Menu

డిఫాయన్స్

defiance_movie_250కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు, ఆ సినిమా కథాగమనంతో భౌగోళికంగానూ కాలమాన పరిస్థితులతోనూ నాకెటువంటి సంబంధం లేకపోయినా కూడా ఒక్కోసారి అందులోని పాత్రలమధ్యలో నేను కూడా దూరిపోయి వాళ్ళతో పాటే అష్టకష్టాలు పడి వాళ్ళతోపాటుగా ఓడుతూ గెలుస్తూ సినిమాలోని అన్ని ఎమోషన్స్ ని అనుభవించి సినిమా అయ్యేటప్పటికి ఏదో ఒక సుదీర్ఘ ప్రయాణం చేసిన ఉద్విగ్నతకు లోనవుతుంటాను. ముఖ్యంగా వార్ మూవీస్ చూసినప్పుడు. అలాంటిదే ఈ సినిమా – డిఫాయన్స్(Defiance).

టైటిల్ చూసి, పోస్టర్ మీద మన సరికొత్త జేంస్ బాండ్(డేనియల్ క్రైగ్)ని, బ్లడ్ డైమండ్, లాస్ట్ సమురాయ్ సినిమాల డైరక్టర్ అని వివరాలు చూసి ఇదేదో సూపర్ యాక్షన్ సినిమాలే అని సంబరపడిపోయి ట్రైలర్ కూడా చూడకుండా సినిమా చూడ్డం మొదలెట్టా. హిట్లర్ని చూపిస్తూ బ్లాక్ అండ్ వైట్ లో ఓపెనింగ్ సీన్ మొదలవడంతో ఒక్కసారిగా బ్లాక్ అయిన మైండ్, కొద్దిసేపటి తరువాత లాస్టయ్యి(lost) సినిమా లాస్టు(last) వరకు అక్కడే వుండి ఇంకరానంది. అప్పటికప్పుడే మొట్టమొదటిసారిగా ఒక సినీసమీక్ష రాయాలనిపించి దాన్ని బలవంతంచేసి లాక్కొచ్చి లేఖినిలో పడేసి, బుర్రలోని ఆలోచనల్ని కట్ పేస్ట్ చేసి మెయిల్లో అటాచ్ చేసి నవతరంగం కి ఫార్వర్డ్ చేసా. షిండ్లర్స్ లిస్ట్ తరహా సీన్లతో మొదటి మూడు నిముషాల్లోనే ఈ సినిమా నాజీల దురాగతాలకు సంబంధించినదని అర్థమైపోతుండగా ఇదికూడా ఆకోవలోకి చెందినదేమోలే అని ఒక కంక్లూజన్ కి వచ్చేలోపల మన జేంస్ బాండ్, ‘తువ్యా బెల్‌స్కీ’ (Tuviya Beilski) రూపంలో మనముందుకు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి సినిమా చివ్వరికంటూ మనల్నికుడా వెంటతీసుకెళతాడు.

