Menu

Definitely, May be (2008)

DEFINITELY-MAYBEఇప్పుడీ సినిమా కథ చెప్పాలంటే, అదో పెద్ద కథ. చూసేటప్పుడు కూడా నాకు కాస్త కన్ఫ్యూజింగ్ గానే అనిపించింది. విషయానికొస్తే, మన కథ వర్తమానంలో మొదలౌతుంది. విల్ హేస్ తన భార్య నుండి విడాకులు కోరి ఉంటాడు. ఈ ప్రయత్నాలు నడుస్తూ ఉండగా, విల్ పదేళ్ళ కూతురు మాయ తన తల్లిదండ్రుల వివాహానికి ముందు జరిగిన కథను తెలుసుకోవాలనుకుంటుంది. విల్ ఈ కథని యదాతథంగా చెప్పక – పాత్రల పేర్లు మార్చి, కాస్త నాటకీయంగా చెప్పడం మొదలుపెడతాడు. తనతో ప్రేమ లాంటి సంబంధాల్లో ఉన్న ముగ్గురు ఆడవారిలో మాయ తల్లి ఎవరో తెలుసుకోడం మాయకే వదిలేస్తాడు.

ఎంటర్ ఫ్లాష్‍బ్యాక్. పూర్వకాలంలో రాజకీయాలపై ఆసక్తికొద్దీ క్లింటన్ ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకోడానికి తన ఊరిని వదిలి వస్తాడు విల్. అలా వస్తున్నప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్ ఎమిలీ అతనికి తన స్నేహితురాలైన సమ్మర్ అనే జర్నలిస్టు కు ఇమ్మని ఓ ప్యాకెట్ ఇస్తుంది. క్లింటన్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విల్ ఏప్రిల్ అనే అమ్మాయిని కలుస్తాడు. సరే, ఎమిలీ సమ్మర్ కు ఏమిచ్చిందో చూద్దామని ప్యాకెట్ తెరిచి చూస్తే అది సమ్మర్ డైరీ. సమ్మర్ తో ఎమిలీకి ఉన్న సంబంధం గురించి అర్థమౌతుంది. తరువాత సమ్మర్ ని కలిసేందుకు వెళ్ళినపుడు అక్కడ ఆమెతో కలిసి ఉన్న ఆమె ప్రొఫెసర్ ను కూడా కలుస్తాడు. వెళుతూ వెళుతూ ఉండగా సమ్మర్ అతనితో ప్రవర్తించిన విధానం అతనికి తేడాగా అనిపిస్తుంది.

ఏప్రిల్, విల్ మంచి స్నేహితులయ్యాక విల్ తాను ఎమిలీకి ప్రపోజ్ చేద్దామనుకుంటున్నా అని, ఏప్రిల్ ముందు రిహార్సల్ వేస్తారు. అతను చెప్పిన పద్ధతికి ఆమె “Definitely, Maybe” అని జవాబిస్తుంది. సరే, ఆ తర్వాత ఏప్రిల్ ఇంటికి వెళ్తారు ఇద్దరూ. అక్కడ పెద్ద సంఖ్యలో “Jane Eyre” పుస్తకాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇంకో కథ: ఏప్రిల్ చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఆమెకీ పుస్తకాన్ని కానుకగా ఇస్తాడు. కానీ, ఆ తరువాత ఆ పుస్తకం పోగొట్టుకుపోతుంది. అప్పట్నుంచి, ఆమె అలా “కానుక”గా లభించి పోగొట్టుకున్న/అమ్మేస్కున్న “Jane Eyre” పుస్తకాలని సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాపులనుండి సేకరిస్తూ ఉంటుంది – ఎప్పుడో ఒకప్పుడు తన పుస్తకం దొరక్కపోదు అని. సరే, ఈ ఉదంతం అయ్యాక విల్ వెళ్ళి ఎమిలీకి ప్రపోజ్ చేస్తే, ఆమె తాను అంతకు ముందురాత్రే విల్ పాత స్నేహితుడు చార్లీతో పడుకున్నానంటుంది. విల్ బాధగా వెళ్ళిపోతాడు.

