Menu

నటన + జీవితం = ఒక మంచి ‘షో’ (రెండవ భాగం)

ఈ వ్యాసం లోని మొదటి భాగం కోసం ఇక్కడ చూడండి.

Art is a lie that makes us realize truth – Pablo Picasso

show-neelakanta-manjulaఒక సినిమాని చూసి కథ చెప్పటం ఒక ఎత్తయితే, దాన్ని విశ్లేషించటం మరొక కష్టమైన పని (ఇప్పుడొస్తున్నతెలుగు చిత్రాల్లో చాలా వాటి విషయంలో రెండోదానికి తావే లేదనుకోండి). ఈ సినిమాను నాకు చేతనైనంతలో, నాకు అర్థమయినంతవరకూ విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను.

సినిమా వినోదప్రధానమైన సాధనం కావటం అటుంచి, కొన్ని సినిమాలు మనల్ని ఒక గొప్ప అనుభూతికి గురిచేస్తాయి. మరికొన్ని ఒక షాక్ ని కలిగిస్తాయి. ఇంకా కొన్ని ప్రేక్షకుడిలో ఒకవిధమైన మానసిక సంఘర్షణ కలిగిస్తాయి. సినిమా చూసి, థియేటర్ బైటికి వచ్చిన తర్వాత కూడా, ఎంత వద్దనుకున్నా, మనల్ని వెంటాడతాయి. ‘షో’ చూసిన తర్వాత నేను అలాగే ఫీలయ్యాను. ‘ఎందుకింత మానసిక సంఘర్షణ కలిగించే సినిమాలు చూడటం? ఇంట్లోనూ సమస్యలే, ఏదో కాస్తంత రిలాక్సేషన్ కోసం సినిమాకని వెళ్తే, అక్కడ కూడా ఈ సమస్యలే చూడాలా? సినిమా అంటే సరదాకోసం వెళ్తాం కాని…’ అని వాదించే వాళ్లకు నా దగ్గర సమాధానమేమీ లేదు – వాళ్ళను అటువంటి చిత్రాలకు దూరంగా ఉండమని చెప్పటం తప్ప.
నిజానికి కళకీ, జీవితానికీ చాలా అవినాభావ సంబంధముంది. అందుకే, జీవితంలో ఉన్న సంఘర్షణలన్నీ కళల్లో ప్రతిఫలిస్తాయి – అది సినిమాయే కావొచ్చు, సాహిత్యం కావొచ్చు, నృత్యం, సంగీతం, చిత్రలేఖనం ఇలా ఏదైనా…. కాబట్టి వాటిని (ఆ సంఘర్షణలను) తిరస్కరించటంలో అర్థం లేదు. ఎంతో కొంత అంతఃసంఘర్షణ జరగనిదే, ఏ కళాకారుడిలోని ప్రతిభయినా బయటికి రాదు. మనందరం ఎంతో ఇష్టపడే మహా ఇతిహాసం రామాయణం కూడా శోకంలోనుంచే పుట్టిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఇక నటన విషయానికి వస్తే, నటనకీ, జీవితానికీ చాలా, చాలా దగ్గరి సంబంధం ఉంది. ఒక నటుడు నటనలో జీవించాడు అని ఊరికే అనం కదా. నటనలో జీవితముంది. జీవితంలో నటనా ఉంది. ఒక దశలో రెండింటినీ విడదీయటం చాలా కష్టం. ‘షో’ లో దర్శకుడు నీలకంఠ చూపించినది అదే.

జీవితంలో నటన

జీవితంలో నటన అన్నప్పుడు ఈ సినిమాలో ఒకటి, రెండు సన్నివేశాలు గుర్తొస్తాయి (ఉద్దేశపూర్వకంగా చూపించినవే అయి ఉండొచ్చుగాని, కథలో చక్కగా కలిసిపోయాయి).

