Menu

Ice Age 3 రివ్యూ

ఒక చిన్న పిల్లవాడిని అతడి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడానికి ఒక ఏనుగు చేసే ప్రయత్నాల ఆధారంగా 2002 లో తీయబడిన Ice Age మంచి కథనం, అంత కంటే మంచి పాత్రలు, కనువిందు చేసే గ్రాఫిక్స్ తో ఆకట్టుకొంది. ఈ సినిమా ఘనవిజయంతో Ice Age 2 సీక్వల్ వచ్చింది. Manny కి, ఆడ ఏనుగు Ellie కి మధ్య లవ్ స్టోరీ రెండవ పార్టు కథాంశం. బోరు కొట్టించే కథ, చిరాకు పుట్టించే క్యారక్టర్లతో రెండవపార్టు Ice Age అభిమానులను చాలా నిరాశపరించింది. మూడవ పార్టు సంగతి తెలిసిన వెంటనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో, రెండవ పార్టు కంటే చెత్తగా ఉంటుందేమో అని అభిమానులు అనుకున్నారు. అందుకు భిన్నంగా గతవారం విడుదలయిన Ice Age 3 అందరినీ మెప్పించింది. కథ విషయానికొస్తే – Ellie ప్రెగ్నెంట్, ఏ క్షణాన అయినా డెలివరీ కావచ్చు. Manny ప్రతి క్షణం తన భార్యతోనే ఉంటూ పుట్టబోయే బిడ్డ కోసం అన్నీ సమకూరుస్తుండడం చూసిన సింహం Diego, తాను ఆ కుటుంబంలో ఒకడిగా ఉండలేనంటూ వెళ్ళిపోతుంది. తనకూ ఒక కుటుంబం ఉంటే బాగుంటుంది అనుకొనే Sid కు మూడు డైనోసార్ గుడ్లు దొరికి, పిల్లలవుతాయి. వాటినే తన పిల్లలుగా చూసుకొని Sid మురిసిపోతుంటే డైనోసార్ వచ్చి తన పిల్లలను, Sid ను తీసుకెళ్ళిపోతుంది. అపుడు Manny, Ellie, Diego కలసి Sid ను వెతుక్కుంటూ వెళ్తారు. జిత్తులమారి అయిన Buck సాయంతో ప్రమాదాలను ఎదుర్కొంటూ Sidని ఎలా కాపాడగలుతారు, చివరికి అందరూ కలుస్తారా అన్నది స్థూల కథ. కొద్ది కాలం క్రితం బాపూ గారు తీసిన “సుందరకాండ” సినిమా చూసిన వీరాభిమానులు కొందరు “అబ్బే మేము ఆ సినెమా చూడనే లేదు” అని చెప్పుకున్నారట. చూసామంటే సినిమా ఎలా ఉందో చెప్పాలి కానీ బాపుగారి మీదున్న అభిమానంతో ఆ సినిమా ఎలా ఉందో నిజం చెప్పడం కంటే చూడలేదన్న అబద్దమే మంచిది అని అలా చేసిఉంటారు. ఇప్పుడు ఈ సంగతి ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే, Ice Age 2 చూసిన తర్వాత అభిమానుల పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఆ సినిమా అలా తయారవడానికి ప్రధాన కారణం ఆడ ఏనుగు Ellie పాత్ర, మిగిలిన సైడ్-కిక్‌ల గోల. ఈ సంగతి గ్రహించిన దర్శకుడు మూడవ పార్టులో ఆ పొరపాటు మళ్ళీ చేయలేదు. రెండవ పార్టులో సిల్లీగా ఉండే Ellie ఈ సినిమాలో డిగ్నిఫైడ్‌గానే ఉంటుంది. ఇక Manny పాత్రలో Ray Romano అదరగొట్టాడు. ఏ క్షణాయినా తన భార్యకు డెలివరీ అవుతుందని పడే కంగారు, ప్రకృతినే తన