దక్షిణ భారత సినిమాల్లో ఒక విశిష్టత ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం- నాల్గింటిలో ఏ భాష లో నైనా మంచి కథాబలమున్న చిత్రాలు వస్తే వెంటనే అవి తక్కిన మూడింటిలోకీ వచ్చేస్తాయి. మళయాళం లో వచ్చిన తెన్‌కాసి పట్నం (తెలుగులో హనుమాన్ జంక్షన్), వాసంతియుం లక్ష్మియున్ పిన్నె న్యానుం (శ్రీన్ వాసంతి లక్ష్మి) కానీ, తమిళ్ లో వచ్చిన ఆటోగ్రాఫ్ కానీ కన్నడ లో వచ్చిన జోగి కానీ తెలుగు లో వచ్చిన ఒక్కడు కానీ తక్కిన మూడు భాషల్లోకో లేదా ఆ మూడింటిలో రెండింటిలో వెళ్ళాయి. అలా ఇతరభాషల్లోకి వెళ్ళినతర్వాత ఆ సినిమాలు అక్కడకూడా హిట్టయ్యాయా లేదా అనేది మళ్ళీ చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది, అది వేరే విషయం. కానీ మిగతా అన్ని భాషల్లోకీ వెళ్ళగల సత్తా ఉండే కథలు ఏ భాషలోనైనా కొంచెం అరుదు గానే వస్తూంటాయి. ఈ మధ్యే రిలీజ్ అయిన నాడొడిగల్ సినిమా గురించి చాలా విని, అప్పుడే తెలుగులోకి (తెలుగులో రవితేజ అంటున్నారు మరి), కన్నడలోకీ, హిందీ లోకి దీన్ని రీమేక్ చేయడానికి సన్నహాలు జరిగిపోయాయని తెలిసి, కొంత కుతూహలం తోనే ఈ సినిమా చూసాను. మరి ఈ సినిమా కథ లో నిజంగా అంత సత్తా ఉందా? ఇతర భాషల్లో కూడా ఇలాగే విజయఢంకా మోగించే సత్తా ఈ కథకి ఉందా? వివరాల్లోకి వెళ్తే..
(spoilers ahead)
కథాకమామీషు:
ఓ మోస్తరు పల్లెటూళ్ళో జరిగే ఈ కథలోని మూడు ప్రధాన పాత్రలు కరుణ, చంద్ర, పాండి. కరుణ బి.ఎ. హిస్టరీ లో గోల్డ్ మెడలిస్ట్. స్టాఫ్ సెలెక్షన్ తదితర గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. “నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటేనే నీకు నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాను” అని తన మామగారు పెట్టిన కండిషన్ వల్లనూ, ఆ పిల్లమీద ఇతనికీ ఉన్న ఇష్టం వల్లనూ, అంతకుమించి వల్లమాలిన ప్రేమ ఆ పిల్లకి ఇతని మీద ఉండడం వల్లనూ గవర్నమెంటుద్యోగం కోసం కొంచెం గట్టిగానే ప్రయత్నిస్తూంటాడు. ఇక రెండో వాడు చంద్ర. ఊళ్ళోనే ఒక కంప్యూటర్ ఇన్స్‌టిట్యూట్ లో పని చేస్తూ ఏనాటికైనా సొంత కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని కలగంటూ ఉంటాడు. ఓ ప్రక్క అందుకోసమని