Menu

మన తెలుగు సినిమాలు ఇలా యెందుకు చచ్చాయి అంటే …!

cinemaనేను ఇక్కడ ఎప్పటి నుంచో సభ్యుడనే అయినా వారానికోసారి కొన్ని వ్యాసాలు చదువుతున్నా , కామెంట్ రాయడం చాలా అరుదు. ప్రధాన కారణం అట్టే చర్చల్లో ఉండటం నాకు నచ్చదు.  కానీ ఇవ్వాళ అబ్రకదబ్ర అనే సభ్యుడు వ్రాసింది చర్చించక ఉండలేని అంశం.  ఆ వ్యాసంలో చెబుతున్న పాయింట్లు నిజమే అయినప్పటికీ… నిందలను మాత్రం ఒప్పుకోలేకున్నాను

“ప్రేక్షకులు ఇలాంటి సినిమాలే కోరుకుంటున్నారు కాబట్టి ఇవే తీస్తున్నాం” అనే తెలుగు సినీ దర్శక, నిర్మాతల భావదారిద్ర్యాన్ని చూస్తే, చాలా జాలేస్తుంది. పోనీ, తెలుగులో ఎప్పుడో ఒకసారి ఏదో కొద్దో, గొప్పో మంచి చిత్రం వచ్చిందని ఆనందపడినా, తర్వాత అది ఏ పరభాషనుంచో దిగుమతి అయిందని తెలిసి, మన గొప్పదనమేం లేదని తెలిసి నిరాశ కలుగుతుంది.

నేను ఇంతవరకూ తెలుగులో దర్శకుడినీ నిర్మాతనూ కాకున్నప్పటికీ ఆ రెండూ అయేందుకు ప్రయత్నిస్తున్నవాడిగా .. ఈ ఆరోపణను గర్హిస్తున్నాను ( మరీ గ్రాంధికం భాష అనుకోకండి….యేదో ఫ్లో లో వచ్చేసింది )

దాదాపు సంవత్సర కాలంగా… నేను అనుకున్న బడ్జట్`లో సినిమా తీద్దామనీ ప్రయత్నిస్తున్న కుదరడం లేదు. కారణం :

1.నా స్వంత కథలు బడ్జట్ పతిమితుల్లో ఇమడకపోవడం.

2. ఇమిడినవి చాలా ” కాంప్లెక్స్” కథలు కావడంతో ,విన్నవారు..మొదట్లో ఇంత బరువైన కథలు వొద్దని హెచ్చరించడం ( హెచ్చరికలకు కారణం…డబ్బులు , రిటర్న్స్ మాత్రమే కాదు : అటువంటి కథలకు సరిపడె నటీనటుల కొరత , మార్కెటింగ్ అంశాలు వగైరా )

3. వేరే రచయితల కథల కోసం ఎన్నెన్నో చదవినా ఫలితం శూన్యం ( తెలుగులో రచనా వ్యాసంగం , లిటరేచర్ దాదాపు చరమాంకంలో ఉంది.. ఇది చేదు నిజం ) మన పాపులర్ రైటర్ల కథలు జేంస్ హాడ్లీ చేస్జ్ నుంచి కాపీ కొట్టడం నుంచి రకరకాల కాపీలే ఇస్తున్నరు. అసలు ఈ రోజు… తెలుగులో… మంచి రచయితలు.. ఒక పదిమంది పేర్లు చెప్పండి. పది ఒద్దు.. ప్రొఫెషనల్ రైటర్ ఒక్కరు చెప్పండి . కాపీలు వ్రాసే యండమూరి / మల్లది లాంటి వాళ్ళు కూడ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు వగైరా అంటు నిష్క్రమిస్తున్న సాహిత్య స్థితి మన తెలుగుది.

యే భాషలో సాహిత్యం చస్తుందో మిగతా అన్ని కళలూ అలాగే చచ్చిపోతాయి.

