Menu

మనుషులు – మమతలు

pedavi virupuకధా కధనాన్ని పక్కనపెడితే ఈ సినిమా ప్రత్యేకించి నటిశిరోమణి సావిత్రి జీవిత చరిత్రని ఆమూలాగ్రం స్ఫురింపచేస్తూ (ఆవిడ జీవితం చివర్లో విషాదాంతం,ఈ కధ సుఖాంతం అంతే తేడా) ఒక్కో చోట నిజమేనేమో అనిపింపచేస్తుంది కూడా కొన్ని సన్నివేశాల్లో.యధావిధిగా ఆమె ఇందులో కూడా తనకి మాత్రమే సొంతమయిన నటవిశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది.ప్రత్యేకించి “మంచి మనసులు” సినిమా తర్వాత ఇదే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో కనిపించినంత సౌందర్యంగా,చిలిపిగా మరే చిత్రంలో(నటనని మినహాయిస్తే) కనిపించలేదేమొ మరి.

ఇప్పటి నిర్మాతా,దర్శకులు,నటీమణులు తప్పకుండా నేర్చుకోవాల్సిన అంశాలు ప్రత్యేకించి లిప్స్టిక్ ఎడ్వర్టైజ్మెంట్స్ లాగ పెదాల కదలికలు,ఇంకా శరీరంలో ఎన్ని చోట్ల ఏ ఏంగిల్ లో చూపెట్టి కేష్ చేసుకోవచ్చో వగైయిరాల్లాంటి చీప్ ట్రిక్స్ లేకుండా ఎలా నటించచ్చో నటీమణులు నేర్చుకోవాల్సిన అంశం.

premalekhaఆమె చూపొక సమ్మోహనాస్త్రం,ఆమె నవ్వొక లాలిత్యం, మాటొక ఆణిముత్యం, నడకొక లయవిన్యాసం, స్పర్శ ఒక ఓదార్పు, నటనొక అనుభూతి, ఇవన్నీ కలగలిపి ఆమే ఒక ఆమే ఒక తీపిగుర్తు. నిమేషమాత్రంలో చేసే ఆ పెదాల విరుపులో పడిపోని మానవమాత్రుడుంటాడా అనేది సందేహమే, ఆమె ముగ్ధమోహన సౌందర్యానికి తలొగ్గని మగతనం ఉంటుందా అన్నది సందేహమే.ఆ నల్లత్రాచు లాంటి పొడవాటి జడని అలా ఓ రెండు అల్లికలేసి ఒక్క సారి అలా విసిర్తే అంతులేని అలౌకికానందంతో ప్రపంచాన్ని చుట్టొచ్చినట్టు చుట్టూ తిరిగొచ్చి ముందు నించి ఎడమభుజం మీదకి వాలడం అదొక ప్రత్యేకత.

jayalaita“తినిపించాలేం పాపం” అంటూ అక్కినేనికి చిన్న చిన్న ముక్కలుగ చేసి ఇడ్లీ తినిపించే దృశ్యంలో ఎన్నిభావాలయిన వెతుక్కోవచ్చు ఎవరికి కావాల్సినవి వారు. ప్రేమలో అమాయకత్వమంటే ఇలా ఉంటుందా, అమాయకమయిన ప్రేమ ఇదా ఏమో, ప్రేమని ఎన్నిరకాలుగా వ్యక్తపరచచ్చో అన్నిరకలుగానూ వ్యక్తీకరించడమే ఈ సినిమా ప్రత్యేకత.

కుమారి జయలలితని ఈ సినిమాలో చూసిన వారెవ్వరికీ ఆమేనా ఇప్పటి ఈ జయలలితా అనిపించక మానదు..పోండి డాడీ అంటూ గారాలు కులుకుతూ వయ్యారాలొలుకుతూ పలికే ఆ ముద్దు ముద్దు చిలక పలుకుల్లో ఎన్ని సంగతులయినా వెతుక్కోచ్చు.అప్పట్లో ఆవిడకి మాత్రమే సాధ్యమయిన రేప్పూ..పాప్పూ డేన్సులు కూడా ప్రత్యేక ఆకర్షణే ఈ చిత్రంలో.

