Menu

Three colours – White

white-three-colorsఎయిర్ పోర్ట్ కెరేజల్ మీదుగా ఒకదాని వెంట ఒకటిగా ముందుకు కదులుతున్న లగేజ్. అందులో ఓ మనిషి పట్టేసేటంత సైజులో ఉన్న పెద్ద పెట్టె మిగతా వాటితో పాటు ముందుకు కదులుతూ ఉండగా సన్నివేశం ఫేడవుట్ అవుతుంది.

సూటు, బూటు వేసుకున్న ఓ మనిషి కాళ్ళు గబా గబా కదులుతూ పోతూ…..అంతలోనే కొంచెం కొంచెంగా వేగాన్ని తగ్గిస్తూ ఓ చోట ఆగుతాయి. అంత వరకు క్లోజ్ అప్ లో ఉన్న కెమెరా ఇప్పుడు మీడియం వ్యూలోకి వస్తుంది.

ఆ వ్యక్తి పేరు కెరోల్. అది పారిస్ లోని ఓ కోర్టు ఆవరణ. జేబులోనుండి ఓ పేపరు తీసి పక్కనే ఉన్న పోలీసుని అడుగుతాడు. “విడాకుల కేసులో నాకు సమన్లు అందాయి, ఈ రోజే విచారణ, ఎటువైపు వెళ్ళాలి?”

పోలీసతను దారి చూపిస్తాడు. కెరోల్ ఆదరా బాదరాగా అటువైపుగా వెళ్తూ….తన అడుగుల చప్పుడుకి భయపడి అటుఇటుగా ఎగిరిపోతూన్న పావురాల వైపు ఆప్యాయంగా చూస్తాడు. అతని ఆప్యాయతకి కానుకగా ఓ పావురం రెట్ట వేస్తుంది. సరిగ్గా అది అతని కోటు మీద పడుతుంది. తనో దురదృష్టవంతున్ని అని మనసులోనే అనుకుంటూ, ఆ రెట్టను తుడుచుకుంటూ విచారణ గదిలో అడుగుపెడతాడు. అప్పటికే అతని భార్య డోమినిక్ అక్కడ సిద్ధంగా ఉంటుంది.

విచారణ మొదలవుతుంది.

న్యాయాధికారి : కెరోల్ ని ఉద్ధేశించి ” మీ భార్య మీనుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నది, దీనికి మీ సమాధానం”

కెరోల్ : నా భార్యంటే నాకు చాలా ఇష్టం, నేను ఆమెకు విడాకులు ఇవ్వదలుచుకోవటంలేదు. తనను నేను మనసారా ప్రేమిస్తున్నాను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. దయచేసి విడాకులు మంజూరు చేయకండి. ఆమె ఏం కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధం.

న్యాయాధికారి : డోమినిక్ ని ఉద్ధేశించి ” మీరెందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు?”

డోమినిక్ : నా భర్తతో కలిసి ఉండటం నాకు ఇష్టంలేదు

న్యాయాధికారి : కారణం?!

డోమినిక్ : (కొంచెం ఇబ్బందిగా) ఆయన నన్ను శృంగారంలో తృప్తిపరచలేకపోతున్నారు.

న్యాయాధికారి : అంటే మీ భర్తని మీరు ప్రేమించట్లేదా?

డోమినిక్ : ఒకప్పుడు ప్రేమించేదాన్ని.

న్యాయాధికారి : ఇప్పుడు

డోమినిక్ : (కొంత సేపు నిశ్శబ్ధం……..) లేదు.

కెరోల్ : గట్టిగా అరుస్తూ….లేదు, అబద్ధం! డోమినిక్! నువ్వు అలా……లేదు…..(అంటూ ఏడుస్తాడు.)

కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. బయటకు రాగానే, డోమినిక్ తన కారు డిక్కీలోనుంచి కెరోల్ సూట్ కేస్ ని (ఎయిర్ పోర్టు కెరేజల్ మీద చూపించినది) తీసి బయట పారేస్తూ…..అటుగా డోమినిక్! డోమినిక్!! అంటూ అరుచుకుంటూ వస్తున్న కెరోల్ ని చూసి “ఇది నీది తీసుకుపో” అంటూ చీత్కరించుకుని, కెరోల్ ఆగమంటున్నా ఆగకుండా వెళ్ళిపోతుంది. కెరోల్ కి ఏం చేయాలో తెలియక, సూట్ కేస్ తీసుకుని డోమినిక్! డోమినిక్!! అంటూ కొంత దూరం కారు వెనకాలే పరిగెడతాడు. అయినా డోమినిక్ ఆగకుండా, నిస్సహాయుడైన కెరోల్ ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది.

ఇద్దరూ కలిసి నడుపుతున్న బ్యూటిపార్లర్ ని, కెరోల్ కష్టపడి కొనుక్కున్న ఇంటిని డోమినిక్ తన పేరు మీద ఎప్పుడో రాయించేసుకుంది. కొంత డబ్బు తీద్దామని ATM కి వెళ్ళి Debit card పెడితే అది కూడా Cancelled అని వస్తుంది. కెరోల్ కి ఏం జరిగిందో అర్థమయ్యేలోపే అక్కడున్న security ఆ కార్డు తీసి, దాన్ని రెండు ముక్కలు చేసేస్తాడు. “అది నా కార్డు” అని అడిగిన కెరోల్ కి. “ఒకప్పుడు, ఇప్పుడు కాదు” అని సమాధానం చెప్తాడు security. “మరి నా డబ్బు” అని ఇంకో ప్రశ్న అడుగుతాడు కెరోల్. ఈసారి security ఏమి మాట్లాడడు. కాని ముక్కలైపోయిన కార్డు చెప్పకనే చెబుతుంది. “నాలాగే నీ డబ్బు కూడా నీది కాదు”.

అసహనంగా పర్సు తీసి చూస్తాడు కేవలం నాలుగు ప్రాంకులే ఉన్నాయి. ఏం చేయాలో ఆలోచిస్తూండగానే చీకటి పడుతుంది, చీకటితో పాటు చల్లదనం పెరుగుతుంది, రోడ్డు పక్కన ఓ మూలగా కూర్చున్న కెరోల్ని ఒంటిమీదున్న కోటు కూడా చలి నుంచి కాపాడలేకపోతున్నది. కొంచెం సర్దుకుంటూ అప్రయత్నంగా కోటు జేబులోకి వెళ్ళిన చేతికి ఇంటి తాళాలు దొరుకుతాయి. కెరోల్ కళ్ళలో ఆశ చిగురిస్తుంది, అంతలోనే మరో ఆలోచన. ఇప్పుడు ఆ ఇల్లు తనది కాదు, డోమినిక్ తనని లోపలకి రానిస్తుందా? అయినా ఈ చలిలో ఇబ్బందిపడే కంటే ఓ ఛాన్స్ తీసుకోవడం మంచిదని నిర్ణయంచుకుని అక్కడికి దగ్గరలోనే ఉన్న ఆ ఇంటికి బయలుదేరతాడు. డోమినిక్ ఇంటిలో లేకపోవడంతో ఆ రాత్రికి అక్కడే తల దాచుకుంటాడు. ఆ తరువాత కొంత సేపటికి డోమినిక్ వచ్చి కెరోల్ ని చూసి చూడగానే కోపంతో ఊగిపోతూ తక్షణమే బయటికి పొమ్మంటుంది, తన దగ్గరున్న లైటర్ తీసి కిటికీ curtain లను తగలబెడుతుంది. ఏం జరుగుతున్నదో అర్థంకాక వెర్రి చూపులు చూస్తున్న కెరోల్ తో ” ఇప్పుడు నువ్వు నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావు, నన్ను చంపడానికి ప్రయత్నించావు, ఈ curtains ని కూడా తగలబెట్టావు, ఇక పారీస్ పొలీసులు నిన్ను వదలరు” అనంటుంది. విషయం అర్థమయిన కెరోల్ కి నిద్రమత్తు పోయి, వెంటనే తన సూట్ కేస్ తీసుకుని గబా గబా అక్కడనుంచి బయటపడతాడు.

