Menu

అంతర్జలి యాత్ర

200px-Antarjali_yatraస్త్రీలను సతీ అనసూయలుగానూ, సతీ సావిత్రులుగానూ, మహా పతివ్రతలుగానూ చిత్రిస్తూ మన భారతీయ సినిమాల్లో అనేక చలన చిత్రాలు వచ్చాయి. కాని సతీ సహగమనాన్ని కథాంశంగా తీసుకుని దాన్ని సమర్ధిస్తూనో, లేదా వ్యతిరేకిస్తూనో వచ్చిన చిత్రాలు స్వల్పం. సతీ సహగమనాన్ని మూఢాచారంగా ఖండిస్తూ సాహిత్య రంగంలో అనేక రచనలు వచ్చాయి. ఓ పెద్ద సామాజికోద్యమమే వచ్చింది. అయితే సతీ సహగమనాన్ని కమల్ కుమార్ మజుందార్ రాసిన నవల ఆధారంగా గౌతం ఘోష్ నిర్మించిన “అంతర్జలీ యాత్ర” విషయ పరంగానూ, చిత్రనిర్మాణ పరంగానూ దర్శకుడి ప్రతిభకు ఆనవాలుగా నిలిచింది. గౌతం ఘోష్ మన తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమయిన పేరు.. ‘మాభూమి’ చిత్రం ద్వారా మన తెలుగు చిత్రసీమకి నవ్య చిత్ర దృక్పధాన్ని, ఒరవడిని చవి చూపించిన ప్రతిభావంతుడాయన. తెలంగాణాలో పెల్లుబికిన నిజాం వ్యతిరేక పోరాటాన్ని నడిపిన అశేష జనవాహిని చరిత్రను ‘ మాభూమి ‘ నిజాయితీగా చిత్రించింది. ‘మాభూమి’ తర్వాత గౌతం ఘోష్ ‘ థకల్, పార్’ లాంటి చిత్రాల్ని నిర్మించాడు. 1987 లో ఆయన ‘అంతర్జలీ యాత్ర’ కు దర్శకత్వం వహించాడు. 1960లో శుద్ధ బెంగాలీ భాషలో విరచితమైన నవలను మూలకథగా తీసుకొని స్వల్పమైన మార్పులతో చిత్ర నిర్మాణం చేపట్టాడు గౌతం. నవలలోని మౌళికాంశం చెడకుండా అతి సున్నితత్వంతో కళాత్మకతతో ఈ చిత్రాన్ని నిర్మించాడు.

నిజానికి ‘సతీ సహగమనం’ స్త్రీలకు వ్యతిరేకమైన విషయం. ఆ విషయాన్ని కథాంశంగా ఎన్నుకొని దాన్ని వ్యతిరేకిస్తూ స్త్రీల పక్షాన నిలబడి చిత్రాన్ని పాజిటివ్ నోట్‌తో ముగిస్తాడు. సరిగ్గా ‘అంతర్జలీ యాత్ర’ చిత్రం నిర్మాణంలో ఉండగానే రూప్ కన్వర్ సతీ సహగమనం సంఘటన జరిగింది. దేశవ్యాప్తంగా దానికి వ్యతికేఅకంగా ఉద్యమ స్థాయిలో నిరసనలు పెల్లుబికాయి. ఆ సందర్భంలోనే అంతర్జలీ యాత్ర చిత్రం నిర్మితమవుతూ ఉండడంతో గొప్ప ఉత్కంటత రేకెత్తింది. ప్రగతిశీలి అయిన గౌతం ఎలాంటి గందరగోళానికి గురవకుండా ముందుకు సాగిపోయాడు.