మిగతా నటులంతా వారి వారి పాత్రలకి పూర్తిగా న్యాయం చేశారు.

ooha(pelli)ఇంక కధలోకొస్తే వేణు(ఏ ఎన్ ఆర్) అన్న కుర్రాడు తన జీవితంలో జరిగిన దుస్సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఇంజినీర్ కావాలన్న దృక్పధంతో రాజారావనే పెద్దాయన(గుమ్మడి)చేరదీయడంతో ఆయన నీడలో పెరిగి పెద్దవాడయి అతని ఆశయాని నెరవేర్చుకునే ప్రక్రియలో ఆ పెద్దాయన కూతురు అయిన రాధ(సావిత్రి)ఇతన్ని ప్రేమిస్తుంది.ఆ ప్రేమని ఎన్ని రకాలుగ రాధ వ్యక్తపరిచినా వేణు గ్రహించడు,పైగా నాకటువంటి అభిప్రాయం లేదంటూ అతని ఏకైక ఆశయాని వ్యక్తపరుస్తాడు రాధకి.అలా తిరస్కరించ బడ్డ రాధ కి చీఫ్ ఇంజినీర్ గోపాలరావు (రమణారెడ్డి)అన్న కొడుకు భాస్కర్(జగ్గయ్య) తో వివాహం నిశ్చయం అవుతుంది.అప్పటిదాకా వేణుతో కలిసి మెలిసి తిరిగిన రాధ అప్పటితో ఇక వేణుతో కలివిడిగా ఉండడం మానేసి వేణూని కూడా అలానే దూరంగా ఉండమని చెపుతుంది. అప్పటికి గానీ వేణూకి తన జీవితంలో ఎంత విలువయిన వ్యక్తిని కోల్పోయాడో తెలిసిరాదు.అలా వేణూ తనని అత్యంత అభిమానించే స్త్రీ కి దూరమవుతాడు.

taguduరాధ బావ శేషు మేన మామ తనని కాదని రాధని భాస్కర్ కి ఇచ్చి చేసినందుకు పగ బట్టి రాధ సంసారాన్ని ఎలాగయిన నాశనం చేసి ఆస్థి ఎలాగయినా కొట్టెయ్యాలని ఉద్దేశ్యంతో రాధ గర్భవతి గా ఉన్నప్పుడు ఆమెకి కొంచం దూరంగా ఉండల్సి రావడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ప్లేన్ అమలుచేస్తాడు శేషు. భాస్కర్ మీద రాణిని (విటురాలు – రాజశ్రీ) ప్రయోగించి అతనిని ఆ ఊబిలోకి లాగి మందు అలవాటు చేయించి అధోగతికి చేరుస్తారు. సరే అలా ఖాళీగా ఉండడం వల్ల భాస్కర్ ఇలా చెడు అలవాట్లకి బానిసవుతున్నాడని అనుకుని పట్నం వెళ్ళి కాంట్రాక్ట్స్ చేస్తాననగానే పెట్టుబడికి తండ్రితో డబ్బులు ఇప్పిస్తుంది రాధ.అలా చిన్న మకాం కూడా పట్నానికి మారి కొన్నాళ్ళు అవగానే అక్కడికి కూడా చేరిన శేషు మెల్లిగా అతన్ని వ్యవహారాలు చూసే నెపంతో మేనేజర్ గా కంపెనీ పనులు చూస్తూ ఉంటాను నువ్వు పూర్తిగా సుఖాల్ని అనుభవించమంటూ రాణి చేత ప్రపోజల్ పెట్టించి పూర్తిగా ఆమె వశమయ్యేట్టు చేస్తారు. అలా తాగుడుకి బానిసయిన పూర్తిగా ఇంటిని తనని బిడ్డని కూడ నిర్లక్ష్యం చేసే తన భర్త తనలో లేనిది ఆ రాణిలో ఏమి చూశాడో తెల్సుకోవాలని వెళ్ళి ఆమెతో జరిగిన సంభాషణలో ఆమె చెప్పినట్లు మీరు భార్యలు,మీకు కొంత పరిధి ఉంది కాబట్టి ఆ పరిధులు ఏమీ లేని మా దగ్గరకి వచ్చి ఆ కోరికల్ని తీర్చుకుంటారు అని చెప్పడంతో రాధ భర్తని ఆ ఇంటికి పోకుండా కట్టడి చెయ్యలనే తలంపుతో ఒకానొక సందర్భంలో భర్తతో కల్సి తను కూడా తాగాల్సి వస్తుంది, అలాగయినా భర్తని బయటకి పోనివకుండా కట్టు దిట్టంచెయ్యచ్చని భావించి తనూ భర్తకి చీర్స్ చెపుతుంది అతని ఆనందం కోసం.

