Menu

మిర్చ్ మసాలా

mirch-masala1980వ దశకంలో భారతీయ సినిమారంగంలో వెలుగు చూసిన మంచి చిత్రాల్లొ కేతన్ మెహతా నిర్మించిన “మిర్చ్ మసాలా” ఒకటి. సత్యజిత్‌రే “ఘరే బైరే”. ఆదూర్ గోపాలకృష్ణన్ “ముఖాముఖం”, అరవిందన్ “చిదంబరం” లాంటి గొప్ప చిత్రాల సరసన నిలిచే చిత్రం “మిర్చ్ మసాలా”. సమాజంలోని వాస్తవికతను ఆవిష్కరించే దిశలో ప్రేక్షకుల్ని తన వెంట లాక్కెళ్తుందీ చిత్రం. గొప్ప భావావేశంతో ఆద్యంతం చూపరుల్ని కట్టిపడేస్తుంది.

“మిర్చ్ మసాలా” చిత్రంలో ఉపయోగించిన మిర్చి రంగు గొప్ప ఉద్వేగభరితమయిన భావాల్ని ప్రస్ఫుటం చేస్తుంది. ఈ చిత్రంలో ఎరువుతో సహా ఉపయొగించే రంగులన్నీ మన జానపద కళారూపాల్ని తలపింప చేస్తాయి. పాశ్చాత్య దేశాల ప్రజల అభీష్టాలకు భిన్నంగా ఉండే మన భారతీయుల రంగుల ప్రపంచాన్ని ఈ చిత్రం పిండి ఆరబోస్తుంది. మిర్చ్ మసాలా చిత్రానికి ఆయువుపట్టులా దర్శకుడు ఉపయోగించిన ఎరుపు అణచివేతకు, తిరుగుబాటుకు ప్రతిబింబంగా భాసిల్లుతుంది.

నిజానికి “మిర్చ్ మసాలా” చిత్రం మన సమాజంలో అణచివేతకు గురైన వాళ్లలోకెళ్లా అణచివేయబడ్డ ‘స్త్రీ’ లను ముఖ్యాభినేతలుగా చేసి నిర్మించబడింది. అయితే స్త్రీలను టైప్స్ గా కాకుండా, మాడల్స్ గా కాకుండా సజీవమయిన పాత్రలుగా మలచడంలో దర్శకుడు తన ప్రతిభను చూపించారు. సామాజిక మార్పునకు ఉత్ప్రేరకాలుగా నిలిచే స్త్రీ పాత్రలతో ఈ చిత్రం నిర్మితమయింది.

ఇందులో కేవలం రంగులే కాదు సంగీతాన్ని కూడా విలక్షణంగా వినియోగించారు. ఆ సంగీతం మూడు స్థాయిల్లో వినిపిస్తుంది. ఒక స్థాయిలో 1930-40 ల కాలంనాటి పాపులర్ సంగీతాన్ని , మరో స్థాయిలో గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన జానపద సంగీత బాణిలో స్వరపరచిన జానపద పాటలు ఆకట్టుకుంటాయి. మూడో స్థాయిలో సినిమాకు నేపధ్యంగా విస్తృతంగా వినియోగించిన ధ్వని సంగీతంగా రూపాంతరం చెందిన స్థితి మొత్తం చిత్రానికి నిండుదనాన్ని తెచ్చింది.