ప్రతి టీవీ చానెల్`లోనూ.. నృత్య ప్రదర్శన అంటే సల్సాలు / హిప్ డ్యాన్సులూ .. గాత్ర/సంగీత ప్రతిభ అంటే సినిమా పాటలే… (99% ఇలాంటివే… 1%అప్పుడప్పుడు జానపద గీతలు.. దూరదర్శన్`లో అయిటె అందరూ నిద్రపోయాక రాత్రి రెండు గంటలప్పుడు క్లాసికల్ కార్యక్రమాలు ఉంటాయి అనుకోండి )

చిత్ర కళ అసలు ఎవ్వరైనా పట్టించుకునే స్థితిలో ఉందా? బాగా ఉన్నవాళ్ళకయితే ఆర్ట్ స్కూల్ వెళ్ళి ఫారిన్ వెళ్ళే చాన్సు ఉంటుందేమో కానీ ( అలా వెళ్ళేవాళ్ళూ తక్కువే ) కానే..సామాన్యుడికి అసలు పెయింటింగ్ అంటే తెలుసుకునే చాన్సు ఉందా ?

సాహిత్యం , సంగీతం , నృత్యం, చిత్ర కళ….ఇవన్నీ కలిసి…ఒక కథను చెప్పడమే సినిమా.

ఈ మిగతా కళలన్నీ తమ ఆస్థిత్వాన్ని కోల్పోతున్న మన దేశ / రాష్రాల్లో… సినిమా మటుకు ఎలా “మనది” అనిపించికుంటుంది ?

ఈ మధ్య కొందరు నవతరంగం సభ్యులను కలిసినప్పుడు ఇదే మాట వచ్చింది.. హైద్రాబాదులో సాల్సాల మీద ఉన్న మోజు కూచిపూడి మీద లేదెందుకు ? మరి పక్క రాష్త్రమయిన తమిళ్నాడులో ఎలా కుదురుతోంది అంటె , అక్కడ ఇప్పటికీ లిటరేచర్ ఉంది. ప్రతి శుక్రవారం హిందూ దినపత్రికలో కొత్తగ విడుదలయ్యే పుస్తాకల లిస్టు చూడండి. యేవేవో కొత్త కొత్త కథలూ , నవలలు. అవి ఆంగ్లంలోకి తర్జుమా అవుతాయి కూడా. కళ క్షేత్ర లాంటి నృత సిక్షణా సంస్థలన్నీ అక్కడే ఉన్నాయి . కర్నాటిక్ నేర్చుకునేవారిని అక్కడ గేళి చెయ్యకపోగా గౌరవిస్తారు. మంగళంపల్లి బాల మురళీ కృష్ణ లాంటి వారు ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్  లో కళాకారులకు గౌరవం లేదని ఇక్కడ కచేరీలూ చెయ్యనన్న ఉదంతం విని ఉంటారు ( ఆయన తెలుగు వాడియినప్పతికీ ) అదే తమిళ్నాడులో మరో పక్క… ర్యాప్ సంగీతమూ వచ్చింది. కానీ తేడా యేమిటంటే .. ఒక కొత్త సంస్కృతిని ఆహ్వానించడం , మోజు పడడం , అనుకరించడం అతి సహజం. కానీ తమ స్వంత సంస్కృతిని యేవగించుకుని కాదు. తమిళ్`లో ర్యాప్ సంగీతాన్ని అందుకున్న … సాహిత్యమ తమ వ్యవహారిక తమిళంలోనే అందించి ఒక సాంస్కృతిక సంగమం చేసారు. మనవాళ్ళు ఆ సంగమం మాట మరిచి పూర్తిగా ఆ నది నీటికే అలోవాటు పడుతున్నరు.

మన సంస్కృతిని యేవగించుకుని పాశ్చాత్య సంస్కృతికై అర్రులుజాస్తున్న జనాన్ని మెప్పించడం అంటే చా………ల కష్టం.

కానీ అసంభవం మాత్రం కాదు.