బ్యాంకులోన్ గురించి ప్రయత్నిస్తూ, ఇంకో ప్రక్క కరుణ కి తెలీకుండా కరుణ చెల్లెల్ని ప్రేమిస్తూంటాడు. మూడోవాడు పాండి. పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసి, అది వస్తే ఎటైనా వెళదామని అనుకుంటూ ఉంటాడు. బావిలో ఈతకొట్టడం,ఊళ్ళో తిరునాళ్ళప్పుడు చిన్నచిన్న గొడవలు జరిగితే వాళ్ళని వీళ్ళని కొట్టడం, ముగ్గురూ కలిసి అప్పుడప్పుడూ మందుకొట్టడం- ఇదీ వీళ్ళ దినచర్య. దర్శకుడు బా..గా… తాపీగా ఓ నలభై నిమిషాలు సమయం తీసుకుని ఈ క్యారెక్టర్లన్నీ నెమ్మదిగా ఎస్టాబ్లిష్ చేసాక, సినిమా ఇంత నత్త నడక నడుస్తోందేమిటీ అని మనం ఒళ్ళు విరిచేసుకున్నాక, ఇంకా కథ మొదలు కూడా అయినట్లు లేదు అని మనసులో (కాదు, బయటికే) అనేసుకున్నాకన్నమాట-
శరవణ అని కరుణ చిన్నప్పటి ఫ్రెండొకడు దిగుతాడు. దిగినప్పటినుండి ఏదో పోగొట్టుకున్నవాడిలా, ఏదో సమస్య నెత్తి మీద పెట్టుకున్నవాడిలా ఉండే ఈ శరవణ ఉన్నట్టుండి బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేస్తాడు. ఎలాగో రక్షించి, చావాల్సినంత ప్రాబ్లెం నీకేమొచ్చిందని అడిగితే- షరా మామూలుగా లవ్ ప్రాబ్లెం అని, తాను కాలేజ్ లో ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్నవాళ్ళు తీసుకెళ్ళి హౌస్ అరెస్ట్ చేసారని, ఆ అమ్మాయి లేకుండా తాను బ్రతకలేనని చెబుతాడు. హీరో అయిన కరుణ కూడా అంతే షరా మామూలుగా – ఆ అమ్మాయిని వాళ్ళింట్లోనుంచి ఎత్తుకొచ్చేసి అయినా ఈ పెళ్ళి జరిపించే బాధ్యత తనదని ధైర్యం చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ ఊరికి బయలుదేరుతాడు ఫ్రెండ్స్ తో సహా. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పళని రాజన్ , బాగా డబ్బు, పలుకుబడి, వ్యాపారాలు ఉన్న వ్యక్తి. శరవణ కూడా తక్కువోడేమీ కాదు. మాజీ ఎం.పి. కొడుకు. కానీ ఇటు శరవణ వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఈ పెళ్ళి ఇష్టం లేకపోవడం తో సాయం కోరి తన పాత స్నేహితులవద్దకి వచ్చాడు. సరే, కరుణ-పాండి-చంద్ర-ఇంకో ఫ్రెండ్ కలిసి ఎంతో సాహసం చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి విజయవంతంగా శరవణతో పెళ్ళి జరిపించేస్తారు. అబ్బే, క్లైమాక్స్ కాదు- ఇంటర్వలే.
