Menu

ధన్ ఠణా…టర టర – కమీనే

3हमारॆ बापू बॊल्ते थॆ, जिन्दगी एक कुतिया चीज है !

మా అయ్య జెప్పేటోడు, బిడ్డా! జీవితం ఒక కుక్కబతుకురా అని. (life with capital “L” అన్నమాట)

वाट उस्सॆ नही लग्ती जॊ रास्ता तुम चुन्तॆहॊ !
वाट उस्सॆ लग्ती है, जॊ तुम छॊड दॆतॆ हॊ !

జీవితానికి డ్యామేజ్ ఎంచుకునే దారితో రాదు. వద్దనుకుని వదిలేసే దారి ద్వారా కలుగుతుంది.
‘కమీనే’ సినిమా ఆరంభంలోనే చార్లీ (మొదటి షాహిద్ కపూర్) చెప్పే వాక్యాలివి.

కొందరి జీవితాలు కుక్కబ్రతుకుల్లాగా తయారవడం దురదృష్టం, చేతకానితనం, పరిస్థితుల ప్రభావం. కానీ కొందరి దృష్టిలో జీవితమే ఒక “కుక్కబ్రతుకు” అవ్వడం…వేదాంతమో, వైరాగ్యమో, జీవనసత్యమో తెలీదు. అలాంటి జీవితాన్ని ఏ ఘటన ఏవిధంగా మార్చేస్తుందో, ఏ విలువ ఎప్పుడు ఎలా మారుతుందో, ఏ కోణంలోంచీ ఎంచుకున్నదారి-ఎంచుకోనిదారి కూడలిలో నిలబెట్టి నిర్దేశిస్తుందో తేలియని స్థితిలో ఆధునికోత్తర (post modern) జీవన విధానం ఉంది. ఆ అయోమయ పోస్ట్ మాడ్రన్ జీవితాలలోని అత్యంత చీకటి కోణాన్ని “హాస్యభరిత ఉన్మాదం”గా చిత్రీకరించిన చిత్రం విశాల్ భరద్వాజా – కమీనే.

‘స’ ను ‘ఫ’ గా పలికే చార్లీ (మొదటి షాహిద్) ముగ్గురు బెంగాలీ బ్రదర్స్ నడిపే గుర్రపు రేసుల మాఫియాలో సభ్యుడు. ఎప్పటికైనా ఒక బెట్టింగ్ బుకీ అయ్యి జీవితంలో విజయవంతం అవ్వాలని కలలు కంటుంటాడు. ఒక బెట్టింగులో జరిగిన మోసంలో ఆ గ్యాంగు తమ డబ్బులు కోల్పోవడంతోపాటూ చార్లీ అన్నిసంవత్సరాల సంపాదనని కూడా పోగొట్టుకుంటాడు.

గుడ్డు(రెండో షాహిద్ కపూర్)కు నత్తి. పాలిటెక్నిల్ లో డిప్లొమా చేస్తూ ఒక కాండోమ్ ప్రమోట్ చేసే NGOలో పనిచేస్తుంటాడు. స్వీటీ (ప్రియాంకా చోప్రా) గుడ్డు గర్ల్ ఫ్రెండ్. ప్రస్తుతం గర్భవతి. స్వీటీ ఒక లోకల్ గూండా ‘భోపే భావ్’ (అమోల్ గుప్తే) చెల్లెలు. “మరాఠీ ప్రైడ్” పేరుతో ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తుంటాడు.

తాషీ (టెన్జింగ్ నీమా) ఒక డ్రగ్స్-వజ్రాల స్మగ్లర్. ఇద్దరు నార్కోటిక్స్ పోలీసు అధికారులు డ్రగ్స్ గురించి సమాచారంతోపాటూ వేరే గ్యాంగుల కోక్ – హెరాయిన్ కూడా హత్యలు చేసిమరీ కొల్లగొట్టుకొచ్చి తాషీకి సమర్పించుకుంటుంటారు.

చార్లీ బెట్టింగులో మోసం చేసిన మనిషి కోసం వెతుకుతుంటాడు…

నార్కోటిక్ ‘దొంగ’ పోలీసులు ఒక డ్రగ్ డీల్ లో పదికోట్ల హెరాయిన్ పట్టుకుంటారు…

గుడ్డు-స్వీటీ పెళ్ళి చేసుకుని, స్వీటీవాళ్ళ అన్న పంపిన గూండాల చేతిలో దెబ్బలుతిని ఎయిర్ పోర్టుకు పారిపోతూ ఉంటారు…

ఈ మూడు ట్రాక్ లూ ఇక్కడ కలుస్తాయి.

పోలీసుల చేతిలోంచీ డ్రగ్స్ చేజారిపోతాయి.

చార్లీ చేతిలో పదికోట్లు విలువచేసే డ్ర్గగ్స్ పడతాయి.

చార్లీలాగా కనిపించే గుడ్డు పోలీసుల చేతిలో పడతాడు.

గుడ్డూని వెతుక్కుంటూ చార్లీ ఇంటికి భోప్పే భావ్ వస్తాడు.

ఇక్కడ మొదలౌతుంది అసలు కథ.