అటువంటిది సినిమాల్లో జరగాలి అంటే… మంచి కథకులే రావాలి.

దర్శత్వం అంటే కథ/మాటలు/స్క్రీన్ ప్లే అనే నాలుగూ కలిసిపోయిన ఈ ఇండస్ట్రీలో అది జరగడం లేదు.

ప్రపంచ సినిమల్లో నేను అభిమానించే దర్శకుల్లో చాలా మంది స్వయంగా కథకులు కారు. సత్యజిత్ రే ను ప్రపంచానికి పరిచయం చేసిన పథేర్ పాంచాలీ ఆయన కథ కాదు. నా అభిమాన దర్సకుడు హిచ్`కాక్ దాదాపు తన క్లాసిక్ చిత్రాల్లో యే ఒక్కదానికి కథ / స్క్రీన్ ప్లే రాయలేదు.

కానీ… ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. కథ చేతిలో ఉన్న ప్రతివాడు ఆ కథను తాను తప్ప ఇంకెవరూ తీయలేరు అనుకుంటారు.

పోనీ ఆ కథలు అయినా బావుంటాయా అంటే… అతిశయోక్తిలా అనిపించినా , నెలక కనీసం 20 కథలు వింటాను నేను… ఎవ్వరెవ్వరి నుంచో , మొహమాటానికి కూడ బావుంది అని చెప్పలేనటువంటివి.

కొన్ని బావున్నా… బడ్జట్ సరిపోని స్థితి.

బడ్జట్ అనేది అన్నిటిలోకి పెద్ద లిమిట్ .

ఇక…కొన్ని కథలు బడ్జట్ సరిపోయినా , ఇక్కడ పేద్ద ప్రాబ్లం . మన ప్రేక్షకుల పల్స్ ( మీ మాటల్లో చెప్పాలి అంటె… టార్గెట్ ఆడియన్స్ ) లేని స్థితి కొన్ని కథలకు.

ఉదహారణకు :- ప్రీ మ్యారిటల్ సెక్స్ , వివాహేతర సంబంధాలు వగైరా అంశాలు అసలు టచ్ చేసే ధైర్యం లేదు. యస్ … ధైర్యం లేదు….. ఎందుకంటే ఎక్కడ అసభ్యత అని బ్యాన్ చెయ్యమని ఎవ్వడు గొడవ పెడతాడొ అని భయం. భావ ప్రకటనా స్వేచ్చ మనకు తక్కువే.

కొన్ని ఉదాహరణలు చెబుతాను :

“చిత్రం”అనే ఒక సినిమా . అప్పట్లో పెద్ద దుమారం లేపితే యేమిటా అనుకున్నను. నాకయితే ఆ కథలో ఏమీ తప్పు అనిపించలేదు. ఆఫ్కోర్స్ , ఒక పాట కొంచెం అదోలా తీసినా , కథకోసం అక్కడ అది అవసరమే. అదే ఇంగ్లీషులో అయితే… సెక్స్ సన్నివేశమే చూపించగలిగే స్వేచ్చ ఉంది. కానీ కథాంశంలో యేం తప్పు ఉందని అంత గొడవ అయ్యింది ?? అదే దర్శకుడు తేజ ఆ తర్వాత సినిమాల్లో కాలేజ్ లెక్చరర్ పాత్రలను వ్యాంపుల్లా చిత్రీకరించి, స్టూడింట్లు ఆ లేడీ లెక్చరర్ల అంగాంగాలను తాకే ప్రయత్నాలు చేసి సుఖించే జుగుప్సాకరమైన సన్నివేశాలు తీస్తే ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. అప్పుడు మీడియా కూడ పల్లెత్తు మాట అనలేదు.

ఇదెక్కడి హిపోక్రసీ ?