ఒకటి – రిధిమ, మాధవ్ కు కాఫీ తయారుచేసి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ –

మాధవ్: అదే రుచి, అదే చిక్కదనం, ఫిల్టర్ కాఫీయా లలితగారూ? (ఒక టివి యాడ్ ను అనుకరిస్తూ)

రిధిమ: (అదే యాడ్ ను అనుకరిస్తూ) నో… ఇది బ్రూ ఇన్ స్టంట్
కథ ప్రకారం, ఇది వాళ్ళిద్దరూ ముందుగా అనుకుని మాట్లాడిన మాటలుకాదు. జోక్ చేసుకోవటంలో సహజంగా వచ్చినవి. ఇది యాక్టింగ్ లో భాగమే కదా.

రెండవది – కొలను దగ్గర పెంకులతో కప్పగంతులు వేస్తున్నప్పుడు –

మాధవ్: అహహా… నేనే గెలిచాను. (బిగ్గరగా, చేతులు పైకెత్తి) యా… ఈ వరల్డ్ కప్ కప్పగంతుల కాంపిటీషన్లో నేనే విన్నర్ని… (చప్పట్లు కొడుతూ)

రిధిమ: (వెంటనే అక్కడే పొత్రంలా ఉన్న ఒక బండరాయిని తీసి అతని చేతికిస్తూ) అయితే… ఈ ట్రాఫీ మీదే…

మాధవ్: ఆ బండరాయిని అందుకుని అటూ ఇటూ చూపించి…..(నీళ్ళల్లోకి విసిరేస్తాడు….అదే వేరే విషయం).

అంటే, నాటకం వెయ్యాలని అనుకోకముందే, వాళ్ళిద్దరూ ఇలా రెండు చిన్న బిట్స్ తెలియకుండానే enact చేసేశారు. ఇదే మాధవ్ ప్రతి మనిషిలోనూ సహజంగానే ఒక నటుడుంటాడని చెప్పినదానికి ఉదాహరణ.

ఇక మాధవ్ మరో రెండు సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగానే, ఆమెకు ‘తెలియకుండా నటించాడు.’ ఒక గంటసేపు తననెవరన్నా entertain చేస్తే, తన ఒక నెల జీతం (ముప్ఫై వేలు) ఇచ్చేస్తానని రిధిమ అన్నప్పుడు, డబ్బిస్తానని తనను insult చేసినట్టుగా ఫీలింగ్ పెట్టి, అదృశ్యమై, తను ఒక సైకో అనుకునేలా ప్రవర్తిస్తాడు.

రెండోది – భోజనం చేసిన తర్వాత, ఐస్ క్రీం తింటూ, తనకున్న నటించడమనే పిచ్చిని గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకోవటం. రిదిమను “ఏడుపు సీను బాగా చేశానాండీ?” అని అడుగుతాడు.

నటనంటే?

Drama“క్షణంలో ఏడుపు ఎలా తెప్పించగలిగారు? కష్టం కదూ?” అని రిధిమ అన్నప్పుడు –

“ఏదీ కష్టం కాదండీ! ఆ క్షణంలో అది నిజమని ఫీలయితే చాలు. మీరూ చెయ్యొచ్చు.” అని నటనలోని అంతఃసూత్రం చెప్తాడు మాధవ్.

రిధిమ సంజయ్ తో (తను ప్రేమించినతను) ఫోనులో మాట్లాడుతున్నట్టు యాక్షన్ బిట్ చేయించినప్పుడు ఆమె మొదట సరిగా చేయలేకపోతుంది. అప్పుడు మాధవ్ ఆమెతో “నేనిక్కడ ఉన్నానని మీరు conscious అయిపోతున్నారండీ. యాక్టింగ్ లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే – మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోవాలి. దీన్నే ‘సమూహంలో ఏకాంతం’ అంటారు.” అని నటనలోని తత్త్వం బోధపరుస్తాడు. రెండోసారి మాధవ్ తన సూచనలతో, మాటలతో ఆమెను ఆ మూడ్ లోకి తీసుకెళ్ళి ఆమెతో నటింపజేయడంలో కృతకృత్యుడవుతాడు. ఇలా రెండు, మూడు సన్నివేశాల్లో దర్శకుడు ‘నటన’ అంటే ఏమిటి అనేదానికి పాత్రల ద్వారానే నిర్వచనం ఇప్పిస్తాడు.

