Menu

మళయాళ శంకరాభరణం

చాలా కాలం క్రితం సంగతి. సుమారు 1990 నాటి మాట. చదువు ముగించి హైద్రాబాదులో ఉద్యోగం చేస్తున్న కొత్తలో తరచు బెంగళూరు వెళ్ళి రావల్సి వచ్చేది. అవి విప్రో ఇన్ఫోటెక్ లో పనిజేసే రోజులు. నాకు జయదేవ్ నాయర్ అని ఒక మళయాళ కొలీగ్ ఉండేవాడు. అతనికీ నాకూ సినిమాలంటే పిచ్చి. అప్పట్లో దూరదర్శన్లో బెంగాలీ, కన్నడ, మళయాళ అవార్డు సినిమాలు ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో రాత్రి పది దాటాకా వేసేవారు. తద్వారా మిగతా భాషల సినిమాలు పరిచయమయ్యింది. జయదేవూ, నేనూ బ్రహ్మచారులవడం వల్ల ఆదివారం ఖచ్చితంగా సినిమాకెళ్ళే వాళ్ళం. బెంగుళూరు ఎం.జీ రోడ్ దగ్గర్లో ఓ సినిమా హాలుండేది. పేరు గుర్తులేదు. ఇప్పుడుందో లేదో కూడా తెలీదు. ఆ సినిమాహాల్లో ప్రతీ ఆదివారం ఓ మళయాళ సినిమా ప్రదర్శించేవారు. ఓ ఆదివారం మేం ఇద్దరం అమితాబ్బచ్చన్, మాధవి నటించిన అగ్నిపథ్ అనే సినిమాకెళదామని అనుకున్నాం. తీరా ఆదివారమొచ్చాక జయదేవ్ మాత్రం హిందీ సినిమాకి రాను, మోహన్ లాల్ అనే కొత్త నటుడు నటించిన సినిమావచ్చింది, చాలా బావుందని విన్నాను, వెళదామన్నాడు. నాకు మళయాళం రాదు. పైగా సబ్ టైటిల్స్ లేవు. అర్థంకాని సినిమా ఎలా చూసేదని ముందు రానన్నాను. తను కావాలంటే అనువాదం చేస్తాను రమ్మంటూ బలవంతపెట్టే సరికి సరే అన్నాను. అలా టిక్కట్టు కొనుక్కుని చూసిన మొదటి మళయాళ సినిమా అది. మేం మధ్యాన్నం పదకొండు గంటల షోకి వెళ్ళాం. సాధారణంగా పరభాషా మషాళా సినిమాలంటే అంత గొప్పగా ఉండవన్న అభిప్రాయం అప్పట్లో ఉండేది. ఆ రోజుల్లో తెలుగు వాళ్ళు మళాయాళ సినిమా అంటే వేరే రకం సినిమాలుగానే భావించేవారు. సాధారణంగా సినిమా చూస్తున్నంతసేపూ కామెంట్లు చేసుకుంటూ చూడ్డం మా ఇద్దరి అలవాటు. అలాంటిది సినిమా మొదలయ్యాక నేనూ, జయదేవూ ఒక్క మాటంటే మాట మాట్లాడితే ఒట్టు. మేం ఇద్దరం, ముఖ్యంగా నేను స్పెల్ బౌండ్ అయి చూసాను. ఆ సినిమా ఎంతగా నచ్చిందంటే, మరలా మేట్నీకి వెళదామని నేను జయదేవ్‌ని అడిగే స్థితొచ్చింది. అలా ఒక షో తరువాత మరో షో చూసిన ఆ మొట్టమొదటి మళయాళ సినిమా “హిజ్ హైనెస్ అబ్దుల్లా”.

