Menu

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (మొదటి భాగం)

slumdog_millionaire_movieఈ సినిమా గురించి ‘నవతరంగం’ లో మొట్టమొదట సమీక్షించినది సాయి బ్రహ్మానందం గారు (డిసెంబర్ 1, 2008). అప్పటికి ఈ సినిమా ఇంకా ఇండియాలో విడుదల కాలేదు. అప్పుడు ఈ సమీక్షకు రాసిన వ్యాఖ్యల్లో నేను ఇది ఎందుకూ పనికిరాని సినిమా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ రాశాను.

ఆ తర్వాత ‘స్వాతి’ మాసపత్రికలో (జనవరి, 2009) ఈ సినిమా మాతృక అయిన వికాస్ స్వరూప్ రాసిన ‘Q & A’ నవల గురించిన సమీక్ష – మాలతి చందూర్ గారు రాసినది చదవటం తటస్థించింది. ఆ సమీక్ష చదివిన తర్వాత మబ్బులు విడినట్టుగా దాని అసలుకథ కొంచెం అర్థమైంది. కొద్దిరోజుల తర్వాత ఇండియాలో విడుదలైనా, థియేటర్లో చూడటం కుదర్లేదుగాని, సిడి కొని చూడగలిగాను. ఆ తర్వాత సాయి బ్రహ్మానందం గారి సమీక్షకు నేను రాసిన వ్యాఖ్యల్లోని అభిప్రాయం పూర్తిగా మారింది. ఇప్పుడది చెత్త సినిమా అనే ఉద్దేశం నాకు లేదు. అలా అని మరీ గొప్ప సినిమా అని కూడా పొగిడెయ్యనుగాని, ఎంతో కొంత వాస్తవికతతో ముడిపడి ఉన్న మంచి కమర్షియల్ సినిమా అని మాత్రం చెప్పగలను.

అయితే, అనూహ్యంగా ఈ చిత్రం ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నా, మనవాళ్ళైన ఎ.ఆర్. రహమాన్, గుల్జార్, రసూల్ పూకుట్టిలకు ఆస్కార్లు దక్కినా, అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపిన ఈ సినిమా, మన భారతీయ ప్రేక్షకులను మాత్రం పెద్దగా కదిలించలేకపోయింది. హిందీలో డబ్ చేసినా, ఈ సినిమా మనదేశంలో పెద్దగా ఆడలేదనే చెప్పాలి (దానికి కారణాలేమై ఉండొచ్చనేది తర్వాత విశ్లేషిస్తాను). అందుకేనేమో, ఇండియాలో విడుదలైన తర్వాత ఈ సినిమా గురించి ‘నవతరంగం’ లో ఎవరూ సమీక్షించలేదు.

Rags to Riches కథలు మనకు కొత్తేమీ కాదు. హిందీలోనూ, ఇతర భారతీయ భాషల్లోనూ ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే, మన సినిమాల్లో హీరో ఎలా గొప్పవాడు అవుతాడు అంటే – కండబలంతో (నిజంగా సల్మాన్ ఖాన్ లా కండలు ఉండనక్కరలేదు). ఒక్కడే పదిమందినైనా మట్టుపెట్టగలడు. ఎటుతిరిగీ, వాడికీ, ప్రేక్షకులకూ బోర్ కొట్టకుండా ఉండేందుకు ఒక హీరోయిన్ ఉండాలి. అంతే. (పాత పగలు తీర్చుకోవటం, విలన్లను చితకబాదడం ఇవన్నీ మామూలే కదా).