నటనలో జీవితం

ఇక రెండోభాగంలో (అంటే వాళ్ళు నాటకం రెండోసారి వేసినప్పుడు – ఇంతకీ దాని పేరు ‘తాడో-పేడో’), ఎవరూ ఊహించనివి (సినిమాలో పాత్రలు కూడా) జరుగుతాయి. రిధిమ, సంధ్య పాత్రలో (మాధవ్ భార్య ‘సుధ’కు రెప్లికా) నిజంగానే జీవిస్తుంది. అది ఎంతవరకూ వెళ్తుందంటే, మాధవ్ తామిద్దరూ ఒక నాటకం వేస్తున్నామన్న విషయం పూర్తిగా మరిచిపోతాడు. రిధిమ గొంతులో తన భార్య స్వరాన్నే వింటాడు. తన భార్యతోనే మాట్లాడుతున్నాననుకుంటాడు.
నాటకంలోని కథ, మాధవ్ చెప్పిన ప్రకారం ఇది – భార్యాభర్తలు నిత్యం గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ గొడవలు చూడలేని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరినీ తమ గొడవలు పరిష్కరించుకోవడానికి ఈ ఏకాంత ప్రదేశానికి పంపించారు. కాని గొడవలు పరిష్కారం కావడానికి బదులు, వాదనలు జరిగి, అవి ముదిరి, విడాకులు తీసుకోవాలనుకునేంత వరకూ వెళ్తుంది.

ఆ ప్రకారమే రిధిమ ఈ కాపురంలో తనకు సుఖం లేదని, తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోతానని, తనకు విడాకులు కావాలని డైలాగు చెప్తుంది. ఇక్కడొక విషయం గమనించాలి – ఈ డైలాగులన్నీ (సంధ్య పాత్ర చెప్పేవి) రిధిమ తనకు మాధవ్ తన గురించి, భార్య గురించి చెప్పిన విషయాలనుంచే తీసుకుని చెప్తుంది తప్ప, సొంతంగా కల్పించి చెప్పదు. పాత్ర ప్రియుడి పేరుకి తన ప్రియుడి పేరే (సంజయ్) ఉపయోగిస్తుంది. ఇలా రిధిమ పాత్రను నేలవిడిచి సాము చెయ్యకుండా తన పరిధిలోనే చక్కగా మలిచాడు దర్శకుడు. లేకపొతే, సినిమా బాలెన్సు దెబ్బతిని ఫక్తు మూస చిత్రంలా తయారయ్యేది.

ఇక చాలామంది ప్రేక్షకులను తికమకపెట్టేది – మాధవ్ తాము ఆడుతున్నది కేవలం ఒక నాటకం అని తెలిసి, ఎందుకిలా ప్రవర్తించాడు అని. అయితే అది నాటకం అని ఒక దశ వరకే అతనికి తెలుసు. తర్వాత జరిగినది అతని వశంలో లేనిది. ముందుగా – అతను నటనంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి. రెండోది – తాము ఆడుతున్న నాటకం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినదే కావటం. ఇలా నాటకంలోని భర్త పాత్రకీ, వ్యక్తిగత జీవితంలోని ‘భర్త’ పాత్రకీ తేడా లేకుండా పోయింది. దాంతో నాటకం ఒక దశకు చేరుకున్నప్పుడు అతనికి అది నాటకం అన్న స్పృహ లేకుండా పోయింది.

ఈ పాత్రేం చేస్తుంది?

