Menu

I for India – సినిమా పరిచయం

ifi.JPGI for India, సినిమా ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక వైవిధ్యమైన సినిమాగా పేర్కొనవచ్చు. 1965 లో ఇండియా వదిలి యునైటెడ్ కింగ్‍డమ్ లో డాక్టరుగా స్థిరపడిన యాశ్‍పాల్ సూరి అనే వ్యక్తి కథ ఇది. 196౦ ప్రాంతంలో ఇండియానుంచి యునైట్‍డ్ కింగ్‍డమ్‍కు వైద్యరంగం లో పైచదువులు రీత్యా వచ్చిన చాలా మంది భారతీయులలో యాశ్‍పాల్ కూడా ఒకరు. యునైటెడ్ కింగ్‍డమ్ కి వచ్చినప్పటినుంచీ ఆయన్ ఇండియా తిరిగి వెళ్ళాలని అనుకుంటూనే వుంటారు కానీ ప్రతి సారీ ఏదో ఒక కారణం చేత అతని పథకాలు మారుతుండడంతో దాదాపు పదేళ్ళపాట ఇండియాకి వెళ్ళలేకపోతాడు. ఈ లోగా అతనికి ముగ్గురు పిల్లలు జన్మిస్తారు.సొంత ఇల్లు కొనుక్కుంటాడు. అతని కుటుంబం ఇంగ్లండు జీవనశైలికి అలవాటుపడిపోతుంది. అన్నేళ్ళుగా తమని వదిలి దూరంగా వెళ్ళిపోయిన కొడుకుపై ఆతల్లిదండ్రులు తీవ్రంగా స్పందిస్తారు. చివరికి ఇండియా వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటారు. ఇండియా చేరగానే అక్కడ ఒక ఆసుపత్రి స్థాపించి రోగులకు సేవలందించాలన్న ప్రయత్నం చేస్తారు యాశ్‍పాల్. అతని ఆసుపత్రి అనుకున్నంత సక్రమంగా నడవదు. మరోవైపు అతని భార్య, ముఖ్యంగా పిల్లలు అక్కడి వాతావరణానికీ జీవన శైలికి తగ్గట్టుగా సర్దుకోలేకపోతారు. చేసేదేమీలేక తిరిగి యునైటెడ్ కింగ్‍డమ్ చేరుతారు. కాలక్రమంలో అతని ముగ్గురు కూతుర్లు పెరిగి పెద్దవాళ్ళవుతారు. పెద్దామ్మాయికి పెళ్ళవుతుంది. రెండో అమ్మాయి చదువుకోడానికి ఆస్ట్రేలియా వెల్తుంది. చదువయ్యాక తిరిగివచ్చిన రెండో కూతురు ఆస్ట్రేలియాలోనే స్థిరపడాలనుకుని నిశ్చయించుకుని అక్కడకు బయల్దేరివెల్తుంది. ఒకప్పుడు తను ఇండియా వదిలివెళ్ళినందుకు తన తండ్రి ఎంత బాధపడివుంటాడో అప్పుడు కానీ అర్థం కాదు యాశ్‍పాల్ కి.

ఇదీ I for India సినిమా కథ. ఈ కథలో పెద్దగా చెప్పుకోడానికేమీ లేకపోవచ్చు. దాదాపు ఇండియా వదిల ఇతరదేశాల్లో నివసించే ఎంతో మందివి దాదాపు ఇలాంటి కథలే (జీవితాలే)! అయితే ఈ సినిమా లో ప్రపంచంలో 99శాతం సినిమాలకు లేని ఒక ప్రత్యేకత వుంది. ఈ సినిమా లోని కథ కల్పితం కాదు. అదేమంత ప్రత్యేకం కాకపోయినా ఈ సినిమా అసలెలా రూపొందించబడిందో తెలుసుకుంటే ఎవరైనా ఈ సినిమా యొక్క గొప్పతనాన్ని అభినందించక తీరరు.

1965 లో యాశ్‍పాల్ యునైటెడ్ కింగ్‍డమ్ రాగానే ఆయన మొదటగా చేసిందేమిటంటే రెండు సినిమా (సూపర్ 8) కెమెరాలు, ప్రొజెక్టర్లను కొని ఒకటి తన వద్దవుంచుకుని మరోటి ఇండియాలోని తన కుటుంబానికి పంపించాడు. ఆ రోజుల్లో ఫోన్ సౌకర్యం అంతంతమాత్రమే వుండడంతో పాటు, ఉత్తరాల ద్వారా పెరిగిన దూరాలను దగ్గరచేయలేకపోవడంతో ఆయన తన బంధు మిత్రులతో సంప్రదించడానికి ఒక వైవిధ్యమైన పధ్ధతిని అవలంబించారు. నెలకో సారి తమ జీవితంలోని మధుర ఘట్టాలను కెమెరాలో బంధించి ఆ రీలుని ఇండీయాకి పంపేవాడట. అలాగే నెలకో సారి ఇండియానుంచీ వచ్చిన సినిమా ప్రదర్శించి తన వారి బాగోగులు తెలుసుకునేవాడట.

అయితే వారు కేవలం కమ్యూనికేషన్ కోసం ఉపయోగించిన ఆ ఫిల్ము రీళ్ళు ఆయన మూడో కూతరు సంధ్య పెద్దయ్యాక ఒక పూర్తి నిడివి చిత్రంగా మలస్తుందని అప్పట్లో వారూహించకపోయుండొచ్చు. యాశ్‍పాల్ సూరి మూడవ అమ్మాయి సంధ్య సూరి ఈ సినిమా దర్శకురాలు.40 ఏళ్ళపాటు తన తండ్రి రూపొందించిన హోమ్ వీడియోస్ తో పాటు కొన్నాళ్ళ నుంచీ తనే సొంతంగా కెమెరాతో రికార్డు చేసిన దృశ్యాల ఆధారంగా ఈమె రూపొందించిన ఈ సినిమా డాక్యుమెంటరీ సినిమా అయినప్పటికీ ప్రతి ఒక్కరినీ అకట్టుకోగలదు. సినిమా అనేది కేవలం వినోదం కోసమే కాదని ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు ఋజువు చేస్తుంటాయి.

ఈ చిత్ర దర్శకురాలు సంధ్య ఐదేళ్ళ క్రితం ఇవే వీడియోలా అధారంగా రూపొందించిన ఒక లఘు చిత్రం, ఈ పూర్తి నిడివి చిత్రానికి దారి తీసి వుండొచ్చనిపిస్తుంది. ఆందువలనేనేమో ఈ మధ్యకాలంలో చిత్రీకరించిన దృశ్యాలలో పాత వీడియోల్లో వున్న Spontaneity వుండకపోవడం గమనించవచ్చు. అయినప్పటికీ అన్ని విధాలా ఒక మంచి సినిమాగా I For India ని పేర్కొనవచ్చు. ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు కనుక,వీలైతే తప్పక చూడండి.

6 Comments
  1. Sowmya January 3, 2008 /
  2. వెంకట్ January 3, 2008 /
  3. వెంకట్ January 3, 2008 /
  4. andhramass February 14, 2008 /
  5. chary August 30, 2009 /
  6. Surya August 31, 2009 /