Menu

నటన + జీవితం = ఒక మంచి ‘షో’ (మొదటి భాగం)

show-neelakanta-manjula

సినిమా చూడటం అంటే చిన్నప్పుడు ఓ సరదా. అంతకుమించి మరేమీ లేదు. కాని ఆ బాల్య, కౌమారావస్థలు దాటి ఒక విధమైన మానసిక పరిణితి వచ్చిన తర్వాత, సినిమా అనే కాదు, ఏ విషయం పట్లైనా మన అభిప్రాయాలు మారిపోతాయి (మారాలి కూడా). ఎన్నిరోజులని, సంవత్సరాలని ఈ కాకమ్మ కథలతో తయారయ్యే చిత్రాలు చూస్తూ కూర్చుంటాం? కొత్త విషయాలు తెలుసుకోవటంలో మన చుట్టూ ఉండే వాతావరణం, మనకు లభించే వనరులు మొదలైనవి కూడా ప్రధానపాత్ర వహిస్తాయి. అయితే, సినిమా అనేది కేవలం ఒక వినోదంగా మాత్రమే కాకుండా, మన తెలుగువాళ్ళకు ఒక జీవనవిధానంగా మారిపోయింది. సినిమా లేని జీవితాన్ని చాలామంది ఊహించుకోలేరు. అంతటి శక్తిమంతమైన మీడియం మనలను కేవలం రెండూ రెండున్నర గంటల పాటు తెరమీద ఏవో బొమ్మలు ఆడించి, మట్టిముద్దల్లా సీట్లకు కట్టిపడేసినట్లుగా కాకుండా, మన బుర్రకు పదునుపెట్టే సాధనంగా ఉంటే ఎంత బాగుంటుంది? ఇలాంటి నేపధ్యం ఉన్న చిత్రాలు చూడటం నిజంగా ఒక మంచి అనుభవం. అవి మనలో మంచి అనుభూతులు మిగులుస్తాయి – కలవరపెట్టినా సరే. మనలను చాలాకాలం వెంటాడతాయి.

ఓ ఐదారేళ్ళ క్రితం అటువంటి తెలుగు చిత్రమే ఒకటి మన రణగొణ చిత్రాల మధ్య Talk of the Town అయింది. ఆ సంవత్సరం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాకుండా, ఉత్తమ స్క్రీన్ ప్లేకు కూడా జాతీయ అవార్డు గెలుచుకుంది. అదే సినీ నటుడు కృష్ణ కూతురు మంజుల నిర్మించిన ‘షో’. తను అందులో నటించింది కూడా. అప్పుడు ఆ చిత్రం గురించి వినటమే గాని, చూసే అవకాశం నాకు రాలేదు. అందుకే, రెండు మూడు నెలల క్రితం మా ఊరెళ్ళినప్పుడు ఏరికోరి ఆ సినిమా సిడి తెచ్చుకున్నాను. ఇది సినిమా విద్యార్థులకు రికమెండ్ చేయాల్సిన చిత్రంగా నేను భావిస్తున్నాను.

ఈ చిత్రంగురించి అందరూ చెప్పిన ఒక్క మాట – ఈ చిత్రంలో రెండే పాత్రలు అని. కాబట్టి నేనూ అక్కడినుంచే ప్రారంభిస్తాను. ఈ సినిమా గురించి తెలియని వాళ్లకు ఈ విషయం ఒకింత ఉత్సుకతను కలిగిస్తుంది – రెండే పాత్రలతో సినిమా ఏమిటి అని. ఆ రెండు పాత్రలూ – ఒక యువతి (రిధిమ) ఒక యువకుడు (మాధవ్) (అపరిచితులు)(ఈ పాత్రల్లో మంజుల, సూర్య నటించారు). అనుకోకుండా ఒక కొత్త ప్రదేశంలో కలిసి, కొన్ని గంటలు గడపాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఎలా టైం పాస్ చేస్తారు అనేదే ఈ సినిమా కథ. టైం పాస్ చేయటానికి వాళ్ళు ఒక నాటకం ఆడాలనుకుంటారు. (నాటకం అంటే సినిమా నాటకం అనుకునేరు. నిజమైన నాటకమే). ఆమె భార్యగానూ, అతను భర్తగానూ. ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ గొడవలు చూడలేని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరినీ తమ గొడవలు పరిష్కరించుకోవటానికి ఈ ఏకాంత ప్రదేశానికి పంపించారన్నమాట. అదీ నాటకంలోని అంశం (ముందు ఇద్దరు ఫ్రెండ్స్ అని అనుకున్నా, భార్యా భర్తలైతే బాగుంటుందని సజెస్ట్ చేస్తాడు మాధవ్).

