Menu

కెమెరా-దర్శకులు ‘హిట్‘ కొట్టలేరా?

‘లోటస్ పాండ్‘!

ఈ మధ్య మన తెలుగు, జాతీయ సినీ వార్తల్లో ప్రధానంగా వినిపిస్తున్న సినిమా! తెలుగు సినిమా రంగంలో టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుత్రరత్నం ఆకాశ్ ఈ సినిమాలో నటిస్తున్నాడనీ, ఈ సినిమా బాలల చిత్రం అనీ, ఇంగ్లీష్ల్ లో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా నిర్మాణం అవుతుందనీ….ఇలా ఎన్నో విశేష వార్తలు ఈ సినిమా గురించి వెలుగులోకి వచ్చాయి. ఐతే వీటన్నింటినీ మించిన గొప్ప విశేషం ఏమంటే – ఈ సినిమాకి పి.జి.వింద దర్శకత్వం వహించడం! ఆ మాటకొస్తే దర్శకుడి గా సినిమా వార్తల్లోకి రావడం పెద్ద విశేషం కాదు. కాని ప్.జి.వింద అనబడే పి.గోవింద తన తొలి దర్శకత్వ చిత్రం చేస్తుండడం విశేషమైంది. ఎందుకంటే వింద బ్యాక్ గ్రౌండ్ అలాంటిది! పి.జి.వింద సినీ పరిశ్రమకు కెమెరామెన్ గా పరిచయం అయ్యారు. జీవన దృశ్యాలను చిత్రిక పట్టాలనే స్వప్నాన్ని నిజం చేసుకుని కెమెరా చేతబట్టారు. ఆయనకి ప్రఖ్యాత కెమెరామెన్ మధు అంబట్, రాజీవ్ మీనన్ వంటి ’దృశ్యస్రష్ట’’ ల దగ్గర శిష్యరికం చేసిన అనుభవం వుంది. పైగా ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు పొందిన ’గ్రహణం సినిమాకు ఛాయాగ్రహకుడిగా ప్రత్యేక గుర్తింపు కూడా వుంది. వీటికి తోడు ఈ మధ్య కాలంలో ’న్యూ ఏజ్ సినిమాలుగా తెలుగు మల్టిప్లెక్స్ సినిమాలుగా హిట్ కొట్టిన అష్టాచెమ్మా, వినాయకుడు సినిమాలకు ప్రతీ దృశ్యంలో ఫ్రెష్ ఫీల్ ను, కెమెరా యాంగిల్స్ లో, చిత్రీకరణలో నవ్యతను చూపించిన ప్రతిభ విందది!

ఇంకా చెప్పాలంటే వింద సాధిమ్చిన ఈ అచీవ్మెంట్స్ ని బట్టి లోటస్ పాండ్ సినిమా వార్త విశేషమై కూచోలేదు. ఆయన ఈ సినిమాకి దర్శకత్వం కూడా చేస్తుండడంతో దర్శకులుగా మారుతున్న కెమెరామెన్ లపై వారి సినిమాలపై సాఫల్య వైఫల్యాలపై చర్చ మొదలైంది.

కెమెరామెనే విజువల్ దర్శకుడు: సాధారణంగా సినిమాని 24 క్రాఫ్ట్ ల సమ్మిళిత రూపంగా చెబుతారు. ఈ క్రాఫ్ట్ లన్నింటినీ సమన్వయపరిచి, తన ఊహకనుగుణమైన కథని నటులనుంచి టెక్నీషియన్లనుంచి, గీత రచయితలు, మాటలరచయితలు, కొరియోగ్రాఫర్ల నుంచి రాబట్టుకునే గొప్ప టాలెంట్ దర్శకుడిది. అయితే దర్శకుడి అంచనాలను, విజన్ ని తెరపైకి అనువాదం చేయగల నైపుణ్యం మాత్రం కెమెరామెన్ దే! అంటే సినిమా దర్శకుడు – మస్తిష్కం వంటివాడైతే కెమెరామెన్ కన్ను వంటి వాడు. మనచుట్టూ జరిగే సంఘటనలపై మన దేహంలో తొలిగా స్పందించే అవయవం కన్ను ఎలా అవుతుందో, సినిమాకీ కెమెరామెన్ అలాంటివాడే! అందుకే కెమెరామెన్ సినిమాకి విజువల్ దర్శకుడు! సినిమా ప్రధానంగా విజువల్ మీడియానే కనుక కెమెరామెన్ దృష్టి-ప్రతిభ-సృజనాత్మకత-నైపుణ్యం-కథను అర్థం చేసుకున్న తీరు అన్నీ కలిపి తెరమీది చిత్రాలుగా రూపొంది, అవి ప్రేక్షకుల మదిలో నిలిచి పోయే భావ చిత్రాలుగా రూపాంతరం చెందుతాయి. అందుకే కెమెరామెన్ దర్శకుడవుతున్నాడంటే సినీ పరిశ్రమలో ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరుగుతాయి. వింద విషయంలో ఈ చర్చకు కారణం అదే!

