Menu

Newyork (2009)

Newyork_albumcover“న్యూయార్క్” – బెంగలూరొచ్చాక, వీథుల్లో గోడలపై అంటించి ఉన్న పోస్టర్లలో జాన్ అబ్రహాం, నీల్ నితిన్ ముకేష్, కత్రినా కైఫ్ లు ముగ్గుర్నీ చూడ్డం తప్పితే ఆ సినిమా గురించి ఏమీ తెలీదు. కానీ, సినిమా రిలీజైన రెండో రోజే వెళ్ళిపోయా, ఆ సినిమాకోసం ఎదురుచూస్తున్న మనిషి వెంటబెట్టించుకువెళితే. ఇన్నాళ్ళకి రాయడం కుదురుతోంది.

(గమనిక: స్పాయిలర్స్ కలవు)

కథ: కథ మొదలవడం – పోలీసులు ఒమర్ (నీల్ నితిన్ ముకేష్) అన్న అమెరికా లో ఉంటున్న భారతీయుణ్ణి అరెస్టు చేయడంతో మొదలౌతుంది. అతనికి తానెలా వారి దృష్టిలో పడ్డాడో అర్థం కాదు కానీ, ఎందుకు ఇందులోకి ఎఫ్.బీ.ఐ తనని ఇరికించిందో క్రమంగా అర్థమౌతుంది. అసలు సంగతి ఏమిటంటే, ఒకప్పటి అతని స్నేహితుడు, ప్రస్తుతానికి ఎఫ్.బీ.ఐ తీవ్రవాది అని అనుమానిస్తున్న సమీర్ (జాన్ అబ్రహాం) ను సాక్ష్యాలతో సహా పట్టుకోడానికి ఒమర్ ను పావుగా వాడుకోవాలి అన్నది పోలీసుల ఆలోచన. ఒమర్ వెళ్ళి సమీర్ ఇంట్లో పాత స్నేహితుడిగా కొన్నాళ్ళు ఉండి, అక్కడ వివరాలు సేకరించి పోలీసులకి ఇవ్వాలనమాట. అయితే, ఒమర్ తనకూ సమీర్ కూ కాలేజీ దాటాక సంబంధం లేదని చెబుతూ తన కథ చెప్పుకొస్తాడు. ఒమర్ ఇండియా నుండి అమెరికా వస్తాడు – పై చదువుల కోసం. తను చదివే యూనివర్సిటీలో విద్యార్థుల్లో బాగా ఇమేజ్ ఉన్న సమీర్, అతని స్నేహితురాలు మాయా (కత్రినా కైఫ్) లతో పరిచయం పెంచుకుంటాడు. జీవితం హాయిగా సాగుతూ ఉంటుంది. ఒమర్ మాయాపై ప్రేమ పెంచుకుంటూ ఉంటే ఆమె సమీర్ ను ఇష్టపడుతుందని తెలుస్తుంది. ఆ తర్వాత 9/11 జరుగుతుంది. అప్పటికే ఈ ఇద్దరికీ దూరమౌతూ వచ్చిన ఒమర్ ఆ ఉదంతం తరువాత అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అక్కడికి ఫ్లాష్‌బ్యాక్ ఐపోతుంది.

ప్రస్తుతానికొస్తే, ఎఫ్.బీ.ఐ ఆఫీసర్ రోషన్ (ఇరఫాన్ ఖాన్) ఒమర్ ను తమ ఏజెంట్ గా సమీర్ ఇంటికి వెళ్ళమంటే, ఒమర్ – సమీర్ అలాంటి వాడు కాదని నిరూపిస్తానని చెప్పి ఒప్పుకుంటాడు. మాయా- సమీర్ ల ఇంట్లోకి ప్రవేశించాక అతనికి అసలు విషయాలు తెలుస్తాయి. 9/11 తరువాత సమీర్-మాయాల జీవితం ఎలా మారిపోయిందో, దాని ఫలితం ఏమిటో అర్థమౌతుంది. అయినప్పటికీ, సమీర్ ను మంచిదారికి తేవాలని చాలా ప్రయత్నం చేస్తాడు. మాయ కూడా తన వంతు ప్రయత్నం చేయడానికి అంగీకరిస్తుంది. అయితే, తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లు ఔతుంది చివరికి.

నచ్చినవి: కథ లో నాకు నచ్చిన, నచ్చని అంశాల్లో – ఒకటి కామన్ గా ఉంది. కథనమే. ఒక విధంగా నాకు ఈ కథనం నచ్చింది. అతి హింస చూపకుండా, కొంతవరకు implicit గా చూపారు. అలాగే, ఈ చూపడంలో ఎక్కడా అతి చేయకుండా ఎవరి మనోభావాలనూ దెబ్బతీయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు అనిపించింది. జాన్ అబ్రహాం ను ఇలాంటి రోల్ లో చూడ్డం ఇదే మొదటిసారి నాకు 🙂 బానే చేసాడు. అయితే, ఇర్ఫాన్ ఖాన్, నీల్ నితిన్ ముకేష్ ల నటన నాకు నచ్చింది. ఈ సినిమాలో హాస్యం పాలు చాలా తక్కువ కానీ, ఉన్న ఒకట్రెండు దృశ్యాలూ బాగున్నాయి. పాటలు తీసిన విధానం – చూడ్డానికి బాగుంది. నాకు “జునూన్” పాట నచ్చింది. 🙂 అక్కడక్కడా సంభాషణలు చాలా నచ్చాయి. అమెరికన్ సంస్కృతి గురించి సినిమా చివరి సన్నివేశంలో చెప్పిన వ్యాఖ్యానాలు కూడా బాగున్నాయి.

నచ్చనిది:
ప్రధానంగా కత్రినా కైఫ్. అన్ని భావాలకీ ఒకటే భావం ఆ మొహంలో! అలా ఎలా పెట్టడం సాధ్యమో మరి. కథనం – ఇందులో ఆ అంశం తీవ్రతకు తగినంత గాఢంగా చూపించలేదేమో అనిపించింది. హింస ను చూపకుండా, తీవ్రత అర్థమయ్యేలా చెప్పలేమేమో అనిపించింది ఇలా అనిపించినందువల్ల. ఏమో! అది అలా వదిలితే, నిజం చెప్పొద్దూ – జాన్ అబ్రహాం ని అలా టెర్రరిస్ట్ గా చూడ్డం ఒక విధమైన బాధ ఐతే, అతను ఆ జైల్లో అనుభవించిన కష్టాలు తలుచుకుంటే ఇంకా బాధేసింది. అంటే, నిజంగా అనుభవించలేదనుకోండి, కానీ, అతనికున్న ఇమేజ్ కి టెర్రరిస్టు అంటే ఎలా ఊహించుకునేది ? 🙂

మొత్తానికి సినిమా పూర్తిగా వాచబుల్. ఇలాంటి కథలు వస్తే, ఎంటర్‌టైన్మెంట్ తో పాటు, ఆలోచనను కూడా రేకెత్తిస్తాయి.

9 Comments
  1. సౌమ్య July 10, 2009 /
  2. nivas July 10, 2009 /
  3. విజయ్ నామోజు July 10, 2009 /
  4. hero July 12, 2009 /
  5. sudhakar July 20, 2009 /
  6. sanjeev February 19, 2010 /