ఇంత వరకు డబ్బులు లేక ఇబ్బంది ఉండేది, ఇప్పుడు పొలీసులనుంచి కూడా తప్పించుకోవాలి. ఎలా? పోలండ్ వెళ్ళిపోవాలి అవును అదొక్కటే ఈ సమస్యకు మార్గం. కాని ఎలా, అరె నా పాస్ పోర్ట్ కూడా డోమినిక్ దగ్గరే ఉందే. ఒకవేళ పాస్ పోర్ట్ ఉన్నా టికెట్ కి డబ్బులు లేవే…! ఎలా?!

ఆకలిగా ఉంది ఎంతోకొంత డబ్బులు సంపాదించాలి అని తన దగ్గరున్న కాగితాన్ని రెండు మడతలు పెట్టి దాని ద్వారా మృదువైన పోలిష్ సంగీతాన్ని వాయిస్తుంటాడు. నచ్చినవాళ్ళు డబ్బులిస్తుంటారు. ఓ వ్యక్తి మాత్రం కెరోల్ దగ్గరకొచ్చి ఆ సంగీతాన్ని తదేకంగా వింటుంటాడు. కెరోల్ అడుగుతాడు, “ఏం కావాలి?” ఆ వ్యక్తి చెబుతాడు ” నా పేరు మికోలజ్, నేను కూడా పోలెండ్ వాసినే”. వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది కెరోల్ కి. ఇద్దరు మాటల్లో పడతారు.

కెరోల్ : నన్ను మీతో పాటు పోలెండ్ తీసుకెల్లగలరా….?

మికోలజ్ : తప్పకుండా కాని ఒక నియమం

కెరోల్ : ఏంటది?

మికోలజ్ : నువ్వొక వ్యక్తిని చంపాలి, కంగారు పడకు ఇక్కడ కాదు, పోలెండ్ లో.

కెరోల్ : (భయంగా) హత్యా…..?

మికోలజ్ : కాదు, సహాయం! అవును అతనికి జీవితం మీద విరక్తితో చనిపోవాలని ఉంది. కాని తనకు తానుగా చావటానికి ధైర్యం చాలటం లేదు. నువ్వు సాయం చేయాలి.

కెరోల్ : కాని విరక్తి ఎందుకు? అతనికి భార్యాపిల్లలు లేరా….?

మికోలజ్ : ఉన్నారు.

కెరోల్ : మరి చనిపోవాల్సిన అవసరం ఏంటి?

మికోలజ్ : (మౌనం)

కెరోల్ : అతని సమస్య ఏంటో నాకు తెలీదు. నువ్వు కోరేది ఈ సహాయమే అయితే నేను చేయలేను. మికోలజ్ నన్ను చూడు. నా భార్య నా ఆస్తిపాస్తులు లాక్కొని నన్ను నిర్థాక్షిణ్యంగా రోడ్డున పడేసింది. తనంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. ఇంత జరిగినా తన మీద నాకు ప్రేమ పెరిగిందే కాని తగ్గలేదు.

మికోలజ్ : (కాస్త అపహాస్యం చేస్తూ) నిజంగా….! హ..హ….హా!!

కెరోల్ : ఇప్పుడే నిరూపిస్తా.(అని కెరోల్ ఆ పక్కనే ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి డోమినిక్ కి ఫోన్ చేస్తాడు.)

డోమినిక్ : హలో ఎవరు.

కెరోల్ : డోమినిక్ నేను కెరోల్, I love you డోమినిక్, I miss you a lot!

