Menu

36 చౌరంఘీలేన్

36-chowringhee-laneమహిళను ముఖ్యాభినేతగా చేసి నిర్మించిన అనేక భారతీయ చలన చిత్రాల్లోకి అపర్ణా సేన్ దర్శకత్వంలో నిర్మితమైన ’36 చౌరంఘీలేన్ ‘ విశిష్టమయింది . దేశ విదేశీ సినీ విమర్శకుల చేత గొప్ప ప్రశంసలు అందుకుంది.

ఈ చిత్రం 1981 లో ఇంగ్లీషులొ నిర్మితమయింది.ఇందులో వయసు మళ్లుతున్న ఓ ఆంగ్లో ఇండియన్ మహిళ యొక్క చేతన, అంతఃచేతనల్లోని ఆశలు, అవగాహనలు, వాస్తవ జీవితంలో ఆమె అనుభవించే ఒంటరిగనమూ, తోడు కోసం, కంపెనీ కోసం వ్యధ చేందే ఆమె మానసిక స్థితి ప్రతిభవంతంగా అవిష్కృతమవుతాయి.

అప్పటిదాకా నటిగా లబ్ద ప్రతిష్టురాలయిన అపర్ణా సేన్ “36 చౌరంఘీలేన్” తో తన చలనచిత్ర యాత్రను మలుపు తిప్పారు. ఆమె ఈ చిత్ర కథను కథనాన్ని తాజాగానూ,వినూత్నంగానూ చిత్రీకరించారు. సుప్రసిద్ధ సినీ విమర్శకుడు చిదానంద దాస్ గుప్త కుమార్తె అయిన అపర్ణాసేన్ తనకు వారసత్వంగా అందిన పరిజ్ఞానానికి తోడు గొప్ప చిత్రాల అధ్యయనం ద్వారా అందుకున్న అనుభవాన్ని రంగరించి సినిమాలకు దర్శకత్వం నెరపడం ఆరంభించారు. ఆమె “36 చౌరంఘీ లేన్” తో తన తొలి ప్రయత్నంలోనే పాత్రల్ని వాటి మానసిక స్థితిని విశ్లేషిస్తూ చిత్రించారు. ముఖ్యంగా ఆంగ్లో ఇండియన్ అయిన వయొలెట్ స్టాన్‌హోమ్ పాత్రను నడిపించడంలో దర్శకురాలి ప్రతిభ విలక్షణంగా గోచరిస్తుంది.

బ్రిటిష్ రాజ్యకాలం నాటి ఆవశేషాలుగా మిగిలిన ఆంగ్లో – ఇండియన్ సంతతి యొక్క మానసిక స్థితిని అర్ధం చేసుకోవడంలో అపర్ణాసేన్ విజయం సాధించారు. ఆ సంతతి అటు ఆంగ్లేయ, ఇటు భారతీయ సంస్కృతుల్లో దేన్నీ సంపూర్ణంగా అందిపుచ్చుకోలేని సందిగ్ధ అవస్థలో పడి పోయింది. బ్రిటీష్ వాళ్ల ఆహార్యమూ, భాషా విధానాలనూ పాటిస్తూనే ఇటు భారతీయ వాతావరణంలో జీవించాల్సిన విచిత్రమయిన స్థితిలో వారి జీవనం కొనసాగుతున్నది. తాము బ్రిటీష్ వాళ్లమే అన్నంతగా వ్యవహరించినప్పటికీ అక్కడి వాళ్ల చేత ‘తమవాళ్లు ‘ అనిపించుకోలేని దుస్థితి వారిది. ఇటు సంపూర్ణంగా భారతీయులతో కలిసిపోలేని స్థితి . ఇలాంటి సంక్లిష్టత మధ్య నివసించే ఆంగ్లో ఇండియన్లలో మహిళల పరిస్థితి మరింత సంక్షోబంతో కూడుకున్నది. అలాంటి ఒక మహిళను ప్రధాన పాత్రగా చేసుకొని నిర్మితమయిన చిత్రమే ” 36 చౌరంఘీలేన్ “. దర్శకురాలు అపర్ణాసేన్ మొట్టమొదట నటిగా సత్యజీత్ రే నిర్మించిన ‘తీన్ కన్యా’ చిత్రంలో ఒక భాగమయిన ‘సమాప్తి’లో ప్రధాన భూమికను పోషించారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించినప్పటికీ గానుగెద్దులాగా మూసపాత్రల్లో నటించాల్సి రావడం ఆమెకు నచ్చలేదు. సృజనాత్మక ప్రయత్నం చేయాలనే అభిలాషతొ దర్శకత్వం వైపు దృష్టి మరల్చారు. నవ్యతతో కూడిన చిత్రం కోసం ఆమె చేసిన ప్రయత్న ఫలితమే ఈ ’36 చౌరంఘీ లేన్’. మొదట స్క్రిప్ట్ పూర్తి చేసి దాని చిత్తుప్రతిని సత్యజిత్ రెకు చూపించారామె. ఆయనకది నచ్చింది. కాని పెట్టుబడి ఎవరు పెట్టాలనే ప్రశ్న ముందుకొచ్చింది. కలకత్తాలో ఎవరూ ముందుకు రాకపోవడంతొ ఆమె బాంబే వైపు దృష్టి మరల్చారు. సరిగ్గా అదే సమయంలో కళాత్మకమైన చిత్రాల్ని నిర్మించాలనే ఆలోచన శశికపూర్ ప్రయత్నిస్తున్నారు. ఆయన అపర్ణాసేన్ ప్రపోజల్‌ని అంగీకరించారు. శశికపూర్ భార్య జెన్నిఫర్ కపూర్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించడానికి ముందుకు వచ్చారు. చిత్ర నిర్మాణం ఇంగ్లీషులో ప్రారంభమయింది.

ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూ తిరిగే ఈ సినిమా కలకత్తా నగరాన్ని కేంద్రంగా తీసుకుని నిర్మితమైంది. ఇందులో అత్యంత ప్రధానమయిందీ, సంక్లిష్టమయిందీ అయిన పాత్ర వయొలెట్ స్టాన్‌హోమ్. వయసు మళ్లుతున్న ఆ ఆంగ్లో ఇండియన్ మహిళ కలకత్తాలోని ఒక స్కూలులో షేక్స్ పియర్ రచనల్ని బోధించే టీచర్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె తన పెంపుడు పిల్లితో కలిసి అపార్ట్ మెంట్‌లో ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది. ఆమెకు గత స్మృతులు, అపుడపుడూ విదేశాల్లోని మిత్రులు, బంధువుల వద్దనుంచి వచ్చే ఉత్తరాలే ప్రధాన వ్యాపకం. ఆమె అన్న ఎడ్డి కలకత్తాలోని ఓ వృద్ధ శరణాలయంలో నివసిస్తూ ఉంటాడు. ఓ క్రిస్‌మస్ రోజున వయొలెట్ చర్చికి వెళ్లి తిరిగి వస్తూ ఉంటే ఆమెకు తన పూర్వ విద్యార్ధిని నందిత కనిపిస్తుంది. ఆమెను ఆమె బాయ్ ఫ్రెండ్ సమరేశ్‌ను తన ఇంటికి కాఫీకి ఆహ్వానిస్తుంది వయొలెట్. మొదట కొంత మొహమాట పడ్డప్పటికీ ఆ ఇద్దరూ వయొలెట్ ఇంటికి వస్తారు. ఆమె చూపిన ఆదరణ, ఆప్యాయత వారికి ఎంతో సంతోషం కలిగిస్తాయి. సమరేశ్ మదిలో ఓ ఆలోచన తలుక్కుమంటుంది. అప్పటిదాకా నందితను పార్కుల్లోనూ, హోటల్లలోనూ కలిసిన తాను ఇక ముందు వయొలెట్ అపార్ట్ మెంట్‌ను ఉపయోగించుకుంటే బావుంటుందని తలపోస్తాడు. తన నవలారచన కోసం వయొలెట్ అపార్ట్ మెంట్‌ని వినియోగించుకోవడానికి ఆమెను ఒప్పిస్తాడు. ఆ ఇద్దరి కంపెనీ వయొలెట్‌కి కూడా ఆనందాన్నిస్తుంది. అప్పటిదాకా ఒంటరిగా ఉన్న వయొలెట్ తన వారితో ఉన్న సంతృప్తిని పొందుతుంది.

ఇంతలో వయొలెట్ పనిచేసే స్కూలులో పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అక్కడ వయొలెట్ స్థానంలో ఓ భారతీయ టీచర్‌ను నియమిస్తారు. చిన్న పిల్లలకి ఇంగ్లీషు గ్రామర్ చెప్పమని వయొలెట్‌కి సూచిస్తారు. ఆమె తీవ్ర మనస్థాపానికి గురవుతుంది.