వివరాల్లోకెళ్ళేముందుగా చిన్న గమనిక! కథ తెలియకుండా సినిమా చూడాలనుకుంటే మనం మళ్ళీ కలవచ్చు. ఒకవేళ చదివేసినా కూడా కాస్త వుత్కంఠ తగ్గుతుందేమోగానీ, మీకు సినిమా చూసిన అనుభూతిలో (టిం బర్టన్-స్లీపీ హాలో చూస్తున్నంత సేపు వేసే ఒకవిధమైన చలి లాంటిది)ఏమాత్రం మార్పుండదని హామీ మటుకు ఇవ్వగలను! నాజీల దమనకాండలో తల్లిదండ్రులను ఆస్తినీ కోల్పోయి ఎలాగోలా తప్పించుకున్న తమ్ముళ్ళను తీసుకుని అడవిలోకి పారిపోయి నాజీలతో పాటుగా ఆకలిదప్పులతో, చలి-వానలతో నిరంతరం జీవనపోరాటం సాగిస్తూ స్వేచ్ఛకోసం, బతకడం కోసం ప్రయత్నం చేసిన ఒక పెద్దన్నయ్య ‘తువ్యా’ నిజజీవితంలో జరిగిన కథ ఇది. టూకీగా ఇంతేనా అనిపించినా చూస్తున్నంతసేపు మనకు తెలియకుండానే తువ్యా బెల్‌స్కీ తో ఒక అనుబంధం ఏర్పరచుకుంటాం.
హిట్లర్ నాయకత్వంలో జర్మన్ దళాలు 1941లో బెలారష్యా (ఇప్పటి బెలారస్)ను ఆక్రమించి యూదులను(jews) ఘెట్టోలకు తరలిస్తూ ఎదురుతిరిగినవాళ్ళను ఊచకోతకోస్తూ వూళ్ళకు వూళ్ళు నాశనం చేస్తూ రష్యా వైపు దాడికి కదులుతున్న సమయం. అతికొద్దిమంది యూదులు నాజీలనుంచి తప్పించుకుని అడవుల్లోకి పారిపోగలుగుతారు. యూదులైన తువ్యా బెల్‌స్కి కుటుంబం కూడా ఈ దాడిలో నాశనమవుతుంది. తల్లిదండ్రులు చనిపోగా ముగ్గురు తమ్ముళ్ళతో జర్మన్లనుంచి తప్పించుకుని తువ్యా అడవుల్లోకి పోతాడు. వున్నకొద్దిపాటి ఆహారనిల్వలతో అడవిలోనే ఎలాగోలా బతికేద్దాం అనుకుంటుండగా తనలాంటివాళ్ళే ఇంకొంతమంది యూదులు తారసపడతారు. వాళ్ళనుకూడా తమతోపాటి ఆహ్వానించి ఒక చిన్న గ్రూప్ తయారుచేస్తాడు. ఆహారంకోసం పక్కనవున్న గ్రామంలో తండ్రి పాతమిత్రుడైన ఒక పోలండ్ రైతుని కలిసి సహాయంపొంది తండ్రిని చంపిన ఆఫీసర్ గురించి తెలుసుకుంటాడు తువ్యా. అతన్ని చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు. కాని నాజీలనుంచి తప్పించుకుని అడవిలోనే వుండిపోవల్సి వస్తుంది. అక్కడే ఒక క్యాంప్ లాంటిది ఏర్పాటు చేసి మరికొంతమంది యూదులను చేరదీస్తాడు.
ఇది మొదట్నుంచి పెద్దతమ్ముడు ‘జుస్'(Zus Beilski) కి నచ్చదు.ఆహారంకోసం పక్కనవున్న గ్రామంలో తండ్రి పాతమిత్రుడైన ఒక పోలండ్ రైతుని కలిసి సహాయంపొంది తండ్రిని చంపిన ఆఫీసర్ గురించి తెలుసుకుంటాడు తువ్యా. అతన్ని చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు. కాని నాజీలనుంచి తప్పించుకుని అడవిలోనే వుండిపోవల్సి వస్తుంది. అక్కడే ఒక క్యాంప్ లాంటిది ఏర్పాటు చేసి మరికొంతమంది యూదులను చేరదీస్తాడు. ఇది మొదట్నుంచి పెద్దతమ్ముడు జుస్ కి నచ్చదు. ఆహారంకోసం  మనమే తిప్పలుపడుతున్నాం ఇంక వీళ్ళందరిని ఎలాచూసుకోగలం అని అంటాడు. తువ్యా మనమందరం ఇప్పుడొక కుటుంబం అని చెప్పి తమ్ముడి నోరుమూయిస్తాడు. అలా మెల్లిగా ఒక చిన్న సైజు గ్రూప్ కి లీడర్ అవుతాడు తువ్యా. ఆహారంకోసం ఆయుధాలకోసం దగ్గర్లోవున్న పళ్ళెటూళ్ళమీద దాడి చేసి,వీరంగం సృశ్టించి దారినపోయే జర్మన్ ఆఫీసర్లతో పోరాడి కొంతమంది అనుచరులను, తమ్ముడిని పోగొట్టుకుంటాడు. అప్పటికికానీ ఏంతప్పుచేసాడో తెలిసి రాదు.
