Menu

తెలుగు సినిమాకు సరస్వతీ కటాక్షం-1

సినిమా రంగం అంటే లక్ష్మీదేవి ’కోటి’రూపా(యి)లతో తాండవ నృత్యం చేసే చోటు. నిన్న మొన్నటి వరకు ఆ రంగం పై మోజుతోనో, అక్కడ లభించే పేరు ప్రఖ్యాతులపై ఆశతోనో ఇల్లు, వాకిళ్లు వదిలి రైలెక్కేవారు, లేకుంటే తమ ప్రతిభ చూపుదామని ఆశించేవారే తప్ప, అదో వృత్తిగా ప్రవృత్తిగా భావించిన వారు అరుదు. ముఖ్యంగా కాస్త చదువుకున్నవారు వేరే దారి లేకపోతే తప్ప అందులో అడుగుపెట్టిన వారు చాలా తక్కువ. ఎన్.టి.రామారావు బి.ఎ అనో, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అనో ఒకటో రెండో పేర్లు కనిపించేవి. ఇప్పుడు రోజులు మారాయి. ఇంజనీర్లు, కంప్యూటర్ మేధావులు, ఫారిన్ రిటర్న్డ్ లు సినిమా రంగాన్ని తమ ’గమ్యం’ గా ఎంచుకుంటున్నారు. డైరెక్టర్లు…అసిస్టెంట్లు…నటులు, సాంకేతిక నిపుణులు…అందరూ పెద్దపెద్ద చదువులు చదివిన వారే. ఇప్పుడు తెలుగు సినిమాకు లక్ష్మీ కటాక్షంతో పాటు సరస్వతీ కటాక్షం కూడా.

పాత తెలుగు సినిమాలలో ఈస్టమన్ కలర్ సినిమా టైటిల్స్ లో ’ఎన్.ఎన్.టి.రామారావు బి.ఎ,’ అని ’కె.రాఘవేంద్ర రావు బి.ఎ’ అని పేరుకి చివరన ఆ మహానుభావులు చదివిన డిగ్రీలను వేసుకోవడం కనిపించేది. అప్పట్లో బి.ఎ, చదువుకు ఉన్న పాత్ర, ప్రాముఖ్యత అంత గొప్పది. అత్యల్ప అక్షరాస్యతా శాతం ఉన్న కాలంలో వారు అత్యున్నత విద్యావంతులు అనే విషయాన్ని తేట తెల్లం చేయడం దీని ఉద్దేశం.

ఇప్పుడు కూడా తెర వెనుక కృషి చేసిన నిర్మాతలు, దర్శకులు, రచయితల పేర్ల టైటిల్స్ పడుతున్నాయి కానీ, వారి ఏడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనిపించడం లేదు. సినిమా రంగం అనగానే చాలామంది మదిలో నాటుకున్న అంశం ఏమిటంటే సినిమా మీది వ్యామోహం కొద్దీ ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళే ఎక్కువమంది ఉంటారు అనేదే. చదువుకు నామం పెట్టిన వాళ్ళో, చదువును మధ్యలో వదిలేసిన వాళ్ళో ఉంటారనే అభిప్రాయం కూడా ఉంది. మరో విధంగా చెప్పలంటే సినిమా రంగానికి ’లక్ష్మీ కళ’ నే తప్ప ’సరస్వతీ కటాక్షం’ తక్కువ అనే అభిప్రాయం కూడా ఉంది.