మరో వైపు ఓల్డ్ ఏజ్ హోంలో ఊన్న ఎడ్డీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తుంది. తోటి ఉపాధ్యాయుల వల్ల నిరాదరణకు గురైన వయొలెట్‌ని ఎడ్డీ పరిస్థితి మరింత సంక్షోబానికి గురి చేస్తుంది. ఆ స్థితిలో తన వాళ్లనుకునే వారి అవసరాన్ని ఆమె అమితంగా ఫీలవుతుంది. ఒక రోజు పగలు ఇల్లు చేరిన వయొలెట్‌కి నందిత, సమరేశ్‌లు తన అపార్ట్ మెంట్ ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలిసిపోతుంది. ఇంతలో ఎడ్డీ చనిపోతాడు. సమరేశ్‌కు ఉద్యోగం రావడంతో పెద్దవాళ్లని ఒప్పించి నందిత, సమరేశ్ పెళ్ళాడతారు. పెద్దలు వారికి ఓ మంచి అపార్ట్ మెంట్‌ని పెళ్లి కానుకగా కొనిస్తారు. వారి జీవితం వారి ఆశల మేరకు సాగిపోతుంది. ఇక వారికి వయొలెట్‌తొ గానీ, ఆమె అపార్ట్ మెంట్‌తొ గాని అవసరముండదు. కాని వయొలెట్‌కి ఆ ఇద్దరి కంపెనీ ఎంతో అవసరమవుతుంది. వారు ఎప్పటిలాగే తన వద్దకు రావాలని ఆమె ఎంతో కోరుకుంటుంది. కాని వారు రారు. తమదైన జీవితంలో పడిపోతారు. ఎడ్డీ చనిపోయి స్కూలులో ప్రతికూల పరిస్థితులు ఎదురైన స్థితిలో వయొలెట్ నందిత, సమరేశ్‌లు కూడా దూరం కావడంతో తీవ్రమైన క్షోభకు గురవుతుంది. ఒంటరితనంలో కూరుకుపోతుంది. మళ్లీ క్రిస్‌మస్ వస్తుంది. వయొలెట్ నందిత, సమరేశ్ లను టీకి ఆహ్వానిస్తుంది. కాని వారు తప్పించుకునేందుకు తాము ఊరెళ్తున్నామని చెబుతారు. వయొలెట్ తీవ్ర నిరాశకు గురవుతుంది. వారికొసం కేక్ తయారు చేసి వారి అపార్ట్ మెంట్‌లో ఇచ్చేస్తుంది. కేక్ చూసిన నందిత, సమరేశ్‌లు ఆశ్చర్యానందాలకు గురవుతారు. వయొలెట్ మాత్రం తీవ్ర నిరాదరణకు గురైనట్టుగా ఫీలయి వేదనతో ఇంటి ముఖం పడుతుంది. నిర్మానుష్యంగా ఉన్న కలకత్తా రోడ్డుపైన తన కిష్టమైన షేక్స్ పియర్ రచనల్ని ఆలపిస్తూ ఆమె తన అపార్ట్ మెంట్ వైపు కదులుతుంది. ప్రేమను పంచే ఓ స్త్రీ సహృదయతనీ, కలివిడిగా ఉంటూ కంపెనీని ఆశించే ఆమెను ఆమెలోని మంచితనాన్ని ఆశించినదానికి భిన్నంగా అనుభవంలోకి వచ్చిన ఒంటరితనపు స్థితిని “36 చౌరంఘీలేన్” గొప్పగా ఆవిష్కరించింది.

36 చౌరంఘీ లేన్ (ఇంగ్లీషు)

కెమెరా – అశోక్ మెహతా

సంగీతం – వనరాజ్ భాటియా

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – అపర్ణాసేన్

నటీనటులు – జెన్నిఫర్ కెండాల్, ధ్రీతిమాన్ చటర్జీ, దేబశ్రీ రాయ్, జెఫర్ కెండల్ మొ…

29 Comments
 1. su July 26, 2009 /
  • abhimaani July 26, 2009 /
   • Manjula July 26, 2009 /
  • Manjula July 26, 2009 /
   • su July 26, 2009 /
   • su July 27, 2009 /
   • su July 27, 2009 /
 2. కొత్తపాళీ July 26, 2009 /
 3. su July 26, 2009 /
  • sasank July 27, 2009 /
  • Manjula July 30, 2009 /
   • su July 30, 2009 /
   • Manjula July 31, 2009 /
   • su July 31, 2009 /
 4. su July 27, 2009 /
  • mohanrazz July 27, 2009 /
   • su July 27, 2009 /
   • su July 27, 2009 /
 5. su July 28, 2009 /
 6. su July 28, 2009 /