తరువాత విల్, అతని స్నేహితుడు కలిసి సొంత కన్సల్టెన్సీ పెట్టుకుని నిలదొక్కుకుంటారు. అలాగే, విల్, సమ్మర్ ఒకరికొకరు దగ్గరౌతారు. అప్పుడే ఏప్రిల్ విల్ ను తను ప్రేమిస్తున్నా అని అర్థమై అతనివద్దకొచ్చి ఈ వ్యవహారం తెలుసుకుని వెళ్ళిపోతుంది. అయితే, ఒకానొక క్లయంట్ కోసం పనిచేస్తున్నప్పుడు సమ్మర్ అతనికి వ్యతిరేకంగా రాస్తుంది. దానితో వీళ్ళిద్దరి సంబంధాలు చెడతాయి, విల్ వ్యాపారం దెబ్బతింటుంది. కొన్నాళ్ళు అతను తాగుడుకి అలవాటై పిచ్చిగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే ఓరోజు విల్ కి ఏప్రిల్ యొక్క “Jane eyre” కాపీ ఓ షాపులో దొరుకుతే ఇద్దామని వాళ్ళింటికి వెళ్తాడు. అక్కడ ఆమె మరెవరితోనో ఉండటం చూసి వెనక్కి వెళ్ళిపోతాడు.

అనుకోకుండా, విల్ సమ్మర్ ను కలుస్తాడు రోడ్డుపై. అప్పటికి ఆమె గర్భవతి. వాళ్ళింట్లో పార్టీకి విల్ ను ఆహ్వానిస్తుంది. అక్కడే ఎమిలీ ఉంటుంది. అక్కడ మళ్ళీ విల్-ఎమిలీలు కలిసి, తర్వాత పెళ్ళి చేస్కుంటారు. తాను సమ్మర్ కూతుర్నేమో అని అనుమానించిన మాయ ఈ ఆఖరు ముక్క విన్నాక ఊపిరి పీల్చుకుంటుంది.

విడాకులు వచ్చాక విల్ సామాన్లు సర్దుకుంటున్నప్పుడు ఏప్రిల్ పుస్తకం కనిపిస్తుంది. ఆమె ఇప్పుడు ఒంటరిగా ఉంటోందని కూడా తెలుసుకుని, ఆ పుస్తకం ఇద్దామని వెళతాడు. కానీ, అతని దగ్గర ఈ పుస్తకం పెట్టుకుని కూడా ఇన్నాళ్ళూ ఇవ్వలేదని ఆమె అతన్ని బయటకు వెళ్ళమంటుంది. కథ వినేసి తను అంతా తెలుసుకున్నా అన్న ఆనందంలో ఉన్న మాయ – కథలో మిగితా పాత్రల పేర్లు మార్చినా కూడా ఏప్రిల్ పేరు అలాగే పెట్టడంతో తన తండ్రి నిజంగా ఇష్టపడ్డది ఏప్రిల్ అని అర్థం చేస్కుని ఆమెని అతనితో కలపడానికి ప్రయత్నిస్తుంది. ఫైనల్లీ, విల్, ఏప్రిల్ కలుస్తారు.
-ఇదీ … ఇంత పెద్ద కథ ఈ సినిమాది.

సరే, ఇలా ఉన్నా కూడా, నాకు సినిమా కాలక్షేపానికి బానే అనిపించింది. అక్కడక్కడా హాస్యానికి తక్కువేమీ లేదు. అయితే, ఇలా కథ విన్నాక మీకు ఈ సినిమా చూడాలనిపించకపోవచ్చు – ఏమిటీ కథ! అనిపించొచ్చు. కానీ, ఇది ఇలా చెప్పడం కష్టం. చూడ్డం ఈజీ. ఇదేదో కళాఖండం అని నేననను కానీ, కథనం నాకు ఆసక్తికరంగా అనిపించింది…. నిజానికి ఏదో రాద్దామని మొదలుపెట్టా కానీ, కథ మొత్తం రాసేసారికే… ఆ ఉత్సాహం ఆవిరైపోయింది 🙂 (సినిమా తాలూకా వికీ లంకె..ఇక్కడ)

3 Comments
  1. rAsEgA July 20, 2009 /
  2. harish July 23, 2009 /
  3. సౌమ్య July 24, 2009 /