చిత్ర కథాంశానికి వస్తే ఓ మారుమూల గ్రామంలో సుబేదారు క్యాంపు వేసి ఉంటాడు. ఆ ఊర్లో అందంగానూ, వయ్యారంగానూ ఉండే సోనాభాయీపై అతను కన్నేస్తాడు. చివరకు జులుం చేయడానికి కూడా సిద్ధపడతాడు. కాని అమె అందుకంగీకరించదు. ఆమె పారిపోయి ఆ ఊర్లో ఉన్న మిర్చి గోడవున్‌లో తల దాచుకుంటుంది. ఆమెతో పాటు మరికొంత మంది ఆ గోడవున్‌లో ఉంటారు. ఆ గోడవున్ గార్డు అబూమియా వారికి రక్షకుడిగా నిలుచుంటాడు. గోడవున్ గేట్ మూసేసి ఎలాంటి పరిస్థితిలోనూ తెరిచేది లేదంటాడు. సుబేదారు ఆ ఊరివారికి అల్టిమేటం జారి చేస్తాడు. సోనాబాయిని అప్పగించండి లేదా ఊరిని తగుల బెడతానంటాడు. గ్రమస్థులంతా భయంతో సోనాబాయిని లొంగిపొమ్మంటారు. కాని సోనాబాయి, అబూమియా ఇద్దరూ ఎదురు తిరుగుతారు. ఆ గొడవలో అబూమియా చనిపోతాడు. సోనాబాయి ఇతర స్త్రీలతో కలిసి సుబేదారు, అతని మనుషులపైన మిర్చితో దాడి చేస్తుంది. వాళ్లంతా వెనుదిరుగుతారు. సోనాబాయి సుబేదారుపై విజయం సాధిస్తుంది. చిత్రంలో ఇది ప్రధాన కథ కాగా దానికి సమాంతరంగా మరిన్ని కథలు నడుస్తాయి. అందులొ ఒకటి ఆ ఊరి ముఖియా భార్య కథ. ముఖియా అందరు గ్రామ పెద్దల్లాగే మరో స్త్రీతో సంబంధం కలిగి ఉంటాడు. అతని వైవాహికేతర సంబంధాన్ని ఆయన భార్య వ్యతిరేకిస్తుంది. కాని శారీరకంగానూ, వ్యక్తిత్వపరంగానూ అంత బలవంతురాలు కాని ఆమె ఎదురు తిరగలేకపోతుంది. తమ కూతురికి విద్యాబుద్ధులు నేర్పి గొప్పదాన్ని చేయాలనుకుంటుంది. ఆమె తన భర్తను ఎంత వ్యతిరేకించినప్పటికీ బయటపడదు.

మరోవైపు ఆ ఊరి ఉపాధ్యాయుడు దేశ స్వాతంత్ర్యం గురించి గ్రామస్థుల్ని చైతన్య పరచాలనుకుంటాడు. కాని సుబేదారుకు వ్యతిరేకంగా ప్రజల్ని సమాయత్తం చేయడంలో విఫలం చెందుతాడు. ఇంకోవైపు ముఖియా తమ్ముడు ఆ ఊళ్లో ఒక యువతిని ప్రేమిస్తాడు. కాని ఆమెను పెళ్ళాడటానికి అంతస్థులు, జాతి భేదాలు అడ్డం వస్తాయి. ఆ యువతి రాధ తండ్రి తీవ్ర మనస్థాపానికి గురై ఆమెను విపరీతంగా కొడతాడు. ఇన్ని పొరలుగా సాగే “మిర్చ్ మసాలా” కథలో సోనాబాయి, సుబేదారుల మధ్య చెలరేగిన ఘర్షణ ప్రధానాంశం. ఆకర్షణీయంగా ఉన్న సోనాబాయిని తన అధికార దర్పంతో సొంతం చేసుకోవాలనే సుబేదారు ప్రయత్నాల్ని ఆమె తన సహచర స్త్రీలతో కలిసి అబూమియా అండతో ఎదురుతిరగడమే చిత్రంలో మౌళిక అంశం. దాన్ని దర్శకుడు కేతన్ మెహతా గొప్ప ప్రతిభతో నడిపిస్తాడు. ఆ నడకలో దర్శకుడు కూర్చిన సన్నివేశాల్లో భావుకతకు తోడు సామాజిక నిబద్ధత కూడా కనిపిస్తుంది.