neelakantaనాటకం అంటే మరి నటించాలి కదా. ఆ అమ్మాయికేమో నటనంటే బొత్తిగా తెలియదు. ఎంతో కొంత నటనతో పరిచయమున్న మాధవ్ ఆమెతో నటింపజేయాలని ప్రయత్నిస్తాడు. కానీ అవేవీ ఫలించవు. (మాధవ్ సినిమాల్లో నటించాలని కొంతకాలం ప్రయత్నం చేసినా సరైన అవకాశాలు దొరకవు. తర్వాత జూనియర్ లాయర్ గా జీవితంలో స్థిరపడతాడు. జీవితంలో పైకెదగలెక పోతున్నావని, తన నటన ఎందుకూ పరికిరానిదని భార్య ఎప్పుడూ తనను సాధిస్తూ ఉంటుందని చెప్తాడు. రిధిమ డిల్లీనుంచి వచ్చిన ఒక ఫార్మాషుటికల్ కంపెనీ ఎక్జిక్యూటివ్. వాళ్ళిద్దరూ ఒక మందు పేటెంటు కేసు విషయంలో ఒక ప్రొఫెసరు గారిని కలవటానికి వస్తారు. ఆయన పక్క ఊరికి అర్జెంటు పని మీద వెళుతున్నానని మెసేజ్ పెట్టి వెళ్తే, ఆయన బంగళాలో వెయిట్ చేస్తూ ఉంటారు). మొత్తంమీద ఆ నాటకం ముందుకు సాగక అర్థాంతరంగా ఆగిపోతుంది.

ఇద్దరూ కాఫీ చేసుకుని తాగుతారు. ఆ బంగాళా లంకంత కొంప. బంగాళా చుట్టుపక్కలంతా పచ్చని చెట్లతో, పక్షులతో, ఒక చక్కటి కొలనుతో అభయారణ్యాన్నితలపిస్తూ ఉంటుంది (ఆ లొకేషన్ ఎక్కడిదోగాని, అద్భుతంగా ఉంది). అక్కడ కాసేపు తిరుగుతూ ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తారు. ఎంతకూ సమయం గడవక బోరు కొడుతున్న ఆ అమ్మాయి, తనని ఒక గంట entertain చేస్తే, తన ఒక నెల జీతం (ముప్ఫై వేలు) ఇచ్చేస్తానంటుంది (సరదాగానే). అతను అది సీరియస్ గా తీసుకుని ‘అవును. మీరు డబ్బుతో ఎవరినైనా కొనగలరు. మనుషులంటే మీకంత చులకన. మనుషులంతా ఇంతే. డబ్బుతో ఏమైనా చేయగలమని అనుకుంటారు. నిజానికి ప్రశాంతతలో ఉన్న entertainment ఎవరికీ అర్థం కాదు. అది పోయిన తర్వాతే అర్థమవుతుంది…….’ ఇలా అనేసి, ఎటో వెళ్ళిపోతాడు. తను సరదాగా అన్న మాటలకు కోపం తెచ్చుకుని అతను అలా వెళ్లిపోయాడని, ఆమె చాలా బాధపడి అతన్ని వెతుక్కుంటూ బంగాళా బయటికి వెళుతుంది. అంతకుముందు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు కూడా, అతను అన్న కొన్ని మాటలు, చేష్టలు గుర్తు తెచ్చుకుని ఆమెకు అతనిపట్ల ఒక అనుమానాస్పద ధోరణి కలుగుతుంది. కొంతసేపటి తర్వాత ఒక చెట్టు వెనుక నవ్వుతూ కనిపిస్తాడు. ‘నేనిందాక మాట్లాడిందంతా నిజమే అనుకున్నారు కదూ. నన్ను సైకో అనుకున్నారు కదూ. మిమ్మల్ని entertain చెయ్యడానికే అలా చేశాను’ అంటాడు. అతని ప్రవర్తన తనకు నిజంగానే భయం కలిగించిందని, ఇంకోసారి అలా చెయ్యొద్దని ఆమె చెప్తుంది. తర్వాత అతను అక్కడ ఉన్న కొలను దగ్గిరకు వెళ్లి సీరియస్ గా పుస్తకం చదువుతూ ఉంటాడు. అతను మళ్ళీ సీరియస్ అయ్యాడని ఆమె అతన్ని తేలిక పరచడానికి ప్రయత్నిస్తుంది. ఇద్దరూ మళ్ళీ నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు.