అప్పట్లో ఈ సినిమా మళయాళంలో అతి పెద్ద హిట్. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో శంకరాభరణమంత హిట్. శంకారభరణంతో ఎందుకు పోల్చానో తరవాత చెబుతాను. ఈ సినిమాకి సిబి మలయల్ దర్శకత్వం వహించాడు. ఈ ఒక్క సినిమాతో మోహన్ లాల్ సూపర్ స్టార్ స్థాయికెదిగి కూర్చున్నాడు. అప్పటివరకూ మొదటి స్థానంలో ఉన్న మమ్ముట్టిని రెండో స్థానానికి నెట్టేసాడు. ఈ సినిమాలో మన తెలుగమ్మాయి తాడిమళ్ళ గౌతమి హీరోయిన్‌గా నటించింది. కథా పరంగా అప్పట్లో ఇదొక పెద్ద వెరైటీ సినిమా అని చెప్పచ్చు.

అసలు కథలోకి వస్తే – రాజా ఉదయ వర్మ ( నడిముడి వేణు ) తిరువనంతపురం లో ఉన్న ఒక హిందూ జమీందారు. పదితరాలకి సరిపడ్డా ఆస్తుంటుంది. పెళ్ళికాని అతని దీవాణంలో బంధువులందరూ చేరుతారు. ఉదయ వర్మకి ఓ పిచ్చి వదినొకావిడ ఉంటుంది. ప్రమాదవశాత్తూ అన్నగారూ, అతని కొడుకు ఉన్ని నదిలో పడి మరణిస్తే అది తట్టుకోలేక ఆవిడ పిచ్చిదవుతుంది. ఉదయ వర్మకి భార్య లేదు. అక్కడే రాధ ( గౌతమి ) ఉదయవర్మకీ, అతని వదినకీ సేవలు చేస్తూ ఉంటుంది. ఉదయవర్మ బంధువులందరూ కలిసి అతన్ని హతమార్చి, ఆస్తి కాజేయాలని మంతనాలు చేస్తారు. అతని బంధువుల్లో ఒకతను ( శ్రీనివాసన్ ) ఉదయ వర్మని చంపడానికని బొంబాయిలో ఉన్న ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అబ్దుల్లా ( మోహన్‌లాల్ ) ని పెద్ద మొత్తానికి బేరం కుదుర్చుకుంటాడు. ఈ శ్రీనివాసన్ స్నేహితుడిగా అబ్దుల్లా ఆనంద నంబూద్రిగా పేరూ, వేషమూ మార్చుకొని ఆ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఉదయవర్మ పిచ్చి వదిన ఆనంద నంబూద్రిని చూసి చిన్నప్పుడు చనిపోయిన ఉన్నిగా భావించి అతనే తన కొడుకని వెంట పడుతుంది. ముందు కాదన్నా ఆమె ఆరోగ్యం కాపాడడం కోసం ఉన్నిలాగే నటించి ఉదయ వర్మ గుర్తింపు పొందుతాడు.

ఉదయ వర్మకి సంగీతమంటే ప్రాణం. అది తెలుసుకొని ఆ దిశగా అతన్ని ఆనంద నంబూద్రి ఆకట్టుకుంటాడు. రాధ అతని ప్రేమలో పడుతుంది. ఉదయ వర్మ బంధువుల్లో ఒకామె కూతురు ఆనంద నంబూద్రిని ప్రేమిస్తుంది. దానికి ఆమె తల్లి సరేనంటుంది. ఉదయ వర్మకి చెబితే సరేనంటాడు. ఆనంద నంబూద్రి హిందూ కాడనీ, ముస్లిమనీ, ఉదయ వర్మని చంపడానికొచ్చిన వాడని చెప్పడంతో ఆ తల్లీ కూతుళ్ళు నోరుమూసుకుంటారు. ఈలోగా ఆనంద నంబూద్రిపై బంధువుల ఒత్తిడి పెరిగి, ఉదయవర్మని చంపడానికి ఊరి చివర సముద్రం దగ్గరున్న కొండపైకి తీసుకెళతాడు. అక్కడ ఉదయ వర్మ అసలు జీవితాన్ని తెలుసుకొని చంపకుండా వెనక్కి వస్తాడు. ఉదయవర్మ రాధకీ, ఆనంద నంబూద్రికి వివాహం చేసి, తన తదనంతరం ఆస్తిని కాపాడే బాధ్యత అప్పజెబుదామని లాయర్ని సంప్రదిస్తాడు. సరిగ్గా అప్పుడే ఆనంద నంబూద్రి హిందూ కాడనీ, అబ్దుల్లా అనే ముస్లిమనీ ఉదయవర్మకి తెలుస్తుంది. తనని నమ్మించి మోసం చేసాడని తిట్టి, అబ్దుల్లాని పొమ్మని చెబుతాడు. అప్పుడు తనెందుకొచ్చాడో అసలు కథ విప్పుతాడు. ఈలోగా బంధువులు మరో కిల్లర్ని కిరాయికి తెచ్చి అబ్దుల్లా పై ఎగదోస్తారు. వాణ్ణి నాలుగు తన్ని బయటకు పంపిస్తాడు అబ్దుల్లా. చివరకి ఉదయవర్మని బంధువుల బారినుండి అబ్దుల్లా రక్షిస్తాడు. తన కథ చెబుతూ ముస్లిమయినా అమీర్ ఖాన్ అనే సంగీత విద్వాంసుడి పరిచయంవల్ల తనకి సంగీతమబ్బిందనీ చెబుతాడు. కథ సుఖాంతమవుతుంది.