మిర్చి గోడవున్‌లో తలదాచుకున్న సోనాబాయి ఇతర మహిళలు సమిష్టిగా కాలం గడిపిన తీరు విశిష్టంగా ఉంటుంది. పనిచేస్తూ, పాటలు పాడుతూ, ఒకరితో ఒకరు సరదాగా పోట్లాడుకుంటూ, గేలి చేసుకుంటూ గడిపిన వైనం వారి సమిష్టి తత్వాన్ని సూచిస్తుంది. చివరికి ప్రసవ వేదనకు గురైన ఓ స్త్రీకి సహకరించడం వారి సామూహికతకు సాధికారిక దర్పణంలా నిలుస్తుంది. వారంతా కలిసి పాడుకున్న పాటల్లొ రస్టిక్ రియాలిటీస్‌తో కూడిన జానపద బాణీలు వినిపిస్తాయి. మరోవైపు సుబేదార్ తన క్యాంపులో కూర్చుని గ్రామఫోన్ లోంచి రొమాంటిక్ గీతాలు వింటూ ఉంటాడు. అతడు ఆ రోజుల్లో కోకిలగా పేరుగాంచిన కజ్జన్‌బాయి పాడిన పాటల్ని వింటూఉంటాడు. ఇలా దర్శకుడు గ్రామీణ మహిళలతో జాంపదాల్ని సుబేదార్ క్యాంపులో ఆధునిక ప్రేమ గీతాల్ని వినిపించి ఆ రెండు వర్గాల మధ్య తేడాని చెప్పకనే చెప్తాడు. పైగా సుబేదార్‌తో ఒకసారి ఇలా అనిపిస్తాడు. “అవాజ్ భీ అబ్ సర్కార్ కి గులాం హై”

మొత్తం మీద “మిర్చ్ మసాలా” అట్టడుగు వర్గానికి చెందిన ఒక స్త్రీకి, ఆమెను మోహించిన అధికారి సుబేదార్‌కి నడుమ సంఘర్షణని అందులో ఆ స్త్రీ తమ సమిష్టిబలంతో ఎదురు తిరిగి అధికారంపైనా, ఆధిపత్యంపైనా విజయం సాధించడాన్ని సూచిస్తుంది.

ఈ చిత్రంలో అందంగానూ, వయ్యారం వొలకబోస్తూనూ మరోపక్క తన వ్యక్తిత్వాన్ని కాపడుకుంటూ ఎదురుతిరిగే సోనాబాయి పాత్రలో స్మితాపాటిల్ అద్వితీయ ప్రతిభ కనబర్చారు. నసీరుద్ధిన్ షా మీసాలు మెలేస్తూ సుబేదార్ పాత్రలో అధికారం వొలకబోస్తూ ఒకవైపు, సంగీతాన్ని ఇష్టపడేవాడిగా, మరోవైపు భిన్న భావాల్ని గొప్పగా ప్రదర్శించారు. వ్యక్తిగత నిబద్ధత గల గార్డు పాత్రలో ఓంపూరి సజీవ నటనని అందించారు. దీప్తీనావల్, సురేశ్ ఓబెరాయ్ తదితరులు ప్రధాన భూమికల్ని పోషించారు. కేతన్ మెహతాకిది మూడవ చిత్రం. అంతకుముందు ఆయన “భవాని భవై”, “హోలీ” చిత్రాల్ని నిర్మించాడు. మిర్చ్ మసాలా జాతీయ స్థాయిలో మూడు అవార్డులు అందుకోవడంతో పాటు మాస్కో, హవాయి తదితర అంతర్జాతీయ ఫెస్టివల్స్ లో పాల్గొని ప్రశంసలు అందుకుంది.

మిర్చి మసాలా (హిందీ)

సినిమాటోగ్రఫీ – జహంగీర్ చౌదరి

సంగీతం – రజత్ డౌలకియా

దర్శకత్వం – కేతన్ మెహతా

నటీనటులు – స్మితాపాటిల్, నసీరుద్ధిన్ షా, ఓంపురి మొ..

6 Comments
  1. గీతాచార్య June 19, 2009 /
  2. మేడేపల్లి శేషు June 19, 2009 /