డోమినిక్ : హ…perfect timing, now listen. హ..హా…మ్…..మ్…..హా….. (అంటూ ఎవరితోనో శృంగారం జరుపుతూ, కెరోల్ కి వినిపించేట్టుగ గట్టిగా అరుస్తుంది)

కెరోల్ అది వినలేక, ఆ బాధను తట్టుకోలేక వెంటనే మికోలజ్ దగ్గరకు వచ్చి “నువ్వు నన్ను పోలెండ్ తీసుకెల్తున్నావు” అనంటాడు. “కాని ఎలా” అని ఎదురు ప్రశ్నిస్తాడు మికోలజ్. కొంచెం ఆలోచించి “ఈ సూట్ కేస్ లో” అని చెప్పి దాంట్లో ఉన్న సర్టిఫికెట్లు, ఇతరత్రా వస్తువులు అన్నీ తీసి బయటపడేసి, శ్వాస ఆడటం కోసం సూట్ కేస్ కి చిన్న కన్నాలు పెడతాడు అక్కడక్కడ. ప్రారంభ సన్నివేశంలో ఎయిర్ పోర్ట్ కెరేజల్ మీదుగా వెల్తున్న సూట్ కేస్ ఇదే.

పోలెండ్ చేరుకున్నాక అక్కడి ఎయిర్ పోర్ట్ పోలీసులు పెద్దగా ఉంది దీంట్లో ఏదో ఒక విలువైన వస్తువు ఉండకపోతుందా అని చెప్పి, ఈ సూట్ కేస్ ని ఎత్తుకుపోతారు. తీరా చూస్తే అందులో కెరోల్ ఉంటాడు. కెరోల్ వాళ్ళనుంచి తప్పించుకుని తన అన్నయ్య దగ్గరకు చేరుకుంటాడు. ఆ తరువాత మికోలజ్ ని కూడా కలుసుకుంటాడు. ఇద్దరూ తమ ఒప్పందం గురించి చర్చించుకుంటారు.

కెరోల్ : సరే నేను ఆ వ్యక్తిని చంపడానికి సిద్ధం, ఇంతకీ ఎవరా వ్యక్తి?

మికోలజ్ : నేనే!

కెరోల్ : వాట్? నీకెమైన పిచ్చెక్కిందా…..?

మికోలజ్ : నువ్వు మాటిచ్చావు

కెరోల్ : సరే ఎక్కడ?

మికోలజ్ : నాతో పద (అని జన సంచారం లేని ఓ ప్రదేశానికి తీసుకెల్తాడు). మికోలజ్ తనతొ పాటు తీసుకొచ్చిన గన్, బుల్లెట్లు కెరోల్ కి ఇచ్చి తనని షూట్ చేయమంటాడు. మికోలజ్ కళ్ళు మూసుకుంటాడు. కెరోల్ గన్ లోడ్ చేయడానికి కొంత సమయం తీసుకుంటాడు. లోడ్ చేసాక మికోలజ్ ని షూట్ చేస్తాడు.

పెద్ద శబ్ధం చేస్తూ తుపాకీ పేలుతుంది. మికోలజ్ గట్టిగా అరుస్తాడు. కొన్ని క్షణాల నిశ్శబ్ధం. ఆశ్చర్యం మికోలజ్ కి ఏం కాలేదు. కెరోల్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తాడు మికోలజ్. ఇందాకటిది బ్లాంక్ షాట్, ఇప్పుడొచ్చేది రియల్. చెప్పు షూట్ చేయమంటావా….? అనడగుతాడు కెరోల్. ఒక్క క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకుని “వద్దు వద్దు కెరోల్, నాకు చావాలని లేదు, నాకు బతకాలని వుంది” అంటాడు మికోలజ్. ఆ రోజు నుంచి ఇద్దరూ మంచి స్నేహితులయిపోతారు.

ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెడతారు. అనూహ్యంగా అన్నీ కలిసొచ్చి పలుకుబడి, డబ్బు, మంచి పేరు సంపాదిస్తారు.

ఇప్పుడు కెరోల్ కి ఓ ఆలోచన వస్తుంది. డోమినిక్ మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. కాని ఎలా తను ఫ్రాన్సులో ఉంది, పోలెండ్ కు రప్పించడం ఎలా….? మికోలజ్ తో చర్చించి ఓ నిర్ణయానికి వస్తాడు. పథకం పారింది డోమినిక్ పోలెండ్ కి వచ్చింది. గుర్తించలేనంతగా అయిన కెరోల్ శవం పక్కనే నించొని విలపిస్తున్నది. అక్కడే ఉన్న కెరోల్ లాయర్లు తన తదనంతరం ఆస్తి మొత్తం డోమినిక్ కే చెందాలని కెరోల్ రాసిన విల్లుని చదివి వినిపిస్తున్నారు డోమినిక్ కి.

ఇదంతా ఎవరికి కనిపించకుండా దూరం నుంచి చూస్తున్న కెరోల్ తనలో తానే నవ్వుకుంటున్నాడు. కెరోల్ ఇక్కడుంటే మరి ఆ శవం ఎవరిది.

కెరోల్, డోమినిక్ ని పోలెండ్ రప్పించడం కోసం తను చనిపోయినట్టు నాటకం ఆడతాడు. తనలాగే ఉన్న ఓ శవాన్ని కొని (illegally) మొహం గుర్తుపట్టలేని విధంగా తయారుచేస్తారు. అంతకు ముందే డోమినిక్ కి కెరోల్ చనిపోయినట్టుగా ఓ సందేశం పంపించారు. కాని డోమినిక్ పోలెండ్ లో అడుగుపెట్టిన తరువాతే కెరోల్ చనిపోయినట్టుగా సృష్టిస్తారు. ఇది తెలియని డోమినిక్ డబ్బుమీదున్న ఆశతో కెరోల్ ఇంటికి వచ్చి అక్కడే ఉంటుంది. ఈ ఆస్తి అంతా తనదే అని ఆనందంలో తేలుతున్న డోమినిక్ దగ్గరకు ఎవరికీ కనిపించకుండా కెరోల్ వస్తాడు. కెరోల్ ని చూసి ఆశ్చర్యంతో షాక్ అయిన డోమినిక్ కి తనని రప్పించడం కోసమే ఇదంతా చేసానని, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని ఆమెతో శృంగారం జరిపి అక్కడి నుంచి ఎవరికీ కనిపించకుండా, తను వచ్చిన జాడ కూడా తెలియకుండా మాయమవుతాడు. డోమినిక్ ఆగమని చెప్పిన వినకుండా వెళ్ళిపోతాడు. ఇలా ఎందుకు చేసాడా? అని ఆలోచిస్తున్న డోమినిక్ కి షాకిస్తూ పోలెండ్ పోలీసులొస్తారు. కెరోల్ ని చంపిన కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నామంటారు. డోమినిక్ గట్టిగా నవ్వి కెరోల్ చనిపోలేదని బతికే ఉన్నాడని చెబుతుంది. ఇది విని విస్తుపోయిన పోలీసులు కెరోల్ Death Certificate చూపిస్తారు అయిన డోమినిక్ నమ్మదు. అయితే బతికున్న కెరోల్ ని నువ్వే చూపించు అంటారు. కెరోల్…కెరోల్ అని గట్టిగా పిలుస్తుంది, ఎవరూ రారు. తాను మోసపోయానన్న విషయం నెమ్మదిగా అర్థమయ్యి ఎటువంటి ప్రతిఘటన ఇవ్వకుండా నిశ్శబ్ధంగా పోలీసుల వెంట వెళ్ళిపోతుంది.