ఇది మళయాళ సినిమా కాబట్టి సినిమా చూసేవారికి మూలకథ కొంత తెలియాలన్న వుద్దేశ్యంతో మొత్తం కథ చెప్పాల్సి వచ్చింది. మొత్తం సినిమాకీ నడిముడి వేణూ నటన హైలెట్. మోహన్ లాల్ చాలా బాగా నటించాడు. సినిమాలో చాలా పాత్రలుంటాయి. ఆనంద నంబూద్రి, రాధల మధ్య ప్రేమ సున్నితంగా ఉంటుంది. ఎక్కడా ఏ రసమూ శృతి మించకుండా కథకి తగ్గట్టుగా ఉంటుంది. అన్నింటినీ పైన చెప్పిన కథ నడపడానికి చక్కగా వాడుకున్నారు. ఈ సినిమాకి స్క్రిప్టే ఆయువుపట్టు. చివర్లో మనుషులకి కులాలు కానీ సంగీతానికి కాదంటూ హిందూ, ముస్లిం ఐక్యత మీద చిన్న సందేశం కూడా జోడించారు. అందుకే ఈ సినిమాకి “హిజ్ హైనెస్ అబ్దుల్లా” అని పేరు పెట్టారు. ఈ కథలో ఒక పాటలో మోహన్‌లాల్ కథకళి నృత్యకారుడి వేషంలో కనిపిస్తాడు. అప్పటినుండి కధకళి నృత్యకారుడిగా ఓ సినిమా చెయ్యాలని ఎంతోకాలం చూసి, చివరకి వానప్రస్థం అనే సినిమా సొంతంగా నిర్మించి నటించాడు.

పైన ఈ సినిమాని తెలుగు శంకారాభరణంతో పోల్చాను. ఈ సినిమా అంతగా హిట్ కావడానికి కారణాలు కథా, స్క్రిప్టూ, దర్శకుడూ, నటులూ మాత్రమే కాదు, సంగీతం కూడా పాత్ర కూడా చాలా ఎక్కువ. మొత్తం 6 పాటలుంటాయి. ఒక్కొక్కటీ ఒక్కో ఆణిముత్యం. తెలుగునాట శంకరాభరణం సినిమాలో పాటలెంతగా ప్రసిద్ధి చెందాయో ఈ సినిమా పాటలు కేరళాలో అంత ప్రాచుర్యం పొందాయి. ఏ మళయాళీ నడిగినా ఈ సినిమా పాటల గురించి ఖచ్చితంగా చెబుతాడు. సంగీత పరంగా మళయాళ సినిమారంగాన్ని ఒక పెద్ద ఊపు ఊపిన సినిమా ఇది.

