స్త్రీని విలాస వస్తువుగానూ, వినియోగ వస్తువుగానూ పరిగణించడం మన వ్యవస్థలో అనాదిగా వస్తున్నది. ఆ స్త్రీ అట్టడుగు వర్గానికి చెందినది అయినప్పుడు పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. బూర్జువా సమాజంలో అధికారంతో ఆధిపత్యం చెలాయిస్తె ఈ పురుషస్వామ్యం పెట్టుబడిదారి సమాజంలో ధనం, వినోదాల ఎరచూపి స్త్రీని అణచివేతకు గురిచేయడం ఆమె శీలాన్ని జీవితాన్ని ఆటవస్తువుగా ఉపయోగించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అట్టడుగు బడుగువర్గాల స్త్రీలను దేవునిపేర ఊరు పరం చేసే ఆచారాలు అనేకం మనదేశంలో నెలకొని ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో నేటికి కనిపించే జోగిని వ్యవస్థ అలాంటి వాటిలో ఒకటి అలాగే దేవదాసీలను చేయడం, గడీల్లో దాసీలను ఏర్పాటు చేసుకోవడం మన తెలంగాణా చరిత్రలో చూశాం.
అలాంటి ఆచారమొకటి కర్నాటకలో కూడా నెలకొని ఉంది. దాదాపుగా జోగిని వ్యవస్థలాంటిదే ఆ స్థితి కూడా. కర్నాటకకూ, మహారాష్ట్రకూ నడుమ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఆచారం అమలులో ఉంది. ఆ వ్యవస్థ అసలు రూపాన్ని వివరిస్తూ కథనాత్మకంగా టి.ఎస్.రంగా ‘గిద్’ చిత్రం నిర్మించారు. 1984-85ల మధ్య నిర్మితమైన ఈ చిత్రానికి బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న జాయింట్ ఉమెన్స్ ప్రోగ్రాంస్ సంస్థ నిర్వహించిన అధ్యయనం మూలాంశంగా పనిచేసింది. ఆ సంస్థ సర్వే చేసి నిర్ధారించి చెప్పిన అంశాల్ని ప్రాతిపధికగా చేసుకొని గిద్‌ను వాస్తవాల్ని ఆవిష్కరించే డాక్యుమెంటరీ నిర్మాణ పద్ధతిలో సాధికారిక చిత్రంగా నిర్మించారు రంగా. ఎల్లమ్మ దేవత పేర వయస్సులో ఉన్న యువతులను ఊరుమీద విడిచేయడం, భూస్వాములు, వ్యాపారులు, పూజారులు కుమ్మక్కై పడుచు పిల్లల్ని ఉపయోగించుకొని బాంబేలోని రెడ్‌లైట్ ఏరియాకు పంపించేయడం లాంటి అమానవికమైన యదార్ధ సంఘటనల్ని ఆధారం చేసుకొని గిద్ చిత్ర కథ రూపొందింది. పేదరికం ఉన్న ఆ ప్రాతంలో హరిజన కుటుంబాల్లొ ఎల్లమ్మ గుడిలొ గంటలు ఎడతెరిపి లేకుండా మోగుతుంటే ఊర్లోని ధనవంతుడైన వాడికి దేవుని పేర ఆ అమ్మాయిని సమర్పిస్తారు. అతని అవసరం తీరాక ఆమె ఇక ఊరువస్తువు అయిపోతుంది. ఏ యువతికైనా తలవెంట్రుకలు చిక్కుపడి అట్టలు కడితే ఆమెను ఎల్లమ్మగా భావిస్తారు. ఇక ఇప్పుడా ఆచారం మరో దారి పట్టింది. దేవుని పేర వదిలేసిన ఆ యువతి అనంతర కాలంలో ఆ కుటుంబానికి ఆధారమవుతుంది. తన శీలాన్ని అమ్మకానికి పెట్టి కుటుంబాన్ని పోషిస్తుంది. దానికోసం బాంబే హైవే పైన వృత్తి నిర్వహించడం లేదా బొంబాయి రెడ్ లైట్‌కి వెళ్లిపోవడమూ జరుగుతుంది. ఇలా వెర్రి తలలు వేసుకున్న ఆచారాన్ని ఆధారం చేసుకొని ‘గిద్’ కథనాత్మకంగా నిర్మితమైంది. పదేళ్ల లక్ష్మిని ఊరంతా ఎల్లమ్మకు అర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ ఊళ్లో టీచరుగా పనిచేస్తున్న