కారణాలేంటి?- దృశ్య సాధనమైన సినిమాలో కెమెరా అనేది ఈ సాంకేతిక నైపుణ్యం. అంతకుమించి ఈ దృశ్య అనుభూతి…అధ్భుతం! అలాంటిది సాంకేతిక నిపుణులైన కెమెరామెన్ ’రోల్ ఛేంజ్ చేసి కొత్త ఫ్రేమ్ లాంటి డైరెక్షన్ లోకి ఎందుకు? అని అలోచిస్తే కనిపించే సమాధానం ఒక్కటే! సినిమా షిప్ కు దర్శకుడు కెప్టెన్ అనేదే! ఇక పడవ నడపడం తెలిసిన వాడికి, పడవని ఏ తీరం వైపుగా నడిపించాలో నిర్దిష్టమైన దృక్పథం ఉన్న సినీ ప్రేమికుడికి ’కెప్టెన్ కావాలని ఉండడం సహజమే కదా! అలాగే సృజనాత్మక రంగంలో ఉన్న ఎవ్వరికైనా తన కనుసన్నలలో పూర్తిగా ఒక సృష్టి జరగాలని కోరుకునే స్వభావం ఉండడం కూడా సహజమే! అందుకే సినిమా గురించి తెలిసిన ప్రతీ సినీ ప్రేమికుడి జీవిత లక్ష్యం దర్శకత్వం వహించడమే అవుతోంది!

దృశ్య బ్రహ్మ తో మొదలు- ఇలా కెమెరామెన్ – టర్న్డ్-డైరెక్టర్స్ అనే ట్రెండ్ తెలుగులో ఈ మధ్యనే వచ్చిన లేదా వస్తున్న పరిణామం కాదు. తెలుగు సినిమా ప్రయాణంలో తొలి రోజుల నుమ్చీ ఇది ఉన్నదే! బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో కూడా కెమెరామెన్ దర్శకుడికి సలహాలు, సూచనలు చేయడమే కాక కొన్ని సీన్లను దర్శకుడు లేకుండా కెమెరామెనే షూట్ చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఆ సంప్రదాయం ఇప్పటికీ ఉంది. కాకపోతే పూర్తి స్థాయిలో ఓ సినిమాకు దర్శకత్వం వహించిన కెమెరామెన్ గా ఘనత సాధించిన వారిలో ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సిన మహనీయుడు – వి.ఎస్.ఆర్. స్వామి! కెమెరా అంటే స్వామిగారే అన్నంతగా తెలుగు సినీ జగత్తుపై చెరిగిపోని ముద్రవేసిన గొప్ప నిపుణుడు ఆయన. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్ లో వందలాది సినిమాలను కెమెరామెన్ గా తెరకెక్కించిన ఘనుడు! ఇంకా చెప్పాలంటే ఇప్పటి తరం కెమెరామెన్ లందరికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయనే గురుపు. ఒక్కమాటలో చెప్పాలంటే స్వామి దృశ్య బ్రహ్మ !