ఇందులో నాదరూపిణి అనే ఒక పాటకి ఎస్.జి.సుకుమార్‌కి ఉత్తమ గాయకుడిగా కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డు పొందాడు. మిగతా పాటల్ని ఏసుదాసు, చిత్ర, శరత్ పాడారు. ఈ పాటలు ఇక్కడ వినచ్చు. శాస్త్రీయ సంగీత బాణీలయినా వినడానికి చాలా బావుంటాయి. కర్ణాటక సంగీతంలో రాగమాలిక అనే ప్రక్రియొకటుంది. స,రి,గ,మ,ప,ద,ని అనే సప్త స్వరాల ఆధారంగా ఈ సినిమాలో కూర్చిన రాగమాలిక పెద్ద హైలైట్. అలాగే గోపికా వసంతం పాట విని మరలా మరలా హమ్మిగ్ చేయకుండా ఉండలేం. ప్రమదవనం అనే పాట జేసుదాసుకి నచ్చిన పాతిక సినిమాపాటల్లో ఇదొకటని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవి కాక ఈ సినిమాలో కవాలి పాట కూడా వుంది. అది కూడా ఎంతో బావుంటుంది. పాటలు వింటే నేను చెప్పిన దాంతో ఏకీభవిస్తారన్న నమ్మకం నాకుంది.అందుకే ఈ సినిమాని సంగీతం విషయంలో తెలుగు శంకరాభరణంతో పోల్చాను. ఈ సినిమాకి రవీంద్రన్ సంగీతాన్నందిచాడు. అసలీ సినిమా ప్రారంభంలో పాటలు లేకుండా తీద్దామని దర్శకుడు సిబి అనుకున్నాడట. ఈ సినిమా రచయితకి రవీంద్రన్ తో ఉన్న పరిచయం వల్ల రెండు పాటలు పెడదామని నిశ్చయించారట. తీరా రవీంద్రన్ బాణీలు చూసాక మొత్తం ఆరు పాటలతో సినిమా తయారయ్యింది. ఈ సంగీతానికనుగుణంగా లోహితదాస్ స్క్రిప్ట్ మార్చి రాసాడని సిబి అప్పట్లో హిందూ పత్రికలో రాసాడు. ఈ సినిమాకి ఎన్నో అవార్డులొచ్చాయి. నడిముడి వేణుకి ఉత్తమ సహాయనటుడిగా కేంద్ర ప్రభుత్వం అవార్డిచ్చింది. కేరళ ప్రభుత్వం లోహితదాస్ కి ఉత్తమ రచయిత అవార్డొచ్చింది. ఇదీ ఈ సినిమా గొప్పతనం.

ఆ సినిమా తరువాత నేను మోహన్ లాల్, లోహిత దాస్ల అభిమాని నయ్యాను. నడిముడి వేణు నటన చూసి అదిరిపోయాను. ఇంకా చెప్పాలంటే, నేను ఈ సినిమా గురించి స్నేహుతులకీ, బంధువులకీ, తోటి సినీప్రియులకీ చెప్పి వాళ్ళందర్నీ ఊదర గొట్టేసాను. ఈ సినిమా వీడియో సంపాదించి, బెంగుళూరు మా ఇంటికొచ్చిన ప్రతీ ఒక్కరికీ చూపించే వాణ్ణి. శంకారాభరణం, సాగరసంగమం పాటల తరువాత అంత పిచ్చిగా రాత్రీ, పగలూ ఎడతెరిపిలేకుండా విన్న పాటలు ఈ సినిమాలోవే! ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతీ మాటకీ అర్థం తెలీకపోయినా ఈ పాటలు నాకిప్పటికీ నోటికొచ్చు. నాకే కాదు, మా బంధువులందరికీ ఈ సినిమా పాటలు బాగా తెలుసు.

కథా, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, నటన, ముఖ్యంగా సంగీత పరంగా నాకు నచ్చిన అతి కొద్ది సినిమాల్లో ఇదొకటి.