సినిమా ఇక్కడివరకూ ఒక ఎత్తయితే, మాధవ్ కత్తితో పొడుచుకోబోయే క్షణంలో రిధిమ ఆ పరిస్థితిని ఎలా హాండిల్ చేసింది లేదా ఆ పరిస్థితిలో ఎలా ప్రవర్తిస్తుందీ అనేది సినిమాలో కీలకమైన సన్నివేశం (ప్రేక్షకులు చాలా ఉత్కంఠతో చూసే సన్నివేశం కూడా).

ఎందుకు మాధవ్ సంసారంలో అనుక్షణం భార్యవల్ల అశాంతిని పొందుతున్నాడు? ఏమిటతను జీవితంలో పోగొట్టుకున్నది? ఏమిటతనికి కావలసింది? –
ఇక్కడ మాధవ్ ఒక సందర్భంలో రిధిమతో భార్య గురించి చెప్పిన మాటలు గుర్తుచేసుకోవాలి.

“సుధ తీరే అంత. ఇన్ స్టాల్మెంటులో టివి, ఫ్రిజ్ కొంటున్నాడా? జీవితంలో ప్రమోషన్ తెచ్చుకుంటున్నాడా? జీవితంలో ఆమె స్టేటస్ ను పెంచుతున్నాడా? ఈ ఆలోచనలతోనే ఆమె సతమతమవుతూ ఉంటుంది. ఆమెను నేను తప్పు పట్టాను. 70 శాతం…కాదు… 90 శాతం ప్రపంచం ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడాగి, మనిషి, మనిషిలోని టాలెంటును గుర్తించే ఓపిక, తీరిక ఎవరికీ లేదు. ఇది నిజం”.

ఆ క్షణంలో రిధిమకు ఆ మాటలు గుర్తొచ్చి ఉంటాయనుకోవచ్చు. అదే పాయింటు దగ్గిర రిధిమ ఒక ట్రాన్సులో ఉన్న మాధవ్ ను మళ్ళీ వెనక్కి మామూలు మూడ్ లోకి తీసుకువచ్చింది (అతని నటనను అభినందించటం ద్వారా). ప్రేక్షకుడినికూడా ఒక్కక్షణం ఆలోచించనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసే సన్నివేశం ఇది. ప్రేక్షకుడు కూడా ఇది నటనా, జీవితమా అనే సంశయంలోకి వెళ్తాడు

కొన్ని భావ వ్యక్తీకరణలు

Drama(2)ఈ సినిమాలో వెరైటీగా అన్పించినవి కొన్ని – మొట్టమొదటి సన్నివేశంలో రిధిమ ఢిల్లీనుంచి ఫ్లైటులో వచ్చిందని తెలియజేయటానికి – ఎయిర్పోర్టులో అనౌన్స్ మెంటు (చాలా మంద్రంగా) విన్పించి, విమానం లాండ్ అవుతున్న శబ్దం విన్పించటం (కొన్నివందల సినిమాల్లో విమానం దిగటం చూసి చూసి ఉన్న కళ్ళకు ఇది మొదట కాస్తంత అర్థం కానట్టుగా అనిపించినా, అందులోనే ప్రయోగాత్మకత కనపడింది).

రిధిమ డైలాగులు చెప్తున్నప్పుడు ఆమె గొంతులో, సుధ గొంతు (మాధవ్ భార్య) juxtapose చేసి విన్పించడంవల్ల మాధవ్ confused mental state బాగా ప్రస్ఫుటమైంది. అలా ఇది మూడు పాత్రల కథ కూడా అయింది. అయితే, మూడో పాత్ర వినిపిస్తుంది. కానీ కనిపించదు.