ఈ మధ్య ఓ సినిమాలో బ్లూ ఫిలిం చూసి హీరో హీరోయిన్`ను ముద్దు అడగడం… అది సున్నితమైన సీన్ అంటే నాకు మతిపోయింది. బ్లూ ఫిలిం చూస్తే కలిగేది లస్ట్.  ” ఆ కోరిక” క్యారెక్టర్`కు పుట్టింది అని నిజాయితీగా చెప్పలేని స్థితిలో మన సినిమా ఉంది. హిందీలో ” దెవ్ డి ” చిత్రంలో ఇటువంటి సన్నివేశమే వస్తే మన సెన్సారుకు అందకుండా ” సజెస్టివ్”గ కొంత ధైర్యంగా చూపించగలిగారు. కాని తెలుగులో అది కూడ ఒప్పుకుంటారని నాకు నమ్మకం లేదు. సెన్సారు ఒప్పుకున్నా, యేదో గొడవ చెయ్యాలి అనుకునే చిన్న చిన్న సంఘాలు , వాటికి పెద్దపీట వేస్తూ థర్టీ మినిట్స్ ప్రోగ్రాములు చేసే మీడియా చానల్సు కలిసి ఇదొక అశ్లీల చిత్రం అనే ముద్ర కొడతాయి.

చాలామందికి లాగానే.. నాకూ పోసాని కృష్ణ మురళి ఎక్సెంట్రిక్ యాక్టింగ్ నచ్చదు. కానీ ఒకనాడు ఒక ఇంటర్వ్యూ చూసా : మనిషి తరహా నాకు నచ్చకపోయినా అతని మాట నిజం కాదు అనలేకున్నాను . వినదగునెవ్వరు చెప్పిన..

” వినాయకుడు సినిమాలో హీరోయిన్ ‘బిఛ్’ అనే మాట అంటుందట (నాకు గుర్తు లేదు ) .. అ మాటకు అభ్యంతరం చెప్పని సెన్సారు , మహిళలు నా సినిమాను ఎందుకు అంటారు. ” అని తన స్టైల్లో ఊగిపోయాడు.. ఆ ఊపును ఇగ్నోర్ చేసి మాటను ఆలోచించండి…

తొలి తెలుగు నవల కన్యాశుల్కంలో “లంజ” ” లంజ ముండ” అనే మాటలు విరివిగా ఉంటాయి. ఎందుకంటే అదే వ్యవహారిక భాష కనుక.

“ఆవకాయ్ బిర్యానీ ” సినిమా తీసిన అనీష్ కురువిల్లా అనే దర్శకుడు అంతకు మునుపు అనే ఒక సినిమా తీసారుట ( నేను చూడలేదు ఆ సినిమా ) అందులో తెలుగులో బూతులు విచ్చలవిడిగా ఉన్నాయని ఎవరో గొడవట. నాకయితే అవే బూతులు ఇంగ్లీషులో చెప్పి ఉంటే … అని పొగిడి ఉంటారేమో అనిపించింది.

చలం కావొచ్చు , తిలక్ కావొచ్చు , శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రిగారు కావోచ్చు… వాళ్ళ అత్యుత్తమ కథల్లో కూడా… అవసరానికి యే భాష మాట్లాడాలో ఆ భాషే వ్రాస్తారు.

కానీ ఇప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నామా ??

ఇప్పుడే ఇదే సైటులో కమీనే రివ్యూ చదివాను.హిందీలో ‘కుతియా’ – bitch అనే మాటను తెలుగులో అనువదించడానికి రచయిత (మహేష్ గారు) ఇబ్బంది పడ్డారు.

మనం రోజూ మాట్లాడుకునే భాషనూ కూడా ఒక సినిమాలోనో / నవలలోనే వాడలేని స్థితి మనది.

పోనీ… ఒక ఇరాన్ దేశంలోలా కఠినమైన సెన్సారు వ్యవస్థా అంటే అదీ కాదు.