‘అంతర్జలీ యాత్ర’ చిత్ర కథ 1830 ప్రాంతం నాటిది. గంగానదీ తీరాన డెల్టా ప్రాంతంలో చిత్రకథ యావత్తూ జరుగుతుంది. గంగానదికి దాని పక్కనే ఉన్న చిన్న గ్రామానికి నడుమ కథాకథనం కొనసాగుతుంది. ఆ ఒడ్డుపక్కనే స్మశానముంటుంది. దాని కాపరి చండాల్ భైజూ అక్కడనే నివసిస్తూ ఉంటాడు. ఓ పక్క ప్రవహించే నది జీవితానికి సంకేతంగా ఉంటే మరోవైపు స్మశానం చావుకు ప్రతీకగా ఉంటుంది. ఇందులో ప్రధాన పాత్రధారి చావుకు సిద్ధంగా ఉన్న ముసలి బ్రాహ్మడు సీతారాం. చావుబతుకుల మధ్య కొడిగట్టనున్న దీపంలా రెపరెపలాడుతున్న సీతారాంని గంగానది ఒడ్డుకు తెస్తారు. స్థానికంగా ఉన్న ఓ జ్యోతిష్కుడు సీతారాం మరో మూడు రోజుల్లో చనిపోతాడని అయితే అతనితో సహగమనం చేసే భార్య ఉంటే పున్నామ నరకాలనుండి తప్పించుకుని ఉన్నత లోకాలకు వెళతాడని చెబుతాడు. కాని చట్టరిత్యా సహగమనం అప్పటికే నేరం. అయినా ఆ ఊరి పెద్దలంతా కలిసి చావుకు సిద్ధంగా ఉన్న సీతారాంకి పెళ్ళి చేయాలని నిర్ణయిస్తారు. ఆ ఊర్లోనే అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న కృష్ణప్రసాద్(బసంత్ చౌదరీ) తన కూతురు యశోబతిని సీతారాంకివ్వడానికి అంగీకరిస్తాడు. ఆమెకు కర్మ సిద్ధాంతాన్ని తన పేదరికాన్ని చూపి సతికి అంగీకరింప చేస్తాడు. నది ఒడ్డునే సీతారాం, యశోబతిల పెళ్ళి ఏర్పాట్లు జరిగిపోతాయి. ఊరంతా ఈ పెళ్ళిని అంగీకరించినా కాటికాపరి బైజూ మాత్రం వ్యతిరేకిస్తాడు. కాని నిమ్న జాతికి చెందిన అతని ఎవరూ లక్ష్యపెట్టరు. పెళ్ళి జరిపించి తర్వాత ఆ ఇద్దరిని అక్కడే వదిలేసి అంతా వెళ్ళిపోతారు. పెళ్ళి అవగానే ఉరకలేసిన సీతారాం భార్యతో శోభనానికి సిద్ధపడతాడు. కాని ముసలి శరీరం సహకరించక విఫలం చెందుతాడు. తన వైఫల్యాన్ని కప్పి పుచ్చి ఆ స్థితిలో కూడా సీతారాం యశోబతిపై విరుచుకు పడతాడు. ఆ అమ్మాయి అపప్టికే కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించి సతివల్ల ఒనగూడనున్న మంచిని తలపోస్తు అన్నీ సహిస్తుంది. అయితే ఇదంతా గమనిస్తున్న బైజూ ముసలివాన్ని వదిలేసి పొమ్మని యశోబతికి బోధిస్తాడు. పలు విధాలుగా కోపంతోనూ, దుఃఖంతోనూ యశోబతికి చెప్పి చూస్తాడు. సతి గురించి అధికారులకు చెప్పేందుకు కూడా విఫలయత్నం చేస్తాడు. ఎంతగా చెప్పినా యశోబతి అంగీకరించకపోవడంతో సీతారాంను గంగలోకి తోసేందుకు కూడా బైజూ ప్రయత్నిస్తాడు. దాంతో యశోబతి కోపంగా బైజూను కర్రతో బాదుతుంది. నది ఒడ్డున బురదలో గాయపడ్డ బైజూ విలవిలలాడతాడు. కొంతసేపటికి యశోబతి బైజూ చెంతకు చేరి గాయల్ని తడిమి బాధగా ఉందా అని అడుగుతుంది. ఆమె స్పర్శ బైజూలోనూ, బైజూ శరీరం ఆమెలో సంచలనం కలిగిస్తుంది. ఇద్దరూ ఒకటవుతారు. ఇంతలో ఉప్పొంగిన నది సీతారాంని ముంచెత్తుతుంది. అతన్ని రక్షించే యత్నంలో యశోబతి కూడా ప్రవాహంలో పడిపోతుంది. రక్షించండి.. రక్షించండి అంటూ యశోబతి నీటిలో కొట్టుకుపోతుంది. బైజూ ప్రేక్షకుడిలా నిలుచుండిపోతాడు. మొదట్నించీ చివరి దాకా నది ఒడ్డునే ఉన్న కర్ర పడవపై ముద్రించి ఉన్న రెండు కళ్లు ఈ మొత్తం జీవన్మరణ సంఘటనల్ని వీక్షిస్తూనే ఉంటాయి.

