Menu

తెలుగు సినిమాకు సరస్వతీ కటాక్షం-2

ఈ వ్యాసం యొక్క మొదటి భాగం ఇక్కడ చదవండి.

కథా రచయితలూ ఉన్నారు ఈ సినిమాకైనా ఆరంభం కథతోనే అనేది నిర్విదాంశం. 24 డిపార్ట్మెంట్స్ లో ’స్టోరీ’ డిపార్ట్మెంటే మొదటిది. కొత్త తరం కథ రచయితలలో చాలామంది కూడా విద్యాపరంగా అత్యున్నత చదువులు చదివినవారే. ’గమ్యం’, ’సొంతవూరు’ వంటి సినిమాలకు కథ భాగస్వామిగా, మాటల రచయితగా పేరు పొందిన నాగరాజు గంధం అత్యున్నత విద్యావంతుడే. ఆయన కొంతకాలం ఖమ్మంలోని బిబిఎం కాలేజీకి ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. అలాగే, రాం గోపాల్ వర్మకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన కథ-మాటల రచయిత కోన వెంకట్ కూడా తక్కువవాడేం కాదు. ఆయన పూనేలో ఎంబిఏ చేసిన మాస్టర్ గ్రాడ్యుయేట్! ఢీ, దుబాయ్ శీను, చింతకాయల రవి వంటివి ఆయన రచనలే! ప్రస్తుతం ఆయన మాధవన్ హీరోగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ’రెడీ’ చిత్రంతో తెలుగు సినీ ప్రపంచంలోకి ప్రవేశించిన కథ-మాటల రచయిత గోపి మోహన్ కూడా ఇంజనీరింగ్ పట్టభద్రుడే. ఆయన బెల్గాంలో ఇంజనీరింగ్ చేశారు. సంగీతకారుల సంగతేంటి? తెలుగు సినిమాకు సంగీతం – పాటల ప్రాణం! మన సినీ రంగంలో ఇప్పటివరకూ సంగీతంలో కూడా సినీ కుటుంబాల పరిచయస్థులకే ప్రవేశం ఉండేది. గత కొంతకాలం నుంచి వస్తున్న మార్పుల ఫలితంగా నవతరం సంగీత దర్శకులకెంతో మందికి ప్రవేశం దక్కింది. అలా వచ్చి ప్రతిభను నిరూపించుకున్న వారిలో మిక్కీ జే మేయర్ ముఖ్యుడు. ’పోతే పోనీ’ సినిమాతో పరిచయమైన ఈయన టెన్త్ క్లాస్, నోట్ బుక్ సినిమాలకు సంగీతాన్నందించారు. ఇక ’హ్యాపీడేస్’ సంగీతం యూత్ లో జాతీయ సంగీతం అయింది. ఈయన మ్యూజిక్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లండన్ లోని ప్రఖ్యాత ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో పట్టాని సాధించారు. ఈ సంస్థలో ప్రతిష్టాత్మకమైన 8 ఏళ్ళ కోర్సును పూర్తి చేసిన మూడవ దక్షిణ భారతీయుడు ఈయనే. మిగతా ఇద్దరు ఇళయరాజా, ఎ.ఆర్.రెహమాన్ కావడం విశేషం. ఇక కొంతకాలం క్రితం తెలుగు సినిమా సంగీతరంగంలో నవ్య పోకడలను సృష్టించిన సంగీతకళాకారుడు రమణ గోగుల! పనవ్ కల్యాణ్, వెంకటేశ్ సినిమాలెన్నింటికో సంగీతాన్నందించిన రమణ ఐఐటి ఖరగ్పూర్ లో ఇంజనీరింగ్ చదివారు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా అమెరికాలో పనిచేసిన ఆయన తన సినిమా కలని నిజం చేసుకుని సంగీత దర్శకులయ్యారు. ఈ మధ్యే నిర్మాతగా మారి సుమంత్ తో ’బోణి’ సినిమాని రూపొందించారు. అలాగే ’ఆనంద్’, ’గోదావరి’, ’చందమామ’ సినిమాలతో ఆహ్లాదకరమైన సంగీతానికి కేరాఫ్ గా నిలిచిన సంగీతకారుడు కె.