ఓ ప్రగతిశీల యువకుడు దీన్ని ప్రతిఘటిస్తూ ఉంటాడు. కాని ఆయన ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్న తరుణంలో అదే ఊర్లో ఉన్న వేశ్య హనుమి ఆచారపు కోరల్లోంచి అక్ష్మిని కాపాడేందుకు ముందుకు వస్తుంది. కాని లక్ష్మి తల్లి ఆచారం ప్రకారం తన కూతుర్ని ఆ ఊరి భూస్వామికి సమర్పించుకోకుండా ఉంటే ఎల్లమ్మ దేవత కోపానికి గురి కావాల్సి ఉంటుందేమోనని హడలి చస్తుంది. మరోవైపు హనుమి గతంలో ప్రేమించిన బాస్య హనుమికి అండగా నిలుస్తాడు. ఆదర్శవంతుడైన స్కూలు టీచరు సాధించలేని పనిని హనుమి బాస్య సహాయంతో పూర్తి చేస్తుంది. ఊరిని ఎదిరించి లక్ష్మిని వెంట తీసుకుని ఆ ఇద్దరూ పరిపోతారు. కాని హైవే మీదకు వచ్చేసరికి బాంబే బస్సు సుదూరంగా వెళ్లిపోతూ కనిపిస్తుంది. చిత్రం సమస్యకు స్పష్టమైన పరిష్కారాల్ని చూపదు కాని ఆ అమానవికమైన ఆచారానికి వ్యతిరేకంగా గళమెత్తిన హనుమి పాత్రలో చిత్రం ఆత్మను నింపాడు దర్శకుడు. హనుమి తన జీవితంలో వైఫల్యం చెంది రోగాలతో అలమటిస్తున్నప్పటికీ సనాతనమైన ఆచారాన్ని, దురాగతాన్ని ఎదిరించి నిలిచి పోరాడుతుంది. హనుమి పాత్రలో స్మితాపాటిల్ అద్భుతమైన నటనను ప్రదర్శించింది. వాస్తవికత ఉట్టిపడుతూ ఉండగా హనుమి పాత్ర గొప్ప స్పూర్థినిస్తుంది.
అయితే గిద్ చిత్రంలో జోగినీ వ్యవస్థ పైన జాలిని కాని, కోపాన్ని కాని రేకెత్తించదు. అది కేవలం ఆ వ్యవస్థను మన కళ్లముందు యదార్ధ దృక్పధంతో ఆవిష్కరిస్తుంది. ఎలాంటి ఎమోషనల్ నోట్‌ని కూడా కలిగించదు. కాని ఒక దురన్యాయాన్ని దురాచారాన్ని మన కళ్లముందు నిజాయితీగా ఉంచుతుందీ చిత్రం. 80 వ దశకం మొదటి పాదంలోనే నిర్మితమైనప్పటికీ, టి.ఎస్.రంగా అత్యంత నిబద్ధతతో చిత్ర నిర్మాణం చేసినప్పటికీ గిద్ అనేక మందిని ఆకర్షించడంలో విఫలమైంది. ప్రయోగాత్మకమైన ప్రగతిశీల చిత్రంగా మిగిలిపోయింది. స్మితాపాటిల్ నటన చిత్రాన్ని సజీవంగా ఉంచుతుంది. వేశ్యావృత్తి పైన కర్నాటక దేవదాసీ వ్యవస్థపైన నిర్మించిన సాధికారిక చిత్రంగా ‘గిద్ ‘ మిగిలిపోయింది.
గిద్ (కన్నడ)
దర్శకుడు – టి.ఎస్.రంగా
నటీనటులు – స్మితాపాటిల్, ఓంపూరి, ఎం.కె.రైనా, అచ్యుత్ పోతెదార్
dr.murali ravikanti,karimnagar says:
గిద్ సినిమా సారాంశం బాగుంది. ఈ సినిమాను ఫిల్మ్ సొసైటీల ద్వారా, మహిళా సంఘాల ద్వారా గ్రామాల్లో ప్రదర్శించే చొరవ తీసుకోవాలి.
మేడేపల్లి శేషు says:
నా కన్నడ సినిమా డివిడిల లిస్టులో ‘గిద్’ ను కూడా చేర్చాను. ‘గిద్’ అంటే అర్థమేంటో వివరించి ఉంటే బాగుండేది. Meaningful cinema గురించి అనుకున్నప్పుడల్లా వెంటనే గుర్తొచ్చే నటి స్మితాపాటిల్. ‘గిద్’ చిత్రదర్శకుడు టి.ఎస్. రంగా గారి ఇతర సినిమాల గురించి కూడా తెలియజేయండి.
vinay says:
mm telugu lo angadi bommalu ani oka film vundi choosara………….koncham vesyala life elavuntundi ani teesaru parledu anipinchindi………