కానీ, గత ఆరేడేళ్ళ కాలం నుండి తెలుగు తెరపై అధ్బుతాలు సృష్టిస్తున్న నవతరం కథకులు, రచయితలు, దర్శకులు, సంగీతకారులకు సంబంధించిన ప్రొఫైల్స్ ను, వారి బ్యాక్ గ్రౌండ్ ను గమనిస్తే అశ్చర్యపోకుండా ఉండలేం…సినిమా కళలో వారికున్న పట్టును, ప్రావీణ్యాన్ని చూసి ఎంత అభినందిస్తున్నామో, వారి ’అకడమిక్ క్వాలిఫికేషన్స్’ ని గమనిస్తే అంతే ఆశ్చర్యపోతాం. సమకాలీన తెలుగు సినిమాని లాలిస్తూ, పాలిస్తూ, శాసిస్తూ, శోధిస్తున్న ఈ new-gen సాంకేతిక నిపుణులు సినిమా ’ఈస్థటిక్స్’ ని ఎక్స్పీరీయన్స్ తోనే కాదు, ’ఏడ్యుకేషన్’ తో కూడా ఔపాసన పట్టిన వారని అర్థమవుతుంది. అంటే వీరంతా ’సరస్వతీ పుత్రులే’ అని కూడా తేటతెల్లమవుతుంది. అలాగే, తెలుగు సినిమాలో వారసులకో, స్టార్ బంధువులకో, బావమరుదులకో, తమకున్న ’స్టార్ కనెక్షన్’, ’పరిచయాల’ వల్ల మాత్రమే ఎంట్రీ దొరుకుతుందని….’లక్ష్మీ కళ’ తో మాత్రమే సినీ రంగ ప్రవేశం సాధ్యమనే అభిప్రాయం స్థానంలో. ఈ యంగ్ బ్రిగేడ్ ఇప్పుడు కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఉన్నత విద్యావంతులు, వృత్తి నిపుణులు, అమెరికా రిటర్న్డ్ ఉన్నతోద్యోగులతో ఇప్పుడు తెలుగు సినిమా సుసంపన్నం అవుతోంది. తెలుగు సినిమా ఇప్పుడు సరస్వతీ కటాక్షంతో అలవారుతోంది.

దర్శకులతో మొదలు

’డైరెక్టర్ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అని అంటారు. సినిమాకు దశను, దిశను నిర్దేశించే అత్యున్నత సృజనాత్మక ప్రతిభాశాలి దర్శకుడు. తెలుగు సినీ రంగంలోకి ఇటీవల దూసుకువచ్చిన నవతరం దర్శకుల బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే, వారి కెరీర్ లోకి ఒక్కసారి దృష్టి సారిస్తే వారు చదివిన చదువులు, వారు చూసిన ప్రపంచం, వారికి ఉన్న విస్తృత అవగాహనకు మనం అభినందనలు చెప్పకుండా ఉండలేం. తెరమీద వారు ప్రదర్శిస్తున్న సృజనాత్మక ప్రతిభకి మూలాలు వారు చదివిన చదువుల్లో ఉన్నాయని తెలుసుకున్న తర్వాత వారి మీద మన అభిమానం, గౌరవం మరింత పెరగకమానదు. తెలుగు సినీ సీమలో రాం గోపాల్ వర్మ తో మొదలైన ఈ కొత్త ట్రెండ్ ఇప్పుడు విస్తృతమయింది.

తెలుగు సినిమాకు గొప్ప టర్నింగ్ పాయింట్ – రాం గోపాల్ వర్మ! ఆయన తీసిన ’శివ’,’క్షణ క్షణం’, ’గాయం’ ప్రతీదీ సంచలనమే. సినీ రంగంలోని వారసులకు, బమ్ధువులకు తప్ప కొత్త వారికి దుర్భేధ్యంగా ఉన్న కంచుకోటలాంటి సినిమా రంగంలోకి ’కొత్తగాలుల్ని’ ప్రసరింపచేసిన దార్శనికుడు ఆయన. ఇప్పటి తెలుగు సినిమా దర్శకులందరికీ ఆది గురువు అన్నా ఆశ్చర్యం లేదు. అలాంటి రాం గోపాల్ వర్మ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజిలో ఆయన చదువుకున్నారు. ఆయన తొలి చిత్రం ’శివ’ కి ఆయన కాలేజీ అనుభవాలే ప్రేరణ అని ఆయన చెప్పారు.

ఇక, ఈ తరంలో ఇప్పుడు ఎంతో మందికి రోల్ మోడల్ గా, సక్సెస్ ఐకాన్ గా ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల! రొటీన్ ఫార్ములాలో వెళ్తున్న తెలుగు సినిమాకు మంచి కాఫీలాంటి ’ఆనంద్’ ని వేసవిని చల్లగా ఉంచే ’గోదావరి’ ని అందించిన న్యూ ఏజ్ డైరెక్టర్ శేఖర్.

