Menu

Transformers 2 రివ్యూ

చక్కని కథనం, అప్పటివరకు చూసిన గ్రాఫిక్స్ కంటే విభిన్నమయిన గ్రాఫిక్స్ లతో తీసిన Transformers చూసిన వెంటనే ఈ సినిమా సీక్వల్ తప్పక చూడాలి అని నిర్ణయించుకున్నాను. రెండవ పార్టు విడుదలయి కేవలం ఒక్క రోజులో 60 మిలియన్ డాలర్లు, వారాంతానికల్లా $112 మిలియన్ల కలెక్షన్ రాబట్టింది. ఈ వివరాలు చూసి ఈ సినిమా పైన మరిన్ని ఎక్కువ అంచనాలతో వెళ్ళాను.

మొదటి పార్టు హిట్ అయింది కాబట్టి రెండవ పార్టుకు కాస్త ఫ్లాష్‌బ్యాక్ కలపాలన్న ప్రాథమిక సూత్రాన్ని పాటించారు. ఈజిప్టులోని పిరమిడ్లో ఉన్న యంత్రాన్ని పునరుజ్జీవనం చేయడానికి అవసరమయిన “మేట్రిక్స్” కోసం డిసెప్టికాన్స్ ప్రయత్నిస్తుంటే ఆప్టిమస్ తన మితృడయిన హీరోతో కలసి ఎలా ఎదుర్కుంటాడు, చివరికి భూలోకాన్ని డిసెప్టికాన్స్ నుండి ఎలా కాపాడగలుగుతారు అన్నది కథాంశం.

చిక్కనయిన కథతో అలరించిన ఫస్ట్ పార్టుకు భిన్నంగా ఈ కథలో సాగతీత, అనవసరపు సన్నివేశాలు ఎక్కువయ్యాయి. గ్రాఫిక్స్/విజువల్స్ కూడా మొదటిపార్టుతో పోలిస్తే తక్కువే. సూటిగా విషయానికి రాకుండా అనవసరపు ఉపోద్ఘాతాలవల్ల, ఉపన్యాసాలవల్ల కథలో స్పష్టత లేదు. మొదటి అరగంటా హీరో కాలేజీ సోదితో “సాగుతుంది”. హీరో హీరోయిన్ల ప్రేమ కథ మరో అనవసరపు ట్రాక్. మొదటి పార్టులోనే ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపించారు. ఇప్పుడు దానికి ట్విస్టులు ఎందుకు పెట్టారో!

డిసెప్టికాన్లను ఎదుర్కోవడానికి ఆప్టిమస్ ప్రైం తమ గ్రహం నుండి అప్పటికప్పుడు మరికొందరు ఆటోబాట్స్ ను ఎందుకు పిలిపించడో అర్థం కాదు. హీరోయిన్ దగ్గరున్న వస్తువును కాజేయడానికి వచ్చిన డిసెప్టికాన్ చైనుకు కట్టివేయబడి కుక్కపిల్లలా ప్రవర్తిస్తూ హీరోయిన్‌కు సహాయం చేస్తుంది!! హీరో తల్లిదండ్రులను ఈజిప్టుకు తీసుకురావలసిన అవసరం కథకు ఏ కోశానా కనపడదు. చివరగా ఆప్టిమస్ ప్రైం అన్ని డిసెప్టికాన్లను మట్టుపెట్టడు. బహుశా మూడో పార్టుకోసం కావచ్చు. గ్రాఫిక్స్ కూడా అంతంత మాత్రమే. మొదటి సన్నివేశంలో కాస్త, చెట్లమధ్య ఆప్టిమస్-డిసెప్టికాన్ల మధ్య ఫైట్, చివరగా పిరమిడ్ల పైన దాడి జరిగే సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకుంటాయి.

నటీనటుల విషయానికొస్తే – సినిమా మొత్తం పైన “నటన” అన్నది దాదాపు కనిపించదు. సినిమా అంతా కేవలం రెండు-మూడు ఎక్స్ ప్రెషన్లతో లాగించే మహేష్‌బాబులా Shia LaBeouf అతి తక్కువ హావభావాలతో “నటించాడు”. మొదటి పార్టులో అస్థిపంజరంలా ఉన్న Megan Fox ఈ సినిమా కోసమే కాస్త బరువు పెరిగి సెక్సీగానే కనిపిస్తుంది. హీరో కనిపిస్తే ఒళ్ళు మరిచిపోయి హీరో పైన పడే తలాతోకా లేని పాత్రలో Isabel Lucas వెగటు పుట్టిస్తుంది. కాస్తో కూస్తో నటనకు అవకాశమున్న పాత్రలో John Turturro కనిపిస్తాడు కానీ ఆ పాత్ర సీరియస్ పాత్రో కామెడీ పాత్రో అర్థం కాదు.

ఈ సినిమాకు Rotten Tomatoes వెబ్‌సైట్ 20%, IMDB 6.8 రేటింగ్ ఇచ్చాయంటే ఏమో అనుకున్నాను కానీ సినిమా చూసిన తర్వాత అర్థమయింది ఎందుకలాంటి రేటింగ్ ఇచ్చారో. సినిమా అయిపోయాక థియేటర్లో కొందరు చప్పట్లు కొట్టారు….నేనూ కొట్టాను “హమ్మయ్యా సినిమా అయిపోయింది” అనుకుంటూ!

–జీడిపప్పు

8 Comments
 1. venu July 22, 2009 /
 2. అబ్రకదబ్ర July 22, 2009 /
  • sasank July 22, 2009 /
   • అబ్రకదబ్ర July 22, 2009 /
   • sasank July 23, 2009 /
  • Ravi July 25, 2009 /