కాని, ‘స్లమ్ డాగ్’ లోని ప్రధాన పాత్రధారి, జమాల్ అలాంటి హీరో కాదు. కండబలంతో కాకుండా, తన బుద్ధిబలంతో ‘రిచ్’ అవుతాడు. స్థూలంగా చూస్తే, మన భారతీయ సినిమాలకూ, దీనికీ ఇక్కడే తేడా ఉంది. (మధ్యలో ముంబాయి రకపు మాఫియా సీనులు చూపించినా, హీరో ఎక్కడా మన సినిమాల టైపు హీరోయిజం చూపించడు). క్విజ్ లో అడిగిన అన్ని ప్రశ్నలకూ అతను ఎలా సరిగ్గా సమాధానం చెప్పగలుగుతాడు అనేది తెరమీద చూడాల్సిన కథ – అదే అతని జీవితకథ.

Questions & Answers (Q&A) గురించి

qandaదీనికి ముందు సినిమాకు మూలం అయిన Q&A నవల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇది రామ్ మొహమ్మద్ థామస్ అనే 18 ఏళ్ల అనాథ కుర్రాడి ఆత్మకథా కథనం. ‘I have been arrested. For winning a quiz show’ అనే ఆసక్తికరమైన వాక్యంతో ప్రారంభమవుతుందీ నవల (రామ్ మొహమ్మద్ థామస్ కథకు తర్వాత వస్తాను). ‘స్లమ్ డాగ్’ సినిమాకు మాతృక అయిన ‘Q & A’ నవల ప్రత్యేకించి సినిమాకోసం అంటూ రాసినదేమీ కాదు. అది భారత విదేశాంగ శాఖలో అధికారి అయిన వికాస్ స్వరూప్ రాసిన మొట్టమొదటి నవల (మొదటగా 2005 లో ప్రచురింపబడింది). డాక్టర్ని కాబోయి యాక్టర్ని అయ్యాను అన్నట్టుగా ప్రచురణ దశలోనే అది అనేకమంది దృష్టిలో పడి సినిమా బాట పట్టింది. ఈ నవల రాయటానికి తనను ప్రేరేపించిన రెండు ముఖ్యమైన విషయాల గురించి వికాస్ స్వరూప్ ఇంటర్వ్యూలలో చెప్పారు.

నవలకు ప్రేరణలు

ఒకటి – ఒకసారి వార్తాపత్రికలో మురికివాడల పిల్లలు కూడా మొబైల్ ఫోను, ఇంటర్నెట్ వంటి అధునాతన సౌకర్యాలను ఉపయోగించగలుగుతున్నారని చదవటం. రెండోది – యుకెలో ప్రాచుర్యం పొందిన ‘Who Wants to Be a Millionnaire’ పోటీలో పాల్గొని బహుమతి గెలుచుకున్న మేజర్ చార్లెస్ ఇంగ్రామ్ అనే బ్రిటిష్ సైన్యాధికారి, తర్వాత మోసం చేసి ఆ పోటీలో గెలిచినట్టుగా తేలటం – ఇవి రెండూ ప్రధానంగా తనను ఈ రచనకు ప్రేరేపించాయని వికాస్ స్వరూప్ చెప్పారు. ‘జ్ఞానం అనేది ఎవరో ఒకరి సొత్తు కాదు. కొంత పరిశీలన, అనుభవంతో, మురికివాడల పిల్లలు కూడా అలాంటి జ్ఞానాన్ని సంపాదించవచ్చు; ఒక బ్రిటిష్ సైన్యాధికారి స్థాయిలో ఉన్న వ్యక్తి పైనే, మోసంచేసి గెలిచినట్టు ఆరోపణలు వచ్చినప్పుడు, ఒక స్లమ్ పిల్లవాడిపైన అలాంటివి రావటం ఇంకా తేలిక’ అంటారు ఆయన. 2003లో ఉద్యోగరీత్యా లండన్ లో ఉన్నప్పుడు, తనకు నవల రాయాలన్న ఆలోచన వచ్చిందని, ఒక రెండు నెలల పాటు తన కుటుంబం ఇండియాకు సెలవుల్లో వెళ్ళారని, అప్పుడు తను ఈ నవల ప్రారంభించి తన లండన్ పోస్టింగ్ ముగుస్తున్న దశలో దాదాపు రెండు నెలల వ్యవధిలోనే ముగించానని చెప్పారు.