ఆయన తొలిసారిగా దర్శకుడిగా మారి ఓ ప్రయోగాత్మక కథని సినిమాగా తీశారు. ఆ సినిమా ’మాకూ స్వాతంత్ర్యం కావాలి! ఈ సినిమా ఎంత అసాధారణ చిత్రం అంటే ఈ సినిమాలో ప్రధాన నటులు మనుషులు కాదు! కోతులు…జంతువులు! ఒక గొప్ప మానవీయ ప్రయోజనంతో జంతుజాలంపై మనుషుల దాష్టికాలపై అంతకుమించిన ప్రాకృతిక-పర్యావరణ స్పృహను రేకెత్తించిన ఈ సినిమాలో కోతులు ప్రధాన పాత్రగా వాటినుంచి తనకు కావలసిన హావభావాలని రాబట్టుకుని స్వామి ఓ అధ్బుతాన్ని సుసాధ్యం చేశారు. కానీ ఈ సినిమా మంచి చిత్రంగా ప్రశంసల్లు పొందింది కానీ వాభిజ్యపరంగా విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత మరే సినీ కెమెరామెన్ దర్శకత్వం వైపుగా ఆసక్తి ప్రదర్శించలేదనే చెప్పాలి. కానీ తమిళంలో బాలుమహేంద్ర దర్శకుడగా మారి అద్భుతమైన సినిమాలను తీశారు. తెలుగులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన పంతులమ్మ సినిమాకు కెమెరామెన్ గా పని చేసిన బాలుమహేంద్ర తమిళ, మళయాళ సినిమాలెన్నింటికో ఛాయాగ్రహణం అందించినప్పటికీ తెలుగులో నిరీక్షణ సినిమా ద్వారా అద్భుతమైన సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అర్చన-భానుచందర్ నటించిన ఈ సినిమా ఓ గొప్ప ప్రేమకథను తెలుగు తెరపై ఆవిష్కరించారు. కాగా కమల్ హాసన్ కు జాతీయ అవార్డు తెచ్చిన వసంత కోకిల ,వెరైటీ కామెడీ-సతీ లీలావతి బాలుమహేంద్ర దర్శకత్వం వహించిన సినిమలే!

అశోక్ కుమార్ సంచలనం: కార్తీక్-శోభన జంటగా వచ్చిన అభినందన సినిమా అప్పటి తరం వెరైటీ లవ్ స్టోరీగా, మ్యూజికల్ హిట్ గా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమా దర్శకుడు అశోక్ కుమార్ అంతకుముందు ఎన్నో సినిమాలకు కెమెరామెన్ గా సేవలందించారు. ఈ సినిమాకి ఆయన డెరెక్షన్ తో పాటు కెమెరా వర్క్ ని కూడా చేసి శీతాకాలపు ఊటీ అందాలను హృద్యంగా చూపించి సినిమాని హిట్ చేశారు. భారతీయ సినిమా చరిత్రలో 100 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డు సాధించిన హమ్ ఆప్ కే హై కౌన్ సినిమాకు అభినందన సినిమానే అనధికారిక స్ఫూర్తి! ఇంతటి సంచలనం సృష్టించిన కెమెరామెన్-టర్న్డ్-డైరెక్టర్ అశోక్ కుమార్ ఆ తర్వాత నీరాజనం, కామాగ్ని, ఖజురహో వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. కాగా అశోక్ కుమార్, శంకర్ సినిమా జీన్స్ కు అద్భుతమైన ఛాయాగ్రహణాన్ని అందించడమే కాకుండా ఏడు ప్రపంచ వింతలను నభూతోనభవిష్యతి అన్న రీతిలో తెరకెక్కించాడు.

మణిరత్నం స్కూల్: ఈ వరుసలో చెప్పుకోవాల్సిన మరో కెమెరా దర్శకుడు సంతోష్ శివన్! మణి రత్నం సినిమాలైన దళపతి, రోజా, ఇద్దరు, దిల్ సే వంటి కళాఖండాలకు ఛాయాగ్రహణం బాధ్యతలను నిర్వహించి సినిమా కథకు ఫీల్ ను, డెప్త్ ను తెచ్చిన ప్రతిభావంతుడు సంతోష్ శివన్. ఆ తర్వాయ ఆయన దర్శకుడిగా మారి అయేషా ధార్కర్ ప్రధాన పాత్రలో టెర్రరిస్ట్ సినిమాకి దర్శకత్వం వహించారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం మానవబాంబు థను పాత్ర స్ఫూర్తిగా శ్రీలంక టెర్రరిజం నేపథ్యంతో తీసిన ఈ సినిమా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై లెక్కకు మిక్కిలి అవార్డులను సాధించింది. ఆ తర్వాత ఆయన షారూక్ ఖాన్-కరీనాలతో చారిత్రాత్మక నేపధ్యంలో అశోక సినిమాను రూపొందించారు.

అలాగే భారతీయ ఇనీ చరిత్రలో కళాఖండాలుగా నిలిచిన బొంబాయి, గురు సినిమాలకు కెమెరామెన్ గా పని చేసిన రాజీవ్ మీనన్ కూడా దర్శకుడిగా మారి ప్రియురాలు పిలిచే, మెరుపు కలలు వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన చైతన్య సినిమాకు కెమెరామెన్ గా పనిచేశారు.