సినిమా చూడటాన్ని ’హ్యాపీడేస్’ అనే ఆనందకరమైన అనుభూతిగా మలిచిన సునిశిత దర్శకుడు.ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్. హైదరాబాదులోని ’చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ విద్యార్ధి. డిగ్రీ తర్వాత ఆయన అమెరికాలోని న్యూ జెర్సీ లో కంప్యూటర్స్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే తన అభిరుచికి దగ్గరగా ’మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ కోర్సును వాషింగ్టన్ లోని ప్రఖ్యాత హోవార్డ్ యీనివర్శిటీ లో అభ్యసించారు. ’హ్యాపీడేస్’ లోని ఎన్నో సంఘటనలకు తన కాలేజీ లైఫే స్ఫూర్తి అని చెప్పడం ఇక్కడ గమనార్హం.

చలం రాసిన ’దోషగుణం’ కథని ’గ్రహణం’ సినిమాగా తెరకెక్కించి తెలుగు సినిమాకు కొత్త ఊపిరులు ఊదిన నవతరం దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి! గత సంవత్సరం ’అష్టా చెమ్మా’ తో ఓ కొత్త తరహా సక్సెస్ ను చవిచూపించారు. తెలుగు సినిమాను నవ్య పోకడలు పోనిస్తున్న ఈ దర్శకుడు ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్! ఆయన ఆంగ్ల సాహిత్యం, ఫిలాసఫీలలో మాస్టర్ డిగ్రీ హోల్డర్! అంతే గాక, టొరంటోలోని యార్క్ యూనివర్శిటిలో ’ఫిల్మ్ అండ్ టెలివిజన్’ ప్రత్యేక సబ్జెక్ట్ గా ’మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ విద్యను చదువుకున్నారు. ’కమ్యూనికేషన్ అండ్ కల్చర్’ విభాగంలో డాక్టరేట్ పరిశోధనను మొదలెట్టిన విద్యాసంపన్నుడు ఆయన.

తెలుగు సినిమా డైలాగులకు ’ఇంటలెక్చువల్ పంచ్’ ల హాస్యాన్ని, కథకు లాజికల్ అద్భుతాన్ని, దర్శకత్వానికి నవ్యతని అద్దిన మరో న్యూజెన్ బహుముఖ ప్రజ్ఞాశాలి – త్రివిక్రమ్ శ్రీనివాస్! ఆయన డైలాగులు రాసిన ’చిరునవ్వుతో’, ’స్వయంవరం’, ’నువ్వు నాకు నచ్చావ్’, ’మల్లీశ్వరి’ సినిమాలు ఎంత హిట్టో, ఆయన దర్శకత్వం వహించిన ;అతడు’, ’జల్సా’ సినిమాలు కూడా అంతే సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఆయన యూనివర్శిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ చదివారు. అంతే కాదు, ఆయన సబ్జెక్ట్ లో గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఆయన భీమవరంలోని హోలీ ఏంజెల్స్ కాలేజీలో కొంత కాలం లెక్చరర్ గా పనిచేశాడు.

అలాగే ’లిటిల్ సోల్జర్స్’ సినిమాతో రంగప్రవేశం చేసి ’ఐతే’ వంటి నవ్య సినిమాలని అందించిన గంగరాజు గుణ్ణం కూడా అత్యున్నత విద్యావంతుడే. ఎన్నెన్నో కష్టాల మధ్య విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజిలో బి.ఏ ను, ఆ తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్ లో ఎం.ఏ ను చదివిన ఆయన స్టేట్ బ్యాంక్ ఉద్యోగిగా కొంత కాలం పని చేశారు.

నూరు చిత్రాలకు పైగా కథ, మాటలను అందించి, ’శ్రావణ మాసం’ సినిమాతో నిర్మాతగా, దర్శకుడిగా మారి ’ఆపరేషన్ దుర్యోధన’ వంటి సంచలన రాజీయ చిత్రాన్ని నిర్మించిన దర్శకుడు పోసాని కష్ణమురళి. ’పోలీస్ బ్రదర్స్’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన ప్రస్తుతం ’రాజావారి చేపల చెరువు’ అనే పొలిటికల్ సెటైర్ ని నిర్మించారు. ఆయన బి.కాం, బి.ఏ, ఎం.ఏ, ఎం.ఫిల్ చేసిన అత్యున్నత విద్యావంతుడే.