పుట్టబోయే బిడ్డకు అనుకూలంగా మార్చాలనే ఆతృత చూస్తుంటే (ఎవ్రిబడీ లవ్స్) రేమండ్ కనిపిస్తుంటాడు. సినిమాకు హైలైట్ గా నిలిచే పాత్ర Buckది. చిత్ర విచిత్రమయిన చేష్టలతో దేనికీ భయపడకుండా దూసుకుపోతుంటాడు. ఈ పాత్ర పైరేట్స్ ఆఫ్ ది కరిబియన్ లో జాక్ స్పారో లేదా ష్రెక్‌లో Puss లాంటిది. ఇక అసలు కథానాయకుడయిన Sid గురించి ఎంత చెప్పినా తక్కువే. డైనోసార్ గుడ్లను కాపాడడం, వాటినుండి పిల్ల డైనోసార్లు వచ్చినపుడు తానే వాటి తల్లిని అని మురిసిపోవడం, పెద్ద డైనోసారుకు అడ్డం పడి Look, these are my kids! And you’re gonna have to go through *me* to get them! అనడం, డైనోసార్ పిల్లలకు మంచి బుద్దులు నేర్పించాలని ప్రయత్నిచడం, చివరగా Manny కి పుట్టిన బేబీని చూసి Its a boy! అనడం ఆద్యంతం నవ్వులు కురిపిస్తాయి. సింహం Diego పాత్ర చిన్నదే కావడం కాస్త నిరాశకు గురిచేస్తుంది. సైడ్‌కిక్‌లు కూడా పర్వాలేదు. పుట్టిన బేబీ ఏనుగు చేష్టలు ఒకట్రెండు నిమిషాలు మాత్రమే అయినా చాలా బాగుంటాయి. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది పెద్ద పళ్ళున్న ఉడత గురించి. మొదటి పార్టునుండి ఒక్క కార్న్ గింజ acorn కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇందులో కూడా ఆ వేట కొనసాగుతుంది. కానీ అంతలో మరో ఆడ ఉడత రావడంతో ఇద్దరి మధ్య ఆ గింజ కోసం తగువులు మొదలయి ప్రేమగా మారుతుంది. ఒకరినొకరు బోల్తా కొట్టించుకునే ఎత్తులు, జిత్తులు మంచి వినోదాన్ని పంచుతాయి. ఈ సినిమా 3D లో కూడా రిలీజ్ అవుతున్నదని భారీ ఎత్తున ప్రచారం చేసారు. తెలుగులోని ఏకైక (?) 3D సినిమా అయినా జై భేతాళ సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా కత్తులు ముందుకు దూసినట్టు ఈ సినిమాలో కూడా ఉంటాయనుకున్నాను కానీ ఎక్కడా శ్రుతిమించలేదు. ఐదు-పది నిమిషాలకు ఒకసారి 3D ఎఫెక్ట్స్ కనిపిస్తుంటాయి. గ్రాఫిక్స్ విషయానికొస్తే, pixar సినిమాల స్థాయిలో లేకున్నా ఓపనింగ్ సీన్, డైనోసార్ల ఆవాసాన్ని మొదటిసారి చూపించడం, లావా ప్రవహిస్తుంటే ఫైట్ మొదలయినవి అద్భుతంగానే ఉన్నాయి. చివరగా – అక్కడక్కడా కొన్ని లోపాలున్నా, బోర్ కొట్టించని కథనం, చక్కని హాస్యంతో ఈ సినిమా కావలసినంత వినోదాన్ని ఇస్తుంది. 3 పార్టుల ఆనవాయితీని కొనసాగించి ఈ Ice Age సిరీస్ ఇంతటితో ఆపకుండా కనీసం మరో పార్టు తీస్తే బాగుంటుందేమో!

–జీడిపప్పు

5 Comments
  1. సుజాత July 7, 2009 /
  2. rayraj July 7, 2009 /
  3. dr.murali ravikanti July 14, 2009 /