అయితే ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చే క్రమం లో వాళ్ళ మనుషుల చేతిలో కాలుపోగొట్టుకుంటాడు చంద్ర. శాశ్వతంగా చెవిటివాడైపోతాడు పాండి. బాగా దెబ్బలుతగులుతాయి కరుణకి. అయినా వీళ్ళకేమీ బాధలేదు. ఒక ప్రేమ జంటని కలిపాము, ఒక ఫ్రెండ్ జీవితాన్ని నిలబెట్టామన్న తృప్తి. నెమ్మదిగా కృత్రిమ కాలితో నడవడం నేర్చుకుంటాడు చంద్ర. మిషన్ సాయం తో వినగలుగుతాడు పాండి. కానీ ఎంతకీ గవర్నమెంటుద్యోగం తెచ్చుకోని కరుణని కాదని కూతురికి వేరే గవర్నమెంట్ ఉద్యోగికిచ్చి పెళ్ళి చేసేస్తాడు కరుణ వాళ్ళ మామ. అయితే వీళ్ళని షాక్ కి లోను చేసే నిజం ఈ లోగా తెలుస్తుంది-నిజానికి ఈ కథలోని “హార్ట్” ఇదే. కథలోకి మనల్ని బాగా లీనం చేసే పార్ట్ కూడా ఇదే. పట్టుమని పదిరోజులు కూడా కలిసి ఉండలేక శరవణ, ప్రభ విడిపోయారు అనేదే ఆ నిజం. వాళ్ళకేం, ఇద్దరూ బాగా డబ్బున్న వాళ్ళు. ఆ అమ్మాయి తనపాటికి తాను ఇంటికి వెళ్ళిపోతే, వాళ్ళ నాన్నగారు మళ్ళీ చేరదీసి ఆ అమ్మాయికి ఫ్రెష్ గా ‘మంచి’ సంబందాలు చూడటం మొదలెడతాడు. శరవణ వాళ్ళ అమ్మేమీ తక్కువ తినలేదు. కొండమీద గుళ్ళో జరిగిన పెళ్ళికి చట్టబద్దత లేదనీ, ఏదో మోజులో కొన్నాళ్ళు కలిసి ఉంటే ఉన్నారనీ చెప్పి ఒక సెంట్రల్ మినిస్టర్ కూతురితో శరవణ పెళ్ళి నిశ్చయిస్తుంది. కరుణకి ఒక్కసారిగా ఆ పెళ్ళి చేసిన తర్వాత వీళ్ళు ఎదుర్కొన్న కష్టాలు గుర్తొస్తాయి . పోలీసులు వీళ్ళని ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పమని ఎంత వేధించినా అన్నింటికీ తట్టుకుంటారే తప్పించి పెదవి విప్పరు.వాళ్ళ మనుషులు వీళ్ళ ఇళ్ళ మీద పడి భీబత్సం సృష్టించినా, ఆ తోపులాట లో కరుణ వాళ్ళ బామ్మ చనిపోయినా అన్నింటికీ తట్టుకుని నిలబెడతారు. కరుణ పోలీసు కేసుల్లో ఇరుక్కున్నాడు కాబట్టి ఇంక గవర్నమెంట్ ఉద్యోగం రాదని నిర్ణయించుకుని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి కూతుర్ని వేరే అతనితో పెళ్ళికి ఒప్పిస్తాడు కరుణ మామగారు. కేవలం ఆ శరవణ పెళ్ళి జరిపించడం అనే ఒక్క ఎపిసోడ్ వల్ల వీళ్ళ ముగ్గురి జీవితాలు శాశ్వత ప్రాతిపదికన మారిపోయాయి. ఆ పెద్దింటి పిల్లలేమో ఇదొక పీడకల గా మరిచిపోయి వేరే పెళ్ళిళ్ళకి సిద్దమై పోతుంటే, జీవితాల్ని ఫణంగా పెట్టి వాళ్ళ పెళ్ళిచేసి మనం వెర్రివెంగళప్పలుగా మిగిలిపోయామా అన్న ఫీలింగ్ ముగ్గురినీ దహిస్తూంటే వీళ్ళేం చేయాలి? వీళ్ళు ఏం చేసారు? ఏ సంచలన నిర్ణయం తీసుకున్నారు? తెరమీద చూడాల్సిందే!