నవలలోంచి మొత్తం వివరాల్ని చిత్రంలో అందించిన దర్శకుడు చిత్రీకరణలో ఎనలేని ప్రతిభను కనబరుస్తాడు. అతని సృజనాత్మక ఆలొచనలకు, ఆయనకున్న సాంకేతిక పరిజ్ఞానం తోడై గొప్ప చిత్రంగా రూపొందింది. మొత్తంగా నది ఒడ్డునే సాగె ఈ చిత్రంలో రాత్రిని, పగటిని రోజులోని భిన్న స్మాయాల్ని చిత్రించడంలో దర్శకుడి ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయయ ఉపయోగించిన లైటింగ్ ఆయా మూడ్స్ ని సాధించడంలో విజయవంతమయింది. చిత్రంలో ధ్వని గొప్ప భావుకతను అందిస్తుంది. కేవలం సంభాషణలున్నప్పుడు మాత్రమే నేపధ్య సంగీతం వినిపించి మిగతా సమయాల్లో గంభీర నిశ్శబ్దం చిత్రనికే విలక్షణతను ఆపాదించింది. అపుడపుడూ గంగానది పైనించి వీచే గాలి సృష్టించే మంత్రధ్వని దుఃఖాన్ని, తీవ్రమైన ఎమోషన్ ని ధ్వనింప చేస్తుంది. నిజానికి చిత్రంలోని నిశ్శబ్దమే గొప్ప సినిమాటిక్ సంగీతం. చిత్రం చివరన నది ఉప్పొంగి ఉధ్వేగభరితమయిన సన్నివేశంలో సంగీత ధ్వని కోపాన్ని, ఆవేశాన్ని ప్రతిధ్వనింప చేస్తాయి. నటీనటుల విషయంలో శతృఘ్న సిన్హా తన జీవిత కాలంలో గొప్ప పాత్ర పోషించారు. ఇక యశోబతి పాత్రలో నూతన నటి షంపా ఘోష్, ముసలి సీతారాం పాత్రలో ప్రమోద్ గంగూలి (80) సజీవంగా నటించారు. అలనాటి స్త్రీ సమస్యని అత్యంత ప్రతిభతో చలన చిత్రంగా మలచి గౌతం ఘోష్ గొప్ప దర్శకుడిగా నిలిచాడు. ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా వచ్చింది. ‘అంతర్జలీ యాత్ర’ బెంగాలీ చిత్రం కాగా, ‘మహాయాత్ర’ హిందీ చిత్రం.

అంతర్జలీ యాత్ర ( బెంగాలీ )

సినిమాటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం – గౌతం ఘోష్,

నిర్మాణం – ఎన్.ఎఫ్.డి.సి,

నటీనటులు – శతృఘ్న సిన్హా , షంపా ఘోష్,

6 Comments
  1. మేడేపల్లి శేషు July 3, 2009 /
  2. kottapALI July 3, 2009 /
  3. సాయి బ్రహ్మానందం July 3, 2009 /
  4. harikrishna July 5, 2009 /
  5. సుజాత July 5, 2009 /