అప్పుడెప్పుడో.. “సై” అనే సినిమా గురించీ ప్రముఖ తెలుగు సినిమా వెబ్ సైటు ( పెరు చెప్పడం లేదు , ఎందుకంటే మనకు భావ ప్రకటనా స్వేచ్చ తక్కువ కదా ) అయిన పనిలెనిమెదడు…లో ఆ సినిమా గురించి రాస్తారు :- మధ్య వేలు చూపించడం , ఎఫ్ పదం వాడటం , హిప్ డ్యాన్సులు వగైరాలతో ఆ చిత్రం కొత్త పంథాను తొక్కిందట. నేను ఆ సమీక్షకుడుని తప్పు అనలేను. ఎందుకంటే మన జనం నర నరానా అదే శైలి .

చిరుత సినిమాలో అనుకుంటా, హీరోయిన్ విలన్ కేసి మధ్య వేలు చూపిస్తే అతనొచ్చి ” నాకూ అదే కావాలి వస్తావా ” అనే సన్నివేశం ఉంది. ఇవన్నీ ప్రజలు మన సంస్కృతి అనుకున్నప్పుడు ,అందులో తప్పు లేదు.. కానీ స్వంత భాషలో మాత్రం చిన్నపాటి బూతు స్క్రీన్ మీద రాకూడదట.

ఇక్కడ అంశం , కేవలం బూతూ మాట గురించి కాదు. ఇప్పటికీ మన సినిమాల్లో హీరో హీరోయిన్లు ఎంత ప్రేమించుకున్న డ్రీం సాంగ్సులో ఎంత విచ్చలవిడిగా దొర్లినా, కథ ప్రకారం, ఇద్దరూ వర్జిన్స్ అయితేనే …అది కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం అంటారు.

నిజ జీవితంలో మన చుట్టూ ఎన్నో పాత్రలూ , ఎన్నో జీవితాలూ ఉన్నా, అవి తెలిపే నవలలు / కథలు లేనంత కాలం… తెలుగు సినిమా పరిస్థితి ఇంతే .

తెలుగే కాదు యే భాష / సంస్కృతిలోని యే కళ అయినా సమాజం నుంచి పుడుతుందే కానీ సమాజం అవతలినుంచి వచ్చే యేలియన్ కాదు.

ఒక వేళ మిగతా భాషల నుంచి అరువు తెచ్చుకున్న కథలు అయినప్పటికీ , అవి మన ప్రేక్షకుల హిపోక్రిసీకు అందుతాయి అనుకుంటేనే ఎవ్వరైన అడాప్ట్ / కాపీ చేస్తారు.

ఈ వ్యాసం అంతా చదివి ఆనక ఇక మన తెలుగు సినిమా స్థితి ఇంతేనా అని నిరాశపడకండని నా మనవి. ప్రతిదానికీ ఒక టైం వస్తుంది…

ఒకప్పుడు జంధ్యాల గారు అద్భుతమైన కథకులు / స్క్రిప్త్ రైటర్ . తెలుగులో ఆఖరుగా చూసిన క్లాసిక్స్ అనిపించుకున్న కె. విశ్వనాథ్ గారి చిత్రాల్లో ఎక్కువవాటికి జంధ్యాలగారి సహకారం ఎంతో ఉంది. ఆన్ స్క్రీన్ క్రెడిట్స్`ను పట్తించుకోకుండా .. కేవలం సినిమా / కథ మీద పిచ్చి ప్రేమతో పనిచేసిన ఆరుద్ర లాంటివారెందరో . ఈ మధ్యే ముళ్ళపూడి రమణగారి కోతి కొమ్మచ్చిలో ఒక ఉదాహరణ: ఆయన వ్రాసిన ఒక స్క్రిప్ట్ వర్షన్ కు పేరు నా పేరు పడకపోయినా ఫర్లేదు ఆరుద్రగారి పేరే వేయండి అన్నారుట. ఇప్పుడు సినిమాల్లో అలా రచయితలు ఎవ్వరూ లేరు. ఒక “లైన్” అనుకోవడం , ఇద్దరు-ముగ్గరు స్నేహితులతో కూర్చుని ఆ “లైన్” ను సీన్లతో నింపడం . కథ-మాటలు-స్క్రీన్ ప్లే అంటూ ఒకరి పేరే వేసుకుని మిగతవారిని అసిస్టెంట్ డైరెక్టర్లు అని చెప్పడం. అసలు రచన వేరు , దర్శకత్వం వేరు అనుకునే స్థితిలో లేరు ఎవ్వరూ .