నవల నాలుగున్నర అధ్యాయాలు రాసిన తర్వాత, స్వరూప్ దానిని పదిమంది ప్రచురణకర్తలకు పంపించారు. వాళ్ళల్లో పీటర్ బక్ మాన్ అనే ఏజెంటు స్పందించాడు. నవల చాలా ఆసక్తికరంగా ఉందని, దానిని పూర్తి చేయమని, దానికి ఒక ప్రచురణకర్తను తాను కుదిర్చిపెడతానని హామీ ఇచ్చాడు. అలా వికాస్ స్వరూప్ ఆ నవలను ముగించి, అతనికి అప్పజెప్పి డిల్లీ పోస్టింగులో చేరటానికి వచ్చారు. 2005 లో లండనుకు చెందిన ట్రాన్స్ వరల్డ్ పబ్లిషర్స్ అనే సంస్థ దీనిని ప్రచురించింది.

నవల పుస్తకరూపంలో రావటానికి ముందే 2004 లో ఫిల్మ్ ఫోర్ అనే కంపెనీ దీనికి సినిమా హక్కులు కొనుక్కున్నది. కొంతమంది భారతీయ దర్శకులు కూడా ఈ నవలను హిందీలో సినిమాగా తీయటానికి ముందుకు వచ్చారని, కాని అప్పటికే ఈ సినిమా హక్కులు ఫిల్మ్ ఫోర్ వాళ్లకు ఉండటంతో వాళ్ళే ఫైనల్ గా ఈ సినిమాని నిర్మించారని వికాస్ స్వరూప్ చెప్పారు. అందుకని మనవాళ్ళు కేవలం డబ్బింగ్ తోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.

భారతీయమే, కాని బహు భాషీయం

‘స్లమ్ డాగ్’ సినిమాగాని, Q&A నవలగాని, మనదేశంలో కంటే, అంతర్జాతీయంగా సృష్టించిన సంచలనమే ఎక్కువ. Q&A నవల సినిమారూపం పొందకముందే, 36 భాషల్లోకి అనువదించబడిందంటే, ప్రపంచవ్యాప్తంగా దానికి లభించిన ఆదరణ అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో ఆరు భాషల్లోకి అనువదించబడి ఇప్పుడు ఆ సంఖ్య 42 కు చేరుకుంది. సరదాగా ఆ భాషలేంటో చూద్దాం. అరబిక్, బ్రెజిలియన్ పోర్చుగీస్, బల్గేరియన్, చైనీస్, క్రొయేషియన్, చెక్, డేనిష్, డచ్, ఈస్తోనియన్, ఫిన్నిష్, ఫ్రెంచ్, జర్మన్, గ్రీక్, గుజరాతీ, హీబ్రూ, హిందీ, హంగేరియన్, ఐస్లాండిక్, ఇండోనేషియన్, ఇటాలియన్, జాపనీస్, కొరియన్, లిథుయేనియన్, మలయాళం, నార్వేజియన్, పోలిష్, పోర్చుగీస్, పంజాబీ, రొమేనియన్, రష్యన్, సెర్బియన్, సింహళ, స్లోవాక్, స్లోవేనియన్, స్పానిష్, స్వీడిష్, తైవానీస్, తమిళం, థాయ్, టర్కిష్, వియత్నమీస్ (ఖచ్చితంగా ఊపిరి పీల్చుకోవటానికి మధ్యలో ఆగి ఉంటారు). ఈ నవల పూర్తిగా మనదేశపు నేపధ్యంలో రాయబడ్డా, ఇందులో ప్రాంతీయ, జాతీయపరమైన ఎల్లలుదాటిన విశ్వజనీనత పాఠకులకు కన్పించి ఉండవచ్చు.