మనం జంతువులలాగా వేటాడబడుతున్నామని జంతువుల్లాగా ప్రవర్తించడం మంచిది కాదు అని అందరికీ సర్ది చెపుతాడు.అలా అహింసాయుతం గా దోపిడీలు చెయ్యడం మనకేనష్టం అని జుస్ చెప్పినా వినడు. పరిణామంగా వీరుండే స్థావరం జర్మన్లకు తెలిసి దాడి జరిగి పారిపోవలసి వస్తుంది. దానితో జుస్ తువ్యాతో తీవ్రంగా విభేదించి అదే అడవుల్లో వున్న సోవియట్ రెడ్ ఆర్మీ తో కలిసిపోతాడు. అయినప్పటికీ తువ్యా మిగిలిన మరొక తమ్ముడితో కలిసి మరికొంతమంది యూదులను జర్మన్ల ఘెట్టోలనుంచి తప్పించి అడవుల్లోకి తీసుకువస్తాడు. అందరినీ ఒకేతాటిమీదకు తెచ్చి నాయకత్వం వహిస్తాడు. ఇలా ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా తను నమ్మిన సిధ్ధాంతానికి కట్టుబడి నమ్మిన వాళ్ళను కాపాడి వాళ్ళందరికీ పరిరక్షకుడిగ అభిమానాన్ని చూరగొంటాడు. ఇంకొన్ని మలుపులతో అనుకోని సంఘటనలతో సినిమా ఐపోతుంది. అవన్ని చెప్పడం కంటే తెరమీద చూస్తేనే బాగుంటుంది.
చాలా సింపుల్‌గా అనిపించినా పట్టుసడలని స్క్రీన్ ప్లే అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, 1940ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్టింగులు, మనల్ని కూడా ఆ కాలంలోకి తీసుకుపోతాయి. షేక్స్పియర్ ఇన్ లవ్ సినిమాకు ఉత్తమ చిత్ర నిర్మాతగా ఆస్కార్ పొందిన ఎడ్వర్డ్ జ్విక్ స్వీయ దర్సకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండో ప్రపంచ యుధ్ధపు మరోకోణాన్ని ఆవిష్కరిస్తుంది. బ్లడ్ డైమండ్, లాస్ట్ సమురాయ్ చిత్రాలతో తనదంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఎడ్వర్డ్, స్క్రీన్ ప్లే కూడా సమకూర్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు పొందింది.
తువ్యా బెల్‌స్కీ గా డేనియల్ క్రైగ్ చాలా చక్కగా నటించాడు. జట్టులోని వారందరికీ నాయకుడిగా బతకాలన్న ఘాడమైన ఆశ మనమీద మనకు నమ్మకం వుంటే కానిది ఏదీ లేదు అని ముందుకు నడిపించే ఆత్మస్థైర్యం, నాజీలు చుట్టుముట్టినప్పుడు ఎంతపోరాడినా ఓడిపోవడం తప్పదని తెలిసి కూడా నిరాశ చెందక జట్టుని ముందుకు వురికించే ధైర్యం, తమ్ముడు విభేదించి వెళ్ళిపోతున్నప్పుడు నిస్సహాయత్వం ఇలా హావభావాలను అద్భుతం గా పండించాడు.
” … we may be hunted like animals but we will not become animals. we have all chosen this to live here free like human beings for as long as we can. every day of freedom is like an act of faith. and if we should die trying to live, and atleast we die like human beings. ” అంటూ అనుచరులను సంఘటిత పరిచే సీన్, ఉధృతమైన చలికాలంలో తినడానికి తిండి దొరకక జనాలు అలమటించిపోతున్నప్పుడు, తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న గుర్రాన్ని చంపే సీన్, కాపలాదారులకు చిక్కిన జర్మన్ సైనికుడిని అనుచరులు కొడుతున్నప్పుడు వాళ్ళను ఆపలేక తనలో తనే కుమిలిపొయ్యే సీన్లు హృద్యంగా వుండి తువ్యాను మరింత దగ్గరకు చేరుస్తాయి.
రెండో ప్రపంచయుద్ధం లో నాజీ దళాలు తిరోగమనం చెందేసమయానికి  బెల్‌స్కీ సోదరుల సహాయంతో బెలారస్ అడవుల్లో దాదాపు 1200 మంది యూదులు నివాసం ఏర్పరచుకున్నారు. వాళ్ళ క్యాంప్ లో ఒక హాస్పిటల్, పాఠశాలకూడా ఏర్పాటుచేసుకుని ఒక సమాంతర గ్రామజీవితాన్ని గడిపారు. అడవి చుట్టుపక్కల వున్న గ్రామాలను బందిపోటు దొంగల్లాగా దోచుకున్నారు అని చరిత్రలో ఇంకో వర్షన్ ఉన్నాకూడా సినిమా వరకు ఆద్యంతం వాళ్ళజీవనపోరాటం హృద్యంగా చిత్రీకరించి దర్శకుడు మన్ననలుపొందాడు. రెండోప్రపంచ యుధ్ధం ఆధారంగా వచ్చిన సినిమాలల్లో ఈ సినిమా తప్పక ముందు వరసలో నిలుస్తుంది. వార్ మూవీస్ నచ్చేవాళ్ళకు ఖచ్చితంగా నచ్చే ఈ సినిమా, తప్పక చూడవలసిన గొప్ప కళాఖండం కాకపోయినా.. నా లాంటి సినిమా పిచ్చోళ్ళకు తీరిక సమయంలో చూడదగ్గ చిత్రం.

– రవి లోచన్

One Response
  1. రవి July 15, 2009 /