కొన్ని రోజుల తరువాత కెరోల్, డోమినిక్ జైలులొ ఎలా ఉందో చూడటం కోసం పథకం వేస్తాడు, దొంగ చాటుగా వెళ్లి తనకున్న పలుకుబడితో జైలు సెక్యూరిటీకి లంచం ఇచ్చి, దూరం నుంచే డోమినిక్ ని బయనాక్యులర్ తో చూస్తాడు. అరె డోమినిక్ ఒకప్పటి అందమైన తల వెంట్రుకలు, పిడుచుగట్టుకపోయాయే…..తీక్షణమైన ఆమె చూపులు ఇప్పుడు నిస్తేజంగా ఉన్నాయే…..సున్నితమైన ఆమె అందాల అరచేతులు ఉక్కు సంకెళ్ళ మధ్య ఇరుక్కుపోయాయే….!
మానసికంగా కృంగిపోయి, నైరాశ్యంలో ఉన్న డోమినిక్ ని చూసిన కెరోల్ బయనాక్యూలర్ని తన కళ్ళకు మరింతగా అదిమి పట్టాడు. వాటి క్రిందుగా సన్నటి నీటి బొట్టు కెరోల్ బుగ్గలమీదుగా జాలువారింది, మరుక్షణంలోనే నీటి బొట్టు కాస్త సన్నటి నీటి ధార అయింది. ఒక్కసారిగా బయనాక్యూలర్స్ తీసిన కెరోల్ కళ్ళు ఎర్రగా కందిపోయి ఉన్నాయి, అతని కళ్ళ నుండి నీటి ధార అప్రతిహతంగా ప్రవహిస్తున్నది. సందేహం లేదు, అది ముమ్మాటికి అతని మనసు పొరల్లోంచి తన్నుకొస్తున్న బాధే. కాని తనను పలు కష్టాల పాల్జేసి, ఆఖరుకు పరాయి దేశంలో తినడానికి తిండి కూడా లేకుండా చేసిన డోమినిక్ మీద అతనికి ఇంత ప్రేమ ఎందుకు?

ఈ ప్రశ్న ప్రేక్షకుల మెదడ్లను తొలుస్తుండగానే సినిమా ముగిసినప్పటికీ, ప్రేక్షకుల మనోభావాలకు విలువనిస్తూ, ఆ కారణాన్ని ఎవరికి వారే సినిమాకి అన్వయించుకొనే స్వేచ్ఛనివ్వడమే దర్శకుడి ప్రయత్నంగా మనకు స్ఫురిస్తుంది.

ఇది Krzysztof Kieslowski దర్శకత్వం వహించిన The Three colours trilogy లో రెండోది. ఫ్రెంచ్ జాతీయ పతాకంలో తెలుపు రంగు సమానత్వానికి ప్రతీక, దాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. ఈ చిత్రంలో ఆకాశం ప్రతీ చోట తెల్లగానే కనపడేట్టు ఛాయాగ్రహణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం గమనార్హం. ఈ చిత్రానికి గాను బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో Kieslowski దర్శకత్వ శాఖలో Silver Bear అవార్డు అందుకున్నారు.

P.S: నిఝంగా నాకు ప్రేమ అంటే ఏంటో వివరంగా తెలీదు. ఈ సినిమాలో కెరోల్ మానసిక సంఘర్షణను చెప్పటం కోసం, డోమినిక్ మీద అతనికున్న ఇష్టాన్ని పాఠకులకు స్పష్టంగా తెలియచెప్పడం కోసం ఆ పదాన్ని విరివిగా ఉపయోగించాల్సి వచ్చింది.

8 Comments
  1. jonathan June 17, 2009 /
  2. Sreeram June 17, 2009 /
  3. NIsha June 17, 2009 /
  4. Dhanaraj Manmadha June 18, 2009 /
  5. మేడేపల్లి శేషు June 22, 2009 /
  6. Rajasekhar June 23, 2009 /