మరికొన్ని కారణాలు – Who Wants To Be A Millionnaire ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టి.వి. గేమ్ షో. చాలా దేశాల్లో దీని అనుకరణలు వచ్చాయి. మనదేశంలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమం కూడా కొన్నేళ్ళపాటు ప్రేక్షకులను టివి సెట్స్ కి కట్టిపడేసింది. అవి కలుగజేసిన సంచలనాన్ని, ప్రయోగాత్మకతను ప్రజలింకా మరిచిపోలేదు. ఆ క్విజ్ షోను కథకు నేపధ్యంగా ఎన్నుకోవటంలోనే వికాస్ స్వరూప్ సగం విజయం సాధించారు. ఆయన దృష్టిలో నవల ఒక ఉత్కంఠను, పాఠకులచేత ఆపకుండా చదివించే గుణం కలిగి ఉండాలి. ఒక క్విజ్ షోలో అటువంటి టెన్షన్, ఉత్కంఠ ఉంటాయి. అయితే ఆ క్విజ్ లో మనలాంటి మధ్యతరగతి బాబులు గెలిస్తే మజా ఏముంటుంది? అందుకే చదువుసంధ్యలు సరిగా లేని ఒక 18 ఏళ్ల మురికివాడ కుర్రాడి పాత్రను ప్రవేశపెట్టాడు. అనుభవానికి మించిన ఉపాధ్యాయుడు లేడంటారు కదా. ఆ కుర్రాడు తన అనుభావాల్లోనుంచే ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలుగుతాడు.

ఇక్కడ మీకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఢిల్లీలో వచ్చే సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని నగరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దుతున్నారు. ఢిల్లీ మెట్రో పనులు వేగవంతమవుతున్నాయి. అయితే ఈ mega event ను పురస్కరించుకుని మరో వర్గం కూడా ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఆ వర్గం ఎవరో తెలుసా? ఢిల్లీలో ఉన్న భిక్షగాళ్ళు. ఢిల్లీలో వందల సంఖ్యలో ఉన్న భిక్షగాళ్ళు తమ పిల్లలకు ఇప్పటినుంచే విదేశీ భాషల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు (అడుక్కోవటానికి అవసరమైనంతవరకే మేరకే కావొచ్చుగాక). వివిధ దేశాల కరెన్సీని వాళ్లకు పరిచయం చేస్తున్నారు. మన కళ్ళముందే ఇటువంటివి జరుగుతుంటే, ‘స్లమ్ డాగ్’ చిత్రంలోని కుర్రాడు డాలర్ నోటుపైన ఉన్న బొమ్మ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ది అని చెప్పటంలో ఆశ్చర్యమేముంది? (అయితే, సినిమాలో గుడ్డివాడు ఎలా చెప్పగలిగాడు అంటే, వాడు గుడ్డివాడు కాకముందు ఆ బొమ్మ చూసి ఉంటాడు అని సరిపెట్టుకోవాలి. నిజానికి ఈ ప్రశ్న వికాస్ స్వరూప్ నవలలో లేదు. మూడు ప్రశ్నలు తప్పించి మిగిలిన ప్రశ్నలన్నింటినీ సినిమాలో మార్చేశారు కాబట్టి నవలలో ఆ ప్రశ్నలకు సంబంధించిన కథనాలూ సినిమాలో మాయమయ్యాయి. దీన్ని గురించి రెండో భాగంలో చర్చిస్తాను).

Q&A నవల ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ గా ఎలా అవతారం ఎత్తిందీ, ఏ ఏ మార్పులు, చేర్పులకు గురి అయిందీ మొదలైన విషయాలు రెండో భాగంలో, చివరన వికాస్ స్వరూప్ గారి అనుమతితో చేసిన కొన్ని తెలుగు అనువాద భాగాలూ (బహుశా మూడో భాగంలో…..)

6 Comments
  1. అబ్రకదబ్ర July 30, 2009 /
  2. mohanrazz July 30, 2009 /
  3. sivaji July 30, 2009 /
  4. sivaji July 30, 2009 /
  5. గీతాచార్య July 30, 2009 /