కెమెరా వెనుకనుంచి దర్శకుడిగా అవతారం ఎత్తిన మరో మణిరత్నం క్యాంప్ ఛాయాగ్రహకుడు-పి.సి.శ్రీరామ్! తెలుగు సినిమా చరిత్రలోనే దృశ్యానికి ఒక కావ్య గౌరవాన్ని -దృశ్య కావ్యం అన్న మాటకు ఖచ్చితమైన ఉదాహరణగా నిలిచిన గీతాంజలి సినిమాకి కెమెరామెన్ ఈయనే. ఆయన మౌన రాగం, నాయకుడు, ఘర్షణ, చీనీకమ్ వంటి ఎన్నో అధ్బుత చిత్రాలకు కెమెరామెన్ గా పని ఛేశారు. ఘర్షణ సినిమా లోని కెమెరా ఎఫెక్టులతో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రాజా రాజాధిరాజా పాటలోనూ, ఒక బృందావనం పాటలోనూ ఆయన చూపించిన కెమెరా పనితనం ఆ అతర్వాత తెలుగు సినిమా పాటల చిత్రీకరణలో ఓ ట్రెండ్ అయింది. అలాంటి ప్రతిభామూర్తి, కమల్ హాసన్ -అర్జున్ లతో ద్రోహి సినిమాకి, విక్రం హీరోగా మీరా సినిమాకి దర్శకత్వం వహించారు.

కొత్త తేజం: కొత్త తరంలో కూడా కెమెరామెన్-టర్న్డ్-డైరెక్టర్స్ తమ సత్తాను వెండి తెరపై సీన్లు సీన్లుగా చూపించారు. వారిలో రాం గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన వారే ఎక్కువ అని చెప్పాలి. వీరిలో ప్రధమంగా ప్రస్తావించుకోవాల్సిన వారిలో తేజ ఒకరు. ఎన్నెన్నో తెలుగు, హిందీ సినిమాలకు కెమెరా బాధ్యతల్ని నిర్వహించి ఆ సినిమాలకు కొత్త గ్లామర్, దృశ్రీకరణలో కొత్త సంవిధానాన్ని సృష్టించిన తేజ, దర్శకుడిగా మారి తొలిగా చిత్రం సినిమాను తీశారు. ఆ తర్వాత నువ్వు-నేను, జయం సినిమాలతో వరుస విజయాలను సాధించి తెలుగులో టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఎదిగాడు. మరో సెన్సిబుల్ కెమెరామెన్-టర్న్డ్-డైరెక్టర్ కూడా మన తెలుగులో ఉన్నారు. ఆయనే రసూల్ ఎల్లోర్. శ్రీరామ్-ఆర్తీ ఛాబ్రియా జంటగా వచ్చిన ఒకరికి ఒకరు సినిమాతో దర్శకుడిగా అవతారం ఎత్తిన రసూల్ ఆ తర్వాత సంగమం సినిమాకి దర్శకత్వం వహించారు.

అలా సినిమాని తెరకెక్కించడంలో దర్శకుడి తర్వాత కథపై అంతటి విస్తృతి, అవగాహన ఉన్న సాంకేతిక నిపుణుడు కెమెరామెన్! ఇక అలాంటి కెమెరామెనే దర్శకుడిగా మారితే ప్రేక్షకులలో వారి సినిమాలపై భారీ అంచనాలు పెరగడం, ఆ సినిమాలు చర్చల్లోకి రావడం సహజమే. పి.జి.వింద తాజా సిన్౯మా లోటస్ పాండ్ కూడా అలాంటి అంచనాలనే పెంచుతోంది.

కొసమెరపు: రాం గోపాల్ వర్మ తొలి చిత్రం -శివ! వి.ఎన్.ఆదిత్య తొలి చిత్రం -మనసంతా నువ్వే! ఇలా తొలి దర్శకుల చిత్రాలెన్నింటిలో కెమెరామెన్ గా పనిచేసి ఆ సినిమాల సూపర్ హిట్ లతో సమాన క్రెడిట్ ను సాధించిన కెమెరా మాంత్రికుడు – ఎస్. గోపాల్ రెడ్డి. ఆయన ఎంతో ముచ్చటపడి దర్శకుడిగా మారి తీసిన తొలి సినిమా – నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్! ఈ సినిమా ఎన్నెన్నో ప్రశంసలను పొందింది కానీ దర్శకుడిగా ఆయనకు ఆశించిన సక్సెస్ ను ఇవ్వలేదు.

–మామిడి హరికృష్ణ

7 Comments
  1. అబ్రకదబ్ర July 31, 2009 /
  2. tsrao July 31, 2009 /
  3. Ashok July 31, 2009 /
    • harikrishna mamidi August 1, 2009 /
    • గీతాచార్య August 7, 2009 /
  4. sheela August 4, 2009 /