కడుపులో కరకరమని ఆకలి కావటంతో భోజనం తయారు చేసుకోవాలనుకుంటారు. తనకు వంట బాగానే వచ్చని ఆమె చెప్తున్నా వినకుండా, అతను తన పాక విద్యా ప్రావీణ్యతను ప్రదర్శిస్తాడు (అంటే వంట చెడగొట్టడు. నిజంగానే చాలా బాగా చేస్తాడు). కొలనులో చేపను పట్టుకొచ్చి, ఆమెకిష్టమైన చేప వంటకం కూడా చేస్తాడు.

లంచ్ తర్వాత ప్రొఫెసర్ గారు రావటానికి ఇంకా చాలా సమయం ఉంటుంది (ఆయన మధ్యలో ఫోన్ చేసి, తను అనుకున్న సమయానికి రాలేకపోతున్నానని, వచ్చేసరికి సాయంకాలం అవుతుందని, వెయిట్ చెయ్యమని చెప్తాడు). మళ్ళీ వాళ్ళ మాటల మధ్యలో నాటకం ప్రస్తావన వస్తుంది. అతనిది నిజంగా బ్రిలియంట్ ఐడియా అని, తనే సరిగా అర్థం చేసుకోలేకపోయానని అంటుందామె. ఆ నాటకమే మళ్ళీ వేద్దామనుకుంటారు – ఆమె ప్రోద్బలంతో. ఈ సారి అతను, నటనలోని కొన్ని ప్రాధమిక అంశాలు ఆమెకు బోధిస్తాడు. ప్రతి వ్యక్తిలోనూ సహజంగానే ఒక నటుడుంటాడని, కొంచెం కృషి చేస్తే, ఆ నటుడిని బైటకు తీసుకురావటం కష్టమేమీ కాదని చెప్తాడు. ఆమెతో ఒక చిన్న యాక్షన్ బిట్ చేయిస్తాడు (తన ప్రియుడితో ఫోనులో మాట్లాడుతున్నట్టుగా). మొదట సరిగా చేయలేకపోయినా, తర్వాత అతని సూచనలకు అనుగుణంగా స్పందిస్తూ ఆమె బాగా చేస్తుంది.

అప్పుడు అసలైన నాటకం ప్రారంభిస్తారు. ఆమె ఒక మధ్య తరగతి గృహిణిలా తన గెటప్ కూడా కొంచెం మారుస్తుంది. నాటకంలో వాళ్ళు అంశంగా తీసుకున్నది అతని ఇంటి పరిస్థితే. తను ఎడ్డెం అంటే, భార్య తెడ్డెం అనాలి. అలాగే, అతనన్న ప్రతి మాటకూ, ఆమె రిటార్టు ఇస్తూ ఉంటుంది. అంతే కాదు. అలా నాటకం వేస్తూ వేస్తూ ఆమె అతని భార్య పాత్రలో పరకాయ ప్రవేశం చేసేస్తుంది. అతను కూడా ఆమె అచ్చు తన భార్యలాగానే మాట్లాడుతోందే అనుకుంటాడు. ఆమె గొంతు తన భార్య గొంతులాగానే వినిపిస్తుంది. అది ఎంతవరకూ వెళ్తుందంటే, అతను తాము ఒక నాటకం వేస్తున్నామన్న సంగతి పూర్తిగా మరిచిపోతాడు. అది తమ ఇల్లేనని, తను తన భార్యతోనే మాట్లాడుతున్నానని అనుకుంటాడు. మాటకు మాట జవాబు ఇస్తూ ఆమె, తనకీ కాపురంలో సుఖం లేదని, తనను ప్రేమించిన వాడితో వెళ్ళిపోతానని, తనకు విడాకులివ్వమని కూడా అంటుంది. మరి తను వదిలేసిపొతే, తన పరిస్థితి, కొడుకు పరిస్థితి ఏమిటంటాడు అతను. ‘మీతో నాకు సంబంధం లేదు. మీరిద్దరూ, దేంట్లోనన్నాదూకి చావండి’ అంటుందామె. అతను ఆ మాటలకు ఆవేశపడిపోయి, అక్కడే ఉన్న కత్తి పట్టుకుని ఆమె వెంటబడతాడు. ఈ హఠాత్ పరిణామానికి అవాక్కైన ఆమె, ‘మాధవ్ గారూ, ఏం చేస్తున్నారు మీరు. ఇది నాటకం. నిజం కాదు. నేను మీ భార్యను కాదు’ అని వారిస్తున్నా, అప్పటికే ఒక ట్రాన్స్ లో ఉన్న అతను, ఆ మాటలకు మరింత రెచ్చిపోయి కత్తితో ఆమె వెంట పడతాడు. మధ్యలో కత్తి కింద పడిపోతే, ఆమె తలను గోడకేసి కొడతాడు. రక్తం కూడా వస్తుంది. అప్పటివరకూ, అదొక నాటకమనుకొని నటిస్తున్న ఆమె అతని ప్రవర్తనకు షాక్ అవుతుంది. తనను వదిలి వెళ్లిపోవద్దని, అది పిల్లవాడిపైన చాలా చెడు ప్రభావం చూపిస్తుందని, తల్లి తనను వదిలేసి మరొక పెళ్లి ఎందుకు చేసుకుందో వాడి లేతమనసుకు అర్థం కాదని ఆవేదనగా అంటాడు. అక్కడే అందుబాటులో ఉన్న కత్తిని తీసుకుని, తన ప్రాణమే తీసుకోవటానికి సిద్ధమవుతాడు. ఇదంతా చూస్తున్న ఆమె ఏం జరగబోతుందో అర్థంగాక, మాటలురాక అవాక్కవుతుంది. మరి కొద్ది క్షణాల్లో కత్తి అతని గుండెల్లో దిగబోతున్నదనగా….

