Menu

పసంగ (తమిళ్) – పిల్లలు: పిడుగులు

2సినిమాకు కావలసింది భారీతారాగణం, కళ్ళుమిరుమిట్లు గొలిపే సెట్లు, హోరెత్తించే పాటలూ, భీకరమైన పోరాటాలు, నిమిషానికి మారే కాస్ట్యూములు, అర్థంపర్థం లేని హాస్యాలూ, ‘పంచ్’ పేరుతో కేవలం ప్రాసతో పలికే మాటలూ, హీరోయిన్ల అర్థనగ్న ప్రదర్శనలూ…కాదు! అని నిరూపించే మరో తమిళ చిత్రం “పసంగ”. పసంగ అంటే పిల్లలు అని అర్థం. ఈ సినిమా అంతా పిల్లలే.ఇద్దరు చిన్నపిల్లలు వారి కుటుంబాలు. కానీ ఇది పిల్లలకోసం పెద్దలు తీసిన సినిమాకాదు. పెద్దలు తీసిన పిల్లల సినిమా అంతకంటే కాదు. పిల్లలకు “మంచిని బోధించే”(?) సందేశాత్మక voyeuristic సినిమా అసలు కాదు. పిల్లాటల సినిమా అస్సలు కాదు. ఇదొక సినిమా. ఒక ని…జ…మై…న పిల్లల సినిమా. అంతే.

ఐదో తరగతి నుంచీ ఆరో తరగతికి వెళ్ళిన కొందరు పిల్లల కథ. ‘అన్బు’(కిషోర్), ‘జీవ’(శ్రీరాం) అనే ఇద్దరు విద్యార్థుల కథ. వాళ్ళ కుటుంబాల ప్రేమలు, గొడలవ కథ. పిల్లల్లోని పిడుగులూ, అల్లరిమూకలూ, బుద్దిమంతులు, క్లాస్ లీడర్ రాజకీయాలు, రైవల్రీలూ అన్నీ కలిపిన అద్వితీయమైన కథ. ఒక చిన్న ఊర్లోని గవర్నమెంటు స్కూళ్ళో ఏంమేమి జరుగుతుంటాయో వాటన్నింటినీ తెరకెక్కించిన చిత్రం.

ఊహల్లో స్కూటరెక్కినట్లు ఊహించుకుని బ్ర్…మని సౌండ్ చేసుకుంటూ వెళ్ళే పిల్లలు. పదిపైసల బిళ్ళని కాగితం క్రిందపెట్టి పెన్సిల్ తో అచ్చుగీసే పిల్లలు. క్లాసులో ఎవరైనా అపానవాయువు వదిల్తే “అగ్గిపెట్టె గిగ్గిపెట్టె” అంటూ ఎవరు బాంబేసారో ఇట్టే కనిపెట్టేసే పిల్లలు. నాలుక మీద మచ్చున్నోళ్ళు ఏంచెబితే అది జరుగుతుందనుకునే పిల్లలు. నెమలి ఈకని పుస్తకంలో పెట్టి పిల్లలు పెడుతుందని నమ్మే పిల్లలు. అబ్రకం ముక్కల్ని నెమలి ఈక తింటుందని నమ్మే పిల్లలు. గట్టిగా చదువుతూ పక్కోళ్ళని చదవకుండా చేసే పిల్లలు. క్లాస్ లీడర్ బోర్డు మీద అల్లరిచేసినవాళ్ళ పేర్లు రాస్తే గొడవపడే పిల్లలు. క్లాసులో నిద్రపోయే పిల్లాడికి మొటిక్కాయలు వేసే పిల్లలు. మార్కులు తక్కువొస్తే ముకుచెంపలు వాయించే పిల్లలు. ఇంకా…ఇంకా ఎన్నెన్నో చేసే చిన్నూరి పాఠశాల పిల్లలు.

తండ్రి ఆర్థిక పరిస్థితి బాగోక ఇంగ్లీషు మీడియంలో చదివే అన్బు గవర్నమెంటు స్కూళ్ళో ఆరవతరగతి చేరుతాడు. అప్పటివరకూ ఒకటి నుండీ ఐదు వరకూ ఎదురులేకుండా ఉన్న జీవా కు కంటగింపుగా మారతాడు. జీవా తండ్రి ఈ ఇద్దరూ ఉన్న క్లాస్ కి క్లాస్ టీచర్. అన్బు చదువులో సంస్కారంలో అందరికన్నా ముందుంటూ మన్ననలు చూరగొంటాడు. క్లాస్ లీడర్ అవుతాడు. జీవా ఈర్ష కోపంగా మారుతుంది. ఎప్పటికప్పుడు అన్బుని తక్కువచేసి చూపాలనే ప్రయత్నాలు చేస్తాడు. చివరకు అదే క్లాసులో చదువుతున్న జీవా అత్తకూతురు కూడా అన్బుతో స్నేహంగా మెలగడం మొదలౌతుంది. జీవా కోపం కసిగా మారుతుంది. ఎప్పటికప్పుడు అన్బు జీవాతో స్నేహం చెయ్యాలని చూసినా జీవా పెంకితనం వారి స్నేహానికి అడ్డుగా మారుతుంది. దానికి తోడు జీవా పక్కనున్న ఒక మిత్ర ద్వయం ఎప్పటికప్పుడు జీవాను ఎగదోస్తూ పరిస్థితిని ఇలాగే కొనసాగేలా చూస్తుంటారు.