ఇంకో పక్క వేణు ఇంజినీర్ అయి మంచిపేరు తెచ్చుకుంటాడు,అతనిని ప్రేమిస్తూ ఉంటుంది చీఫ్ ఇంజినీర్ గోపాలరావు కూతురు ఇందిర(జయలలిత). అలా ఇంజినీరింగ్ పూర్తిచెయ్యగనే సాగర్ డేం పనిలో ఉద్యోగం అది కూడా అప్పటికే అక్కడ చీఫ్ ఇంజినీర్ గోపాలరావు దగ్గరే అవడం మంచిదవు తుంది వేణుకి.

jayalaitaభాస్కర్ చేసే కాంట్రాక్ట్ వ్యవహారాలలో చాలా అవకతవకలు ఉండడంతో అతని బిల్ల్స్ పాస్ చెయ్యడానికి అభ్యంతరం చెపుతాడు వేణు. ఇక్కడ శేషు భాస్కర్ కి తెలియకుండా సాగర్ డేం కాంట్రాక్ట్స్ లో నాసిరకపు పనులు చేయిస్తూ డబ్బులు దోచేస్తూ ఉంటాడు.అలా అతని పనులకు సంబంధించిన బిల్ల్స్ నాసిరకపు పనుల కారణాన్ని చూపిస్తూ ఆపివేయడంతో డబ్బులకి ఇబ్బంది ఎదురవుతుంది భాస్కర్ కి.ఆ వ్యవహారంలో వేణు నిక్కచ్చిగా వ్యవహరించడంతో అర్ధాలూ పెడర్ధాలూ అపార్ధాలు లాంటి చిన్న చిన్న ట్విస్ట్ లతో చివరికి శేషు ఆటకట్టించడంతో కధ సుఖాంతం అవుతుంది.

కొన్ని ఆత్రేయ చెణుకులు:

అయినా ఎదటున్నవాడికి ఉత్తరమెందుకు? ఏమి రాసావో చెప్పేస్తే ఎదురుగానే సమాధానం చెప్పేస్తా కదా,

మీ వయసెంతండి పాపం నాలుగేళ్ళే కదా అంటే మరి మీ వయసెంతో అంటే నా వయసెంతండీ రెండే ఎందుకంటే గోదావరి పుష్కరాలకి పుట్టాను అందువల్ల ఇదిగో ఈ యేటికి రెండు నిండాయి,

ఆరోగ్యానికి మంచిది కానిదాంట్లో ఆనందముండదు…ఆ సంగతి అనుభవం మీద కాని తెలియదు కదా.

అందులో ఏమి సుఖం ఉందని ఇలా తాగుతారో అర్ధం కావట్లేదు,ఇంక మళ్ళీ అటుపక్క పోను అంటే

అలా తాగుడికి అలవాటయిన వాళ్ళంతా ఇలా అన్నవాళ్ళే అంటూ,

చెడిపోడానికి డబ్బే కారణమయితే డబ్బులేని వాడు కూడా ఎందుకు చెడిపోతున్నాడు,

మనిషిని డబ్బుతోటే కట్టెయ్యలేము కదా,మనసుతోటీ,మమతతోటీ కట్టేయ్యాలి కానీ…

వెనకటి రోజుల్లో దాహానికి మంచినీళ్ళూ,మజ్జిగా ఇచ్చేవరు,ఇప్పుడు కాఫీ ఇకపైనా విస్కీ బ్రాందీ ఇస్తారు…

ప్రతిదానికీ కొన్ని సాంప్రదాయాలుంటాయి.ఒంటరిగా తాగడం సాంప్రదాయం కాదు.అలా తాగితే ఒంటబట్టదు.

కొన్ని కోట్ల మందికి ద్రోహిని కావడం కన్నా కొంత మందికి కృతఘ్నుణ్ణయినా క్షమిస్తారని చేసాను రాధా..

బహుశా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల బాక్ డ్రాప్ గా తీసినట్లుగా అనిపిస్తుంది దాసరి తీసిన ప్రేమాభిషేకం

ప్రత్యేకించి రాధ తన భర్త భాస్కర్ కోసం విటురాలు రాణి ఇంటికెళ్ళిన సందర్భంలోనూ ఆమెతో జరిగే సంభాషణల్లో (ఈ సన్నివేశాన్ని చూసి ఆ సంభాషణల వరద పరంపరని అనుభవించాల్సిందే. .)

