయ్యేసరికి మనం ఎక్కడైతే మొదలయ్యామో (Search for Anna) కథ అక్కడే వుంటుంది (Anna is never found). అప్పటి వరకూ వచ్చిన ఎన్నో సినిమాల్లో ఇలాంటి సంఘటన జరిగినప్పుడూ తప్పిపోయిన వారి గురించి సినిమాలో ఎక్కడో దగ్గర వారి బాగోగుల గురించి చర్చింపబడుతుంది. అయితే ఈ సినిమాలో ఏ విషయం తెలుసుకోవడం కోసమైతే ప్రేక్షకుడు సినిమాలో లీనమయ్యాడో ఆ విషయాన్ని తప్ప సినిమాలోని మరెన్నో విషయాలను చర్చిస్తాడు ఆంటొనియాని. అంతే కాదు ఒక అనిశ్చయాన్నుంచి (Anna ఎక్కడవుంది?) మరో అనిశ్చయంలోకి (క్లాడియా మరియు శాండ్రోలు ఒకటవుతారా?) మనల్ని తోశేసి సినిమా ముగిస్తాడు దర్శకుడు.

ఈ సినిమా ఇలా ఎందుకు ముగించారు? ఈ సినిమా ద్వారా అసలు ఏం చెప్పాలనుకున్నారు లాంటి ప్రశ్నలకు చాలా రకమైన interpretetions ఉన్నాయి. ఉదాహరణకు Geoffery Nowell Smith ఈ సినిమా గురించి ఇలా అంటారు:

The dissonant chord which concludes L’avventura says it all, or nearly all. The film is a love story. But it is one which ends with the lovers not marching into the sunset but facing an uncertain dawn. Just as the final chord (a major seventh) does not resolve but remains agonisingly poised, so Claudia’s and Sandro’s relationship is also on a knife edge. To the uncertainty of what has happened to Anna is added the uncertainty of whether Claudia’s and Sandro’s affair has any future. It is not a happy end, but not a tragic one either. The flux of life has been halted at a particular moment, in what James Joyce called an epiphany. Life will resume its flux; it is just the story which has ended at this moment.

జీవితమే ఒక సినిమా అన్నారెవరో. సినిమాల్లో మొదట్లో చూపించిన సంఘర్షణ(conflict)కి చివర్లో ఒక తీర్మానం (resolution) చూపిస్తేకానీ పరిపూర్ణమైన సినిమాటిక్ అనుభవాన్ని చాలా మంది ప్రేక్షకులు పొందలేరు. కానీ సినిమాలాంటి మన జీవితంలో దైనందిన జీవితంలోని ఎన్నో సంఘర్షణలకు రిజల్యూషన్ దొరకక జీవితం చివరి వరకూ మనం వెతుకుతూనే వుంటాం. జీవితంలోని వివిధ సంఘర్షణలను సినిమాల్లోలాగా తీర్మానించి చివరకు మన జీవితానికో హ్యాపీ ఎండింగ్ ఉంటుందో లేదో అన్న సందిగ్ధత త్యాగరాజ స్వామివారి “మోక్షము గలదా” అనే కృతిలో కనిపించినంతగా ఈ L’avventura లోనూ కనిపించింది. అందుకే నా జీవితంలోని conflictsకి ఒక resolution దొరుకుతుందా లేదా అనే సందిగ్ధత వల్లనేమో తెలియదు కానీ “మోక్షము గలదా” విన్నప్పుడూ, “L’avventura” చూసినప్పుడూ నేను కళ్ళనీళ్ళ పర్యంతమైపోతాను.

ప్రతిఒక్కరూ చూసి ఆలోచించదగ్గ సినిమా ఇది. ఈ వ్యాసం ద్వారా ఒక గొప్ప సినిమాని పరిచయం చేయడం మాత్రమే చేయగలిగాను. వీలైతే ఈ సినిమా గురించి మరింత వివరంగా వ్రాసే ప్రయత్నం త్వరలో చేస్తాను. మీరు కూడా ఈ సినిమా చూసి మీ అభిప్రాయాలు, సమీక్ష-విశ్లేషణలు నవతరంగంలో ప్రచురించడం ద్వారా ఈ సినిమా గురించి మరింత చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాను.

ఈ సినిమా ట్రైలర్

8 Comments
  1. శంకర్ August 16, 2009 /
  2. Uttara August 16, 2009 /
  3. Uttara August 17, 2009 /
  4. su August 18, 2009 /
  5. Venkat Gopu April 8, 2010 /