ఎం.రాధాకృష్ణన్. ఆయన బి.ఎస్సీ డిగ్రీ తర్వాత హైదరాబాద్ మ్యూజిక్ కాలేజీలో సంగీతంలో డిప్లొమాను చేయడమే కాక, భారతీయ సంగీతంలో రెండు సంప్రదాయాలైన కర్ణాటక-హిందుస్థానీ సంగీతాల మేళవింపుపై పరిశోధనలు చేశారు. ’వెన్నెల’ సినిమాకి సంగీతాన్ని అందించిన మహేశ్ శంకర్ కూడా ఉన్నత విద్యావంతుడే.ఆయన చెన్నై విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీ నుండి డిగ్రీని, అమెరికాలో మాస్టర్స్ డిగ్రీని చేశారు. ప్రఖ్యాత డ్రమ్మర్ శివమణి తో కలిసి వందలాది స్టేజ్ షోలు ఇచ్చిన ఈయన తాజాగా ’ప్రయాణం’ చిత్రానికి సంగీతాన్నందించారు. అనతికాలంలో సంచలన సంగీత దర్శకుడిగా వందలాది హిట్ సాంగ్స్ ఇచ్చిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్! ’చిత్రం’ తో సంగీత దర్శకుడిగా మొదలెట్టి, ’శ్రీను వాసంతి లక్ష్మి’ తో నటుడిగా ఆ తర్వాత దర్శకుడిగా మారిన ఆర్పీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పోస్ట్ గ్రాడ్యుయేట్! వీరే కాకుండా గీత రచయితలైన చేగొండి అనంత శ్రీరామ్ ఇంనీరింగ్ పట్టభద్రుడుకాగా, ’వనమాలి’ కలం పేరుతో పాటలు రాస్తున్న మణిగోపాల్ డాక్టరేట్ పట్టాపొందిన అత్యున్నత విద్యావంతుడు. అలాగే మరో గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి వరంగల్ లోని రీజియనల్ ఇంజనీరింగ్ కాలేజి (ఇప్పుడు ’నిట్’) లోనూ, ఆ తర్వాత ఖరగ్ పూర్ లోని ఐఐటిలోనూ చదివిన అత్యున్నత వృత్తి నిపుణుడు. సినిమాటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు ఇక తెరపైన చిత్రాన్ని అందంగా ప్రదర్శించడంలో అసమాన ప్రతిభను చూపేవారు సినిమాటోగ్రాఫర్స్! తెలుగులోని కొత్తతరం సినిమాటోగ్రాఫర్స్ లో సైతం చాలామంది విద్యాపరంగా గొప్పవాళ్ళే కావడం విశేషం. ’అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్’ సినిమాతో పరిచయం అయిన సినిమాటోగ్రాఫర్ – మాలిని దాసరి! సినిమాటోగ్రఫీలో అత్యంత ప్రతిభావంతమైన మహిళగా పేరొందిన మాలిని ’తారే జమీన్ పర్’ ’జానే తు య జానేన’ వంటి సూపర్ హిట్ సినిమాలకు అసిస్టెంట్ కెమెరాఉమెన్ గా పనిచేసింది. ఆమె బెంగళూరులోని ఇండయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబియే పూర్తి చేసింది. ఆ తర్వాత పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో మూడేళ్ళ సినిమాటోగ్రఫీ కోర్సు పూర్తి చేసింది. అలాగే ’ఇదీ సంగతి’ సినిమాకు కెమెరామెన్ గా పనిచేసిన