తెలుగులో మంచి కథలు / కథకుల కోసం వెదుకున్న దర్శక / నిర్మాతలకేమీ కొదవ లేదు. ఇప్పటివరకూ మన భాషలో వచ్చి సినిమాకు సరిపోతాయి అనే పాత కథ కావొచ్చు లేదా స్వీయ కథ కావొచ్చు, అందులో కాస్తంత మార్కెటబిలిటీ అంశం కనిపిస్తే.. ఆ కథను కొనుక్కోవడానికీ తెరకెక్కించడానికి ఎందరో అర్రులుజాస్తున్నారు. కాకపోతే ఏదయిన కొత్త తరహా కథతో ఎక్సపరిమెంటు చేయాలంటే ఆ కథ ఒక లో బడ్జెట్ చిత్రం అయ్యేట్లు అయితేనే ఇది కుదురుతుంది. లో- బడ్జేట్ అనేందుకు ఇంత అని లేదు. యెంత తక్కువలో అయితే అంత సులభం ప్రొద్యూసర్`ను ఒప్పించడం. అయిదువేల రూపాయిల రెమ్యూనరేషన్ కడితే, యేపీ ఫిలిం రైటర్స్ అసోసియేషన్`లో ఎవ్వరైనా మెంబరు కావొచ్చు , తమ కథలను యే భయమూ లేకుండా ఎందరికైనా వినిపించొచ్చు. లేదా , ఒక పత్రికలో చిన్న కథ / నవలగా అచ్చు వేయించుకోగలిగితే చదివిన వారెవ్వరో ఆ కథను సినీ-కరించేందుకు ఉత్సాహం చూపవచ్చు.

” యేమో…గుర్రమెగరావచ్చు ”

ఇంతకూ టైటిల్ ఇలా యెందుకు పెట్టాను అంటే…. మనకు భావ పరకటనా స్వేచ్చ తక్కువ కాబట్టి.

అదీ ఇంగ్లీషులో అయితే…. ఇదీ నా టైటిలు :

“WHY IS TELUGU CINEMA SO F****D UP ? ”

Well, to fill in the omitted letters, its a self-censor in my mind, which will always be there inside any artist and filmmaker.

–విప్లవ్

35 Comments
 1. shanthi August 22, 2009 /
  • viplove August 22, 2009 /
 2. అబ్రకదబ్ర August 22, 2009 /
  • viplove August 22, 2009 /
   • అబ్రకదబ్ర August 22, 2009 /
   • viplove August 23, 2009 /
  • viplove August 22, 2009 /
   • viplove August 22, 2009 /
 3. Bluto August 22, 2009 /
 4. vennela August 22, 2009 /
  • viplove August 22, 2009 /
 5. viplove August 22, 2009 /
 6. Ashok August 22, 2009 /
  • rAsEgA August 22, 2009 /
   • viplove August 22, 2009 /
   • rAsEgA August 24, 2009 /
  • viplove August 22, 2009 /
   • Ashok August 23, 2009 /
 7. Alibhai August 22, 2009 /
  • viplove August 23, 2009 /
   • Alibhai August 23, 2009 /
  • raj August 23, 2009 /
 8. shanthi August 22, 2009 /
 9. వెంకట్ ఉప్పలూరి August 23, 2009 /
 10. Srinivas August 23, 2009 /
 11. గీతాచార్య August 24, 2009 /
 12. okadu August 26, 2009 /
 13. su September 19, 2009 /
 14. Suneetha July 23, 2010 /
 15. saralabose November 23, 2011 /
 16. పుల్లారావు November 23, 2011 /
 17. Kiran November 23, 2011 /