యంగ్ హీరో అల్లు అర్జున్ కు స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా ’ఆర్య’! ఆ సినిమాను రూపొందించిన దర్శకుడు సుకుమార్. ’జగడం’ వంటి వెరైటీ సినిమాను తీసిన ఆయన ప్రస్తుతం ’ఆర్య-2′ పేరుతో ఒక సీక్వెల్ సినిమాని తీస్తున్నారు. ఆయన కూడా ఎమ్మేస్సీ (మ్యాథమేటిక్స్) పోస్ట్ గ్రాడ్యుయేట్! సినిమాల్లోకి రాకముందు ఆయన కొంతకాలం కాకినాడ ఆదిత్య ట్యుటోరియల్స్ లో లెక్చరర్ గా పనిచేశారు.

అలాగే ఆ మధ్య ’కుబుసం’ వంటి సామాజిక చైతన్య సినిమా చేసిన దర్శకుడు శ్రీనాథ్ డాక్టరేట్ పట్టా పొందిన అత్యున్నత విద్యావంతుడు. ’పల్లే కన్నీరు పెడుతుందో’ అనే గోరేటి వెంకన్న పాటను ఎంతో ప్రతిభావంతంగా చిత్రీకరించిన ఆయన సినిమాలలో ఆయన అధ్యయనం చేసిన సాహిత్య ప్రభావం కనిపిస్తుంది.

ఈ మధ్య ’కొత్త బంగారు లోకం’ తో అందమైన యువ ప్రేమ కథని తెలుగు తెరకి అందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా ఎం.టెక్ చదివిన అత్యున్నత విద్యావంతుడే. అలాగే, ’కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాని రూపొందించిన దర్శకుడు కిశోర్ కుమార్ కూడా డిగ్రీ తో పాటు ’లా’ చదువును కూడా పూర్తి చేశారు. ఆయన విజయనగరం మహారాజా కాలేజీలో చదువుకున్నారు.

’కంత్రీ’ ఇప్పుడు ’బిల్లా’ సినిమాలతో భారీ తనానికి కేరాఫ్ గా నిలిచిన దర్శకుడు మెహర్ రమేశ్, సివిల్ ఇంజనీరిమ్గ్ లో డిప్లొమా హోల్డర్. ఇక ’అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్; సినిమాతో పరిచయం అయిన హరి యెల్లేటి అమెరికాలో ఎమ్మెస్ మాత్రమే కాక, పి హెచ్ డి కూడా పూర్తి చేసిన హార్డ్ వేర్ ఇంజనీర్.

’చుక్కల్లో చంద్రుడు’ సినిమాతో పరిచయమై ’శౌర్యం’ తో హిట్ సాధించిన దర్శకుడు శివకుమార్. ఈయన బిట్స్, పిలానీ లో ఇంజనీరింగ్, అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్శిటీ నుండి ఎమ్మెస్ (మాస్ కమ్యూనికేషన్) డిగ్రీ ని సాధించిన ఉన్నత విద్యావంతుడు. ఆయన ప్రస్తుతం గోపిచంద్-త్రిషా జంటగా కొత్త సినిమాను తీస్తున్నారు. అలాగే ’బ్లాక్ అండ్ వైట్’ అనే థ్రిల్లర్ సినిమా దర్శకుడు శ్రీకాంత్ వేములపల్లి కూడా ఎం.టెక్, సివిల్ ఇంజనీరింగ్ చదువును పూర్తిచేసి సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా పనిచేసిన వారే!

వీరే కాకుండా సమకాలీన తెలుగు సినిమాకు దిశానిర్దేశం చేస్తున్న జాగర్లమూడి రాధాకృష్ణ (గమ్యం) …’బొమ్మలాట’ వంటి ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు కె.సూర్యప్రకాశ్ రావు, ’అల్లరి’ రవిబాబు వంటి న్యూవేవ్ దర్శకులందరూ అత్యున్నత చదువులు చదివిన వారే! ’స్నేహ గీతం’ తో దర్శకుడిగా పరిచయం అవుతున్న మధుర శ్రీధర్ రెడ్డి కూడా ఈ కోవలోకి చెందినవాడే.

-ఇంకావుంది

–మామిడి హరికృష్ణ

ఈ వ్యాసం మొదట ఆంధ్రభూమిలో ప్రచురితం


8 Comments
  1. ramesh reddy June 20, 2009 /
  2. rathnakar kandula June 20, 2009 /
  3. rathnakar kandula June 20, 2009 /
  4. మేడేపల్లి శేషు June 22, 2009 /
    • harikrishna June 24, 2009 /
  5. సుజాత June 22, 2009 /