జయకృష్ణ గుమ్మడి, ’పౌరుడు’ సినిమాకు తళుకులద్దిన సుధాకర్ రెడ్డి కూడా ఉన్నత విద్యావంతులే. వీరంతా కూడా పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో క్లాస్ మేట్స్ కావడం విశేషం. వృత్తి నిపుణులే ఎక్కువ తెలుగు సినిమాకు కొత్త జవజీవాలను కొత్త గ్రామర్ ను నిర్మిస్తున్న ఈ నవతరం కళాకారులు ఎక్కువమంది ఇంజనీరింగ్ వంటి సాంకేతిక వృత్తి నిపుణులే కావడం గమనార్హం. అలాగే, ఉన్నత విద్యా నేపథ్యం అని సందర్భాలలో అత్యున్నత సినిమాని సృష్టిస్తుందని చెప్పలేము. ’అనుభవాన్ని మించిన విద్య లేదు’ అని నిరూపించిన ఎంతోమంది గతకాలపు తెర మహానుభావులు అజరామరమైన సినిమాలను తీశారు. అలా అని న్యూజెన్ తెలుగు సినీ రంగంలో కనిపిస్తున్న ఈ అత్యున్నత విద్యా నేపథ్యం తాలూకు మార్పు పవనాల్ని విస్మరించలేము. ఎందుకంటే, తెలుగు సినీరంగంలో ఇన్నేళ్ళ కాలంలో వచ్చిన మార్పుకన్నా గత ఐదారేళ్ళ కాలంలో కనిపిస్తున్న నవ్య ధోరణే అత్యంత వేగంగా ఉందనేది గమనించాలి…ఉన్నత విద్యా నేపథ్యం తెలుగు సినిమాల్లో చూపిస్తున్న ప్రభావం ఇప్పటికే సుస్పష్టం. అది మరింత నిర్మాణాత్మక, సృజనాత్మక సినిమా సృష్టివైపు అడుగులేస్తుందనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా మంచి ’విజువల్’ కు చక్కనైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కలిస్తే సీన్ ఎలా పండుతుందో, ఈ నవతరం దర్శకులు, సాంకేతిక నిపుణులకు వారి చదువులు కూడా అంతే విజన్ ని ఇస్తున్నాయనేది నిజం. అమెరికా రిటర్న్డ్… ఉన్నత విద్యతో వచ్చే అత్యున్నత ఉద్యోగావకాశాలకు నెలవైన ప్రదేశంగా అమెరికాకు పేరుంది. ఆమెరికా వెళ్ళడమే మన తెలుగు సామాజిక జీవనంలో ఎంతో ఉన్నత స్థాయి దశగా భావించడం మామూలు. అలాంటిది అమెరికాలో చదువుకోసమో, ఉద్యోగం కోసమో వెళ్ళడం, అక్కడే స్థిరపడటం అనేది ప్రతీ పది తెలుగు కుటుంబాలలో దాదాపు ఆరు కుటుంబాల కల అంటే అతిశయోక్తి కాదు. ’డాలర్ డ్రీమ్స్’ తో వేర్వేరు వృత్తి నైపుణ్యాలతో అమెరికాకు వెళ్లిన తెలుగు వారు కొంతమంది వృత్తి ఉద్యోగాలకు అతీతంగా సినిమాను ప్రవృత్తిగా భావించినవాళ్ళున్నారు. వారు స్వదేశానికి, స్వరాష్ట్రానికి తిరిగొచ్చి తమ అభిరుచులు, తాము సినిమా కళను అర్థం చేసుకున్న తరహాలోనే సినిమాలను తీయడానికి చొరవచూపించారు. ఇంకా కొంతమందైతే, తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న ధోరణులను గమనించి, ఇక్కడి హీరోలను, నిర్మాతలను తమ కథలతో ఒప్పించడం కష్టమని భావించారు. ఒక వైపు సినిమాపై ప్రేమ… మరో వైపు అందుకు అనుగుణమైన వాతావరణం తెలుగు సినీ పరిశ్రమలో లేకపోవడం….