కనిపించకుండా, వినిపించకుండా ఉండే నాలుగో పాత్ర కూడా ఉందండోయ్. అదే రిధిమ ప్రియుడు సంజయ్ పాత్ర. ఆ ప్రదేశం అందచందాలను, మాధవ్ తో తన అనుభవాలను రిధిమతో టేప్ రికార్డర్లో చెప్పించటం ద్వారా ఆమె మనోభావాలను చక్కగా వెంటిలేట్ చేశాడు దర్శకుడు. (మూస చిత్రాల్లో అయితే, ఫోన్లో మాట్లాడినట్టు చూపించే వాళ్ళేమో. అవతల సంజయ్ ని కూడా చూపించేవాళ్ళు).

ఇక రెండు చోట్ల ప్రొఫెసరుగారు కాసేపు కనిపించినా (ఈ పాత్రలో నటించింది లక్ష్మీరతన్) అసలు కథతో ఆ పాత్రకు నేరుగా సంబంధం ఏమి లేదు (ఆయన absence తప్ప).

ఇక ఫోటోగ్రఫీ, సంగీతం గురించి రెండు మాటలు –

ఈ సినిమా లొకేషన్ మదనపల్లిలోని హార్స్లీ హిల్స్ అని ఒకరు చెప్పారు (మొదటిభాగం వ్యాఖ్యల్లో). మన రాష్ట్రంలోనే ఇంత అందమైన ప్రదేశాలు పెట్టుకుని, మన దర్శకులు ఏ పరాయి దేశానికో ఎందుకు పరుగెడతారో అర్థం కాదు. ఆ లొకేషన్ అందాలను కెమెరాలో చక్కగా బంధించారు కెమెరామాన్ రవియాదవ్. కథ స్వభావరీత్యా కూడా, క్లోజప్ షాట్స్ ఎక్కువగా అవసరం పడిన సినిమా ఇది.

రాజ్ సమకూర్చిన సంగీతం వీనుల విందుగా ఉంది. నా దృష్టిలో సినిమా సంగీతం అంటే, ఒకే పనిగా, ఏదో ఒక instrument ను వాయిస్తూనే ఉండటం కాదు. మ్యూజిక్ ఎక్కడ విన్పించాలో, ఎక్కడ ఆపాలో కూడా తెలియాలి. చాలామంది సంగీత దర్శకులకు, దర్శకులకు నిశ్శబ్దం కూడా సంగీతంలో ఒక భాగం అన్న విషయం తెలియదు. మాధవ్, రిధిమ నాటకం ప్రారంభించబోయే ముందు సంప్రదాయమైన హార్మోనియం సంగీతాన్నివిన్పించటం చాలా తగ్గట్టుగా ఉంది.
ఇలాంటి సినిమా తెలుగులో నూటికో, కోటికో ఒకటి వస్తుంది. ఏ విదేశీ చిత్రానికీ తీసిపోని కథాసంవిధానం, ప్రయోగాత్మకత, దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. Reluctant lawyer మాధవ్ పాత్రలో, సూర్య నటన అద్భుతం. రిధిమ పాత్రలో మంజుల అంతకుముందు నటనానుభవం లేకపోయినా, సూర్యతో సరిసమానంగా చేసింది. భారీ తారాగణం, ఎన్నో సాంకేతిక విలువలు గొప్పగా ఉండి కూడా, ప్రేక్షకుడిని ఏమాత్రం ఆలోచింపచేయలేని సినిమాకంటే, సాదాసీదాగా తీసినా, దర్శకత్వ ప్రతిభ, నటీనటుల పరిపక్వత కలిగి, ప్రేక్షకుడిని గొప్పగా ఆలోచింపజేయగల సినిమాయే, ‘ఉత్తమచిత్రం’ అనిపించుకుంటుంది. అలాంటి ఉత్తమచిత్రాల కోవలోకి వచ్చేది ఈ ‘షో’. మన డివిడి లైబ్రరీలో తప్పకుండా ఉండాల్సిన సినిమా ఇది.

4 Comments
  1. neeharika July 8, 2009 /
  2. satyam July 9, 2009 /
  3. srinivas July 16, 2009 /