Menu

నాడోడిగళ్ (త)- సమీక్ష

1“తమ జీవితంలో కోరుకున్న ప్రేమని పొందలేని వారు. తాము కోరుకున్న ప్రేమ దక్కుతుందని ఆశపడేవారు. కనీసం ఎదుటోడైనా కోరుకున్న ప్రేమని దక్కించుకోవాలనుకునేవాళ్ళూ ఉన్నంతవరకూ ఈ ప్రపంచంలో ప్రేమికుల్ని ఒకటి చేసే మనుషులుంటారు.” అంటాడు ఈ చిత్రంలోని ప్రధానపాత్రధారి (ఈ సినిమాలో హీరోలు లేరు. కేవలం పాత్రలున్నాయి)

అదే స్ఫూర్తితో, అప్పటికే వారివారి కష్టాల్లో ఉన్న ముగ్గురు స్నేహితులు, వాళ్ళలో ఒక స్నేహితుడి యొక్క మరో స్నేహితుడి ప్రేమని పెళ్ళిదాకా నడిపించి గెలిపించాలని నిర్ణయించుకుంటారు. Friend’s friend is a friend అనే సూత్రాన్ని అనుసరించి ప్రాణాల్ని ఫణంగా పెట్టి ఆ స్నేహితుడి ప్రేమను గెలిపిస్తారు. సాధారణంగా అయితే ఇక్కడితో కథ అంతమైపోవాలి. కానీ అక్కడే ‘నాడోడిగళ్’ మరో పార్శ్వాన్ని చూపుతుంది.
స్నేహితుడి పెళ్ళి చేసే ప్రయత్నంలో జరిగిన గొడవలో ఆ ముగ్గురిలో ఒకరికి కాలుపోయి శాశ్వతంగా అవిటివాడు అవుతాడు. మరో స్నేహితుడు తలపై బలమైన దెబ్బతగిలి చెవిటి వాడుగా మిగుల్తాడు. ప్రధాన పాత్రధారిపైన పోలీసు కేసు రిజిష్టర్ అవడం వలన, ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడౌతాడు. ప్రభుత్వ ఉద్యోగం ఉంటేగానీ పెళ్ళి చేయనన్న తన మామ, ప్రధాన పాత్రధారి అమితంగా ప్రేమించిన అమ్మాయికి వేరేచోట పెళ్ళిచేసేస్తాడు. ఈ ఘర్షణల నేపధ్యంలో జరిగిన దాడిలో ప్రధానపాత్రధారి నానమ్మ చనిపోతుంది. స్నేహితుడి ప్రేమకోసం తమ ప్రేమను,జీవితాన్ని ఫణంగా పెట్టిన స్నేహితుల జీవితాల కథ ఇది.
ఇక్కడితో కథ ఆగినా ఏదో తీశారనుకోవచ్చు. కానీ ఇక్కడే ఉంది మరో ట్విస్ట్. వాళ్ళు ఇంత కష్టపడి ఒకటి చేసిన ప్రేమికులు కొద్దికాలానికే గోడవపడి విడిపోతారు. అప్పుడు వాళ్ళని ఇంత శ్రమకోర్చి ఒకటి చేసిన ముగ్గురు స్నేహితులు ఏంచేశారు అన్నది కథ.
నటీనటుల్లో కర్ణ(కరుణ) పాత్రలో శశికుమార్ ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్ దృశ్యాల్లో తన అండర్ ప్లే హత్తుకుంటుంది. చంద్రన్ పాత్రలో విజయవసంత్ ఫరవాలేదు. బహుశా పాత్ర తీరే అంతకాబట్టి నటన “ఒలకపోయకుండా” ఉండటం వలన అలా నిపించుండొచ్చేమోగానీ, కాలు పోయిన తరువాత తన composed నటన ఆ పాత్ర మీద గౌరవాన్ని కలిగిస్తుంది. పాండియన్ గా భరణి నటన కొంచెం అతిగా అనిపించినా, అలాంటివాళ్ళు నిజజీవితంలో ఉంటారు కాబట్టి సరదాగానే ఉంటుంది. బహుశా ఈ అతివలనే అనుకుంటాను, తనకు చెవులు పోయినప్పుడు తన మీద వ్యక్తిగతమైన సానుభూతికన్నా, ఆ పరిస్థితి మీద ఒక critical ధృక్కోణం ప్రేక్షకుడికి కలిగేలా ఆ పాత్ర ప్రవర్తనను దర్శకుడు తీర్చిదిద్దాడు. మరో పాత్రలో కంజ కురుప్పు కనిపిస్తాడు.
4

సినిమాలో “మరో స్నేహితుడిగా” ఒక్క డైలాగ్ కూడా లేని  ఒక పాత్రద్వారా సినిమాలో ప్రేక్షకుడికి దర్శకుడు participant గా స్థానం ఇచ్చాడా అనిపిస్తుంది. అమాయకపు తిండిపోతు ప్రేమికురాలిగా అనన్య, ప్రధానపాత్రధారి చెల్లెలుగా శాంతిని చాలా ముఖ్యమైన పాత్రల్ని పోషించారు. మొదటి చిత్రమే అయినా వీరి నటనచూసి అబ్బురపడాల్సిందే. తెలుగు నటి ‘ప్రభ’ ఒక పవర్ ఫుల్ పాత్రలో ఈ సినిమాలో చూడటం ఒక పెద్ద రిలీఫ్. అంత మంచి నటిని మనవాళ్ళు ఎందుకు ఉపయోగించుకోవడం లేదో ఆశ్చర్యపడాల్సిన విషయమే!

సుందర్ సి. బాబు సంగీతం బాగుంది. ఒక అనవసరమైన ఐటం సాంగుని మినహాయిస్తే మిగతాపాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా నేపధ్యంలో వచ్చే మెలోడియస్ పాట సంగీతదర్శకుడి ప్రతిభకు చిహ్నంగా నిలిచిపోతుంది. రచన,దర్శకత్వం విభాగాల్లో ‘సముత్రకని’ కమాండ్ సుస్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడా హడావిడి లేకుండా తను రాసుకున్నదాన్ని తెరకెక్కిచే నిబద్ధత కనిపిస్తుంది.
గొప్ప సినిమా కాకపోయినా, ఇది ఖచ్చితంగా ఒక మంచి సినిమా. ఆలోచించదగిందీ, అనుభవించదగినదీ అయిన సినిమా. అందుకే ఈ సినిమా చూడాలి.
6 Comments
  1. pappu July 22, 2009 /
  2. గీతాచార్య July 22, 2009 /
  3. అబ్రకదబ్ర July 23, 2009 /
  4. su July 25, 2009 /
  5. పుల్లాయన July 27, 2009 /