ఈ రెండింటి మధ్య సంఘర్షణకు గురైన నవతరం యువకులు కొంతమంది, తమ చిరకాల స్వప్నమైన సినిమా తీయడం కోసం డబ్బులు సంపాదించాలనుకున్నారు. దానికోసం తాము చదివిన చదువు, వృత్తి నైపుణ్యాలను సోఫానంగా మలుచుకున్నారు…అమెరికా వెళ్ళారు…డబ్బు సంపాదించారు…ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు. తెలుగు సినీ పరిశ్రమలో బలంగా నాటుకుపోయిన సంప్రదాయక నిర్మాతలు – దర్శకులు -హీరోల వెంట తిరక్కుండా, తామే స్వయంగా నిర్మాతా దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు…ఈ మొత్తం పరిణామం తెలుగు సినీ పరిశ్రమలో ఓ సంచలనమే! ఉన్నత చదువు, ఉన్నత ఉద్యోగం వల్ల వచ్చిన నవ్య భావనలు, విస్తృత సాహిత్య అధ్యయనం, ప్రపంచ సినిమాతో పరిచయం వంటివి వీరి కథల్లో నవ్యతకు దారి తీసాయి. ఇలా అమెరికా రిటర్న్డ్ సినీ పిపాసులకు ఓ సక్సెస్ స్టోరీగా నిలిచిన దర్శకుడూ శేఖర్ కమ్ముల! ’డాలర్ డ్రీమ్స్’ తో తన సనీ స్వప్నాన్ని సాకారం చేసుకున్న శేఖర్, ’ఆనంద్’ సినిమాతో తెలుగు సినీ గమ్యాన్నే కొత్త పుంతలు తొక్కించాడు…యాక్షన్..ఫ్యాక్షన్ హింసోన్మాదాల తెలుగు సినిమాకు మంచి కాఫీ తాగిన అనుభూతిని అందించాడు. దేవా కట్టా తెలుగు సినిమాకు ’వెన్నెల’ ను అందిస్తే రాధాకృష్ణ సరైన ’గమ్యం’ చూపించారు. మరో అమెరికా రిటర్న్డ్ సంగీతకారుడు రమణ గోగుల ఇప్పటికే తెలుగు సినీ సంగీతంలో ఎన్ని సూపర్ హిట్స్ ఇచ్చాడో తెలిసిందే. అలాగే నిర్మాతలు హరిచరణ్ ప్రసాద్, మోహన్ కూడా అమెరికా రిటర్న్డ్ తెలుగువారే! డిఫరెంట్ సినిమాకి ’హ్యాపీడేస్’ ‘ఎడ్యుకేషన్ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ లైఫ్’ అనేది అమెరికన్ ప్రాగ్మాటిక్ తత్వవేత్త జాన్ డ్యూయి మాట! అంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే సంసిద్ధతను ఏర్పర్చేది విద్య అని అర్థం. ఇక స్వామి వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి వంటి భారతీయ తాత్విలుకు ’సంపూర్ణమూర్తినుత్వవికాసమే విద్యాలక్ష్యం’ అని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో ఇంతకాలం కొనసాగుతున్న విద్యావిధానం ఈ మహోన్నత లక్ష్యాలను ఎంతమేరకు సుసాధ్యం చేస్తున్నాయనే విషయాన్ని పక్కనపెడితే, అకడమిక్ చదువులు వ్యక్తి ఆోచనలో, దృక్కోణంలో, జీవనశైలిలో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయనేది నిర్వివాదాంశం. ఈ తేడానే మన తెలుగు సినీరంగంలోని అత్యున్నత విద్యావంతులైన దర్శకులు, రచయితలు, ఇతర సాంకేతిక నిపుణులు సినిమాను