ఇతరత్రా:
ఇతరత్రా అంటే- “నటీనటులంతా తమ తమ పరిధుల్లో బాగానే నటించారు”, “ఫోటోగ్రఫీ బాగానే ఉంది”, “ఎడిటింగ్ ఫరవాలేదు”, “నేపథ్య సంగీతం సినిమాలో భాగమైపోయింది”..ఇవి కాదు. నిజానికి సాధారణ ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూ లో – ఎప్పుడైనా మరీ పాత్‌బ్రేకింగ్ స్థాయిలో ఉంటే తప్పించి , ఇవన్నీ పెద్దగా చర్చించి తీరవలసిన అవసరం లేదని సాధారణ ప్రేక్షకుడిగా నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఒక తెలుగు ప్రేక్షకుడి గా ఈ సినిమా చూసాక కామన్ గా అనిపించే ప్రశ్నలు రెండు. ఒకటి-రవితేజ తో తీస్తే ఈ సినిమా తెలుగులో ఆడుతుందా. రెండు- పోనీ రవితేజ కాదనుకుందాం, ఇంకెవరితో తీసినా ఈ సినిమా తెలుగులో ఆడుతుందా? సరే, ఒక చిన్న ఉదాహరణ. ఓ ఆదివారం మధ్యాహ్నం ఎక్కడో అద్భుతమైన బిరియానీ దొరుకుతుందంటే వెతుక్కుంటూ మరీ ఆ మెస్ కి వెళ్ళాను. తీరా అక్కడికెళ్ళాక-”సార్, ఈ రోజు బిరియాని లేదు” అని చెప్పి పులిహోర వడ్డించాడు. నీరసపడిపోయేను. అలాంటి నీరసం లోనుంచి బయటపడి తృప్తిగా బయటికి రావాలి అంటే- ఆ పులిహోర నా జీవితం లో తిన్న అత్యుత్తమ పులిహోరల్లో ఒకటి అయి ఉండాలి. అది బాగోక పోయినా, సాదాసీదా గా ఉన్నా, పర్లేదే అనిపించేట్టు ఓ మోస్తరుగా ఉన్నా అది ఆనదు. షడ్రసోపేతమైన విందుభోజనాల్లాంటి మాస్ ఎంటర్‌టైనర్లని అందిస్తూన్న రవితేజ తో తీసే ఈ కథ అత్యుత్తమమైనదైతే కాదు మరి. చూడాలి జనాలు ఎంతవరకు దీన్ని ఆస్వాదిచగలుగుతారో. ఇక రెండోది- రవితేజని ప్రక్కన పెడదాం, ఇంతకీ తెలుగులో ఎలా ఉంటుంది. ఇది మనకి మరీ కొత్త కథ ఏమీ కాదు (సేతు లాగానో, ఆటోగ్రాఫ్ లాగానో) . ఆ మధ్య వచ్చిన “పరుగు”లో కూడా అల్లు అర్జున్ అచ్చు ఇలాగే జంటని బస్సెక్కించి పై జేబు లో ఉన్న డబ్బులు, కింద జేబులో ఉన్నడబ్బులూ అన్నీ తీసి ఇచ్చేసాడు- కాకపోతే అక్కడ కథ ఎవరి పాయింట్ ఆఫ్ లో చూడాలో అర్థం కాక భాస్కర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసారు జనాలు. ఇక్కడ ఆ సమస్య లేదు కానీ చాలా వరకు నత్త నడక లా సాగే ఈ కథనం తెలుగు ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.
–మోహన్ రాజ్
అబ్రకదబ్ర says:
నవతరంగంలో అప్పుడో మూడో వ్యాసం – ఈ సినిమా గురించి.
ఈ ఎమోషనల్ డ్రామాలనించి దక్షిణ భారతీయ సినిమా ఎప్పటికి బయట పడేనో!
కత్తి మహేష్ కుమార్ says:
@అబ్రకదబ్ర: ఈ సినిమా కథలో ఏమోషన్ ఉంది. డ్రామా ఉంది. కానీ సినిమా ఎమోషనల్ డ్రామా కాదు. అయినా, మనుషుల గురించి సినిమా తీసి ఏమోషన్,డ్రామా లేకుంటే ఎట్లా? What are you exactly hinting at?
అబ్రకదబ్ర says:
I’m hitting at the lack of variety in south Indian movie themes. ‘తెలుగు కథ’ గురించి నేను మొత్తుకునేదే సినిమాలకీ వర్తిస్తుంది. కథలన్నీ ఏదో రకంగా ప్రేమ, పెళ్లి చుట్టూ తిరగటమేనా?