1అన్బు-జీవాల గొడవలు చివరకు వాళ్ళ కుటుంబాల వరకూ పాకుతాయి. అప్పటికే ఆర్థిక పరిస్థితి బాగోలేని అన్బు కుటుంబం మరింత కల్లోలానికి గురౌతుంది. ఈ గొడవల మధ్యలో జీవా అక్క సోబికన్ను(వేగ), అన్బు బాబాయ్ సుందరం(విమల్) ప్రేమించుకుంటారు. ఈ పిల్లల వైరాలు సమసిపోతాయా, కుటుంబాలు కలుస్తాయా, సోబికన్ను -సుందరంల ప్రేమ సఫలం అవుతుందా అనేది చిత్రకథ.

నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన విషయం ఏమిటంటే, పిల్లల్ని పెద్దమాటలు మాట్లాడే ఆరిందాల్లాగానో లేక శుద్ధ అమాయకుల్లాగానో కాకుండా పిల్లల్ని పిల్లల్లాగా చిత్రీకరించడం. వారు మాట్లాడే మాటలదగ్గరనుంచీ వాళ్ళ నమ్మకాలు, ఆనందాలు, కోపాలూ, ఉక్రోషాలూ అన్నీఅన్నీ అత్యంత సహజంగా మనం చిన్నప్పుడు చదివిన స్కూలు గుర్తొచ్చేవిధంగా తీర్చిదిద్దడం. అంతేకాక ఈ పిల్లల భావనల్ని సినెమాటిగ్గా ఎలివేట్ చెయ్యడానికి దర్శకుడు కమర్షియల్ ఫిల్మ్ ఫార్మేట్ను వాడిన విధం అత్యంత ముదాహం. మన సాధారణ కాలేజి సినిమాల్లోని హీరో – విలన్ ల ఘర్షణ దృశ్యాల గ్రామర్ ని ఇక్కడ అన్వయించి దర్శకుడు చూపిన ప్రతిభ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పాటల్లో కూడ ఇదే శైలిలో పాప్యులర్ సినిమాల దృశ్యాల్ని పోలిన షాట్ డివిజన్, నేపధ్య సంగీతం, ఎడిటింగ్ వంటి ప్రక్రియలు వాడి ఆసక్తిభరితం చేశారు. దీని వెనుక రచయిత దర్శకుల శ్రమ ఎంతుందో మనం గుర్తించనంత సహజంగా ఈ సినిమా ఉంటుంది.

సోబికన్ను(వేగ), సుందరం(విమల్) ప్రేమ దృశ్యాల్లో టెలిఫోన్ రింగ్ టోన్లలాగా ఇళయరాజా ట్యూన్లు వాడి మనల్ని 70-80 ల సినిమాలలోకి తీసుకొచ్చి ఈ చిత్రంలోని ప్రేమ కథకు మరింత లోతు తీసుకొస్తాడు. చాలా సరదాగా, సహజంగా, విన్నూత్నంగా సాగుతుంది ఈ ఉప(ప్రేమ) కథ.

పిల్లలతో సహా ఈ చిత్రంలోని నటీనటులెవ్వరూ నటించలేదు. జీవించారు. కాబట్టి వారి నటన గురించి నేను ఏమీ చెప్పను. సుజాత సినిమాలో చూసిన వేగ కూ ఈ చిత్రంలోని వేగకూ చాలా తేడా ఉంది. నటనలో ఈజ్ సుస్పష్టంగా తెలిసొస్తోంది. జేమ్స్ వసంతన్ సంగీతం ఈ చిత్రానికి మరింత ప్రాణాన్ని పోస్తే సినెమాటోగ్రఫీ (ఎవరో నోట్ చేసుకలేకోయాను) ప్రతి ఫ్రేములోనూ జీవాన్ని నింపింది.  సుబ్రహ్మణ్యపురం (తెలుగులో ‘అనంతపురం -1980′ ) నిర్మించి దర్శకత్వం వహించిన శశికుమార్ ఈ చిత్రానికి నిర్మాత. పాండియరాజన్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తప్పకుండా అందరూ చూడవలసిన చిత్రం ఇది. ఈ చిత్రం తెలుగులోడబ్ అయ్యివస్తే ఆనందమే. కానీ తమిళ్ లో అర్జంటుగా చూసెయ్యమని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ సంవత్సరంలో భాతదేశంలో వచ్చిన సినిమాలు పదిలెక్కెంచితే ఈ సినిమా లేకపోతే ఆ లిస్టు తప్పని వాదించగలిగేంత మంచి సినిమా ‘పసంగ’.

18 Comments
 1. $hankaR! June 28, 2009 /
 2. Indian Minerva June 28, 2009 /
 3. jonathan June 28, 2009 /
 4. మేడేపల్లి శేషు June 29, 2009 /
 5. venkat June 29, 2009 /
 6. rayraj June 29, 2009 /
 7. Surya June 29, 2009 /
 8. కంది శంకరయ్య July 9, 2009 /
 9. su July 25, 2009 /
 10. su July 25, 2009 /
 11. Norman Bates July 25, 2009 /
 12. Satyam July 25, 2009 /
 13. G April 17, 2010 /