Menu

Father of the bride

father of the brideFather of the bride 1991లో వచ్చిన ఇంగ్లీషు సినిమా. అప్పుడెప్పుడో “ఆకాశమంత” చూసినప్పుడు ఎవరో అన్నారు ఈ సినిమా, ఆ సినిమా ఒకే థీం అని. విని ఊరుకున్నాను. ఆ తరువాత ఓ పదిరోజుల క్రితం అనుకోకుండా ఈ సినిమా చూశాను. పనిగట్టుకుని ఆలోచించకపోయినా కూడా రెండింటినీ పోల్చడం మొదలుపెట్టాను కాసేపు. ఇప్పుడీ వ్యాసం దాని పర్యవసానమే…

కథ విషయానికొస్తే, జార్జ్ బ్యాంక్స్ అన్న పెద్దాయన కూతురు Annie ఆర్థికంగా తమకంటే పై అంతస్థులో ఉన్న అబ్బాయిని ప్రేమించి, పెళ్ళి చేసుకోబోతూ ఉంటుంది. కూతురు వెళ్ళిపోతే జీవితాన్ని ఊహించుకోలేని ఆ నాన్న ఎలా ప్రవర్తిస్తాడో, పెళ్ళి ఎలా చేస్తాడో.. చివరికి ఏమౌతుందో – ఇదీ ఈ సినిమా కథ. మొత్తంగా కాకపోయినా, “ఆకాశమంత” తో పోలికలు బానే ఉన్నాయి ఈ సినిమాకి. సినిమాలోని కొన్ని దృశ్యాలు చూస్తూ ఉంటే కూడా అదే అనిపించింది. జార్జ్ ఓ సూపర్ మార్కెట్ లో హంగామా చేసి, తరువాత జైలుకి వెళ్తే, అక్కడికి అతని భార్య వచ్చినప్పటి సన్నివేశం, పెళ్ళి ఏర్పాట్ల సమయంలో జరిగే హాస్యం – ఇలాంటివి “ఆకాశమంత” లో లేవు కానీ, ఇలాంటి ఫీలింగ్ కలిగించే దృశ్యాలు లేకపోలేదు.

ఈ సినిమా చూసాక గానీ నాకో విషయం తట్టలేదు – తండ్రులు ఎక్కడైనా తండ్రులే అని 🙂 అమెరికాలో పెళ్ళిళ్ళు, వాటి చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలూ-మనకి మల్లేనే ఉంటాయని ఎందుకో నాకు ఎప్పుడూ అనిపించలేదు. నేను చూసిన హాలీవుడ్ చిత్రాల్లో ఈ కుటుంబ సంబంధాలను చూపినవి తక్కువగా ఉన్నందువల్ల కాబోలు. ఈ పెళ్ళి తంతు జరుగుతున్నంత సేపూ ఉన్న డైలాగులు – మన కుటుంబాల్లో పెళ్ళి ఇళ్ళు ఎలా ఉంటాయో వాటినే తలపించాయి. అదేదో పరలోక దేశం అన్నట్లు అనుకోడమే కానీ, అమెరికన్ కుటుంబాల్లోనూ మనలాగే ఉంటాయన్నమాట భావోద్వేగాలు …అనుకున్నా (వాళ్ళూ మనుష్యులే కదా మరి..:) )

ఇక, ఆంగ్ల సినిమా తెలుగు/తమిళ సినిమా కంటే కూడా బాగా తీసినట్లు అనిపించింది నాకైతే. అంటే, నా ఉద్దేశ్యంలో తెలుగు సినిమాలో కాస్త నాటకీయత ఎక్కువగా అనిపించింది. లేదా, అమెరికన్ పెళ్ళిళ్ళ గురించీ, వారి జీవనశైలి గురించి నాకు తెలీకపోవడం వల్ల ఆంగ్ల సినిమాలోని నాటకీయత నాకు కనబళ్ళేదేమో మరి – తెలీదు. ఇక హాస్యం : నాకు తెలుగు/తమిళ సినిమాలోని హాస్యం నచ్చింది కానీ, నిస్సందేహంగా ఆంగ్ల సినిమాలో దానికంటే సంభాషణలు బాగున్నాయి. అలాగే, రెండు సినిమాలు ప్రేక్షకులను కదిలించగలవు.

రెండింటిలోనూ తండ్రీ-కూతుర్ల మధ్య ఉండే అనుబంధాన్నే చూపినా కూడా, Father of the bride లో దాన్ని చాలా subtleగా, ఎక్కువ మాటల్లేకుండా (అలాగే, సుత్తి లేకుండా) చూపినట్లు అనిపించింది. ఏదో ఒకటి, యాక్షన్ సినిమాలో, పూర్తి అబ్సర్డ్ కామెడీలో, అతి మెలోడ్రామాలో చూసి చూసి బోరు కొట్టేస్తూ ఉంటే, అప్పుడప్పుడూ ఇలా ఆహ్లాదకరంగా ఉండే సినిమాలు చూడాలి అని మాత్రం మళ్ళీ తేలింది, నా కోణంలో 🙂

3 Comments
  1. కొత్తపాళీ July 16, 2009 /
  2. Venkat May 15, 2010 /