రిధిమ అభినందన పూర్వకంగా చప్పట్లు కొడుతుంది. ‘మాధవ్ గారూ. అద్భుతంగా నటించారు. అద్భుతం మీ నటన. అపూర్వం. ఫాంటాస్టిక్, ఎక్సెలెంట్’ ఇలా ఒక ఐదు నిముషాల పాటు చప్పట్లు కొడుతూ అతన్ని అభినందనలతో ముంచెత్తుతుంది. మాధవ్ మెల్లమెల్లగా ఈ లోకంలోకి వస్తాడు. ఆ అభినందనలకు ఉబ్బి తబ్బిబ్బవవుతాడు. తనలోని నటునికి ఇంతకాలానికి గుర్తింపు వచ్చిందని మురిసిపోతాడు. క్రమంగా అతని పెదవులపై చిరునవ్వు మొలుస్తుంది. ఆమె అతన్ని అభినందిస్తూనే ఉంటుంది. సడన్ గా అతను ‘ఇంకో నాటకం వేద్దామా?’ అంటాడు. ఆమె అతన్ని సుతారంగా వారిస్తుంది. ఇద్దరూ పగలబడి నవ్వుకుంటారు.

గోడ గడియారం ఆరు గంటలు కొడుతుంది. ప్రొఫెసరు గారు వచ్చేస్తారు. ‘హలో. మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించినందుకు సారీ. I hope everything is OK.’ అంటూ విష్ చేస్తారు. ఆయన మాటలు వాళ్ళ నవ్వుల్లో కలిసిపోతాయి. ఆ palatial బంగళాలో వాళ్ళ నవ్వులు ప్రతిధ్వనిస్తూ ఉండగా ‘శుభం’ కార్డు పడుతుంది. తెరమీద ఈ కొటేషన్ వస్తుంది.

“ఆ జగన్నాటక సూత్రధారి, కేవలం మన వినోదం కోసం సృష్టించిన అద్భుత నాటకమే ఈ జీవితం – శ్రీ పరమహంస యోగానంద

“This world is but a cosmic drama created by God for our entertainment only” – Sri Paramahamsa Yogananda

ఈ మధ్యకాలంలో నాకు చాలా సంతృప్తినిచ్చిన తెలుగు సినిమా ఇది. దీనిని గురించి రాయాలనుకున్నదంతా రాయలేకపోయాననుకుంటున్నాను. ఆందుకే దీనిని మొదటిభాగం అన్నాను. ఇందులో కథ చెప్పటం వరకే జరిగింది. దీన్ని ఇంకా కొంచెం విశ్లేషిస్తే బాగుంటుంది. అది త్వరలో రెండో భాగంలో చేస్తాను. నిజానికి దీన్ని గురించి మంచి చర్చ జరగాలనే, జరుగుతుందనే అనుకుంటున్నాను.

బ్యానర్: ఇందిరా క్రియేషన్స్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నీలకంఠ
నటీనటులు: మంజుల, సూర్య
సంగీతం: రాజ్
కెమెరా: రవి యాదవ్
ఎడిటింగ్: అనిల్ మల్నాడ్
నిర్మాత: మంజుల
విడుదల తేదీ: 13 సెప్టెంబర్ 2002

– మేడేపల్లి శేషు, కొత్త ఢిల్లీ

4 Comments
  1. అబ్రకదబ్ర June 26, 2009 /
  2. dhrruva June 26, 2009 /