చూసే, చూపించే విధానంలో వైవిధ్యతకు కారణమవుతోంది. మన తెలుగు సినిమాకు సంబంధించినంతవరకు తెర వెనుక సినిమాను నడిపించే దర్శకులు, కథకులు, కెమెరామెన్, సంగీత దర్శకులకు సంబంధించి ప్రధానంగా రెండు రకాల ఔత్సాహికులు కనిపిస్తారు. ఒక రకమేమో, చిన్నప్పటినుంచి సినిమాలను చూసి, సినిమాలను ప్రేమించి చెప్పాపెట్టకుండా రైలెక్కేసి మద్రాస్ బాటనో, భాగ్యనగరం బాటనో పట్టేవాళ్ళు! వీళ్లకి సినిమా ఓ జీవితాశయం. సినిమా తప్ప మరేదీ కనిపించని మమేకభావం. ఇక మరో రకం ఉంటారు. వీరు అకడమిక్ గా అత్యున్నత చదువులు చదివిన వారు. ఇతర నైపుణ్యాలలో ఉన్నత స్థానానికి ఎదిగిన వారు. అదే సమయంలో సినిమాని, సినిమా కళని విపరీతంగా ప్రేమించినవారు. సినిమా మీది ఆకర్షణని, వ్యామోహాన్ని శాస్త్రీయంగా, విస్తృత అధ్యయనం చేసిన వారు….ఆకళింపు చేసుకున్నవారు. టెక్నిక్-ట్రీట్మెంట్-టేకింగ్ ల విషయంలో క్రియేటివిటీని ప్రపంచ స్థాయి ధోరణులను చొప్పించగలిగినవారు. వీరిలో ఈ విశాల దృక్పథానికి కారణం వారి చదువులే అనడంలో అతిశయోక్తి లేదు. ఈ రెండు రకాల సినీ ప్రేమికులలో ఇద్దరికీ సినిమా క్రాఫ్ట్ పట్ల ఉన్న ప్యాషన్ ని యాంబిషన్స్ ని తక్కువ అంచనా వేయలేము. కానీ ఇన్నాళ్ళ తెలుగు సినీ ప్రస్థానంలో ఆయా దర్శకులు – రచయితల ’అకడమిక్’ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, వారు సృష్టించిన సినిమాలలో తేడా ఇట్టే కనిపిస్తుంది. అకాడమిక్గా సైఅతం అత్యున్నత విద్యనభ్యసించిన దర్శకులు తెలుగు సినిమాకు ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచారని అర్థమవుతుంది. ఫార్ములా రొడ్డకొట్టుడు సినిమాలకు భిన్నమైన ’డిఫరెంట్ సినిమాని’ తెలుగు తెరకు పరిచయం చేసిన ’క్రియేటర్స్’ కూడా వీరే అని అర్థమవుతుంది. రాంగోపాల్ వర్మ, శేఖర్ కమ్ముల, జాగర్లమూడి రాధాకృష్ణ, దేవ కట్టా, ఇంద్రగంటి మోహనకృష్ణ, శ్రీకాంత్ అద్దాల వంటి వారే ఇందుకు ఉదాహరణ. 78 ఏళ్ళ తెలుగు సినిమా గమనంలో ఒక ’శివ’, ’ఆనంద్’, ’గమ్యం’, ’అష్టాచెమ్మా’ వంటి డిఫరెంట్ సినిమాలని సృష్టించింది అత్యున్నత విద్యావంతులైన సినిమా ప్రేమికులే! మున్నెప్పుడూ లేనంతగా ఇప్పుడు తెలుగు సినీ సీమలోకి విద్యాధికులంతోమంది వస్తుండడంతో రానున్న కాలం అంతా తెలుగు సినిమాకు ’హ్యాపీడేస్’ అనిపిస్తోంది!

–మామిడి హరికృష్ణ

6 Comments
    • harikrishna June 26, 2009 /
  1. Rajasekhar June 25, 2009 /
  2. Sreenivas Paruchuri June 25, 2009 /
    • harikrishna June 26, 2009 /
  3. Mahesh Vaddi. July 13, 2009 /