కత్తి మహేష్ కుమార్ says:
@అబ్రకదబ్ర: మొత్తానికి మీరు గత నాలుగు సంవత్సరాలుగా తమిళ-మళయాళ సినిమాలు చూడలేదన్నమాట. మొత్తంగా దక్షిణభారతదేశంలోని సినిమాలని అనేస్తున్నారు.
కత్తి మహేష్ కుమార్ says:
చేరన్ ఆటోగ్రాఫ్ సినిమాకి తెలుగులో రవితేజ పట్టించిన గతి చూశాక. నాకైతే ఈ సినిమా రవితేజ చేస్తే చూడటం కష్టమేమో అనిపిస్తోంది. కానీ మనోళ్ళు కమిటైతే వాళ్ళ మాటవాళ్ళే వినరుగనక, మనం చెయ్యగలిగేది ఏమీ లేదు.
“కిక్” లాంటి సినిమాని “షడ్రసోపేతమైన విందుభోజనాల్లాంటి”ది అనుకుంటే నాడోడిగళ్ ఖచ్చితంగా పులిహారే! కాకపోతే కథా,కథనాలు బాగున్నాయి. అయినా మనకు అవన్నీ ఎందుకు. కావల్సిందల్లా ఒక రెండొందల జోకులు సినిమాని ఎంటర్తైనింగ్ గా నడపడానికి. అంతేగా!
vinay says:
@katti mahesh
i agree with u………..
atanu oka class character chesina danlo tana konni alavaatlu maanukooledu for example venu madhv ni kottadam lantivi……alane chaala vunnay…..
kick nachhindani chaala mandi annaru ento….ante maname correct ga choodaledaaa enti
కత్తి మహేష్ కుమార్ says:
@వినయ్: అవును. కిక్ చాలా మందికి నచ్చింది. అందుకే అరుంధతి తరువాత వచ్చిన ఏకైక హిట్ గా నిలబడింది.వ్యాపారపరంగా విజయం సాధించడం. ప్రేక్షకులకు కొన్ని నవ్వులు పంచిపెట్టి ఎంటెర్టైన్ చెయ్యడం వరకూ అయితే ఈ చిత్రం ఓకే.
కానీ చూసి ఆనందించగలిగే సినిమానా, కనీసం కొంతకాలం గుర్తుపెట్టుకోదగ్గ సినిమానా, సినిమా ఏదైనా చెప్పడానికి ప్రయత్నించిందా, సాంకేతికంగా ఏదైనా విన్నూత్నతను సాధించిందా, కథాపరంగా కొత్తపోకడలకు ఆద్యమయ్యిందా, కథనం విషయంలో ప్రత్యేకత ఏమైనా ఉందా లాంటి ప్రశ్నలు వేసుకుంటే సమాధానాలు కనబడవు.
పై విషయాలన్నీ “సినిమా”కు అనవసరం. పెట్టిన డబ్బులకు లాభం వచ్చింది అంతే చాలు. లేదా ప్రేక్షకులు ఈ సినిమాను వంద రోజుల దిశగా తీసుకెళ్తున్నారు అదే కొలమానం. అనుకుంటే, ఈ ఒక్క సినిమా విషయంలో పెద్ద సమస్య లేదు. ఐతే, తెలుగు పరిశ్రమ విషయంలో మాత్రం ఇంకా బెంగపడాల్సిందే ఎందుకంటే ఇదే మూసలో తియ్యబోయే మరో ఇరవై సినిమాలు ఖచ్చితంగా ఫ్లాప్ అవుతాయి గనక.
గీతాచార్య says:
I don’t agree with u on kick. I have my version to show.
నాడొడిగల్ -తెలుగులో ఆడుతుందా? « జురాన్ సినిమా says:
[...] నా సమీక్ష నవతరంగం లో ప్రచురితమైంది. ఇక్కడ [...]
నాడొడిగల్ -తెలుగులో ఆడుతుందా? « జురాన్ సినిమా says:
[...] సమీక్ష నవతరంగం లో [...]