Menu

లక్ (హిందీ) – అంత లక్కీ కాదు : సమీక్ష

Luckఈ మధ్యకాలంలో ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళడం తగ్గించాను. కానీ అప్పుడప్పుడూ ప్రమాదవశాత్తూ టికెట్టు దొరికేస్తే అదో ఆనందం. ఆ ఆనందం, లక్ సినిమా మొదలయ్యేవరకే మిగిలింది. సగం సినిమా పూర్తయ్యేసరికీ నా అంత అన్ లక్కీ ఫెలో ఉండడని తేలిపోయింది.

దర్శకుడు సోహమ్ షా మొదటి సినిమా ‘కాల్’. కనీసం ఆ సినిమా చూసైనా దర్శకుడి మీద ఒక దిగజారిన అంచనా వేసుకుని ఉండాల్సింది. కానీ ఏంచేస్తాం, కమల్ హాసన్ కూతురు శృతి హసన్ మొదటి చిత్రం, కాస్త ప్రామిసింగ్ గా అనిపించే ఇమ్రాన్ ఖాన్ మూడోచిత్రం, ప్రోమోలు ఆసక్తికరంగా ఉండటంతో గొప్ప సినిమా కాకపోయినా కనీసం భరించగలిగే సినిమాగా ఉంటుందని నా లక్కుని పరీక్షించుకోవడానికి ధియేటర్లో కూర్చున్నాను.
మూసా భాయ్ (సంజయ్ దత్) ఒక మాఫియా డాన్. పని, లక్ తో బెట్టింగ్ వ్యాపారం చెయ్యడం. చిన్నప్పుడు జరిగిన ప్రమాదాల్లో లక్కీగా బ్రతికిన కారణంగా, స్వతహాగా తనో పెద్ద లక్కీఫెలో అని ఇతగాడి నమ్మకం. మనుషుల ప్రాణాలతో బెట్టింగ్ నిర్వహించి బెట్టింగ్ స్థాయిని పెంచాలనే మహత్తరమైన ఆదర్శంతో దక్షిణాఫ్రికాలో ఒక ప్రాణాంతకమైన “ఆట”ను ఏర్పాటు చేస్తాడు. ఈ ఆటకోసం పరమలక్కుగాళ్ళని వెతికే బాధ్యత తమాంగ్ (డానీ డెంజోప్పా)ది. తమాంగ్ ట్యాలెంట్ హంట్ లో, లక్ ఉండీ బ్యాడ్ టైం లో ఉన్న రామ్ (ఇమ్రాన్ ఖాన్) అనే ఒక యువకుడు, డబ్బు అవసరంలో ఉన్న ఒక ఆర్మీ మేజర్ (మిధున్ చక్రవర్తి), పాకిస్తాన్ లో ఒంటె పందాలు చేసుకునే    ఒక అమ్మాయి (చిత్రాశి), ఉరిశిక్షను లక్కీగా తప్పించుకున్న ఖైదీ (రవి కిశన్) లను గుర్తించి ఈ ఆటలో దింపుతాడు. క్రితం సంవత్సరం జరిగిన ఇదే ఆటలో గెలిచిన కొందరు మళ్ళీ వీళ్లతో చేరుతారు. వాళ్ళలో ఒకరు శ్రుతి హసన్. ఆ ఆట ఏమిటి. ఎలా జరిగింది. ఈ ఇరవై రోజుల ఆటలో వీళ్ళమధ్య ఏమేం జరుగుతాయి. చివర్కి ఎవరు గెలిచారు. అనేది చిత్రకథ.
వాళ్ళందరినీ గుర్తించి ఆటమొదలయ్యేవరకూ సినిమా కాస్తోకూస్తో ఆసక్తికరంగా సాగుతుంది. ఆ సగంలో కూడా అనవసరమైన స్లోమోషన్లు, గ్రాండ్ ఎంట్రీలు, లక్కుని పరీక్షించుకునే లైటర్ గేమ్స్ (ఇక్కడ మన తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు తళుక్కున కనిపిస్తాడు) లాంటివాటితో అడపాదడపా ప్రేక్షకుడికి సహన పరీక్ష జరుగుతుంది. ఇక డెత్ గేమ్ మొదలయ్యిన తరువాత, ఇంతే సంగతులు. యాక్షన్ చిత్రం కాబట్టి కనీసం పోరాట దృశ్యాలు సీట్లో కూర్చోబెట్టాలి. కానీ వీడియో గేమ్స్ కన్నా ఘోరంగా పోరాటదృశ్యాలు ఉండటంతో నిరాశపరుస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైటు అత్యంత కృతకం(పరమ దారుణం).
Shrutiఇక నటన విషయానికొస్తే, ‘నేనుంటే చాలు. నటించాల్సిన అవసరం లేదు’ అన్నట్టుండే సంజయ్ దత్ నటన. ‘మూడు ఎక్స్ ప్రెషన్స్ చాలు ఈ సినిమాకి’ అనిపించే ఇమ్రాన్ నటనకాని నటన గురించి చెప్పుకోవడం కూడా అనవసరం. మంచిమంచి తమిళ్ అవకాశాలు వదులుకొని నటనకు ఏమాత్రం అవకాశం లేని ఈ సినిమా శృతి హసన్ ఎంచుకోవడం అర్థం కాని విషయం. బహుశా తను నిర్మించబోయే తమిళ సినిమాకి డబ్బు సమకూర్చుకోవడానికి నటించినట్లుంది. చూడ్డానికి ఒక్క చూపుతో ఆకర్షించ లేకపోయినా, చూసేకొద్దీ ఫరవాలేదనిపిస్తుంది. బికినీ సీన్ లో సారికా కమల్ హాసన్ ని తలపిస్తుంది. అవకాశం తక్కువే అయినా, తమదైన నటనను చూపించడంలో మిధున్ చక్రవర్తి, డానీ డెంజొప్పా, భోజ్ పురి నటుడు రవి కిశన్ లు సఫలీకృతులయ్యారు.
సలీం-సులేమాన్ సంగీతంలో హోరెక్కువ హుషారు తక్కువ. ఒక్క నేపధ్యగీతం మాత్రం ఫరవాలేదు.సౌండ్ డిజైనింగ్ వరకూ ఈ సినిమా బాగుంది. ఆ నేపధ్య సంగీతం, సరైన మిక్సింగ్ లేకుంటే సినిమా వీడియో సినిమాలాగా అనిపించుండేదేమో. దర్శకుడు సోహమ్ స్టార్లను సమీకరించడంలో పెట్టిన శ్రద్ధ ద్వితీయార్థంలోని కథపై పెట్టుంటే సినిమా కొంచెమైనా రాణించుండేది.
ఈ సినిమా చూడకపోతే ఏమీ నష్టం లేదు. నేలబారు ఆశపెట్టుకుని చూస్తేమాత్రం, ఖచ్చితంగా నిరాశపరచదు.
9 Comments
  1. ashok July 25, 2009 /
  2. అన్‌లక్కీ ఫెలో July 25, 2009 /
  3. chinni July 26, 2009 /
  4. naveen July 27, 2009 /
  5. విజయ్ నామోజు July 27, 2009 /
    • sasank July 27, 2009 /
  6. vinay July 27, 2009 /