ఈ కథంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ మధ్యనే, అంటే గతనెల జూన్ 29న ఆ సినిమాకి స్క్రిప్ట్ రాసిన ప్రముఖ మళయాళ రచయిత లోహితదాస్ హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. మంచి రచయితగా, దర్శకుడిగా ఎంతో పేరు గడించిన లోహిత దాస్ మరణ వార్త నన్ను కలవర పరిచింది. నా అభిమాన సినిమా రచయితల జాబితాలో ఇతనూ ఉన్నాడు. హిజ్ హైనెస్ అబ్దుల్లా తరువాత, భరతం, కిరీటం వంటి ఆణిముత్యాలు తీసాడితను.  తనియవర్తనం, కిరీడం ( కిరీటం ), భరతం, అమరం సినిమా స్క్రిప్టులు పాఠ్య గ్రంధాల కోవకి చెందుతాయని మళయాళ సినీ ప్రముఖులు గొప్పవిగా చెబుతారు. అవే కాకుండా భూతకన్నడి, కస్తూరిమన్, అరయన్నంగలుదె, వీడు వంటి హిట్ చిత్రాలకి దర్శకత్వం కూడా వహించాడు. ఈయన రాసినవెంత గొప్పవీ అంటే 1990 నుండీ, 2001 వరకూ వరసగా తొమ్మిదేళ్ళ పాటు మళయాళ చిత్ర రంగంలో బెస్ట్ స్క్రిప్ట్ అవార్డు ఇతన్నే వరించింది. ఇతను దర్శకత్వం వహించిన భూతకన్నడి కి కేంద్ర ప్రభుత్వపు స్వర్ణ కమలం లభించింది. తనియవర్తనం ద్వారా 1987లో మళయాళ సినీ రంగ ప్రవేశం చేసిన ఇతను అతి కొద్ది కాలంలోనే మంచి పేరు సంపాదించాడు. కేవలం కథా రచయిత పేరు చూసి సినిమాలు హిట్టయ్యేవి. అప్పట్లో మళయాళంలో అత్యధిక పారితోషికం తీసుకున్న మొదటి రచయిత ఈయన. మన తెలుగులో జంధ్యాల పేరు చూసి సినిమాలు ఎలా ఆడ్ ఏవో, ఈ యన పేరు చూసి జనాలు సినిమాలకెగబడే వాళ్ళు. ఒకరకంగా చెప్పాలంటే ప్రజాదరణ తగ్గుముఖం పట్టిన దశలో తిరిగి జవసత్వాలందిచిన ఘనుడీ లోహితదాస్. తెలుగులో మంచి పేరొచ్చిన మీరా జాస్మిన్‌ని సినిమా రంగానికి పరిచయం చేసింది లోహితదాసే! ఈ మధ్య ఇద్దరిమీదా అనేక కథలూ, పుకార్లూ నడిచాయి.

“హిజ్ హైనెస్ అబ్దుల్లా” సినిమా ఈ లింకులో చూసి ఆనందించండి.

చూసిన తరువాత మీకు లోహితదాస్ గొప్పతనం తెలుస్తుంది. అంతేకాదు, అతని మిగతా సినిమాల గురించి మరింత తెలుసుకుంటారన్న నమ్మకం నాకుంది. చివరగా – మంచి కథలందించిన లోహితదాస్ ఆకస్మిక మృతికి సంతాపం తెలియజేస్తూ, ఇతను మళయాళ సినిమా రంగలో “హిజ్ హైనెస్ రైటర్” గా మిగిలిపోయాడని భావిస్తున్నాను. ఇతను లోహిత దాస్ కాదు. మళయాళ కథా మాంత్రికుడు.

–సాయి బ్రహ్మానందం గోర్తి

15 Comments
 1. సాయి బ్రహ్మానందం గొర్తి July 12, 2009 /
 2. కొత్తపాళీ July 12, 2009 /
 3. మేడేపల్లి శేషు July 13, 2009 /
 4. రవి July 13, 2009 /
 5. suree July 13, 2009 /
 6. Hari C Prasad July 13, 2009 /
 7. సాయి బ్రహ్మానందం July 14, 2009 /
 8. సాయి బ్రహ్మానందం July 15, 2009 /
 9. Hari July 15, 2009 /
 10. harikrishna July 15, 2009 /
 11. veernisrinivas July 17, 2009 /
 12. Venkat July 19, 2009 /