కామెడీ అసలు లేకపోడమే ఈ సినిమాకి పెద్ద లోటు.ఇలాంటి కధలో కామెడీ పాలుండకూడదను కున్నారో ఏమో రచయిత దర్శక నిర్మాతలు.ఒక వేళ అలా అంతగా అవసరమనిపిస్తే రమణారెడ్డి చేత అలవాటుగా అనిపించే వోయ్..వొయ్ అనే ఒక్క ఊత పదమే సరిపోతుందనుకున్నారో(అసలే చిన్న చిన్న ఆనందాలకే సంతృప్తి పడిపోతారు కదా అంధ్రా ప్రేక్షకులు) ఏమో కానీ 3గంటల సినిమాకి అదే పెద్దలోటయి కూర్చుంది ఆఖరికి.

అసలు ఆడది గట్టిగా మాటలాడ్డము,నవ్వడమూ కూడ పెద్ద తప్పూ,అనాగరికంగానూ చూసే రోజుల్లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి పూనుకున్న నిర్మాతా దర్శకులు,అలా నటించడానికి (జీవించిందనచ్చేమో) ఒప్పుకున్న నటి సావిత్రి ని తప్పకుండా అభినందిచాల్సిందే .

ఇంక చివరిగా ముఖ్యంగా మన-సు-కవి ఆత్రేయ కలం యధావిధిగా తనదైన బాణీలో ప్రేమని, చలాకితనాన్నీ,అమాయకత్వాన్నీ,బాంధవ్యాన్నీ,ఆదర్శాన్నీ, వ్యసనాన్నీ, విషాదాన్ని,గుండెపోటునీ తన ఇంకుపోటుతో బాగానే స్పృశించింది.

అందువల్ల ఈ సినిమాని సావిత్రి ఆత్రేయ ల గుర్తుగా చూసుకోవచ్చు వారి వారి అభిమానులు తప్పకుండా…

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై 1965 లో వచ్చిన ఈ సినిమాలో

ఏ.ఎన్.ఆర్, జగ్గయ్య, సావిత్రి, జయలలిత, రమణారెడ్డి, గుమ్మడి, ప్రభాకరరెడ్డి, రాజశ్రీ వగైరా నటవర్గం.

మూల కధ: యద్దనపూడి సులోచనారాణి.

మాటలు:ఆత్రేయ,

పాటలు: దాశరధి,సినారె,కొసరాజు,ఆత్రేయ.

సంగీతం: ఆస్థాన విద్వాంసుడు టి చలపతిరావు.

నేపధ్యగానం: ఘంటసాల,సుశీల,జానకి,జయదేవ్.

నిర్మాత: ఏ.వి. సుబ్బారావు

దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ.

పాటలు:

1. ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు,జంటగ నీ జతఒకరుంటే అన్నిటికీ మేలన్నారు
2. వెన్నెలలో మల్లియలు,మల్లెలలో ఘుమఘుమలు,ఘుమఘుమలో గుసగుసలు,ఏవేవో కోరికలూ,
3. సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా నీకు సిగ్గేస్తుందా మొగ్గలాటి చిన్నది బుగ్గమీద చిటికేస్తే సిగ్గేస్తుందా సిగ్గేస్తుందీ సిగ్గేస్తుందీ నాకు సిగ్గేస్తుందీ చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తుంటే సిగ్గేస్తుందీ నాకు సిగ్గేస్తుందీ…
4. నేను తాగలేదు..నాకు నిషాలేదు..నాకు నిషా రాదూఊఊఊ…
5. నువ్వూ..ఎదురుగా ఉన్నావూ బెదిరిపోతున్నావూ…ఎందుకో ఉలకవు పలకవు…
6. నీ కాలికి నేనందినయనై, నీ కన్నులలో కాటుకనై…ఉండిపోనా నీతోనే…నిండీపోనా నీలోనే…
7. కన్ను మూసింది లేదూ..నిన్ను మరిచింది లేదూ..నీ తోడూ..ఓ ప్రియతమా….
8. నిన్ను చూడనీ…నన్ను పాడనీ ఇలా ఉండిపోనీ నిన్ను చూడనీ…

–శ్రీనివాస్ పప్పు

5 Comments
  1. సుజాత June 23, 2009 /
  2. గీతాచార్య June 23, 2009 /
  3. vinay June 23, 2009 /
  4. Sudhakar Tirumalasetty June 23, 2009 /