ఈ సినిమా మొదటి అరగంటా అర్థం కాదు. లేదా అర్థం చేసుకునే ప్రయత్నంలో మనం ఉంటాం. సినెమాటిక్ గ్రామర్, కథాసంవిధానం, కథనరీతి సాధారణ సినిమాలకన్నా కొంత భిన్నంగా ఉండటం, పాత్రల పరిచయాలు ఉపోద్ఘాతాలు లేకుండా జరిగిపోవడం, ఆరంభంలోనే సినిమాలో ఉన్న conflict తెలిసిపోయినట్లు అనిపించినా సంతృప్తికరమైన కొనసాగింపు మన ఊహకి అందకపోవడంతో కొంత తికమకలో ప్రేక్షకుడు ఆ ముఫై నిమిషాలూ గడుపుతాడు.
ప్రధమార్థం ముగిసేసరికీ ప్యారలల్ ట్రాకులు ఒకదారికొచ్చినట్లు అనిపించినా, కొంత సాగదీతని అనుభవించకతప్పదు.
కానీ…ఇంటర్వెల్ దాటాక ఉంటుంది నా సామిరంగా…రోలర్ కోస్టర్ రైడే!

ఇక కథ క్లైమాక్స్ కొచ్చేసరికీ భారతీయ సినిమా ఎప్పుడూ చూడని, ఏ సాధారణ దర్శకుడూ అస్సలు ఊహించలేని అద్వితీయమైన “క్లైమాక్స్”. క్లైమాక్స్ అంటే అచ్చమైన CLIMAX అనుకోవాల్సిందే. అదొక ఉన్మాద భరిత అంతం. అదొక అసాధారణ అంతం. అదొక “తృప్తి” కరమైన అంతం. అప్పటిదాకా కాస్తోకూస్తో ఏదైనా నిరాశ ఉంటే “హుష్ కాకి” అని ఎగిరిపోయే అంతం. A truly pleasurable climax.

నటీనటుల్లో షాహిద్ కపూర్ కి చార్లీ-గుడ్డు పాత్రలు ఒక జీవితానికి సరిపడే పాత్రలు అనుకోవాలి. ప్రియాంకా చోప్రా నటించగలదు అని మళ్ళీ నిరూపించుకుంది. ప్రెగ్నెన్సీ విషయం చెప్పే దృశ్యం. అన్న పంపిన గూడాలు గుడ్డుని కొడుతున్నప్పుడు తను చేసిన నటన. క్లైమాక్స్ ముందు గన్ పెట్టి బెదిరించే దృశ్యాల్లో చాలాబాగా రాణించింది. నాయికా-నాయకుల పాత్రలకన్నా ఇతర పాత్రలు పోషించిన నటుల ముఖాలు సినిమా చూసొచ్చిన తరువాత కూడా మన మనసుల్లో ఉండిపోతాయి. పాత్రలుతప్ప నటులు కనిపించని ఈ సహజనటులలో చాలా మందికి ఇది మొదటి సినిమా అనుకుంటాను. కానీ నటనలో కాకలు తీరిన నటులు కూడా వీరి ముందు దిగదుడుపే. వీళ్ళలో అమోల్ గుప్తే, టెన్జింగ్ తప్పితే చాలా మంది పేర్లు కూడా నాకు తెలీదు. వీళ్ళని పేరుపేరునా పరిచయం చేస్తూ ఒక వ్యాసం రాయాల్సిందే!

ఈ సినిమా ఆద్యంతం విశాల్ భరద్వాజ్ సినిమా. సంగీతం, రచన (మాటలు- సహస్క్రీన్ ప్లే రచన) వంటి కీలక పాత్రలతోపాటూ దర్శకత్వం వహించి ఈ సినిమా ద్వారా తనేమిటో, భారతీయ సినిమాకి తాను ఏమివ్వగలడో నిరూపించుకున్నాడు. తసదుఖ్ హుస్సేన్ సినెమాటోగ్రఫీ విశాల్ ఆలోచనకు సమతూకంలో దృశ్యీకరణ చేసింది. అలాగే మేఘనా మన్చంద సేన్ తన ఎడిటింగ్ ద్వారా ఎడిటింగ్ స్థాయిని “ఎడిటింగ్ కొరియోగ్రఫీ” స్థాయికి తీసుకెళ్ళింది.
ఈ సినిమా చూడకపోతే ఒక ల్యాండ్ మార్క్ సినిమాని మిస్ చేసినట్లే!

38 Comments
 1. $hankar August 18, 2009 /
 2. venkataramana August 18, 2009 /
 3. శంకర్ August 18, 2009 /
 4. pappu August 18, 2009 /
 5. sasank August 18, 2009 /
 6. mohanrazz August 18, 2009 /
 7. గీతాచార్య August 18, 2009 /
 8. sujata August 18, 2009 /
 9. su August 18, 2009 /
  • khalid August 19, 2009 /
   • khalid August 19, 2009 /
   • khalid August 19, 2009 /
   • పద్మ August 20, 2009 /
   • tharik August 20, 2009 /
   • su August 19, 2009 /
   • su August 19, 2009 /
 10. పద్మ August 19, 2009 /
  • khalid August 19, 2009 /
   • పద్మ August 20, 2009 /
   • tharik August 20, 2009 /
 11. chandramouli August 19, 2009 /
 12. Manjula August 19, 2009 /
 13. అబ్రకదబ్ర August 20, 2009 /
 14. శ్రీ August 21, 2009 /
 15. Gopi August 26, 2009 /
   • sasank August 30, 2009 /
 16. khel September 9, 2009 /